
ప్రజా సేవకు లాభం ఆశించకుండా పని చేస్తున్న మహా సైన్యానికి సెల్యూట్ అని సీఎం జగన్ పేర్కొన్నారు.
సాక్షి, నరసరావుపేట: రాష్ట్రంలోని వలంటీర్ వ్యవస్థ వైపు.. ఇప్పుడు దేశం మొత్తం చూడడం గర్వంగా ఉందని అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. గురువారం పల్నాడు జిల్లా నరసరావుపేటలో నిర్వహించిన వలంటీర్లకు వందనం కార్యక్రమ సభలో పాల్గొని.. వలంటీర్లను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
కొత్తగా ఏర్పాటైన పల్నాడు జిల్లా.. అందునా జిల్లా కేంద్రం నరసరావుపేట నుంచి వలంటీర్ వ్యవస్థ అనే సేవా భావానికి సెల్యూట్ చేస్తున్నామని చెప్పారు సీఎం వైఎస్ జగన్. వివక్ష, లంచం, అవినీతిలకు తావులేకుండా, కులమతరాజకీయాలను పట్టించుకోకుండా ఒక వ్యవస్థ కోసం కల గన్నామని, వలంటీర్ వ్యవస్థ ద్వారా ఆ కల సాకారమైందని ప్రశంసించారు సీఎం జగన్. వలంటీర్ వ్యవస్థ దేశంలోనే గొప్ప వ్యవస్థగా రూపుదిద్దుకుందని పేర్కొన్నారు. లాభాన్ని పట్టించుకోకుండా.. సేవే పరమావధిగా వలంటీర్లు ముందుకు సాగుతున్నారంటూ గుర్తు చేశారు సీఎం జగన్.
వలంటీర్ వ్యవస్థ ద్వారా 33 రకాల సేవలను ప్రతీ ఇంటికి అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 2 లక్షల 60 వేలమంది వలంటీర్లు.. లక్షల మందికి పైగా లబ్ధిదారులకు సేవలు అందించేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారని పేర్కొన్నారు సీఎం జగన్. ఏ పథకమైనా వివక్షకు తావు లేకుండా వలంటీర్లు సేవలు అందిస్తున్నారని, వలంటీర్లు అంటే గొప్ప సైనికులు, గొప్ప సేవకులని ప్రశంసలు గుప్పించారు. ఈ సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం తరపున చిరుసత్కారం అందజేస్తున్నామని చెప్పారు సీఎం వైఎస్ జగన్.