Contract teachers
-
సీఎం జగన్‌కు జీవితాంతం రుణపడి ఉంటాం..
చిలకలపూడి(మచిలీపట్నం): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తూ తమ జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని, జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటామని కాంట్రాక్టు జూనియర్ అధ్యాపకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని ఆర్ అండ్ బీ అతిథి గృహం ఆవరణలో సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. వైఎస్సార్సీపీ మైనార్టీ విభాగం జోనల్ ఇన్చార్జ్ షేక్ సలార్‌దాదా, మునిసిపల్ కార్పొరేషన్ మాజీ డెప్యూటీ మేయర్ లంకా సూరిబాబు, పార్టీ యువజన విభాగం జోనల్ ఇన్చార్జ్ పేర్ని కృష్ణమూర్తి(కిట్టు), అర్బన్ బ్యాంక్ అధ్యక్షుడు పల్లపాటి సుబ్రహ్మణ్యం, పలువురు కాంట్రాక్టు అధ్యాపకులు పాల్గొన్నారు. -
హెచ్ఎం వేధింపులు.. జాబ్ కావాలంటే , నేను చెప్పినట్లు వినాల్సిందే!
గౌరిబిదనూరు(బెంగళూరు): తాలకాలోని దారినాయకనపాళ్య (డి పాళ్య) గ్రామంలోని ప్రభుత్వ కర్ణాటక పబ్లిక్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడైన రాజేశ్ కాంట్రాక్టు టీచర్‌ను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని, అతని మాటలు వినకపోతే ఉద్యోగం నుంచి తీసేస్తానని బెదిరిస్తున్నాడని దళిత సంఘర్ష సమితి కార్యకర్తలు పాఠశాల ముందు ధర్నా నిర్వహించారు. ఆమెను వేధించడమే కాకుండా అసభ్య పదజాలంతో దషిస్తున్నాడని సమితి నేతలు ఆరోపించారు. ఇది తెలిసి తాలకా విద్యాశాఖ అధికారి శ్రీనివాసమూర్తి అక్కడకు చేరుకుని నిరసనకారులతో చర్చించారు. హెచ్ఎం పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని వారు వినతి పత్రమిచ్చారు. సర్వశిక్షా అభియాన్ అధికారి గంగారెడ్డి పాల్గొన్నారు. చదవండి కిసాన్ మోర్చా మహిళా నేత ఆత్మహత్య.. బీజేపీ కీలక నిర్ణయం.. -
అంతులేని వ్యథ! 30 ఏళ్ళు పనిచేసినా మారని కథ.. చదువు చెప్పినవాళ్లేమో
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా వివిధ విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న దాదాపు వెయ్యి మంది కాంట్రాక్టు అధ్యాపకులు ఎన్నో ఏళ్లుగా క్రమబద్ధీకరణకు నోచుకోవడం లేదు. రెగ్యులర్ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా, ఇంతవరకూ ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. తాము చదువు చెప్పిన వాళ్ళు ఉన్నత స్థానాల్లోకి వెళ్ళినా, తమ పరిస్థితిలో మాత్రం మార్పు లేదని అధ్యాపకులు వాపోతున్నారు. వీరిలో పదవీ విరమణకు దగ్గరపడుతున్న అధ్యాపకులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్నవారు సైతం ఉండటం గమనార్హం. కాగా 60 ఏళ్ళు దాటిన కారణంగా రెండేళ్ళలో 11 మంది కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లను తొలగించారు. వీళ్ళంతా దాదాపు 30 ఏళ్ళుగా పనిచేస్తున్నవారు కావడం విశేషం. అయితే పర్మినెంట్ కాకపోవడంతో వీరికి ఎలాంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందలేదు. మరోవైపు గత ఏడాది కాలంలో సర్వీస్‌లో ఉన్న ఏడుగురు కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు మృతి చెందారు. వీరు కనీసం ఎక్స్‌గ్రేషియాకు కూడా నోచుకోలేదు. 11 వర్సిటీల్లోనూ అధ్యాపకుల కొరత.. రాష్ట్రంలోని 11 యూనివర్సిటీల్లోనూ అధ్యాపకుల కొరత వేధిస్తోంది. అన్నిచోట్లా కాంట్రాక్టు అధ్యాపకులతోనే నెట్టుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో వర్సిటీల్లో ఖాళీలు, ప్రస్తుతం పని చేస్తున్న అధ్యాపకుల తాజా లెక్కలను విద్యాశాఖ తేల్చింది. 2021 జనవరి 31వ తేదీనాటికి 11 వర్సిటీల్లో 2,837 మంజూరైన పోస్టులు ఉంటే అందులో ఏకంగా 1,869 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంటే 968 మంది (34.12 శాతం) మాత్రమే రెగ్యులర్ ఆధ్యాపకులు ఉన్నారు. ప్రస్తుతం 157 మంది ప్రొఫెసర్లు ఉండగా 238 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 129 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు ఉండగా, 781 పోస్టులు, 682 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు పని చేస్తుండగా 850 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు విద్యాశాఖ లెక్కలు తేల్చింది. అయితే 1869 ఖాళీల్లో 1,061 పోస్టుల భర్తీకి ప్రభుత్వం మూడేళ్ల కిందటే ఆమోదం తెలిపినా ఇంతవరకు భర్తీ చేయలేదు. 61.65% ప్రొఫెసర్ పోస్టులు ఖాళీ.. – ఉన్నత విద్యాశాఖ లెక్కల ప్రకారం.. రాష్ట్రంలో ఒక్క ప్రొఫెసర్ కూడా లేని వర్సిటీలు ఆరు ఉన్నాయి. శాతవాహన, మహత్మాగాంధీ, పాలమూరు, రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ (ఆర్జీయూకేటీ), డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీల్లో ఒక్క ప్రొఫెసర్ కూడా లేరు. శాతవాహన, ఆర్జీయూకేటీ, బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు కూడా లేరు. పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్ ఒకరే ఉన్నారు. ఇక మెుత్తంగా చూస్తే రాష్ట్రంలోని 11 యూనివర్సిటీల్లో 61.65 శాతం ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 85.82 శాతం అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు, 55.48 శాతం అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వందేళ్ళకు పైగా చరిత్ర ఉన్న ఓయూలో సగానికిపైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కేయూలో ఇప్పుడు కేవలం ఒక్కరే ప్రొఫెసర్ ఉండగా, అసోసియేట్ ప్రొఫెసర్లు ఇద్దరే ఉన్నారు. శాతవాహన, ఆర్జీయూకేటీ, బీఆర్ అంబేడ్కర్ వర్సిటీల్లో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు ఒక్కరంటే ఒక్కరు లేరు. యూజీసీ పే కమిషన్ అమలు చేయాలి కాంట్రాక్టు అధ్యాపకులతోనే ఓయూ విద్యా వ్యవస్థ నడుస్తోంది. యూజీసీ నిబంధనల ప్రకారం మాకు అన్ని అర్హతలు ఉన్నాయి. కాబట్టి 7వ పే కమిషన్ వేతనాలు ఇవ్వాలి. – డాక్టర్ డి.ధర్మతేజ (ఓయూ కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ల సంఘం అధ్యక్షుడు) నా బిడ్డ కోసమైనా ఉద్యోగం ఇవ్వండి పదేళ్ళు ఓయూలో కాంట్రాక్టు అధ్యాపకుడిగా పనిచేసిన నా భర్త గత ఏడాది చనిపోయారు. ఇప్పటికీ ఎలాంటి ఆర్థిక సాయం అందలేదు. నాకు ఉద్యోగం ఇవ్వమని అడుగుతున్నా పట్టించుకోవడం లేదు. పర్మినెంట్ అయితే ఇవన్నీ లభించేవి. నాకు రెండేళ్ళ పాప ఉంది. కుటుంబ పోషణ కష్టంగా ఉంది. నా బిడ్డ మొఖం చూసైనా ఉద్యోగం ఇస్తారని ఆశ పడుతున్నా. – రాజేశ్వరి (చనిపోయిన కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీకాంత్ భార్య) 24 ఏళ్ల సర్వీసుకు గుర్తింపు లేదు.. కాంట్రాక్టు అధ్యాపకురాలిగా 24 ఏళ్ళుగా పనిచేస్తున్నా. రీసెర్చ్‌లో 25 ఏళ్ళ అనుభవం ఉంది. పరీక్షల నిర్వహణలో 15 ఏళ్ళు సర్వీస్ ఉంది. ఎప్పటికప్పుడు పర్మినెంట్ అవుతుందని ఎదురుచూస్తుండగానే రిటైర్మెంట్ దగ్గర (సెప్టెంబర్‌లో) పడింది. నా సర్వీస్‌కు ప్రభుత్వ గుర్తింపు లేకపోవడం దురదృష్టకరం. – డాక్టర్ అనిత కుమారి (నిజాం కాలేజీ జువాలజీ డిపార్ట్మెంట్ అధ్యాపకురాలు) -
మీకు నేనున్నా.. హామీ ఇస్తున్నా: కేజ్రీవాల్
మొహాలి: ‘నన్ను మీ సోదరుడిగా భావిస్తే, దయచేసి కిందకు దిగండి. మేము త్వరలో పంజాబ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము. తర్వాత మీ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాము’ అంటూ పంజాబ్‌లోని కాంట్రాక్టు టీచర్లకు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ హామీయిచ్చారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మొహాలీలో ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంక్‌పైకి ఎక్కి నిరసన తెలుపుతున్న ఉపాధ్యాయులతో ఆయన మాట్లాడారు. కేజ్రీవాల్ వాహనంపై ఎక్కి పైకి చూస్తూ వారితో మైక్‌లో సంభాషించారు. కిందకు దిగి రావాలని వారిని కోరారు. ‘మీరు ఎంతకాలం నుంచి నిరసనలు చేస్తున్నారు?’ అని కేజ్రీవాల్ ప్రశ్నించగా.. దానికి వారు ‘సార్, 45 రోజులు’ అని బదులిచ్చారు. కాంట్రాక్టు టీచర్ల సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఈ సందర్భంగా ఆయన విమర్శించారు. ‘విచారకరమైన విషయం ఏమిటంటే, ఢిల్లీలోని ఉపాధ్యాయులను శిక్షణ కోసం ఇంగ్లండ్, స్వీడన్ దేశాలకు పంపుతున్నాము. పంజాబ్‌లోని కాంగ్రెస్ సర్కారు వారిని ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంకులకు పంపుతోంద’ని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో విద్యావ్యవస్థను పూర్తిగా సంస్కరించామని, ఈ ఘనత ఉపాధ్యాయులకే దక్కుతుందని అన్నారు. పర్మినెంట్ ఉద్యోగాలు, మెరుగైన జీతాల కోసం చాలా కాలంగా కాంట్రాక్టు టీచర్లు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం పంజాబ్ ఎడ్యుకేషన్ బోర్డ్ వెలుపల టీచర్లు భారీ ఎత్తున నిరసనకు దిగారు. ఎన్నికల్లో తమకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని కొంతమంది ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంక్ పైకి ఎక్కారు. విషయం తెలుసుకున్న కేజ్రీవాల్ అక్కడికి చేరుకుని ఆందోళనకారులను సముదాయించే ప్రయత్నం చేశారు. పంజాబ్‌లో తాము అధికారంలోని వస్తే కాంట్రాక్టు టీచర్ల ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చారు. (చదవండి: ముఖ్యమంత్రి దాతృత్వం.. అతని కలను సాకారం చేశారు) ‘కెప్టెన్ అమరీందర్ సింగ్, బాదల్ సహా పలువురు ముఖ్యమంత్రులు ఉపాధ్యాయులకు గతంలో ఇవే హామీలు ఇచ్చారని విన్నాను. ఆ ట్రెండ్‌ని అనుసరించడానికి నేను ఇక్కడకు రాలేదు. ఢిల్లీలోని విద్యావ్యవస్థను సంస్కరించిన తీరు గురించి మీరు వినే ఉంటారు. అక్కడ ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు గణనీయంగా మారిపోయాయి. ఇదంతా అది మా టీచర్ల గొప్పతనమే. నేను చేయాల్సిందల్లా వారి సమస్యలను పరిష్కరించడమే. పంజాబ్‌లోని కాంట్రాక్టు ఉపాధ్యాయుల ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తానని నేను హామీ ఇస్తున్నాను’ అని కేజ్రీవాల్ వాగ్దానం చేశారు. (చదవండి: మాటంటే మాటే.. ‘డ్యూటీలో ఉన్నా లేకున్నా మందు ముట్టం, ఆన’) -
2008 డీఎస్సీ అభ్యర్థులకు కాంట్రాక్టు టీచర్లుగా అవకాశం
సాక్షి, అమరావతి: 2008 డీఎస్సీలో కామన్ మెరిట్ పాటించకపోవడం వల్ల నష్టపోయిన అభ్యర్థులకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ కె.వెంకటరామిరెడ్డి చెప్పారు. వారిని కాంట్రాక్టు పద్ధతిలో టీచర్లుగా నియమిస్తామని చెప్పారని తెలిపారు. ఆయన బుధవారం సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి ఈ విషయాన్ని విన్నవించారు. అనంతరం ఆయన మీడియా పాయింట్లో మాట్లాడారు. దీనివల్ల 2,193 మంది నిరుద్యోగ టీచర్లు ఉద్యోగం పొందనున్నారని చెప్పారు. ఇప్పటికే కొందరు ప్రభుత్వ ఉద్యోగాల్లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నారని తెలిపారు. వీరికి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం విడుదల చేసే నోటిఫికేషన్లో మినహాయించాలని సీఎంకు విన్నవించినట్లు చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ డిక్లేర్ చేయాలి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను నియమించి ఈ అక్టోబర్ 2వ తేదీకి రెండేళ్లు పూర్తవుతుందని, ఆ వెంటనే వారందరికీ ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని కోరగా సీఎం సానుకూలంగా స్పందించారని చెప్పారు. రెండేళ్లు నిండగానే శాఖాపరమైన పరీక్షల్లో పాసైన వారందరికీ ప్రొబేషన్ డిక్లేర్ చేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారని తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియను మొదలు పెట్టాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారన్నారు. ఉద్యోగుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో 2008 డీఎస్సీ అభ్యర్థులు పి.వెలుగుజ్యోతి, సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు అంజన్‌రెడ్డి, కార్యదర్శి అంకమరావు తదితరులు పాల్గొన్నారు. చదవండి: అమానుషం: పసికందును డ్రైనేజీలో పడేసిన తల్లి -
2008 డీఎస్సీ అభ్యర్థులకు మరో అవకాశం
సాక్షి, అమరావతి: 2008 డీఎస్సీలో మెరిట్ జాబితాలో ఉండి పోస్టులు పొందలేకపోయిన వారి విన్నపాలు ఎట్టకేలకు ఫలిస్తున్నాయి. కనీసం కాంట్రాక్ట్ టీచర్లుగానైనా నియమించాలన్న విజ్ఞప్తులను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ప్రస్తుతం వారికి అవకాశం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వారిని కాంట్రాక్ట్ టీచర్లుగా నియమించేందుకు వీలుగా విద్యాశాఖ ఉత్తర్వులిచ్చింది. 2008 డీఎస్సీలో మెరిట్ లిస్ట్‌లో ఉండి పోస్టులు పొందలేకపోయిన వారి జాబితాలను ఇప్పటికే జిల్లాల నుంచి తెప్పించింది. వీరిలో 4,579 మంది బీఈడీ అభ్యర్థులు, 78 మంది డీఈడీ అభ్యర్థులు కలిపి మొత్తం 4,657 మంది ఉన్నారు. వీరిలో కొంతమంది తరువాత డీఎస్సీల్లో, ఇతర పోటీ పరీక్షల్లో వేర్వేరు పోస్టులకు ఎంపికయ్యారు. మిగిలిన వారిలో ఎంతమంది కాంట్రాక్ట్ టీచర్లుగా పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నారో తెలుసుకోవలసిందిగా విద్యాశాఖ జిల్లా విద్యాధికారులకు ఉత్తర్వులిచ్చింది. ఆయా అభ్యర్థుల అంగీకారాన్ని, జాబితాలను trc.cse@apschooledu.inకు ఈనెల 18లోగా పంపాలని పేర్కొంది. -
కంప్యూటర్ విద్య మిథ్య..!
కరీంనగర్‌ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్లు మూలకుపడ్డాయి. బోధకుల కాంట్రాక్టు ముగియడంతో విద్యార్థులకు కంప్యూటర్ పాఠాలు బోధించేవారు కరువయ్యారు. ఐదేళ్లపాటు కుదుర్చుకున్న బోధకుల కాంట్రాక్టు ఒప్పందం ముగిసి ఐదేళుŠల్ అయ్యింది. కాంట్రాక్టు ముగిసేలోపు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాల్సి ఉండగా.. అది నెరవేరలేదు. ప్రభుత్వం తిరిగి కాంట్రాక్టు ఇవ్వకపోవడంతో పాఠశాలల్లో కంప్యూటర్ పాఠాలు బోధించేవారు కరువయ్యారు. అధికారులు చొరవ తీసుకుని పాఠశాలల్లో కంప్యూటర్ బోధకులను కొనసాగించాలని తల్లిదండ్రులు, విద్యార్థులు కోరుతున్నారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోనూ విద్యార్థులకు కంప్యూటర్ విద్యను బోధించేందుకు ఏర్పాటు చేసినప్పటికీ.. బోధకులు లేక కంప్యూటర్లు మూలనపడ్డాయి. బోధకుల కాంట్రాక్టు 2013 ఆగస్టు నెలాఖరుతో ముగిసిపోయింది. అప్పటినుంచి పాఠాలు బోధించేవారు లేక ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా తయారైంది. కంప్యూటర్ బోధన బాధ్యతను ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులకు అప్పగించినప్పటికీ వారు పట్టించుకోవడంలేదని విద్యార్థులు వాపోతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులకు కంప్యూటర్‌పై అవగాహన కల్పించి ఎంఎస్ ఆఫీస్, ఇంటర్నెట్, ఎక్సెల్, పవర్‌పాయింట్ ప్రెజంటేషన్, మైక్రోసాఫ్ట్, పెయింటింగ్ అంశాలపై వివరించేలా ఏర్పాట్లు చేశారు. 2007 నుంచి కేంద్ర ప్రభుత్వం దశలవారీగా ఆయా పాఠశాలల్లో కంప్యూటర్ విద్యాబోధన ప్రవేశపెట్టింది. ఉమ్మడి జిల్లాలో 277 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో కంప్యూటర్ విద్యను ప్రారంభించింది. ఒక్కో పాఠశాలకు ప్రభుత్వం 10 కంప్యూటర్లను మంజూరు చేసింది. కంప్యూటర్ పాఠాలు బోధించేందుకు ఇద్దరిని నియమించింది. కంప్యూటర్ విద్యాబోధన కాంట్రాక్టును ప్రభుత్వం జిల్లాలో ఐసీటీ అనే సంస్థకు అప్పగించింది. ఈ సంస్థ పాఠశాలల్లో కంప్యూటర్ను ఏర్పాటు చేయడంతోపాటు బోధకులను నియమించి విద్యార్థులకు విద్యాబోధన చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఒక్కో పాఠశాలకు ఇద్దరు బోధకులను నియమించి.. వారికి నెలకు రూ.4,500 వేతనంగా చెల్లించారు. ఐదేళ్లపాటు కుదుర్చుకున్న ఒప్పందం 2013 ఆగస్టు నెలాఖరు వరకు ముగిసింది. ఈ ఐదేళ్ల కాలంలో ఐసీటీ సంస్థ ఒప్పందం ముగిసే లోపు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు ఇవ్వాల్సి ఉన్నా.. ఇవ్వలేదు. రెండేళ్ల క్రితం సర్వశిక్ష అభియాన్, రాజీవ్ విద్యామిషన్ ద్వారా ఆయా పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులకు 20 రోజులపాటు కంప్యూటర్లో శిక్షణ ఇచ్చారు. అదే సమయంలో కంప్యూటర్ శిక్షణ సంస్థ ఒప్పందం ముగియడంతో కేంద్రప్రభుత్వం బోధకులను తొలగించింది. ప్రభుత్వం తిరిగి ఏ ఒక్క సంస్థకూ కాంట్రాక్టు ఇవ్వకపోవడంతో పాఠశాలల్లో కంప్యూటర్ పాఠాలు బోధించేవారు కరువయ్యారు. కంప్యూటర్లు గదిలోనే మూలకు పడ్డాయి. వాటిని వినియోగించకపోవడంతో చెడిపోతున్నాయి. ఒక్కో పాఠశాలలో కంప్యూటర్ల ఏర్పాటుకు ఏకంగా రూ.మూడులక్షల చొప్పున వెచ్చించారు. ప్రస్తుతం అక్కడక్కడ కొందరు విద్యార్థులు మాత్రం ఇప్పటివరకు నేర్చుకున్న పరిజ్ఞానాన్ని మరిచిపోకుండా ఉండేందుకు ప్రాక్టీస్ చేస్తున్నారు. తెలిసీతెలియక ఏదో ఒకటి ఆపరేట్ చేస్తే కంప్యూటర్లు చెడిపోతాయనే భావనతో కొన్ని పాఠశాలల్లో కంప్యూటర్ గది తాళాలు తీయడం లేదు. కంప్యూటర్ విద్యాబోధన బాధ్యతలను ప్రధానోపాధ్యాయులే తీసుకుని పాఠాలు బోధించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి ఉత్తర్వులు జారీ చేసినా.. ఎక్కడా అమలు చేయడం లేదు. గతంలో సర్వశిక్ష అభియాన్, రాజీవ్ విద్యామిషన్ ద్వారా ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చినప్పటికీ చాలామంది వాటిని మరిచిపోయారు. కొందరైతే శిక్షణకే హాజరు కాలేదు. రెగ్యులర్‌గా ఆయా అంశాలపై ప్రాక్టీస్ లేని కారణంగా వారికి మరోసారి శిక్షణ ఇస్తేగానీ బోధించే పరిస్థితి ఉండదని అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి అయినప్పటికీ అటు విద్యాశాఖ అధికారులు, ఇటు జిల్లా యంత్రాంగం చడీచప్పుడు లేకుండా వ్యవహరిస్తుండడంతో ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ విద్య అందనిద్రాక్షగా మిగిలింది. కంప్యూటర్ విద్యను ప్రారంభించాలని జిల్లా ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశాల్లో ప్రజాప్రతినిధులు లేవనెత్తినా ఫలితంలేకుండాపోతోంది. ఐదేళ్ల నుంచి కంప్యూటర్లను వినియోగించడంలేదని, ఆ కారణంగా అవి చెడిపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కంప్యూటర్ల విషయమై సంబంధిత అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని పాఠశాలల్లో కంప్యూటర్ విద్యాబోధనను కొనసాగించాలని తల్లిదండ్రులు, విద్యార్థులు కోరుతున్నారు. -
మా సర్వీసులను క్రమబద్ధీకరించండి
► కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం నేతల డిమాండ్ విజయనగర్ కాలనీ: కాంట్రాక్టు అధ్యాపకుల సర్వీసులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ గురువారం మాసబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యా మండలి కార్యాలయాన్ని యూనివర్సిటీల కాంట్రాక్టు అధ్యాపకులు ముట్టడించారు. తెలంగాణ ఆల్ లెక్చరర్స్ కాంట్రాక్టు టీచర్స్ అసోసియేషన్ (టి–ఏయూసీటీఏ) అధ్యక్షుడు రామేశ్వర్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు అన్యాయాన్ని ప్రతిఘటించే ఎన్నో ఉద్యమాలకు వేదికలుగా నిలిచి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వ గ్రాంట్స్ యూనివర్సిటీలకు ఇవ్వక పోవడం వల్ల యూనివర్సిటీలు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నాయన్నారు. దీంతో యూనివర్సిటీల్లో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు, కాంట్రాక్ట్ అధ్యాపక వ్యవస్థ ఆవిర్భవించిందన్నారు. రెగ్యులర్ పోస్టుల్లో కూడా నియామకాలు చేపట్టకపోవడంతో కాంట్రాక్ట్ అధ్యాపకుల నియామకం మొదలైందన్నారు. కాంట్రాక్ట్ అధ్యాపకులకు చాలీచాలని జీతాలు ఇస్తూ వెట్టిచాకిరి చేయిస్తూ యూజీసీ నిబంధనలను కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఉన్నత విద్యామండలి చైర్మన్ కార్యాలయంలో తమ సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీధర్ కుమార్, కాంట్రాక్టర్ లెక్చరర్లు పాల్గొన్నారు. -
బరితెగింపు
► ఎమ్మెల్సీ ఎన్నికల కోసం టీడీపీ ప్రలోభాలు ► కాంట్రాక్టు ఉపాధ్యాయులపై ఒత్తిడి ► ఓటు వేయకపోతే రెగ్యులర్ చేయమంటూ బెదిరింపులు ప్రైవేట్ పాఠశాలలకు అల్టిమేటం ► గుర్తింపు రద్దు చేస్తామంటూ హెచ్చరిక ► ఆదివారం ఒంగోలులో ఉపాధ్యాయులతో టీడీపీ సమావేశం ► ఓటర్ల ఫోన్ నెంబర్లు తెచ్చిన వారికి నగదు బహుమానం ► ఓటేస్తే... పెద్ద మొత్తంలో ముడుపులు సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు సంపాదించడమే లక్ష్యంగా అధికార టీడీపీ బెదిరింపులు, ప్రలోభాల పర్వానికి తెరలేపింది. అధికార పార్టీకి ఓటు వేయకపోతే సంగతి తేలుస్తామంటూ ఆ పార్టీ నేతలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి ఏకంగా జిల్లా కేంద్రంలో ఆదివారం ఉపాధ్యాయులు, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలతో ఒంగోలులోని శ్రీనివాస కల్యాణ మండపంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ రామకృష్ణ, కొండపి ఎమ్మెల్యే స్వామితో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. కస్తూరిబా పాఠశాలలకు చెందిన 300 మంది ఉపాధ్యాయులను సమావేశానికి బలవంతంగా తరలించారు. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు ఓట్లేయకపోతే కాంట్రాక్టు ఉపాధ్యాయులకు రెన్యువల్ లేకుండా చేస్తామని సమావేశంలో టీడీపీ ముఖ్యనేతలు హెచ్చరించారు. అందరికీ సెల్మెసేజ్లు పెట్టి మరీ సమావేశానికి రప్పించారు. ఆదివారం అని కూడా చూడకుండా స్థానిక టీడీపీ నేతలు బెదిరించి మరీ ఉపాధ్యాయులను టీడీపీ సమావేశానికి పంపించారు. అధికార పార్టీ హెచ్చరికల నేపథ్యంలో విధి లేని పరిస్థితుల్లో కస్తూరిబా పాఠశాలల ఉపాధ్యాయులు సమావేశానికి హాజరయ్యారు. అధికార పార్టీకి కచ్చితంగా ఓట్లేయాల్సిందేనంటూ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వారికి హుకుం జారీ చేశారు. 2, 3 రోజుల్లో జిల్లా స్థాయిలో మరో సమావేశం ఏర్పాటు చేస్తామని, ఆ సమావేశానికి సైతం రావాలని టీడీపీ నేతలు ముందస్తుగానే ఉత్తర్వులు జారీ చేశారు. విధి లేని పరిస్థితుల్లో సమావేశంలో హాజరైన పలువురు కస్తూరిబా పాఠశాలల ఉపాధ్యాయులు సాక్షికి ఫోన్ చేసి మరీ తమ గోడు వెల్లబోసుకున్నారు. అధికార పార్టీ నేతల దౌర్జన్యం భరించలేకున్నామని ఎన్నికల కోడ్‌లోనూ వారి ఆగడాలు తప్పడం లేదని వాపోయారు. ప్రైవేట్ యాజమాన్యాలతో సమావేశం: మరోవైపు అధికార పార్టీ నేతలు ఆదివారం ఒంగోలులోని మంత్రి నారాయణకు చెందిన ఓ కళాశాలలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించారు. టీడీపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులకు కచ్చితంగా ఓట్లు వేయాల్సిందేనని హెచ్చరికలు జారీ చేశారు. కాదూ కూడదని పీడీఎఫ్ అభ్యర్థులకు ఓట్లు వేస్తే పాఠశాలల గుర్తింపును రద్దు చేస్తామంటూ బెదిరించారు. అన్ని పాఠశాలల పరిధిలో తాము నమోదు చేయించిన బోగస్ ఓట్లన్నీ కచ్చితంగా అధికార పార్టీకి వేసేలా చర్యలు తీసుకోవాలని వారు యాజమాన్యాలపై ఒత్తిడి తెచ్చారు. ఓటర్లకు ప్రలోభాలు: ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికార పార్టీ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు రకరకాల ఆఫర్లను ప్రకటించింది. 2, 3 రోజుల్లో అవగాహన సదస్సు పేరుతో ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించిన ఓటర్లందరినీ ఒంగోలుకు తరలించేందుకు ఆ పార్టీ నేతలు సిద్ధమయ్యారు. ఓటర్లకు సంబంధించిన ఫోన్ నంబర్లు తెస్తే ఒక్కొక్క ఫోన్ నెంబర్‌కు రూ.200 ఇస్తామంటూ సరికొత్త ఆఫర్‌ను తెరపైకి తెచ్చారు. ఓటర్లకు సంబంధించిన ఎన్ని నంబర్లు తెచ్చి ఇస్తే ... అన్ని రూ.200 ఇస్తామంటూ ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు ఓట్లు వేసిన ఓటర్లకు పెద్ద మొత్తంలోనే నగదు లేదా గిఫ్ట్‌లు ఇస్తామంటూ ప్రచారం మొదలుపెట్టారు. ఎంత మొత్తంలో ఇస్తామన్న విషయం కూడా రెండు రోజుల్లో ప్రకటిస్తామని ఆదివారం జరిగిన సమావేశంలో టీడీపీ నేతలు బహిరంగంగానే ప్రకటించినట్లు సమాచారం. నిన్న, మొన్నటి వరకు బోగస్ ఓట్లనే నమ్ముకున్న టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు అధికార పార్టీ నేతలు, కార్యకర్తలను ఏ మాత్రం పలకరించిన పాపానపోలేదు. పీడీఎఫ్‌కు వైఎస్సార్సీపీ మద్ధతు నేపథ్యంలో..: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీడీఎఫ్ అభ్యర్థులకు మద్దతు ప్రకటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించడంతో అధికార పార్టీ నేతలు బెంబేలెత్తిపోయారు. హుటాహుటిన కస్తూరిబా పాఠశాల ఉపాధ్యాయులు, ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలతో సమావేశం పెట్టి మరీ ఓట్లేయాలంటూ బెదిరింపుల పర్వానికి తెరలేపారు. రకరకాల పద్ధతుల్లో మరోవైపు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు సిద్ధమయ్యారు. అధికార పార్టీ ఓట్ల కోసం బెదిరింపుల పర్వానికి తెరలేపడంపై కస్తూరిబా పాఠశాలల ఉపాధ్యాయులు, ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలతో పాటు ఓటర్లు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
కాంట్రాక్ట్ టీచర్ల సమ్మె విరమణ
అంబర్‌పేట: ప్రభుత్వంపై విశ్వాసంతో తమ సమ్మెను విరమిస్తున్నట్టు తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ కాంట్రాక్ట్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.రామేశ్వర్రావు తెలిపారు. ఆదివారం టీఆర్ఎస్ అంబర్‌పేట నియోజకవర్గ ఇన్చార్జి ఎడ్ల సుధాకర్‌రెడ్డి నేతృత్వంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిని కలిసి తమ సమస్యలను చెప్పగా పరిష్కరానికి ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. ఛే నంబర్ చౌరస్తాలో సుధాకర్‌రెడ్డితో కలిసి రామేశ్వర్రావు విలేకరులతో మాట్లాడారు. సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత, రెగ్యులరైజేషన్ ప్రక్రియ వేగవంతం వంటి డిమాండ్లతో 13 రోజులుగా తాము సమ్మె చేస్తున్నామన్నారు. తమ డిమాండ్లకు డిప్యూటీ సీఎం సానుకూలంగా స్పందించారన్నారు. ఓయూ మాజీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ తిరుపతిరావు నేతృత్వంలో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసి 30 రోజుల్లో సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారన్నారు. దీంతో అసోసియేషన్ ఆయనకు కృతజ్ఞతలు తెలిపి సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించిందన్నారు. ఈ సమావేశంలో అసోసియేషన్ ప్రతినిధులు సుధీర్‌కుమార్, ఎ.దత్తాత్రి, నారాయణ, సూర్యం, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎం.తిరుపతి, రవీందర్‌రెడ్డి, సురేష్‌నాయక్, చక్రవర్తి, డాక్టర్ పరుశరాం, డాక్టర్ ధర్మతేజ, డాక్టర్ వేల్పుల కుమార్ పాల్గొన్నారు. -
క్రమబద్ధీకరణ వెంటనే చేయాలి
నిర్మల్‌టౌన్ : కాంట్రాక్ట్ అధ్యాపకులను వెంటనే క్రమబద్దీకరించాలని కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం నాయకులు డి మాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ముందు నిరవధిక దీక్షలో భాగంగా సోమవారం మౌన దీక్ష చేశారు. అంతకుముందు వారు మాట్లాడారు. క్రమబద్దీకరణను చేయడంలో ప్రభుత్వం ఎందుకు ఆలçస్యం చేస్తుందో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. క్రమబద్దీకరణ ఆలస్యం అవుతుండడం వల్ల అప్పటి వరకు 10వ పీఆర్సీ ప్రకారం బేసిక్ పే చెల్లించడంతో పాటు డీఏ ఇవ్వాలని కోరారు. మహిళలకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. నాన్ సాంక్షన్ పోస్టులను వెంటనే సాంక్షన్ పోస్టులుగా మర్చాలని అన్నారు. ఇందులో నాయకులు సంజీవ్, పురుషోత్తం, లక్షీ్మకాంత్, నాగేశ్వర్రావు, సుధారాణి, సురేఖ, సుమన్ గౌడ్, సవిన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఆమరణ నిరాహార దీక్ష భగ్నం
అనంతపురం అర్బన్ : తమ డిమాండ్ల సాధన కోసం కలెక్టరేట్ ఎదుట కాంట్రాక్టు అధ్యాపకులు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షని బుధవారం రాత్రి పోలీసులు భగ్నం చేశారు. కాంట్రాక్టు అధ్యాపకుల జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట కాంట్రాక్టు అధ్యాపకులు జె.నాగరాజనాయక్, హెచ్.నరసింహప్ప, జి.గోవిందు, కె.వెంకటేశ్వరరాజులు నిరాహార దీక్షని ఈ నెల 27న చేపట్టారు. రెండవ రోజైన బుధవారం దీక్ష కొనసాగించారు. రాత్రి 8.30 గంటల సమయంలో వన్ టౌన్ సీఐ రాఘవన్ నేతృత్వంలో ఎస్ఐ రంగడు, తన సిబ్బందితో అక్కడి చే రుకుని దీక్ష చేస్తున్నవారికి వైద్యుల చేత ఆరోగ్య పరీక్ష నిర్వహించారు. అందులో ఒకరి ఆరోగ్య పరిస్థితి క్షీణించినట్లు, మిగతా ముగ్గురూ అస్వస్థతకు గురవుతున్నట్లు వైద్యులు తెలిపారు. దీంతో నలుగురి దీక్షని పోలీసులు భగ్నం చేసి చికిత్స నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు. -
కాంట్రాక్టు అధ్యాపకులపై ‘కత్తి’
డేట్లైన్ హైదరాబాద్ ఒక్కో వర్సిటీ ఒక్కో పేరుతో పిలిచే కాంట్రాక్టు అధ్యాపకులకు సెలవులుండవు. విద్యా సంవత్సరాంతంలో బ్రేక్ ఇచ్చి మళ్లీ ఆరంభంలో విధుల్లోకి తీసుకుంటారు. వారి డిమాండ్లు న్యాయమైనవి. వాటిలో ప్రధానమైనవేవీ అసాధ్యమైనవి కావు. ఖాళీ అధ్యాపక పోస్టులను భర్తీ చేయక ముందే తమను రెగ్యులరైజ్ చేయాలని, తమ సర్వీసును పరిగణనలోకి తీసుకోవాలని, ప్రభుత్వం ఒక కమిటీని నియమించి పనిజేస్తున్న వారిని సర్వీసులోకి తీసుకునేలా నియమనిబంధనలను తయారుచేయాలని వారు కోరుతున్నారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నియమావళి ప్రకారం విశ్వ విద్యాలయాలు ప్రధానంగా మూడు రకాలు విధులను నిర్వర్తించాలి. అవి బోధన, పరిశోధన,విస్తరణా కార్యక్రమాలు. మన దేశంలో ఉన్న 759 విశ్వ విద్యాలయాలలో ఎక్కువ బోధనకే పరిమితమయ్యాయి. కొన్ని బోధనతో పాటు పరిశోధనను కూడా సమానంగానే చేబడుతున్నాయి. ఇక విస్తరణా కార్యక్రమాలను అతి తక్కువ విశ్వవిద్యాలయాలు నిర్వహిస్తున్నాయి. విస్తరణా కార్యక్రమాలలో ముఖ్యమైనవి వయోజన విద్య, సామాజిక ప్రయోజన కార్యకమాలు. వీటికి ప్రేరణ 1978లో జనతా ప్రభుత్వం ప్రారంభించిన జాతీయ వయోజన విద్యా కార్యక్రమం. తదుపరి ప్రభుత్వాలు వయోజన విద్యను అనియత విద్యా కార్యక్రమాలలో భాగంగా కొనసాగించి, ఆ తర్వాత చరమగీతం పాడాయి. దీనికి కారణం నిధుల కొరత మాత్రమే కాదు, ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేకపోవడం కూడా. పరిశోధనా రంగంలోనే కృషిచేసే ప్రత్యేక సంస్థలున్నప్పటికీ విశ్వవిద్యాయాలు కూడా అకడమిక్ రీసెర్చ్‌ను ప్రోత్సహిస్తున్నాయి. ముఖ్యంగా సాంప్రదాయక విశ్వవిద్యాలయాలు బోధన, పరిశోధనలను సమతూకంలో కొనసాగిస్తున్నాయి. ఈ విషయంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం మొదటి స్థానంలో ఉంది. కొత్తగా ప్రారంభించిన విశ్వ విద్యాలయాలలో పరిశోధన అంతంత మాత్రపు స్థాయిలోనే ఉంది. తగినంత మంది అధ్యాపకులు, అర్హులైన పర్యవేక్షకులు లేకపోవడమే దీనికి కారణం. కాంట్రాక్టు అధ్యాపకుల గుండెల్లో గుబులు ప్రస్తుతం మన రాష్ర్టంలో 14 విశ్వవిద్యాలయాలున్నాయి. ఒక్కటంటే ఒక్క కేంద్రీయ విశ్వ విద్యాలయం కూడా లేదు. ఈ వ్యాసం ఆంధ్రప్రదేశ్‌లోని రాష్ట్ర విశ్వ విద్యాలయాల గురించి మాత్రమే చర్చిస్తుంది. రాష్ట్రంలోని అన్ని విశ్వ విద్యాలయాలు ఎదుర్కొంటున్న సమస్య అధ్యాపకుల కొరత. సుమారు ఒక దశాబ్దం నుంచి అధ్యాపల భర్తీ జరగలేదు. పర్మినెంట్ ఫ్యాకల్టీ (బోధనా సిబ్బంది) చాలా తక్కువగా ఉంది. చాలా విభాగాలలో అది సున్నా స్థాయికి వచ్చేసింది. సింగిల్ అధ్యాపక విభాగాలు లేకపోలేదు. దీని వల్ల సామాజిక శాస్త్రాలు, భాషా, మానవీయ శాస్త్ర విభాగాలను కొన్ని యూనివర్సిటీలలో మూసివేసారు. చాలా విభాగాలు సింగిల్ టీచర్ స్కూల్స్‌లా మిగిలిపో యాయి. దీన్ని అధిగమించడానికి కాంట్రాక్టు అధ్యాపకుల వ్యవస్థను విశ్వ విద్యాలయాలు ప్రారంభించాయి. ఇదిప్పుడు కేంద్ర విశ్వ విద్యాలయాలకు కూడా పాకింది. విద్యార్థులు, తల్లిదండ్రుల విమర్శలను తట్టుకోలేక ఇంజనీరింగ్ కళాశాలలో మొక్కుబడిగా అధ్యాపకులను నియమిస్తున్నారు. కాంట్రాక్టు అధ్యాపకులు రెండు దశాబ్దాలుగా బోధనకే పరిమితమై పని చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని విశ్వ విద్యాలయాలలో సుమారు 500 మంది కాంట్రాక్టు పద్ధతిపై పనిజేస్తున్న అధ్యాపకులున్నారు. ఏదో నాటికి పర్మినెంట్ అవుతామన్న ఆశతో వారు పనిజేస్తున్నారు. ఈ లోగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ర్ట వ్యాప్తంగా ఉన్న విశ్వ విద్యాలయాలలో, 1,385 ఆచార్య పదవులను భర్తీ చేస్తామని ప్రకటించింది. దీంతో కాంట్రాక్టు అధ్యాపకులకు గుండెల్లో రాయి పడినట్లైయింది. ఇప్పుడైనా వారికి అవకాశం ఉంటుందో లేదోనని భయాందోళనతో ఉన్నారు. విచిత్రమేమిటంటే ఈ కాంట్రాక్టు అధ్యాప కులలో కొందరు 62 ఏళ్లు నిండి పదవీ విరమణ చేయబోతున్నారు. పుండు మీద కారం చల్లినట్లు భర్తీ చేయబోయే అధ్యాపకుల పోస్టులకు రాత పరీక్షలు, మౌఖిక పరీక్షలుంటాయని కూడా ప్రభుత్వం ప్రకటించింది. రెండు దఫాలుగా జరిగే ఈ నియామకాలలో ఏఏ విశ్వవిద్యాలయాలలో ఏఏ పోస్టులను భర్తీ చేస్తారని కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయం తెలిసిన తర్వాత కాంట్రాక్టు అధ్యాపకులు తమ దగ్గర చదువుకున్న విద్యార్థులతోనే తాము పోటీ పడవలసిన అగత్యం ఏర్పడిందని వాపోతున్నారు. ఇదిలా ఉండగా గోరుచుట్టుపై రోకటి పోటున్నట్లు ఆచార్యుల నియామకాలను ఏపీపీఎస్సీకి అప్పగించాలని విద్యాశాఖ మంత్రి ప్రకటించారు. దీంతో తమ భవిష్యత్తు ఏమౌతుందోనన్న భయంతో కాంట్రాక్టు అధ్యాపకులు రొడ్డెక్కారు. రోస్టర్ విధానం ప్రకారం ప్రకటించిన అధ్యాపక పోస్టులలో ఏ పోస్టు ఏ కేటగిరికి వెళుతుందో తెలియదు. ఈ పరిస్థితిలో ఇంతవరకూ ఖాళీ పోస్టులకు ప్రత్యా మ్నాయంగా పనిజేస్తున్న కాంట్ట్రాక్టు అధ్యాపకుల పరిస్థితి అయోమయంగా మారింది. ఇదిలా ఉంటే కాంట్రాక్టు అధ్యాపకులు కూడా మళ్లీ దరఖాస్తు చేసుకొని పోటీలో నిలబడాల్సి వస్తుంది. ఇక్కడే సమస్య మరింత జఠిలమైంది. అధ్యాపకులు లేకుండానే ఉన్నత ప్రమాణాలా? విశ్వ విద్యాలయాలలో పోస్టులు భర్తీ కాకపోవడానికి అధికారులు చాలా కారణాలు చెబుతున్నారు. కొంత కాలం ప్రభుత్వ ఆర్థికశాఖ అనుమతియ్య లేదన్నారు. కారణం ఏదైనా ఖాళీ పోస్టులు భర్తీ చేయకపోవడాన్ని విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలు ప్రశ్నిస్తూనే ఉన్నాయి. ఒక సమయంలో ఆంధ్ర విశ్వ విద్యాలయంలో రోస్టర్ వేయడం పూర్తి అయ్యింది, రేపో మాపో ప్రకటన వస్తుందని అందరూ ఆశపడ్డారు. కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. ఒకానొకప్పుడు ఆంధ్ర యూనివర్సిటిలో 1,200 అధ్యాపకులుండేవారు. వారి సంఖ్య ప్రస్తుతం 350కి పడిపోయింది. ఖాళీయైన స్థానాల్లో కాంట్రాక్టు అధ్యాపకులు, గెస్ట్ ఫ్యాకల్టీలు పనిజేస్తున్నారు. ఈ తాత్కాలిక అధ్యాపకుల తోనే యూనివర్సిటీలు పని చక్కబెడుతున్నాయి. అధ్యాపకుల కొరత ఉన్నప్పటికీ విశ్వవిద్యాలయాలకు ప్రపంచ ర్యాంకులు రావాలని, ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు పోటీగా నాణ్యమైన విద్యను అందించాలని ప్రయత్ని స్తున్నాయి. పూర్తి స్థాయి అధ్యాపకులు లేనిదే అది సాధ్యం కాదు. ఈ విష యం వారికి తెలియనిది కాదు. దేనికైనా అధ్యాపకులే నాంది. విద్యనందిం చడంలో అధ్యాపకులదే ప్రధాన పాత్ర. ఏ విద్యాసంస్థయైనా కీర్తి పొందిం దంటే అది అధ్యాపకులవల్లనే. సంస్థలు దానిని నిలబెట్టుకోవాలి. ప్రపంచీకరణ నేపథ్యంలో విద్యారంగంలో చాలా మార్పులు వచ్చాయి. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలతో పాటు, ప్రైవేటు, విదేశీ విశ్వవిద్యాలయాలు కూడా ఉన్నత విద్యనందించడానికి ముందుకు వస్తున్నాయి. వీటికి పోటీగా రాష్ట్ర విశ్వవిద్యాలయాలు కొత్త కొత్త కోర్సులను ప్రవేశపెడుతున్నాయి. విద్యాప్రణాళికలో సెమిస్టర్ విధానంతోబాటు ఐచ్ఛికాధార జమా వ్యవస్థ (Choice Based Credit System) అంతర్ నాణ్యతా హామీ వ్యవస్థ (IQAC) ఉద్యోగ నియామకాల వ్యవస్థ (Placement Cell) లాంటివి ప్రవేశపెట్టాయి. ఇవన్నీ సక్రమంగా జరగాలంటే సుశిక్షితులైన అధ్యాపకులు కావాలి. అందు లోనూ సుదీర్ఘ అనుభవమున్న వారుండాలి. యూజీసీ ప్రమాణాల ప్రకారం ప్రతి శాఖలో ఒక ప్రొఫెసర్, ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లు, నలుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండాలి. ఇప్పుడు చాలా విశ్వవిద్యాలయాలలో ఫీడర్ పోస్టులైన అసిస్టెంట్ ప్రొఫెసర్లు లేకపోవడం వల్ల అసోసియేట్ ప్రొఫెసర్ల స్థాయి లేకుండా పోయింది. ఈ ప్రాథమిక స్థాయిలో పనిజేస్తున్నవారు కాంట్రాక్టు అధ్యాపకులు. వీరు రెగ్యులరైజ్ అయ్యే పరిస్థితి సుదూరంలో కనబడటం లేదు. ఈ కాంట్రాక్టు అధ్యాపకులను ఒక్కో యూనివర్సిటీ ఒక్కో పేరుతో పిలుస్తాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్ (కాంట్రాక్టు), ఎకడమిక్ కన్సల్టెంట్, అడ్హాక్ ఫ్యాకల్టీ, టీచింగ్ అరేంజ్మెంట్ ఇలా రకరకాల పేర్లతో వీరు పనిచేస్తున్నారు. వీరికి సెలవులుండవు. బోధనకు తప్ప మరే పనికీ పనికి రారు. ప్రతి సంవత్సరాంతంలో బ్రేక్ ఇచ్చి విద్యా సంవత్సర ఆరంభంలో మళ్లీ విధుల్లోకి తీసుకుంటారు. ఈ రకంగా కాంట్రాక్టు అధ్యాపకులు దిన దిన గండం నూరేళ్ల ఆయుష్షుగా బతుకు వెళ్లదీస్తున్నారు. డిమాండ్లు న్యాయమైనవి, సాధ్యమైనవి రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలలోని కాంట్రాక్టు అధ్యాపకులు జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి ఆందోళన బాటపట్టారు. ఇటీవల అమరావతి దగ్గర ధర్నా చేసిన కొంత మంది కాంట్రాక్టు అధ్యాపకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు వార్తలొచ్చాయి. వీరు పెడుతున్న డిమాండ్లలో న్యాయం ఉంది. వాటిలో ప్రధాన డిమాండ్లు అసాధ్యమైనవి కావు. ఖాళీ అధ్యాపక పోస్టులను భర్తీ చేయక ముందే వారిని రెగ్యులరైజ్ చేయాలని, తమ సర్వీసును పరిగణనలోకి తీసుకోవాలని, రాష్ట్రప్రభుత్వం ఒక కమిటీని నియమించి ఇంతవరకు పనిజేస్తున్న వారిని సర్వీసులోకి తీసుకునే విధంగా నియమనిబంధనలను తయారుచేయాలని, కాంట్రాక్టు అనే పద్ధతిని రద్దు చేయాలని కోరుతున్నారు. కాంట్రాక్టు అధ్యాపకుల డిమాండ్ల ఆధారంగా, వారు కోరుతున్నట్టు చట్టబద్ధంగా నియమించిన కమిటీ ద్వారా తమ పోస్టులు భర్తీ చేశారని, అప్పటికే ఖాళీగా ఉన్న స్థానాలలో తమను నియమించారని, కాబట్టి తాము మరో పరీక్షకు గాని, ఇంటర్వ్యూకుగానీ హాజరవ్వాల్సిన అవసరం లేదని వారు వాదిస్తున్నారు. అంతేకాదు ఈ కాంట్రాక్టు విధానంలో పనిజేస్తున్న వారిలో నూటికి 80 శాతం దళిత, ఆదివాసీ, వెనుకబడిన తరగతులు, మైనార్టీ వర్గానికి చెందినవారు. సెప్టెంబరు 5న జరిగిన ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒక సెంట్రల్ యూనివర్సిటీలో కాంట్రాక్టు పద్ధతిలో పనిజే స్తున్న ఒక అధ్యాపకురాలు రాష్ట్రపతికి ఒక బహిరంగ లేఖను రాశారు. మమ్మల్ని ఉపాధ్యాయులుగా కాకుండా కేవలం ‘సంఖ్యా’ నామవాచకంతో పిలుస్తున్నారని, అదైనా జూన్-ఏప్రిల్ నెలల మధ్య పనిజేసే కూలీలుగా చూస్తున్నారని ఆమె ఆ లేఖలో వాపోయారు. అత్యున్నత విద్యనభ్యసించిన మాలాంటి వారిని ‘అడ్హాక్స్’గా పిలుస్తూ నానా రకాల అవమానాలకు గురి చేస్తున్నారని, కనీసం అధ్యాపకులుగా కాకపోయినా మనుషులుగా గుర్తిం చాలని ఆమె రాష్ట్రపతిని వేడుకొంది. పేరు కూడా తెలియకుండా ఆమె ఈ లేఖ రాసిందంటేనే కాంట్రాక్టు అధ్యాపకుల పరిస్థితి ఆమె మాటల్లో ‘అడ్హాక్స్’ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థమౌతుంది. ఇప్పటికైన రాష్ర్ట, కేంద్ర ప్రభుత్వాలు కాంట్రాక్టు అధ్యాపకులపై దృష్టి పెట్టి తగు న్యాయం చేయడం శ్రేయస్కరం. వ్యాసకర్త ఆంధ్ర విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు మొబైల్: 9963366788 - ప్రొఫెసర్ కె.పి. సుబ్బారావు -
'ఈ నెల 27 నుంచి ఆమరణ దీక్ష చేస్తాం'
విశాఖ: విశాఖ జిల్లా పాడేరులో ఆశ్రమ పాఠశాలల కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల ఆందోళన రోజురోజుకీ ఉధృతమవుతోంది. వారం రోజులుగా రిలే దీక్షలు చేస్తున్నా ఏపీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ తమను పట్టించుకోకపోవడంపై నిరసిస్తూ వారు ఆందోళన బట్టారు. ఈ నెల 27 నుంచి ఆమరణ దీక్ష చేస్తామని ఆశ్రమ పాఠశాలల కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు స్పష్టం చేశారు. -
కాంట్రాక్టు టీచర్ల మెరుపు సమ్మె
పాడేరు ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలల కాంట్రాక్టు ఉపాధ్యాయులు మెరుపు సమ్మెకు దిగారు. పక్కరాష్ట్రం తెలంగాణలో గిరిజన ఆశ్రమ పాఠశాలల టీచర్లకు రూ.15వేలకు వేతనం పెంచినా ఇక్కడి ప్రభుత్వంలో కదలిక లేదని విమర్శించారు. మూడేళ్లుగా తాము రూ.5వేల వేతనంతోనే పనిచేస్తున్నామని చెప్పారు. మెరుపు సమ్మెలో 480 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
శ్రీనగర్‌లో కాంట్రాక్ట్టీచర్ల ఆందోళన
-
క్రమబద్ధీకరణ కాంట్రాక్ట్!
మంత్రివర్గ తీర్మానం లేకుండానే కాంట్రాక్టు రెసిడెంట్ టీచర్ల సర్వీస్ క్రమబద్ధీకరణ రాజీనామాకు ముందు రోజు రాత్రి సీఎం కిరణ్ సంతకం సబ్‌కమిటీ సమావేశం కాకున్నా సంతకాలు చేసిన మంత్రులు 800 మంది నుంచి భారీగా వసూళ్లు, చేతులు మారిన ముడుపులు? ఉత్తర్వులు జారీకి ఉన్నతవిద్య ముఖ్య కార్యదర్శి నిరాకరణ సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ విభాగంలో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసును క్రమబద్ధీకరణ చేయాలంటే కేబినెట్ ఆమోదం తప్పనిసరి. కాంట్రాక్టు రెసిడె ంట్ టీచర్ల(సీఆర్టీ) సర్వీసు క్రమబద్ధీకరణలో మాత్రం ఈ నిబంధనను తుంగలోకి తొక్కారు. అధికారులు కుదరదన్నా మంత్రులు ఆగమేఘాలపై ఆమోదించారు. కేబినెట్ ఆమోదం లేకున్నా 800 మంది టీచర్ల సర్వీసు క్రమబద్ధీకరణ ఫైలుపై సీఎం హోదాలో కిరణ్‌కుమార్‌రెడ్డి హడావుడిగా సంతకం చేశారు. రెగ్యులరైజేషన్ పేరిట ఒక్కొక్కరినుంచి లక్ష రూపాయల వరకు వసూలు చేశారనే ఆరోపణలు వినవస్తున్నారుు. ఉత్తరాంధ్రకు చెందిన జిల్లా కాంగ్రెస్ కమిటీ(డీసీసీ) అధ్యక్షుడు, ఓ ఎమ్మెల్సీ ఈ వ్యవహారంలో కీలకపాత్ర పోషించినట్లు సమాచారం. డీసీసీ అధ్యక్షుడి నేతృత్వంలో ఈ వసూళ్ల పర్వం కొనసాగినట్లు అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేయడానికి ముందు రోజు రాత్రి అంటే ఈ నెల 18వతేదీన ఈ ఫైలుకు ఆమోదం తె లుపగా... రెగ్యులరైజేషన్ ఉత్తర్వుల జారీకి మాత్రం అధికారులు జంకుతున్నారు. ఆర్థికశాఖ కుదరదన్నా పట్టించుకోలేదు! ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సొసైటీ(ఏపీఆర్ఈఐ) పరిధిలోని స్కూళ్లలో దాదాపు 1,100 మంది సీఆర్టీలు ఉండగా 300 మంది ఇతర ఉద్యోగాలు రావటంతో వెళ్లిపోయారు. మిగతా 800 మంది టీచర్ల సర్వీసు రెగ్యులరైజేషన్‌కు ఉత్తరాంధ్రకు చెందిన డీసీసీ అధ్యక్షుడి నేతృత్వంలో వసూళ్ల దందా నడిచింది. కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్లు, పాలిటెక్నిక్ లెక్చరర్ల రెగ్యులరైజేషన్ అంశాన్ని పరిశీలిస్తున్న కేబినెట్ సబ్‌కమిటీ దృష్టికి సీఆర్టీ రెగ్యులరైజేషన్ అంశాన్ని తెచ్చారు. దీనిపై ఆర్థిక శాఖ అధికారులు ససేమిరా అన్నా, రెగ్యులరైజేషన్ కుదరదని స్పష్టం చేసినా ఫైలు కిరణ్‌కుమార్‌రెడ్డి వద్దకు వెళ్లింది. ఈ వ్యవహారంలో ఒక మంత్రికి రూ.2 కోట్లు, మరికొంత మంది మంత్రులకు కూడా భారీగానే ముట్టజెప్పినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇద్దరు మంత్రులు కాంట్రాక్టు రెసిడెంట్ టీచర్ల రెగ్యులరైజేషన్‌కు సిఫారసు చేస్తూ సీఎంకు ఫైలు పంపినట్లు సమాచారం. దీనిపై కేబినెట్ సబ్‌కమిటీ సమావేశం కాకపోయినా, ఎలాంటి నిర్ణయం తీసుకోకున్నా సబ్‌కమిటీలోని మంత్రులంతా సంతకాలు చేసినట్లు తెలిసింది. దీంతో టీచర్ల రెగ్యులరైజేషన్‌కు సీఎం ఆమోద ముద్ర వేశారు. వీటితోపాటు దాదాపు 600 మంది టీచర్ల బదిలీల ఫైలుపైనా సంతకం చేశారు. మరోవారం సెలవులోనే రాజేశ్వర్ తివారి.. సెకండరీ విద్యా ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్‌తివారీ వ్యక్తిగత కారణాలతో ఈనెల 14 నుంచి 10 రోజుల పాటు సెలవుపై వెళ్లటంతో టీచర్ల బదిలీలు, సీఆర్టీల రెగ్యులరైజేషన్ బాధ్యతలను ప్రభుత్వం ఉన్నత విద్య ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్‌కు అప్పగించింది. సీఎం రాజీనామా తరువాత వచ్చిన ఫైళ్లు కావడంతో తమకు ఎందుకీ తలనొప్పి అనే ఉద్దేశంతో ఆయన వాటిపై సంతకాలు చే యలేదు. దీంతో ఉత్తర్వులు జారీ కాలేదు. ఈలోగా పది రోజులు గడిచాయి. రాజేశ్వర్ తివారి మళ్లీ మరో వారం రోజులు సెలవు కాలాన్ని పెంచుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ బాధ్యతలను ప్రాథమిక విద్య ముఖ్య కార్యదర్శి పూనం మాల కొండయ్యకు సోమవారం అప్పగించింది. ఈ ఫైళ్లపై ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి! -
సమ్మె విరమించిన కాంట్రాక్టు టీచర్లు
సాక్షి, న్యూఢిల్లీ: తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని కోరుతూ ఢిల్లీ సచివాలయం వద్ద ధర్నా చేస్తున్న కాంట్రాక్టు టీచర్లు గురువారం సమ్మె విరమించారు. కాంట్రాక్టు ఉద్యోగులను పర్మనెంట్ చేయడానికి ప్రభుత్వం నియమించిన కమిటీ సిఫార్సులను అమలు చేసేంతవరకు కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించబోమని విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియా ఇచ్చిన హామీతో సమ్మె విరమించినట్లు యూనియన్ల నాయకులు చెబుతున్నారు. అయితే అంతకుముందు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విలేకరుల సమావేశంలో చేసిన హెచ్చరికతోనే వీరు ఈ నిర్ణయం తీసుకున్నారని. మీడియా సమావేశంలో సీఎం మాట్లాడుతూ ‘కమిటీ నివేదిక వచ్చే దాకా టీచర్లను తొలగించబోమని స్వయంగా హామీ ఇచ్చినా, వాళ్లు ధర్నా చేస్తున్నారు. ఆందోళన విరమించి విధులకు హాజరు కాకుంటే, వారి స్థానంలో కొత్త వారిని నియమిస్తాం. ధర్నా కొనసాగించేవారిని పర్మనెంట్ చేయబోం’ అని ఆయన హెచ్చరించారు. తమ ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ కొందరు కాంట్రాక్టు టీచర్లు జనవరి 15 నుంచి సచివాలయం ఎదుట ధర్నా చేస్తున్నారు. మరికొందరు టీచర్లు జనవరి 27 నుంచి నిరాహార దీక్ష చేపట్టారు. కాంట్రాక్టు టీచర్లు ఆందోళన విరమించుకుంటే వారిని తొలగించి కొత్త వారిని తీసుకుంటామని రాష్ట్ర న్యాయ,విద్యాశాఖ మంత్రి మనీశ్ సిసోడియా సైతం బుధవారం హెచ్చరించిన సంగతి తెలిసిందే. డీటీసీ కాంట్రాక్టు డ్రైవర్లు కూడా.. ఇదిలా ఉంటే తమ ఉద్యోగాలను కూడా క్రమబద్ధీకరించాలనే డిమాండ్ డీటీసీ ఉద్యోగులు సమ్మెకు దిగడంతో చాలా బస్సులు నిలిచిపోయాయి. ప్రభుత్వం కూడా కాంట్రాక్టు డ్రైవర్ల సమ్మెపై కఠినంగా వ్యవహరిస్తుండడంతో పరిస్థితి విషమిస్తోంది. సమయానికి బస్సులు రాక కార్యాలయాలకు వెళ్లేవారు ఇబ్బందిపడ్డారు. ఆటావాలాలు అడ్డగోలుగా చార్జీలు వసూలు చేశారు. -
కష్టానికి ప్రతిఫలమేదీ?
రాయవరం, న్యూస్‌లైన్ : అసలే అరకొర జీతాలు..అవీ నెలల తరబడి అందడం లేదు.... కుటుంబాన్ని ఎలా పోషించాలో తెలీని దిక్కుతోచని స్థితి... ఎప్పటికైనా తమ ఉద్యోగం క్రమబద్ధీకరించకపోతారా అనే ఆశతోనే కాంట్రాక్టు అధ్యాపకులు కష్టాలను ఎదుర్కొంటూ నెట్టుకొస్తున్నారు. తాము పడ్డ కష్టానికి ప్రతిఫలమందక వారు విలవిల్లాడుతున్నారు. వారి ఆకలి కేకలు ప్రభుత్వం చెవికెక్కడం లేదు. జిల్లాలోని 39 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 460 మంది కాంట్రాక్టు అధ్యాపకులు పనిచేస్తున్నారు. వారిలో 140 మంది ఒకేషనల్ కోర్సులను బోధిస్తున్నారు. అలాగే జిల్లాలోని 18 డిగ్రీ కాలేజీల్లో 160 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులు విధులు నిర్వర్తిస్తున్నారు. జూనియర్ కాలేజీల్లోని కాంట్రాక్ట్ అధ్యాపకులకు నెలకు రూ. 18వేల జీతం. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలకు జీతాలను ప్రభుత్వం విడుదల చేయలేదు. అలాగే డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న వారికి నెలకు రూ. 20,700 వంతున చెల్లిస్తున్నారు. వేసవి సెలవుల అనంతరం జూన్ నెల నుంచి నేటి వరకు తొమ్మిది నెలలుగా ఒక్క నెలకు కూడా వారికి జీతం చెల్లించలేదు. దాంతో అధిక వడ్డీలకు అప్పులు చేసుకుని జీవితం వెళ్లదీయాల్సిన పరిస్థితి నెలకొంది. 4271 జీవో అమలై ఉంటే... మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 4271జీవోను విడుదల చేశారు. ప్రతీ నెలా ఐదో తేదీ లోగా కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలనేది జీవో సారాంశం. ఆయన మరణానంతరం ప్రభుత్వం ఆ జీవోను అమలు చేయకపోవడంతో తమకు కష్టాలు తప్పడం లేదని కాంట్రాక్టు అధ్యాపకులు వాపోతున్నారు. నెరవేరని ప్రభుత్వ హామీ.. తమ సర్వీసును క్రమబద్ధీకరించాలని కాంట్రాక్ట్ అధ్యాపకులు ఎన్నో పోరాటాలు చేశారు. దీనిపై 2012లో కాంట్రాక్ట్ అధ్యాపకులు సమ్మెచేశారు. దాంతో ప్రభుత్వం 2012 ఫిబ్రవరి 13న మంత్రుల సబ్‌కమిటీ వేసింది. మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, కె.పార్థసారథి, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, కొండ్రు మురళి, సాకే శైలజానాథ్, డి.శ్రీధర్‌బాబు అందులో సభ్యులు. నెల రోజుల్లో సమస్యను పరి ష్కరిస్తామని కాంట్రాక్ట్ అధ్యాపకులకు ఆ కమిటీ హామీ ఇచ్చి సమ్మెను విరమింపజేసింది.. అయితే ఇంతవరకూ ఆ హామీ అమలుకు నోచుకోనేలేదు. -
నిధులున్నా వేతనాల్లేవ్..
మోర్తాడ్, న్యూస్‌లైన్ : దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్న చందంగా మారింది ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని కాంట్రాక్టు అధ్యాపకుల పరిస్థితి. ప్రభుత్వం 2013-14 విద్యా సంవత్సరం ఆరంభం లో కాంట్రాక్టు అధ్యాపకుల వేతనాలకు సంబంధించిన గ్రాంటును మంజూరు చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. విద్యా సంవత్సరం ఆరంభంలోనే గ్రాంటు మంజూరు కావడంతో ప్రతి నెలా వేతనాలు పొందడానికి ఎలాంటి ఆటంకం ఉండదని కాంట్రాక్టు అధ్యాపకులు సం బర పడ్డారు. అయితే అందుకు విరుద్ధంగా ఈసారి మునుపెన్నడూ లేని విధంగా వేతనాలు చెల్లించడంలో ఉన్న త విద్యాశాఖ తీవ్ర జాప్యం చేస్తోంది. జిల్లాలో మోర్తాడ్, బిచ్కుంద, నిజామాబాద్, కామారెడ్డి, బోధన్, ఎల్లారెడ్డి, బాన్సువాడ, ఆర్మూర్, ధర్పల్లిలో ప్రభు త్వ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. వీటిలో వివిధ సబ్జెక్ట్‌లను రెగ్యులర్ అధ్యాపకులతో పాటు, కాంట్రాక్టు అధ్యాపకులు, పార్ట్‌టైం అధ్యాపకులు బోధిస్తున్నారు. కాంట్రాక్టు అధ్యాపకులు దాదాపు 80 మంది వరకు జిల్లాలో పని చేస్తున్నారు. వీరికి ప్రభుత్వం గతంలో వేతనాలను పెంచింది. ప్రతి కాంట్రాక్టు అధ్యాపకునికి రూ. 18 వేల నుంచి రూ. 24 వేల వరకు వేతనం లభిస్తుంది. 2012-13 విద్యా సంవత్సరానికి గాను ఫిబ్రవరి నెల వరకు వేతనాలు చెల్లించారు. అదే విద్యా సంవత్సరంలో మార్చి, ఏప్రిల్ నెలల వేతనం చెల్లించాల్సి ఉంది. కళాశాలలు జూన్‌లో ప్రారంభం అయినా కాంట్రాక్టు అధ్యాపకులకు మాత్రం జూలైలోనే కాంట్రాక్టును పొడగించారు. వీరికి జూలై నుంచి డిసెంబర్ నెల వర కు వేతనాలు మంజూరు కావాల్సి ఉం ది. గడచిన విద్యా సంవత్సరానికి సంబంధించి రెండు నెలల వేతనం, ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ఆరు నెలల వేతనం కాంట్రాక్టు అధ్యాపకులకు రావాల్సి ఉంది. ప్రభుత్వం వేతనాల చెల్లింపుకోసం గ్రాంటును ముం దుగానే విడుదల చేసినా వేతనాల చెల్లింపునకు ఉన్నత విద్యా శాఖ ఎం దుకు తాత్సారం చేస్తుందో అర్థం కావ డం లేదని పలువురు కాంట్రాక్టు అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిగ్రీ కళాశాలల్లో కాంట్రాక్టు అధ్యాపకులుగా పని చేస్తున్న అనేక మంది మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలకు చెం దిన వారు ఉన్నారు. దూర ప్రాంతాల నుంచి ఇక్కడకు వచ్చి అద్దె ఇండ్లలో ఉంటూ వేతనాలు లేక అవస్థలు పడుతున్నారు. తాము తమ కాళ్లపై నిలబడి పని చేస్తున్నా వేతనాలు లేక పోవడంతో ఇళ్ల నుంచి ప్రతి నెల డబ్బు తెప్పించుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని అంటున్నారు. ఇప్పటికైనా ఉన్నత విద్యాశాఖ అధికారులు స్పందించి వేతనాలు చెల్లించాలని కాంట్రాక్టు అధ్యాపకులు కోరుతున్నారు.