Strike retirement
-
ఏపీలో 108 సిబ్బంది సమ్మె విరమణ
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా 108 ఉద్యోగుల చేస్తున్న సమ్మెను విరమించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో జరిగిన చర్చలు ఫలప్రదం కావడంతో సమ్మె విరమిస్తున్నట్లు 108 సిబ్బంది ప్రకటించారు. గురువారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన సిబ్బంది తమ సమస్యలను వివరించారు. 108ను ప్రభుత్వమే నిర్వహించడమే సహా అన్ని సమస్యలను పరిష్కరించాల్సిందిగా సీఎంకు విన్నవించుకున్నారు. వారు చెప్పిన సమస్యలపై సానుకూలంగా స్పందించిన సీఎం.. ఉద్యోగ భద్రత కోసం ప్రత్యేక పాలసీ రూపొందించి త్వరలోనే అమలు చేస్తామని హామీ ఇచ్చారు. సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన భరోసాతో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో గురువారం రాత్రి నుంచే 108 సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. -
డిస్టిలరీల సమ్మె విరమణ
సాక్షి, హైదరాబాద్: మద్యం ఉత్పత్తి చేసే డిస్టిలరీలు సమ్మె విరమించాయి. లైసెన్స్ ఫీజు పేరుతో తమ నుంచి అడ్డగోలుగా వసూలు చేస్తున్నారని, ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ మద్యం తయారీని నిలిపివేసేందుకు రాష్ట్రంలోని కొన్ని డిస్టిలరీల యాజమాన్యాలు నిర్ణయించాయి. దీనిలో భాగంగా 17 డిస్టిలరీలకుగాను 10 డిస్టిలరీలను తాత్కాలికంగా మూసివేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎక్సైజ్ కమిషనర్ సోమేశ్‌కుమార్.. యాజమాన్యాలతో గురువారం సచివాలయంలో చర్చలు జరిపారు. డిస్టిలరీల యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు జైపాల్‌రెడ్డితోపాటు పలువురు ప్రతినిధులు తమ వాదనలను వివరించారు. యాజమాన్యాల విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించిన సోమేశ్‌కుమార్.. న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో డిస్టిలరీల్లో మళ్లీ మద్యం ఉత్పత్తి చేసేందుకు యాజమాన్యాలు అంగీకరించాయి. శుక్రవారం నుంచి అన్ని డిస్టిలరీల్లో ఉత్పత్తిని ప్రారంభిస్తామని అనధికారికంగా వెల్లడించాయి. ఐదుగురు సభ్యులతో కమిటీ డిస్టిలరీల యాజమాన్యాలతో జరిగిన చర్చల్లో ఎక్సైజ్ శాఖ జాయింట్ కమిషనర్ ఖురేషీ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తామని సోమేశ్‌కుమార్ హామీ ఇచ్చారు. లైసెన్స్ ఫీజుతోపాటు డిస్టిలరీల సమస్యలపై కమిటీ అధ్యయనం చేసి నివేదిక ఇస్తుందని, ఈ మేరకు తాను ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపుతానన్నారు. వీలైనంత త్వరగా డిస్టిలరీల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. -
ఆర్టిజన్ల వేతనాలు పెంపు
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికు (ఆర్టిజన్లు)లకు శుభవార్త. ఆర్టిజన్ల వేతనాలు పెంచుతూ తెలంగాణ ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం పొందుతున్న వేతనాలతో పోలిస్తే.. గ్రేడ్–1 ఆర్టిజన్లకు రూ.3,477, గ్రేడ్–2 ఆర్టిజన్లకు రూ.2,865, గ్రేడ్–3 ఆర్టిజన్లకు రూ.2,181, గ్రేడ్–4 ఆర్టిజన్లకు రూ.1,900 వేతనం పెరగనుంది. ఆగస్టు 1 నుంచి పెరిగిన వేతనాలు అమల్లోకి రానున్నాయి. అలాగే ఈఎస్ఐ, పీఎఫ్ యాజమాన్య వాటాలను ఇకపై యాజమాన్యాలే చెల్లించనున్నాయి. ఇప్పటివరకు యాజమాన్య వాటాలను కూడా కార్మికుల వేతనాల నుంచే చెల్లిస్తున్నారు. తాజా నిర్ణయంతో ఆ మొత్తం కార్మికులకే మిగిలి ఆ మేరకు వారి వేతనాల్లో పెరుగుదల కనిపిస్తుంది. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈనెల 21 నుంచి విద్యుత్ కాంట్రాక్ట్ కార్మిక సంఘాలు సమ్మెబాట పట్టిన విషయం తెలిసిందే. విద్యుత్‌శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో గత శనివారం సచివాలయంలో జరిగిన చర్చల సందర్భంగా ఆర్టిజన్ల వేతనాల పెంపుతోపాటు ఈఎస్ఐ, పీఎఫ్ వాటాల చెల్లింపు తదితర డిమాండ్ల పరిష్కారానికి విద్యుత్ సంస్థల యాజమాన్యాలు హామీ ఇవ్వడంతో అదే రోజు కార్మిక సంఘాలు సమ్మె విరమించాయి. ఈ నేపథ్యంలో ఆ హామీలను అమలుచేస్తూ ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కింది హామీలను అమలు చేస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న 20,803 మంది ఆర్టిజన్లకు ప్రయోజనం కలగనుంది. అమలు చేయనున్న హామీలివే... ♦ విద్యుత్ సంస్థల్లో ఆర్టిజన్ల విలీనంపై హైకోర్టులో విధించిన యథాతథ స్థితి(స్టే) తొలగింపునకు తక్షణమే విద్యుత్ సంస్థలు అదనపు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేస్తాయి. ♦ విద్యుత్ రెగ్యులర్ ఉద్యోగుల వేతన సవరణ జరగనున్న నేపథ్యంలో ఆర్టిజన్ల ఏకమొత్తం వేతనాల పెంపునకు అంగీకరించాం. పీఆర్సీ అమల్లోకి వచ్చిన తర్వాత మళ్లీ ఆర్టిజన్ల వేతనాల పెంపు ఉండదు. ♦ నిరంతర విద్యుత్ సరఫరాకు ప్రోత్సాహకంగా ఆర్టిజన్లకు ప్రత్యేక అలవెన్స్ మంజూరు. ♦ సాధారణ మరణం/ప్రమాదాల్లో మరణించిన ఆర్టిజన్ల కుటుంబంలో అర్హులైన ఒకరికి విద్యార్హతల ఆధారంగా ఉద్యోగావకాశం కల్పిస్తాం. ♦ ఆర్టిజన్ గ్రేడ్–3, గ్రేడ్–4గా కొనసాగుతూ పోల్ టూ పోల్, ఎఫ్ఓసీ, సబ్‌స్టేషన్ ఆపరేటర్, ఎంఆర్టీ, సీబీడీ, లైన్ బ్రేక్ డౌన్ గ్యాంగ్, డీపీఈగా నైపుణ్యం కలిగి విధులు నిర్వహిస్తున్న వారికి ఆర్టిజన్ గ్రేడ్–2 వేతనం చెల్లింపు. ♦ టీఎస్ఎస్పీడీసీఎల్లోని ఫీల్డ్ కార్యాలయాలు, సబ్స్టేషన్లలో గత రెండేళ్లుగా పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిశీలిస్తున్నాం. ♦ విధి నిర్వహణలో ప్రమాదాలకు లోనైతే చికిత్స కల్పించేందుకు మెడికల్ క్రెడిట్ కార్డులు జారీ. ♦ రెగ్యులర్ ఉద్యోగుల తరహాలోనే ఆర్టిజన్లకు సైతం సాధారణ మరణానికి రూ.10 లక్షల జీవిత బీమా చెల్లింపు. ♦ కార్మికుల ఈఎస్ఐ, పీఎఫ్ వాటాలను ఆయా చట్టాల ప్రకారమే వారి వేతనాల్లో కోత విధింపు. -
సమ్మె సమాప్తం
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా చేపట్టిన లారీల సమ్మె ఎట్టకేలకు ముగిసింది. ఎనిమిది రోజులపాటు దేశంలో ఎక్కడికక్కడ స్తంభించిన రవాణా ఇక కదలనుంది. సమ్మె విరమణ ప్రకటనతో అర్ధరాత్రి నుంచే లారీలు రోడ్డెక్కాయి. డిమాండ్లను పరిష్కరిస్తామని కేంద్రం హామీ ఇవ్వడంతో లారీల యజమానులు సమ్మె విరమించారు. డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి చేర్చాలన్న ప్రధాన డిమాండ్‌తో జూలై 20న ఆలిండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ (ఏఐఎంటీసీ) దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో 93 లక్షల లారీలు రోడ్లపైనే ఆగిపోయాయి. అత్యవసర సర్వీసుల ట్రక్కులు మాత్రం సమ్మెకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. శుక్రవారం సాయంత్రం లారీల యజమానులు, ఏఐఎంటీసీ నాయకులతో కేంద్ర రహదారుల శాఖ అధికారులు చర్చలు జరిపారు. లారీ యజమానుల ప్రధాన డిమాండ్లయిన డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియంను తగ్గించడం, కేంద్ర, రాష్ట్ర పరిధిలోని పలు రకాల ట్యాక్సులను తగ్గించడం, టోల్ గేట్లను ఎత్తివేయడం వంటి వాటిని మరోసారి కేంద్రం ముందుంచారు. డిమాండ్లను పరిశీలిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. వీటి అధ్యయనానికి అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపింది. సింగరేణిలో పేరుకుపోయిన నిల్వలు ఎనిమిది రోజులు జరిగిన సమ్మెతో సింగరేణిలో బొగ్గు నిల్వలు పేరుకుపోయాయి. రోజూ 40,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుగుతుండగా.. 8 రోజులుగా 3.2 లక్షల టన్నుల నిల్వలు ఉండిపోయాయి. రైలు రవాణాకు ఆటంకం లేకున్నా.. లారీల ద్వారా జరగాల్సిన బొగ్గు రవాణా స్తంభించిపోయింది. ఉత్తర తెలంగాణ నుంచి రాజధానితోపాటు వివిధ రాష్ట్రాలకు సరఫరా కావాల్సిన ఇసుక, సిమెంటు, గ్రానైటు, కంకర, మట్టి తదితరాల రవాణా కూడా స్తంభించింది. నల్లగొండలో లారీ సమ్మె అరెస్టుల దాకా వెళ్లింది. సమ్మెలో భాగంగా రోడ్డుపై వాహనాలను అడ్డుకున్న డ్రైవర్లను పోలీసులు అరెస్టు చేశారు. వీరిపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారని, థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారని, రాత్రంతా తీవ్రంగా కొట్టారని లారీ యజమానుల సంఘం ఆరోపించింది. రాష్ట్రంలో అర్ధరాత్రిదాటాక విరమణ దేశవ్యాప్తంగా సమ్మె విరమించినప్పటికీ.. తెలంగాణలో సమ్మె కొనసాగించాలని తెలంగాణ లారీ యజమానుల సంఘం తొలుత నిర్ణయించింది. అయితే అర్ధరాత్రి దాటాక తాము కూడా సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించింది. బత్తాయికి భారీ నష్టం పూర్వ నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అధికంగా ఉత్పత్తి అయ్యే బత్తాయిపై లారీల సమ్మె ప్రభావం పడింది. సీజన్ కావడంతో రాష్ట్రం నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, విశాఖపట్నం నుంచి కుప్పలుతెప్పలుగా వచ్చిన బత్తాయితో గడ్డిఅన్నారం మార్కెట్లో నిల్వలు పేరుకుపోయాయి. రాష్ట్రంలోకి యాపిల్, దానిమ్మ, పుచ్చకాయ తదితరాలు దిగుమతి అవుతుండగా, రాష్ట్రం నుంచి ఒక్క బత్తాయి మాత్రమే ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతోంది. గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ నుంచే రోజూ 100 లారీల్లో 600 టన్నుల నుంచి 700 టన్నుల బత్తాయి ఇతర ప్రాంతాలకు తరలుతోంది. ఇందులో 30 శాతం రాష్ట్ర పరిధిలోని ఇతర మార్కెట్లకు వెళ్తుండగా, మరో 60 శాతం ఢిల్లీ, ఆగ్రా, జైపూర్, ముంబైలకు ఎగుమతి అవుతోంది. టన్ను ధర వేసవిలో రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు ఉండగా.. తాజాగా లారీల సమ్మె నేపథ్యంలో రూ.8 వేల నుంచి రూ.12 వేలకు పడిపోయింది.. -
రేషన్ డీలర్ల సమ్మె విరమణ
సాక్షి, హైదరాబాద్: రేషన్ డీలర్లు ఈ నెల ఒకటి నుంచి తలపెట్టిన సమ్మెను విరమించారు. సమస్యల పరిష్కారంపై మంగళవారం ప్రభుత్వంతో జరిపిన చర్చల్లో వారికి స్పష్టమైన హామీ లభించడంతో సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. విడతల వారీగా బకాయిల విడుదలకు ప్రభుత్వం ఓకే చెప్పగా, కమీషన్ల పెంపు, కనీస గౌరవ వేతనంపై సీఎం కేసీఆర్ చర్చిం చి నిర్ణయం చేస్తామన్న ప్రభుత్వ హామీ నేపథ్యంలో సమ్మె విరమిస్తున్నట్లు రేషన్ డీలర్ల సంఘం ప్రతినిధులు తెలిపారు. కనీస వేతనాల అమలు, పెండింగ్ బకాయిల విడుదల, కమీషన్ పెంపుపై గత కొన్ని రోజులుగా డీలర్లు నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. అయితే దీనిపై పలుమార్లు ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో ఈ నెల ఒకటి నుంచి డీలర్లు సమ్మెకు దిగారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం వారికి నోటీసులివ్వడంతో పాటు ప్రత్యామ్నాయంగా మహిళా సంఘాలతో సరుకుల పంపిణీ చేసేలా ఏర్పాట్లు పూర్తి చేసింది. కమీషన్లు, బకాయిలపై చర్చ డీలర్లపై సస్పెన్షన్లకు సైతం ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్న నేపథ్యంలో డీలర్లు మంగళవారం మినిష్టర్ క్వార్టర్స్‌లో పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో మరో దఫా చర్చలు జరిపారు. వైద్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, పౌర సరఫరాల సంస్థ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి ఈ చర్చలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మరోమారు తమ సమస్యలను డీలర్లు ఏకరువు పెట్టారు. చాలా రాష్ట్రాల్లో డీలర్లకు క్వింటాల్‌పై రూ.70కి పైనే కమీషన్లు ఇస్తున్నా, రాష్ట్రంలో కేవలం రూ.20 మాత్రమే ఇస్తున్నారని, దీనిపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు. రూ.70 కమీషన్లో కేంద్ర వాటా రూ.35 ఇవ్వాల్సి ఉన్నా, దానిని ఇవ్వడం లేదని తెలిపారు. జాతీయ ఆహార భద్రతా చట్టం అమల్లోకి వచ్చిన 2014 అక్టోబర్ ఒకటి నుంచి మొత్తంగా రూ.300కోట్ల బకాయిలు ఉన్నాయని, వీటిని త్వరగా విడుదల చేయాలని కోరారు. దీనిపై మంత్రి ఈటల స్పందిస్తూ కమీషన్లు పెంచుతామని, అయితే ఎంత చేయాలన్న దానిపై సీఎంతో చర్చించి నిర్ణయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇక బకాయిలను దశల వారీగా విడుదల చేస్తామని చెప్పారు. కనీస వేతనాలపై కమిటీ డీలర్ల కనీస వేతనాల అమలుపై కమిటీ ఏర్పాటు చేస్తామని, కమిటీ నిర్ణయం మేరకు తుది నిర్ణయం తీసుకుంటామని ఈటల హామీనిచ్చారు. అప్పటివరకు సమ్మె విరమించాలని కోరారు. ఒకట్రెండు రోజు ల్లో మరోసారి భేటీయై సమస్యలపై చర్చిద్దామన్నారు. దీనికి అంగీకరించిన డీలర్లు సమ్మె విరమిస్తున్నట్లు తెలిపారు. ఇక సరుకులకై డీడీలు కట్టేందుకు గడువు ముగిసినందున, 4 రోజులు గడువు పొడిగించాలని విన్నవించారు. దీనికి ఈటల ఓకే చెప్పారు. సమావేశం అనంతరం డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. డీలర్ల సమ్మె విరమణ హర్షదాయకమని, వారి డిమాండ్లపై సీఎంతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. డీలర్ల సమ్మె విరమణను పెద్ది సుదర్శన్‌రెడ్డి స్వాగతించారు. సీఎం కేసీఆర్‌పై నమ్మకముంది: డీలర్ల సంఘం తమ సమస్యలు పరిష్కరించి, న్యాయం చేస్తారనే నమ్మకం సీఎం కేసీఆర్‌పై ఉందని రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు నాయికోటి రాజు, దాసరి మల్లేశం అన్నారు. అందుకే సమ్మె విరమిస్తున్నామని వారు తెలిపారు. నెల రోజుల్లో సమస్యలు పరిష్కరించకుంటే మళ్లీ సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. -
తెలంగాణ రేషన్ డీలర్ల సమ్మె విరమణ
-
రేషన్ డీలర్ల సమ్మె విరమణ
నల్లగొండ : రేషన్ డీలర్లు సమ్మెను విరమించారు. తమ డిమాండ్ల సాధనకు నాలుగు రోజులుగా ఆందోళన చేస్తున్న డీలర్లు ప్రభుత్వం వైపు నుంచి హామీరావడంతో శుక్రవారం సమ్మె విరమించినట్లు జిల్లా డీలర్ల సంఘం అధ్యక్షుడు వైద్యుల సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం నల్లగొండలో సివిల్ సప్లై గోదాం వద్ద నాలుగో రోజు సమ్మె కొనసాగించిన డీలర్లు ప్రస్తుతానికి సమ్మె వాయిదా వేస్తున్నట్లు సాయంత్రం ప్రకటించారు. తమ డిమాండ్లను పరిష్కరించేందుకు ఈ నెల 10 నుంచి 14 తేదీ మధ్యలో ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించేందుకు ప్రభుత్వం నుంచి పిలుపు వచ్చిందని వివరించారు. ప్రభుత్వం ప్రకటన మేరకు 14 తేదీలోగా సమస్యల పైన ఎలాంటి హా మీగానీ చర్చలు జరిగని పక్షంలో మళ్లీ సమ్మెలోకి దిగుతామని స్పష్టం చేశారు. ‘మిర్యాల’లో భారీ ర్యాలీ మిర్యాలగూడ : డిమాండ్ల పరి ష్కారం కోసం రేషన్ డీలర్ల సం క్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ నారాయణరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రేషన్ డీలర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి దొంతిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత రేషన్ డీలర్లను ప్ర భుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారని, ఆచరణలో అమలు చేయడం లేదన్నారు.ర్యాలీలో రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం నాయకులు అజీజ్, గజ్జి మధుసుదన్, పగిళ్ల వెంకటేశ్వర్లు, ఉబ్బపల్లి కాశయ్య, ఉబ్బపల్లి వెంకటేశ్, దైద మనోహర్, బడుగుల లింగయ్యయాదవ్, సుధాకర్‌రెడ్డి, గందె నాగేశ్వర్రావు, నూకపంగ సోమ య్య, విజయలక్ష్మి, మణెమ్మ పాల్గొన్నారు. -
ఫెఫ్సీ సమ్మె విరమణ
తమిళసినిమా: మూడు రోజులుగా నిర్వహిస్తున్న సమ్మెను దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య (ఫెఫ్సీ) గురువారం సమ్మెను విరమించుకుంటున్నట్టు ప్రకటించింది. గురువారం మధ్యాహ్నం జరిగిన సమావేశంలో ఫెఫ్సీ నిర్వాహకులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్కె.సెల్వమణి మాట్లాడుతూ మూడు రోజులుగా 40 చిత్రాలకు పైగా షూటింగ్‌లకు ఇబ్బంది ఏర్పడిందన్నారు. నటుడు రజనీకాంత్, దర్శకుల సంఘం ఇతర సినీ ప్రముఖులు విజ్ఞప్తి మేరకు ఫెఫ్సీ సభ్యులతో చర్చలు నిర్వహించి సమ్మెను విరమించుకోవాలని నిర్ణయించినట్టు తెలిపారు. శుక్రవారం నుంచి యథాతథంగా ఫెఫ్సీ సభ్యులు షూటింగ్లలో పాల్గొనవచ్చని ఆయన తెలిపారు. -
పారిశుధ్య కార్మికుల సమ్మె విరమణ
-
పారిశుధ్య కార్మికుల సమ్మె విరమణ
సాక్షి, హైదరాబాద్: నలభై నాలుగు రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికులు ఎట్టకేలకు తమ ఆందోళనను విరమించారు. తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగుల, పారిశుధ్య కార్మికుల సంఘం నేతలు, సమ్మెకు మద్దతిస్తున్న వివిధ కార్మిక సంఘాలు, వామపక్ష పార్టీల ప్రతినిధులతో పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారకరామారావు గురువారం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామజ్యోతి కార్యక్రమం ఈనెల 17నుంచి ప్రారంభం కానున్నందున సమ్మెను విరమించి విధుల్లో చేరాలని మంత్రి కేటీఆర్ వారికి విజ్ఞప్తి చేశారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను తప్పక నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. దీంతో సమ్మెను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు కార్మిక సంఘాల నేతలు ప్రకటించారు. చర్చల్లో పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి రేమండ్ పీటర్, కమిషనర్ అనితా రాంచంద్రన్, డిప్యూటీ కమిషనర్ రామారావు, ఎమ్మెల్యేలు సున్నం రాజయ్య, రవీంద్రనాయక్, తెలంగాణ పంచాయతీ ఉద్యోగుల, పారిశుద్ధ్య కార్మికుల సంఘం అధ్యక్షుడు గణపతిరెడ్డి, ఉపాధ్యక్షుడు కోటిలింగం, ప్రధాన కార్యదర్శి శ్రీపతిరావు, సీఐటీయూ, ఏఐటీయూసీ, ఏఐఎఫ్టీయూ, ఐఫ్టీయూ తదితర సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. కమిటీని నియమించాం: కేటీఆర్ ‘అతి తక్కువ వేతనంతో పనిచేస్తున్న గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికుల డిమాండ్లు న్యాయమైనవే. కనీస వేతనం పెంపు, ఆరోగ్య బీమా, ఉద్యోగ భద్రత, గుర్తింపు కార్డులు తదితర డిమాండ్ల పరిష్కారం గురించి అధ్యయనం చేసేందుకు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్ నేతృత్వంలో పంచాయతీరాజ్, ఆర్థిక, న్యాయ శాఖల అధికారులతో కమిటీని వేశాం. రెండు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని కమిటీకి గడువు విధించాం. కమిటీ నివేదిక అందగానే ముఖ్యమంత్రితో చర్చించి పరిష్కారానికి చర్యలు చేపడతాం. పంచాయతీల ఆదాయం నుంచి ఉద్యోగుల వేతనాలను భరించేందుకు ప్రస్తుతం ఉన్న 30శాతం పరిమితిని 50 శాతానికి పెంచుతూ ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రకటించారు. ఈ మేరకు వెంటనే ఉత్తర్వులు కూడా ఇవ్వనున్నాం. గ్రామాలకు ఆర్థిక స్వావలంబన చేకూర్చే ఉద్దేశంతో చేపట్టిన గ్రామజ్యోతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో పారిశుధ్య కార్మికులు భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం’ అని కేటీఆర్ చెప్పారు. విరమణ తాత్కాలికమే..: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 30 వేలమంది పంచాయతీ పారిశుధ్య కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని తెలంగాణ పంచాయతీ ఉద్యోగుల, పారిశుద్ధ్య కార్మికుల సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీపతిరావు చెప్పారు. మంత్రి హామీ మేరకు సమ్మెను తాత్కాలికంగా విరమిస్తున్నామని, శుక్రవారం నుంచి విధుల్లో చేరతామని చెప్పారు. సమ్మె కాలానికి కూడా వేతనం చెల్లిస్తామన్నారని, రెండు నెలల్లో సమస్యలు పరిష్కరించకుంటే మళ్లీ ఆందోళనకు దిగుతామని పేర్కొన్నారు. -
108 సిబ్బంది సమ్మె విరమణ
హైదరాబాద్: సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉండటంతో ‘108’ ఉద్యోగులు తమ సమ్మె విరమించారు. దీంతో 11 రోజులుగా జరుగుతోన్న సమ్మెకు తెరపడింది. ఈ నేపథ్యంలో ఆదివారం నుంచి ఉద్యోగులు విధుల్లోకి రానున్నారు. తెలంగాణ ‘108’ ఉద్యోగుల సంక్షేమ సంఘం, జీవీకే-ఈఎంఆర్ఐ ప్రతినిధులతో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి రెండు రోజులు చర్చలు జరిపారు. అనంతరం మంత్రి ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఉద్యోగుల 15 డిమాండ్ల పరిష్కారానికి పార్లమెంటరీ కార్యదర్శులు వినయ్‌భాస్కర్, గాదరి కిషోర్లతో కమిటీ ఏర్పాటు చేశామన్నారు. ఉద్యోగులు, జీవీకే ప్రతినిధుల నుంచి వాదనలు విని ఆ కమిటీ నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. అయితే ఎప్పటిలోగా కమిటీ నివేదిక సమర్పిస్తుందన్న విషయాన్ని మాత్రం మంత్రి స్పష్టీకరించలేదు. ఉద్యోగుల సమ్మె కాలాన్ని వేతనంతో కూడిన సెలవుగా పరిగణిస్తామని మంత్రి హామీయిచ్చారు. ఈ సందర్భంగా ‘108’ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు మహేందర్‌రెడ్డి, అశోక్‌లు కూడా మాట్లాడుతూ రెగ్యులర్‌గా పెంచే 10 శాతంతో కాకుండా మరో రూ. వెయ్యి అదనంగా వేతనం పెంచుతామని మంత్రి హామీయిచ్చారని తెలిపారు. తీసేసిన 70 మందిపై కమిటీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. జీవీకే బదులు ప్రభుత్వమే ‘108’ వ్యవస్థను నిర్వహించాలన్న డిమాండ్‌పైనా కమిటీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. రెండు నెలల్లో కమిటీ నివేదిక సమర్పిస్తుందన్నారు. కమిటీలో సంఘం ప్రతినిధులు కూడా ఉంటారన్నారు. మెడ్‌సెట్ ద్వారానే యాజమాన్య వైద్య సీట్లు కేటాయిస్తాం... రాష్ట్రంలో ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో తమ కోటా సీట్లన్నింటినీ యాజమాన్యాలు అమ్ముకున్నాయని, ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వహించడం వల్ల ఏం ప్రయోజనం ఉంటుందని మంత్రి లక్ష్మారెడ్డిని ప్రశ్నించగా... ‘ప్రత్యేక ప్రవేశ పరీక్ష ఉంటుందన్న విషయం ఇప్పటివరకు చాలామందికి తెలియదు. కొన్ని ప్రైవేటు వైద్య కళాశాలల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి అడ్వాన్సు డబ్బులు తీసుకొని సీట్లను బుక్ చేశారు. ప్రత్యేక ప్రవేశ పరీక్షలో మెరిట్ మార్కులు రాకుంటే ఎవరి డబ్బులు వారికి వాపసు ఇస్తార’ని మంత్రి తెలిపారు. ముందు డబ్బులు తీసుకున్నందున పేపర్ లీక్ అయ్యే అవకాశాలుంటాయని ప్రశ్నించగా... అటువంటి పరిస్థితి తలెత్తకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతిష్టాత్మక సంస్థ ద్వారానే ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వ డాక్టర్ల వేతనాలు పెంచుతాం ప్రభుత్వ డాక్టర్ల వేతనాలు పెంచాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని మంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. వారికి ప్రోత్సాహకాలు కూడా ఇస్తామన్నారు. అలాగే ప్రభుత్వ వైద్య విధానాన్ని సమూలంగా మార్చుతామన్నారు. ఆసుపత్రులు, కార్యాలయాల్లో సీసీ కెమెరాలు పెట్టే ఆలోచన ఉందన్నారు. అనేక ఆసుపత్రుల్లో పరికరాలు కూడా సరిగా లేవన్నారు. ఇప్పటివరకు పరికరాలు, డ్రగ్స్ కొనుగోలులో అనేక అవకతవకలు జరిగాయన్నారు. ఎల్1, ఎల్2 వ్యవస్థ కాకుండా సరైన వ్యవస్థను ఏర్పాటుచేస్తామన్నారు. పరికరాల కొనుగోలుకు సంబంధించి బహిరంగ చర్చ పెడతామన్నారు. గాంధీ ఆసుపత్రిలో లిఫ్ట్ పాడయితే అడగడానికి ఆ కంపెనీయే లేదన్నారు. పెంటావలెంట్ టీకాను వచ్చే నెల రెండో తేదీన ప్రారంభిస్తామన్నారు. -
సమ్మె విరమించిన కాంట్రాక్టు టీచర్లు
సాక్షి, న్యూఢిల్లీ: తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని కోరుతూ ఢిల్లీ సచివాలయం వద్ద ధర్నా చేస్తున్న కాంట్రాక్టు టీచర్లు గురువారం సమ్మె విరమించారు. కాంట్రాక్టు ఉద్యోగులను పర్మనెంట్ చేయడానికి ప్రభుత్వం నియమించిన కమిటీ సిఫార్సులను అమలు చేసేంతవరకు కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించబోమని విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియా ఇచ్చిన హామీతో సమ్మె విరమించినట్లు యూనియన్ల నాయకులు చెబుతున్నారు. అయితే అంతకుముందు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విలేకరుల సమావేశంలో చేసిన హెచ్చరికతోనే వీరు ఈ నిర్ణయం తీసుకున్నారని. మీడియా సమావేశంలో సీఎం మాట్లాడుతూ ‘కమిటీ నివేదిక వచ్చే దాకా టీచర్లను తొలగించబోమని స్వయంగా హామీ ఇచ్చినా, వాళ్లు ధర్నా చేస్తున్నారు. ఆందోళన విరమించి విధులకు హాజరు కాకుంటే, వారి స్థానంలో కొత్త వారిని నియమిస్తాం. ధర్నా కొనసాగించేవారిని పర్మనెంట్ చేయబోం’ అని ఆయన హెచ్చరించారు. తమ ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ కొందరు కాంట్రాక్టు టీచర్లు జనవరి 15 నుంచి సచివాలయం ఎదుట ధర్నా చేస్తున్నారు. మరికొందరు టీచర్లు జనవరి 27 నుంచి నిరాహార దీక్ష చేపట్టారు. కాంట్రాక్టు టీచర్లు ఆందోళన విరమించుకుంటే వారిని తొలగించి కొత్త వారిని తీసుకుంటామని రాష్ట్ర న్యాయ,విద్యాశాఖ మంత్రి మనీశ్ సిసోడియా సైతం బుధవారం హెచ్చరించిన సంగతి తెలిసిందే. డీటీసీ కాంట్రాక్టు డ్రైవర్లు కూడా.. ఇదిలా ఉంటే తమ ఉద్యోగాలను కూడా క్రమబద్ధీకరించాలనే డిమాండ్ డీటీసీ ఉద్యోగులు సమ్మెకు దిగడంతో చాలా బస్సులు నిలిచిపోయాయి. ప్రభుత్వం కూడా కాంట్రాక్టు డ్రైవర్ల సమ్మెపై కఠినంగా వ్యవహరిస్తుండడంతో పరిస్థితి విషమిస్తోంది. సమయానికి బస్సులు రాక కార్యాలయాలకు వెళ్లేవారు ఇబ్బందిపడ్డారు. ఆటావాలాలు అడ్డగోలుగా చార్జీలు వసూలు చేశారు. -
యథావిధిగా...
=తాత్కాలికంగా ఉద్యోగుల సమ్మె విరమణ =నేటినుంచి తెరుచుకోనున్న కార్యాలయాలు =కదలనున్న ఫైళ్లు ={పజలకు అందనున్న సేవలు విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : ప్రభుత్వ కార్యాలయాల్లో ఇకపై ఫైళ్లకు కదలిక రానుంది. యథావిధిగా ప్రభుత్వ పనులు జరగనున్నాయి. సమైక్యాంధ్ర కోసం 65 రోజుల నుంచి ఏపీఎన్జీఓలు చేస్తున్న సమ్మెను తాత్కాలికంగా విరమించారు. శుక్రవారం నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు తెరుచుకోనున్నాయి. ఉద్యోగులందరూ తిరిగి విధుల్లో చేరనున్నారు. రాష్ట్ర విభజనపై జూలై 31న సీడబ్ల్యూసీ నిర్ణయం ప్రకటించిన వెంటనే సమైక్యాంధ్ర కోసం ప్రజా ఉద్యమం ప్రారంభమైంది. అనంతరం ఆగస్టు 12వ తేదీ అర్ధరాత్రి నుంచి ఏపీఎన్జీఓలు సమ్మె బాట పట్టారు. వీరికి అన్ని ఉద్యోగ సంఘాలు మద్దతు తెలిపాయి. దీంతో జిల్లాలో ఉన్న 40 వేల మంది ఉద్యోగులు విధులను బహిష్కరించారు. ఫలితంగా కలెక్టరేట్ నుంచి గ్రామ కార్యాలయాల వరకు అన్నీ మూతపడ్డాయి. ప్రభుత్వ సేవలన్నీ స్తంభించాయి. ఎప్పుడూ ఆఫీసులకే పరిమితమయ్యే ఉద్యోగులు సమైక్యాంధ్ర కోసం రోడ్ల మీదకొచ్చి నిరసనలు వ్యక్తం చేశారు. విభిన్న తరహాలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. వీరికి జీతాలు రాకపోయినా వెరవకుండా ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. విద్యార్థుల కౌన్సెలింగ్ సమయంలో ఉద్యోగులు సమ్మెలో ఉండడంతో వారికి అవసరమైన కుల, ఆదాయ, నివాస, ఇతర ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేసేవారు లేకుండా పోయారు. కానీ ప్రజల నుంచి ఎటువంటి వ్యతిరేకత రాలేదు. సమైక్యాంధ్ర కోసం ఆందోళన చేపడుతున్న ఉద్యోగులకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభించింది. నేటి నుంచి కార్యకలాపాలు అసెంబ్లీలో తెలంగాణ బిల్లును అడ్డుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇవ్వడంతో సమ్మెను తాత్కాలికంగా విరమిస్తున్నట్టు ఏపీఎన్జీఓ నాయకులు ప్రకటించారు. దీనికి అన్ని ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు అంగీకారం తెలపడంతో శుక్రవారం నుంచి ప్రభుత్వ కార్యాలయాలన్నీ తెరుచుకోనున్నాయి. జిల్లా అధికారుల నుంచి వీఆర్వోల వరకు అందరూ విధుల్లో చేరనున్నారు. దీంతో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోను కార్యాకలాపాలు ప్రారంభం కానున్నాయి. అన్ని ప్రభుత్వ సేవలు శుక్రవారం నుంచి ప్రజలకు యథావిధిగా అందనున్నాయి. ఈ సమ్మె కారణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో వేల సంఖ్యలో దరఖాస్తులకు మోక్షం లభించలేదు. కుల, ఆదాయ, నివాస ధ్రువపత్రాలతో పాటు, ఇతరత్రా వాటి కోసం ఒక్క అర్బన్ తహశీల్దార్ కార్యాలయంలోనే సుమారుగా 16 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రతీ మండల కార్యాలయంలోను 1500 నుంచి 2 వేల వరకు దరఖాస్తులు ఉన్నాయి. వీటిని వీలైనంత త్వరగా మంజూరు చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. పుంజుకోనున్న ఖజానా గత 65 రోజులు ఉద్యోగుల సమ్మె కారణంగా సర్కారు ఖజానాకు తీవ్ర లోటు ఏర్పడింది. ఖజానా శాఖ ఉద్యోగులు కూడా విధులను బహిష్కరించడంతో ఇప్పటి వరకు దాదాపుగా రూ.1500 కోట్లు మేర లావాదేవీలకు బ్రేక్ పడింది. సమ్మెలో లేని అత్యవసర సేవలందించే ఉద్యోగులకు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరులలో ఒకటైన రిజిస్ట్రేషన్ శాఖ నుంచి ఆదాయం నిలిచిపోయింది. అన్ని రకాల రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో దాదాపుగా రూ.230 కోట్లు ప్రభుత్వ ఖజానాకు గండిపడింది. శుక్రవారం నుంచి సమ్మె విరమించడంతో తిరిగి ప్రభుత్వ ఖజానా కళకళలాడనుంది. అన్ని రకాల రిజిస్ట్రేషన్లు యథావిధిగా జరగనున్నాయి. కలెక్టర్‌ను కలిసిన ఉద్యోగులు ఉద్యోగ సంఘాలు గురువారం జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్, జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్‌లను కలిశాయి. సమ్మెను తాత్కాలికంగా విరమిస్తున్నట్టు తెలిపాయి. శుక్రవారం నుంచి విధుల్లో చేరుతున్నట్టు నాయకులు కలెక్టర్‌కు చెప్పారు. పరిపాలన, ప్రాధాన్యతాపరమైన పనులను వేగవంతంగా పూర్తి చేయడంతో పాటు జిల్లా అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని ఉద్యోగ సంఘాల నాయకులకు కలెక్టర్ సూచించారు. తాత్కాలికంగా విరమించాం అసెంబ్లీలో తెలంగాణ బిల్లును అడ్డుకుంటామని ఎమ్మెలు హామీ ఇవ్వడంతో అప్పటి వరకు తాత్కాలికంగా సమ్మెను విరమించామని ఏపీఆర్ఎస్ఏ జిల్లా అధ్యక్షుడు ఎస్.నాగేశ్వరరెడ్డి తెలిపారు. కేంద్రం అసెంబ్లీ తీర్మానం అవసరం లేదని రాజకీయ నిర్ణయం తీసుకుంటే ఇప్పటికంటే తీవ్రమైన ఉద్యమం చేపడతామన్నారు. ఏపీఎన్జీఓల పిలుపు మేరకు సమ్మెను విరమిస్తున్నామని పంచాయతీరాజ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కూర్మారావు చెప్పారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా చేపట్టే ప్రతి కార్యక్రమానికి తమ మద్దతు ఉంటుందన్నారు. అసెంబ్లీలో బిల్లు పెట్టే సమయంలో ఎమ్మెల్యేలు, మంత్రులపై ఒత్తిడి చేసేందుకు మళ్లీ సమ్మె చేస్తామని వీఆర్వో సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్.టి.రామకాసు తెలిపారు.