సాక్షి, హైదరాబాద్: మద్యం ఉత్పత్తి చేసే డిస్టిలరీలు సమ్మె విరమించాయి. లైసెన్స్ ఫీజు పేరుతో తమ నుంచి అడ్డగోలుగా వసూలు చేస్తున్నారని, ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ మద్యం తయారీని నిలిపివేసేందుకు రాష్ట్రంలోని కొన్ని డిస్టిలరీల యాజమాన్యాలు నిర్ణయించాయి. దీనిలో భాగంగా 17 డిస్టిలరీలకుగాను 10 డిస్టిలరీలను తాత్కాలికంగా మూసివేశారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎక్సైజ్ కమిషనర్ సోమేశ్‌కుమార్.. యాజమాన్యాలతో గురువారం సచివాలయంలో చర్చలు జరిపారు. డిస్టిలరీల యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు జైపాల్‌రెడ్డితోపాటు పలువురు ప్రతినిధులు తమ వాదనలను వివరించారు. యాజమాన్యాల విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించిన సోమేశ్‌కుమార్.. న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో డిస్టిలరీల్లో మళ్లీ మద్యం ఉత్పత్తి చేసేందుకు యాజమాన్యాలు అంగీకరించాయి. శుక్రవారం నుంచి అన్ని డిస్టిలరీల్లో ఉత్పత్తిని ప్రారంభిస్తామని అనధికారికంగా వెల్లడించాయి.
ఐదుగురు సభ్యులతో కమిటీ
డిస్టిలరీల యాజమాన్యాలతో జరిగిన చర్చల్లో ఎక్సైజ్ శాఖ జాయింట్ కమిషనర్ ఖురేషీ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తామని సోమేశ్‌కుమార్ హామీ ఇచ్చారు. లైసెన్స్ ఫీజుతోపాటు డిస్టిలరీల సమస్యలపై కమిటీ అధ్యయనం చేసి నివేదిక ఇస్తుందని, ఈ మేరకు తాను ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపుతానన్నారు. వీలైనంత త్వరగా డిస్టిలరీల సమస్యలను పరిష్కరిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment