సమ్మె విరమించిన కాంట్రాక్టు టీచర్లు
Published Thu, Jan 30 2014 10:41 PM | Last Updated on Sat, Sep 2 2017 3:11 AM
సాక్షి, న్యూఢిల్లీ: తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని కోరుతూ ఢిల్లీ సచివాలయం వద్ద ధర్నా చేస్తున్న కాంట్రాక్టు టీచర్లు గురువారం సమ్మె విరమించారు. కాంట్రాక్టు ఉద్యోగులను పర్మనెంట్ చేయడానికి ప్రభుత్వం నియమించిన కమిటీ సిఫార్సులను అమలు చేసేంతవరకు కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించబోమని విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియా ఇచ్చిన హామీతో సమ్మె విరమించినట్లు యూనియన్ల నాయకులు చెబుతున్నారు. అయితే అంతకుముందు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విలేకరుల సమావేశంలో చేసిన హెచ్చరికతోనే వీరు ఈ నిర్ణయం తీసుకున్నారని.
మీడియా సమావేశంలో సీఎం మాట్లాడుతూ ‘కమిటీ నివేదిక వచ్చే దాకా టీచర్లను తొలగించబోమని స్వయంగా హామీ ఇచ్చినా, వాళ్లు ధర్నా చేస్తున్నారు. ఆందోళన విరమించి విధులకు హాజరు కాకుంటే, వారి స్థానంలో కొత్త వారిని నియమిస్తాం. ధర్నా కొనసాగించేవారిని పర్మనెంట్ చేయబోం’ అని ఆయన హెచ్చరించారు. తమ ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ కొందరు కాంట్రాక్టు టీచర్లు జనవరి 15 నుంచి సచివాలయం ఎదుట ధర్నా చేస్తున్నారు. మరికొందరు టీచర్లు జనవరి 27 నుంచి నిరాహార దీక్ష చేపట్టారు. కాంట్రాక్టు టీచర్లు ఆందోళన విరమించుకుంటే వారిని తొలగించి కొత్త వారిని తీసుకుంటామని రాష్ట్ర న్యాయ,విద్యాశాఖ మంత్రి మనీశ్ సిసోడియా సైతం బుధవారం హెచ్చరించిన సంగతి తెలిసిందే.
డీటీసీ కాంట్రాక్టు డ్రైవర్లు కూడా..
ఇదిలా ఉంటే తమ ఉద్యోగాలను కూడా క్రమబద్ధీకరించాలనే డిమాండ్ డీటీసీ ఉద్యోగులు సమ్మెకు దిగడంతో చాలా బస్సులు నిలిచిపోయాయి. ప్రభుత్వం కూడా కాంట్రాక్టు డ్రైవర్ల సమ్మెపై కఠినంగా వ్యవహరిస్తుండడంతో పరిస్థితి విషమిస్తోంది. సమయానికి బస్సులు రాక కార్యాలయాలకు వెళ్లేవారు ఇబ్బందిపడ్డారు. ఆటావాలాలు అడ్డగోలుగా చార్జీలు వసూలు చేశారు.
Advertisement
Advertisement