ఏపీ: ఇంటికే ఆర్టీసీ కార్గో సేవలు రేపటి నుంచే.. | APSRTC Cargo To Start Door Delivery Service From September 1st | Sakshi
Sakshi News home page

ఏపీ: ఇంటికే ఆర్టీసీ కార్గో సేవలు రేపటి నుంచే..

Published Tue, Aug 31 2021 8:58 AM | Last Updated on Mon, Sep 20 2021 11:25 AM

APSRTC Cargo To Start Door Delivery Service From September 1st - Sakshi

సాక్షి, అమరావతి బ్యూరో:  కోవిడ్‌ కారణంగా ఆర్టీసీకి ప్రజారవాణా ద్వారా వచ్చే ఆదాయం పడిపోయింది. సంస్థకు వచ్చిన నష్టాలను తగ్గించుకుంటూ, ప్రజలకు మెరుగైన సేవలు అందించే భాగంగా కార్గో సేవలు అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. వీటిని ప్రజలు ఎక్కువగా వినియోగించుకోవడంతో మంచి లాభాలు వస్తున్నాయి. గతేడాదితో పోల్చుకుంటే గుంటూరు జిల్లా పరిధిలో కొరియర్‌ సర్వీసు ద్వారా వచ్చే ఆదాయం 75 శాతం పెరిగింది. మరింత ఆదాయం పొందడంలో భాగంగా కార్గో రవాణాను డోర్‌ డెలివరీ సదుపాయాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం కార్గో డోర్‌ డెలివరీ అందిస్తున్న ప్రైవేటు కొరియర్‌ సంస్థలకు భిన్నంగా మెరుగైన సేవలు అందించేలా ప్రణాళిక రూపొందించింది. జిల్లాలో రోజుకు రూ.3 లక్షల ఆదాయం సాధించడం లక్ష్యంగా సెప్టెంబర్‌ 1 నుంచి కార్గో రవాణా డోర్‌ డెలివరీ సేవలను ప్రారంభించాలని నిర్ణయించింది.

రేపటి నుంచి.. 
ఆర్టీసీ కొరియర్‌ సేవలను ఇళ్లకే అందించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో తొలుత పైలెట్‌ ప్రాజె క్టుగా జిల్లా కేంద్రాలు, ప్రధాన పట్టణాల్లో ప్రారంభించేలా ఏర్పాట్లు చేశారు. గుంటూరు నగరంలో డోర్‌ డెలివరీ సేవలు సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి అందుబాటులోకి తేవడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటివరకు వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు తమ పార్శిళ్లను ఇతర ప్రాంతాలకు పంపాలన్నా.. వచ్చిన వాటిని తీసుకెళ్లాలన్నా బస్టాండ్‌లోని కొరియర్‌ కార్యాలయానికి రావాల్సి వస్తోంది. ఇకపై వినియోగదారులు అందరూ తమ ఇళ్ల వద్దే సేవలు పొందడానికి అవకాశం ఏర్పడింది.

డోర్‌ డెలివరీని ప్రస్తుతానికి బుకింగ్‌ ఏజెంట్‌ కాంట్రాక్టర్లే చేయనున్నారు. ఆర్టీసీ బస్‌ స్టేషన్లలోని స్టోరేజీ పాయింట్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. తద్వారా జవాబుదారీతనం పెరగనుంది. ఇక పార్శిళ్లకు ట్రాకింగ్‌ సదుపాయం ఏర్పాటు చేయనుంది. దాంతో బుక్‌ చేసిన పార్సిల్‌ ఎక్కడ ఉందన్నది కచ్చితంగా తెలుసుకునే సౌలభ్యం ఉంటుంది. బీమా సదుపాయం కల్పిస్తోంది. పొరపాటున పార్శిల్‌ కనిపించకుండా పోతే ఖాతాదారులకు ఈ మేరకు పరిహారం లభిస్తుంది.

పెరుగుతున్న ఆదాయం... 
జిల్లా కేంద్రమైన గుంటూరు నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలతోపాటు హైదరాబాద్, బెంగళూరుకు ప్రస్తుతం కొరియర్‌ సేవలు అందుబాటులో ఉన్నాయి. జిల్లాలో ప్రసిద్ధి చెందిన చేనేత, వ్యవసాయ, మత్స్య ఉత్పత్తులు, ఆటో మొబైల్‌ పరికరాలు, చిన్నతరహా పరిశ్రమలు ఉత్పత్తి చేసిన వస్తువులు తదితరాలు వివిధ ప్రాంతాలకు ఎగుమతి అవుతున్నాయి. ఎల్‌ఐసీ వంటి ప్రభుత్వ సంస్థలు కూడా ఆర్టీసీ కార్గో సేవలను వినియోగించుకుంటున్నాయి. వాటి ద్వారా వచ్చే ఆదాయం కూడా పెరుగుతోంది. గతేడాది ఏప్రిల్‌ నుంచి జులై మధ్య కాలంలో రూ.98.28 లక్షల ఆదాయం వస్తే ఈ ఏడాది అదే సమయంలో రూ.172.17 లక్షలకు పైగా సమకూరింది. ప్రజా రవాణా ద్వారా వచ్చే ఆదాయం తగ్గినా కార్గో కొంత వరకుఆ నష్టాన్ని భర్తీ చేస్తోంది. అందుకే సేవలను మరింత విస్తృతం చేయాలన్న లక్ష్యంతో డోర్‌ డెలివరీని కూడా అందుబాటులోకి తేవడానికి సిద్ధమయ్యారు.

రోజుకు రూ.3 లక్షల ఆదాయమే లక్ష్యం  
సెప్టెంబర్‌ 1 నుంచి ఇంటింటికీ కార్గో సేవలు అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. తొలుత నగరం నుంచి 10 కిలోమీటర్ల పరిధిలో 10 కేజీల వరకు డోర్‌ డెలివరీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. విడతల వారీగా చుట్టుపక్కల అన్ని ప్రాంతాలకూ అందించడానికి ప్రణాళిక సిద్ధం చేశాం. డోర్‌డెలివరీ సేవలను కూడా వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. ఆర్టీసీకి కార్గో ద్వారా ప్రస్తుతం సరాసరి రోజుకు రూ.2 లక్షల ఆదాయం వస్తోంది, దీన్ని రూ.3 లక్షలకు తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. 
– ఎస్‌టీపీ రాఘవ కుమార్, ఆర్‌ఎం, గుంటూరు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement