సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా వివిధ విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న దాదాపు వెయ్యి మంది కాంట్రాక్టు అధ్యాపకులు ఎన్నో ఏళ్లుగా క్రమబద్ధీకరణకు నోచుకోవడం లేదు. రెగ్యులర్ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా, ఇంతవరకూ ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. తాము చదువు చెప్పిన వాళ్ళు ఉన్నత స్థానాల్లోకి వెళ్ళినా, తమ పరిస్థితిలో మాత్రం మార్పు లేదని అధ్యాపకులు వాపోతున్నారు.
వీరిలో పదవీ విరమణకు దగ్గరపడుతున్న అధ్యాపకులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్నవారు సైతం ఉండటం గమనార్హం. కాగా 60 ఏళ్ళు దాటిన కారణంగా రెండేళ్ళలో 11 మంది కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లను తొలగించారు. వీళ్ళంతా దాదాపు 30 ఏళ్ళుగా పనిచేస్తున్నవారు కావడం విశేషం.
అయితే పర్మినెంట్ కాకపోవడంతో వీరికి ఎలాంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందలేదు. మరోవైపు గత ఏడాది కాలంలో సర్వీస్‌లో ఉన్న ఏడుగురు కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు మృతి చెందారు. వీరు కనీసం ఎక్స్‌గ్రేషియాకు కూడా నోచుకోలేదు.
11 వర్సిటీల్లోనూ అధ్యాపకుల కొరత..
రాష్ట్రంలోని 11 యూనివర్సిటీల్లోనూ అధ్యాపకుల కొరత వేధిస్తోంది. అన్నిచోట్లా కాంట్రాక్టు అధ్యాపకులతోనే నెట్టుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో వర్సిటీల్లో ఖాళీలు, ప్రస్తుతం పని చేస్తున్న అధ్యాపకుల తాజా లెక్కలను విద్యాశాఖ తేల్చింది. 2021 జనవరి 31వ తేదీనాటికి 11 వర్సిటీల్లో 2,837 మంజూరైన పోస్టులు ఉంటే అందులో ఏకంగా 1,869 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంటే 968 మంది (34.12 శాతం) మాత్రమే రెగ్యులర్ ఆధ్యాపకులు ఉన్నారు. ప్రస్తుతం 157 మంది ప్రొఫెసర్లు ఉండగా 238 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 129 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు ఉండగా, 781 పోస్టులు, 682 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు పని చేస్తుండగా 850 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు విద్యాశాఖ లెక్కలు తేల్చింది. అయితే 1869 ఖాళీల్లో 1,061 పోస్టుల భర్తీకి ప్రభుత్వం మూడేళ్ల కిందటే ఆమోదం తెలిపినా ఇంతవరకు భర్తీ చేయలేదు.
61.65% ప్రొఫెసర్ పోస్టులు ఖాళీ..
– ఉన్నత విద్యాశాఖ లెక్కల ప్రకారం.. రాష్ట్రంలో ఒక్క ప్రొఫెసర్ కూడా లేని వర్సిటీలు ఆరు ఉన్నాయి. శాతవాహన, మహత్మాగాంధీ, పాలమూరు, రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ (ఆర్‌జీయూకేటీ), డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీల్లో ఒక్క ప్రొఫెసర్ కూడా లేరు. శాతవాహన, ఆర్‌జీయూకేటీ, బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు కూడా లేరు. పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్ ఒకరే ఉన్నారు. ఇక మెుత్తంగా చూస్తే రాష్ట్రంలోని 11 యూనివర్సిటీల్లో 61.65 శాతం ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 85.82 శాతం అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు, 55.48 శాతం అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వందేళ్ళకు పైగా చరిత్ర ఉన్న ఓయూలో సగానికిపైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కేయూలో ఇప్పుడు కేవలం ఒక్కరే ప్రొఫెసర్ ఉండగా, అసోసియేట్ ప్రొఫెసర్లు ఇద్దరే ఉన్నారు. శాతవాహన, ఆర్‌జీయూకేటీ, బీఆర్ అంబేడ్కర్ వర్సిటీల్లో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు ఒక్కరంటే ఒక్కరు లేరు.
యూజీసీ పే కమిషన్ అమలు చేయాలి
కాంట్రాక్టు అధ్యాపకులతోనే ఓయూ విద్యా వ్యవస్థ నడుస్తోంది. యూజీసీ నిబంధనల ప్రకారం మాకు అన్ని అర్హతలు ఉన్నాయి. కాబట్టి 7వ పే కమిషన్ వేతనాలు ఇవ్వాలి.
– డాక్టర్ డి.ధర్మతేజ (ఓయూ కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ల సంఘం అధ్యక్షుడు)
నా బిడ్డ కోసమైనా ఉద్యోగం ఇవ్వండి
పదేళ్ళు ఓయూలో కాంట్రాక్టు అధ్యాపకుడిగా పనిచేసిన నా భర్త గత ఏడాది చనిపోయారు. ఇప్పటికీ ఎలాంటి ఆర్థిక సాయం అందలేదు. నాకు ఉద్యోగం ఇవ్వమని అడుగుతున్నా పట్టించుకోవడం లేదు. పర్మినెంట్ అయితే ఇవన్నీ లభించేవి. నాకు రెండేళ్ళ పాప ఉంది. కుటుంబ పోషణ కష్టంగా ఉంది. నా బిడ్డ మొఖం చూసైనా ఉద్యోగం ఇస్తారని ఆశ పడుతున్నా.
– రాజేశ్వరి (చనిపోయిన కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీకాంత్ భార్య)
24 ఏళ్ల సర్వీసుకు గుర్తింపు లేదు..
కాంట్రాక్టు అధ్యాపకురాలిగా 24 ఏళ్ళుగా పనిచేస్తున్నా. రీసెర్చ్‌లో 25 ఏళ్ళ అనుభవం ఉంది. పరీక్షల నిర్వహణలో 15 ఏళ్ళు సర్వీస్ ఉంది. ఎప్పటికప్పుడు పర్మినెంట్ అవుతుందని ఎదురుచూస్తుండగానే రిటైర్‌మెంట్ దగ్గర (సెప్టెంబర్‌లో) పడింది. నా సర్వీస్‌కు ప్రభుత్వ గుర్తింపు లేకపోవడం దురదృష్టకరం.
– డాక్టర్ అనిత కుమారి (నిజాం కాలేజీ జువాలజీ డిపార్ట్‌మెంట్ అధ్యాపకురాలు)
Comments
Please login to add a commentAdd a comment