సాక్షి , కడప : వలంటీర్లు సేవకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వ పథకాలను నేరుగా ప్రజలకు అందించడానికి సమాయత్తమవుతున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని గ్రామాలలో వలంటీర్ల వ్యవస్థ ద్వారా పథకాల ఫలాలతోపాటు రేషన్ సరకులను ఇంటింటికీ చేరవేయాలని సంకల్పించిన సంగతి తెలిసిందే. ఈనెల 15నుంచి వీరంతా విధులలోకి రానున్నారు. ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్ పనిచేయనున్నారు. ఇప్పటికే ఇంటర్వ్యూలు పూర్తి చేసుకున్నారు. నియామక పత్రాలు అందుకున్నారు. మండల స్థాయిలో శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. జిల్లాలో తొమ్మిది లక్షల మేర కుటుంబాలకు సంబంధించి 15,040 మంది వలంటీర్ల నియామకం చేపట్టారు. ప్రజాసాధికారిక సర్వే తరహాలో ముందుగా వలంటీర్ బయో మెట్రిక్ మిషన్ ద్వారా కుటుంబ వివరాలు సేకరించి పెట్టుకుంటారు.
తదనంతరం ఇల్లు, రేషన్, పెన్షన్, స్థలం, నీరు, విద్యుత్, ఇతర కార్డు ఏదైనా అంతా వలంటీర్ ద్వారానే జరగాల్సి ఉంది. సచివాలయ వ్యవస్థ అక్టోబరు నుంచి అమలులోకి వస్తే వలంటీర్ ద్వారా ప్రజల సమస్యలకు సంబంధించి 72 గంటల్లోనే సమస్యను పరిష్కారం చూపేలా ప్రభుత్వం సిద్దమైంది. రేషన్ చేర్చడం మొదలుకొని ప్రతి సేవలోనూ వీరు కీలకంగా వ్యవహారించనున్నారు. వలంటీర్ల వ్యవస్థతో గ్రామాల్లో పూర్తి స్థాయిలో అన్ని సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం కానుంది. వలంటీర్‌కు ప్రభుత్వం రూ.5 వేలు గౌరవ వేతనం అందిస్తుంది. సేవాభావంతో పనిచేసేలా వీరికి దిశా నిర్దేశం చేశారు. మరో పది రోజుల్లో ప్రజల్లోకి వలంటీర్ల వ్యవస్థ రానుంది.
జిల్లా సమాచారం
జిల్లాలో మొత్తం మండలాలు - 50
రెవెన్యూ గ్రామాలు - 4,032
మున్సిపాలిటీలు- 08
కార్పొరేషన్ - 01
మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో పనిచేయనున్న వలంటీర్లు- 4483
గ్రామాల్లో సేవలు అందించనున్న వలంటీర్లు- 10,557
Comments
Please login to add a commentAdd a comment