ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అమరావతి: రెండేళ్ల క్రితం రికార్డు స్థాయిలో ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందుకున్న లక్ష మందికిపైగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల మరో కల కూడా నెరవేరబోతుంది. అప్పట్లో ఉద్యోగాలు పొందిన వారికి ఈ ఏడాది జూన్ 30లోగా ప్రొబేషనరీ ప్రకటించి పే స్కేల్ వర్తింపజేస్తామంటూ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ప్రకటనపై హర్షం వ్యక్తమవుతోంది.
ప్రొబేషనరీ పూర్తి చేసుకున్నట్లు ప్రకటన తర్వాత ప్రస్తుతం రూ.15 వేల చొప్పున నెల వారీ జీతం అందుకుంటున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు నిర్ణీత పే స్కేలు పరిధిలోకి వస్తారు. దీనికి తోడు వారంతా ప్రభుత్వ ఉద్యోగులకు ఉండే పూర్తి స్థాయి ఉద్యోగ భద్రతను పొందడంతో కొత్తగా ప్రభుత్వ ఉద్యోగుల మెడికల్ ఇన్సూరెన్స్ పరిధిలోకి వస్తారని అధికార వర్గాలు వివరించాయి. విధి నిర్వహణలో ఉద్యోగి మరణించిన పక్షంలో ఆ కుటుంబంలో మరొకరికి ఉద్యోగం దక్కే అవకాశం కూడా ఉంటుంది.
నాలుగు నెలల్లో 1.34 లక్షల ఉద్యోగాలు..
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజునే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గ్రామ, వార్డు సచివాలయాల్లో నియామకాలపై ప్రకటన చేశారు. ప్రమాణ స్వీకార సభలో ప్రకటించిన విధంగా అప్పటికప్పుడు 1.34 లక్షల కొత్త ప్రభుత్వ ఉద్యోగాలను స్పష్టించారు. జూలైలో నోటిఫికేషన్.. సెప్టెంబర్ మొదటి వారం నుంచి రాత పరీక్షలు... 20 రోజుల్లో ఫలితాల ప్రకటన.. ఆ తరువాత మరో వారం రోజుల్లో ఎంపికైన వారికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేయడం కూడా పూర్తయింది.
వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే దాదాపు లక్ష మంది నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు దక్కాయి. మొదటి విడతలో మిగిలిపోయిన ఉద్యోగాల భర్తీకి 2020 ఆరంభంలో తిరిగి నోటిఫికేషన్ జారీ చేసి ఆ ఏడాది చివరి కల్లా రెండో దశ నియామక ప్రక్రియను కూడా పూర్తి చేశారు. అప్పట్లో ఉద్యోగాలు పొందిన వారు తాజాగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ప్రకటన మేరకు జూన్ నెలాఖరు కల్లా ప్రొబేషనరీని కూడా పూర్తి చేసుకోబోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment