రాయవరం, న్యూస్‌లైన్ : అసలే అరకొర జీతాలు..అవీ నెలల తరబడి అందడం లేదు.... కుటుంబాన్ని ఎలా పోషించాలో తెలీని దిక్కుతోచని స్థితి... ఎప్పటికైనా తమ ఉద్యోగం క్రమబద్ధీకరించకపోతారా అనే ఆశతోనే కాంట్రాక్టు అధ్యాపకులు కష్టాలను ఎదుర్కొంటూ నెట్టుకొస్తున్నారు. తాము పడ్డ కష్టానికి ప్రతిఫలమందక వారు విలవిల్లాడుతున్నారు. వారి ఆకలి కేకలు ప్రభుత్వం చెవికెక్కడం లేదు. జిల్లాలోని 39 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 460 మంది కాంట్రాక్టు అధ్యాపకులు పనిచేస్తున్నారు. వారిలో 140 మంది ఒకేషనల్ కోర్సులను బోధిస్తున్నారు.
అలాగే జిల్లాలోని 18 డిగ్రీ కాలేజీల్లో 160 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులు విధులు నిర్వర్తిస్తున్నారు. జూనియర్ కాలేజీల్లోని కాంట్రాక్ట్ అధ్యాపకులకు నెలకు రూ. 18వేల జీతం. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలకు జీతాలను ప్రభుత్వం విడుదల చేయలేదు. అలాగే డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న వారికి నెలకు రూ. 20,700 వంతున చెల్లిస్తున్నారు. వేసవి సెలవుల అనంతరం జూన్ నెల నుంచి నేటి వరకు తొమ్మిది నెలలుగా ఒక్క నెలకు కూడా వారికి జీతం చెల్లించలేదు. దాంతో అధిక వడ్డీలకు అప్పులు చేసుకుని జీవితం వెళ్లదీయాల్సిన పరిస్థితి నెలకొంది.
4271 జీవో అమలై ఉంటే...
మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 4271జీవోను విడుదల చేశారు. ప్రతీ నెలా ఐదో తేదీ లోగా కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలనేది జీవో సారాంశం. ఆయన మరణానంతరం ప్రభుత్వం ఆ జీవోను అమలు చేయకపోవడంతో తమకు కష్టాలు తప్పడం లేదని కాంట్రాక్టు అధ్యాపకులు వాపోతున్నారు.
నెరవేరని ప్రభుత్వ హామీ..
తమ సర్వీసును క్రమబద్ధీకరించాలని కాంట్రాక్ట్ అధ్యాపకులు ఎన్నో పోరాటాలు చేశారు. దీనిపై 2012లో కాంట్రాక్ట్ అధ్యాపకులు సమ్మెచేశారు. దాంతో ప్రభుత్వం 2012 ఫిబ్రవరి 13న మంత్రుల సబ్‌కమిటీ వేసింది. మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, కె.పార్థసారథి, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, కొండ్రు మురళి, సాకే శైలజానాథ్, డి.శ్రీధర్‌బాబు అందులో సభ్యులు. నెల రోజుల్లో సమస్యను పరి ష్కరిస్తామని కాంట్రాక్ట్ అధ్యాపకులకు ఆ కమిటీ హామీ ఇచ్చి సమ్మెను విరమింపజేసింది.. అయితే ఇంతవరకూ ఆ హామీ అమలుకు నోచుకోనేలేదు.
కష్టానికి ప్రతిఫలమేదీ?
Published Mon, Jan 6 2014 1:10 AM | Last Updated on Mon, Apr 8 2019 7:51 PM
Advertisement
Advertisement