మంత్రివర్గ తీర్మానం లేకుండానే కాంట్రాక్టు రెసిడెంట్ టీచర్ల సర్వీస్ క్రమబద్ధీకరణ
రాజీనామాకు ముందు రోజు రాత్రి సీఎం కిరణ్ సంతకం
సబ్‌కమిటీ సమావేశం కాకున్నా సంతకాలు చేసిన మంత్రులు
800 మంది నుంచి భారీగా వసూళ్లు, చేతులు మారిన ముడుపులు?
ఉత్తర్వులు జారీకి ఉన్నతవిద్య ముఖ్య కార్యదర్శి నిరాకరణ
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ విభాగంలో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసును క్రమబద్ధీకరణ చేయాలంటే కేబినెట్ ఆమోదం తప్పనిసరి. కాంట్రాక్టు రెసిడె ంట్ టీచర్ల(సీఆర్‌టీ) సర్వీసు క్రమబద్ధీకరణలో మాత్రం ఈ నిబంధనను తుంగలోకి తొక్కారు. అధికారులు కుదరదన్నా మంత్రులు ఆగమేఘాలపై ఆమోదించారు. కేబినెట్ ఆమోదం లేకున్నా 800 మంది టీచర్ల సర్వీసు క్రమబద్ధీకరణ ఫైలుపై సీఎం హోదాలో కిరణ్‌కుమార్‌రెడ్డి హడావుడిగా సంతకం చేశారు. రెగ్యులరైజేషన్ పేరిట ఒక్కొక్కరినుంచి లక్ష రూపాయల వరకు వసూలు చేశారనే ఆరోపణలు వినవస్తున్నారుు. ఉత్తరాంధ్రకు చెందిన జిల్లా కాంగ్రెస్ కమిటీ(డీసీసీ) అధ్యక్షుడు, ఓ ఎమ్మెల్సీ ఈ వ్యవహారంలో కీలకపాత్ర పోషించినట్లు సమాచారం. డీసీసీ అధ్యక్షుడి నేతృత్వంలో ఈ వసూళ్ల పర్వం కొనసాగినట్లు అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేయడానికి ముందు రోజు రాత్రి అంటే ఈ నెల 18వతేదీన ఈ ఫైలుకు ఆమోదం తె లుపగా... రెగ్యులరైజేషన్ ఉత్తర్వుల జారీకి మాత్రం అధికారులు జంకుతున్నారు.
ఆర్థికశాఖ కుదరదన్నా పట్టించుకోలేదు!
ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సొసైటీ(ఏపీఆర్‌ఈఐ) పరిధిలోని స్కూళ్లలో దాదాపు 1,100 మంది సీఆర్‌టీలు ఉండగా 300 మంది ఇతర ఉద్యోగాలు రావటంతో వెళ్లిపోయారు. మిగతా 800 మంది టీచర్ల సర్వీసు రెగ్యులరైజేషన్‌కు ఉత్తరాంధ్రకు చెందిన డీసీసీ అధ్యక్షుడి నేతృత్వంలో వసూళ్ల దందా నడిచింది. కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్లు, పాలిటెక్నిక్ లెక్చరర్ల రెగ్యులరైజేషన్ అంశాన్ని పరిశీలిస్తున్న కేబినెట్ సబ్‌కమిటీ దృష్టికి సీఆర్‌టీ రెగ్యులరైజేషన్ అంశాన్ని తెచ్చారు. దీనిపై ఆర్థిక శాఖ అధికారులు ససేమిరా అన్నా, రెగ్యులరైజేషన్ కుదరదని స్పష్టం చేసినా ఫైలు కిరణ్‌కుమార్‌రెడ్డి వద్దకు వెళ్లింది. ఈ వ్యవహారంలో ఒక మంత్రికి రూ.2 కోట్లు, మరికొంత మంది మంత్రులకు కూడా భారీగానే ముట్టజెప్పినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇద్దరు మంత్రులు కాంట్రాక్టు రెసిడెంట్ టీచర్ల రెగ్యులరైజేషన్‌కు సిఫారసు చేస్తూ సీఎంకు ఫైలు పంపినట్లు సమాచారం. దీనిపై కేబినెట్ సబ్‌కమిటీ సమావేశం కాకపోయినా, ఎలాంటి నిర్ణయం తీసుకోకున్నా సబ్‌కమిటీలోని మంత్రులంతా సంతకాలు చేసినట్లు తెలిసింది. దీంతో టీచర్ల రెగ్యులరైజేషన్‌కు సీఎం ఆమోద ముద్ర వేశారు. వీటితోపాటు దాదాపు 600 మంది టీచర్ల బదిలీల ఫైలుపైనా సంతకం చేశారు.
మరోవారం సెలవులోనే రాజేశ్వర్ తివారి..
సెకండరీ విద్యా ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్‌తివారీ వ్యక్తిగత కారణాలతో ఈనెల 14 నుంచి 10 రోజుల పాటు సెలవుపై వెళ్లటంతో టీచర్ల బదిలీలు, సీఆర్‌టీల రెగ్యులరైజేషన్ బాధ్యతలను ప్రభుత్వం ఉన్నత విద్య ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్‌కు అప్పగించింది. సీఎం రాజీనామా తరువాత వచ్చిన ఫైళ్లు కావడంతో తమకు ఎందుకీ తలనొప్పి అనే ఉద్దేశంతో ఆయన వాటిపై సంతకాలు చే యలేదు. దీంతో ఉత్తర్వులు జారీ కాలేదు. ఈలోగా పది రోజులు గడిచాయి. రాజేశ్వర్ తివారి మళ్లీ మరో వారం రోజులు సెలవు కాలాన్ని పెంచుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ బాధ్యతలను ప్రాథమిక విద్య ముఖ్య కార్యదర్శి పూనం మాల కొండయ్యకు సోమవారం అప్పగించింది. ఈ ఫైళ్లపై ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి!