కంప్యూటర్‌ విద్య మిథ్య..! | Computer Education Not Implemented In Karimnagar Govt Schools | Sakshi
Sakshi News home page

కంప్యూటర్‌ విద్య మిథ్య..!

Published Mon, Sep 17 2018 10:14 AM | Last Updated on Mon, Sep 17 2018 10:14 AM

Computer Education Not Implemented In Karimnagar Govt Schools - Sakshi

కరీంనగర్‌ఎడ్యుకేషన్‌: ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్లు మూలకుపడ్డాయి. బోధకుల కాంట్రాక్టు ముగియడంతో విద్యార్థులకు కంప్యూటర్‌ పాఠాలు బోధించేవారు కరువయ్యారు. ఐదేళ్లపాటు కుదుర్చుకున్న బోధకుల కాంట్రాక్టు ఒప్పందం ముగిసి ఐదేళుŠల్‌ అయ్యింది. కాంట్రాక్టు ముగిసేలోపు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాల్సి ఉండగా.. అది నెరవేరలేదు. ప్రభుత్వం తిరిగి కాంట్రాక్టు ఇవ్వకపోవడంతో పాఠశాలల్లో కంప్యూటర్‌ పాఠాలు బోధించేవారు కరువయ్యారు. అధికారులు చొరవ తీసుకుని పాఠశాలల్లో కంప్యూటర్‌ బోధకులను కొనసాగించాలని తల్లిదండ్రులు, విద్యార్థులు కోరుతున్నారు.

ప్రైవేట్‌ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోనూ విద్యార్థులకు కంప్యూటర్‌ విద్యను బోధించేందుకు ఏర్పాటు చేసినప్పటికీ.. బోధకులు లేక కంప్యూటర్లు మూలనపడ్డాయి. బోధకుల కాంట్రాక్టు 2013 ఆగస్టు నెలాఖరుతో ముగిసిపోయింది. అప్పటినుంచి పాఠాలు బోధించేవారు లేక ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా తయారైంది. కంప్యూటర్‌ బోధన బాధ్యతను ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులకు అప్పగించినప్పటికీ వారు పట్టించుకోవడంలేదని విద్యార్థులు వాపోతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులకు కంప్యూటర్‌పై అవగాహన కల్పించి ఎంఎస్‌ ఆఫీస్, ఇంటర్‌నెట్, ఎక్సెల్, పవర్‌పాయింట్‌ ప్రెజంటేషన్, మైక్రోసాఫ్ట్, పెయింటింగ్‌ అంశాలపై వివరించేలా ఏర్పాట్లు చేశారు. 2007 నుంచి కేంద్ర ప్రభుత్వం దశలవారీగా ఆయా పాఠశాలల్లో కంప్యూటర్‌ విద్యాబోధన ప్రవేశపెట్టింది. ఉమ్మడి జిల్లాలో 277 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో కంప్యూటర్‌ విద్యను ప్రారంభించింది. ఒక్కో పాఠశాలకు ప్రభుత్వం 10 కంప్యూటర్లను మంజూరు చేసింది. కంప్యూటర్‌ పాఠాలు బోధించేందుకు ఇద్దరిని నియమించింది.

కంప్యూటర్‌ విద్యాబోధన కాంట్రాక్టును ప్రభుత్వం జిల్లాలో ఐసీటీ అనే సంస్థకు అప్పగించింది. ఈ సంస్థ పాఠశాలల్లో కంప్యూటర్‌ను ఏర్పాటు చేయడంతోపాటు బోధకులను నియమించి విద్యార్థులకు విద్యాబోధన చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఒక్కో పాఠశాలకు ఇద్దరు బోధకులను నియమించి.. వారికి నెలకు రూ.4,500 వేతనంగా చెల్లించారు. ఐదేళ్లపాటు కుదుర్చుకున్న ఒప్పందం 2013 ఆగస్టు నెలాఖరు వరకు ముగిసింది. ఈ ఐదేళ్ల కాలంలో ఐసీటీ సంస్థ ఒప్పందం ముగిసే లోపు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు ఇవ్వాల్సి ఉన్నా.. ఇవ్వలేదు. రెండేళ్ల క్రితం సర్వశిక్ష అభియాన్, రాజీవ్‌ విద్యామిషన్‌ ద్వారా ఆయా పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులకు 20 రోజులపాటు కంప్యూటర్‌లో శిక్షణ ఇచ్చారు. అదే సమయంలో కంప్యూటర్‌ శిక్షణ సంస్థ ఒప్పందం ముగియడంతో కేంద్రప్రభుత్వం బోధకులను తొలగించింది. ప్రభుత్వం తిరిగి ఏ ఒక్క సంస్థకూ కాంట్రాక్టు ఇవ్వకపోవడంతో పాఠశాలల్లో కంప్యూటర్‌ పాఠాలు బోధించేవారు కరువయ్యారు. కంప్యూటర్లు గదిలోనే మూలకు పడ్డాయి. వాటిని వినియోగించకపోవడంతో చెడిపోతున్నాయి.

ఒక్కో పాఠశాలలో కంప్యూటర్ల ఏర్పాటుకు ఏకంగా రూ.మూడులక్షల చొప్పున వెచ్చించారు. ప్రస్తుతం అక్కడక్కడ కొందరు విద్యార్థులు మాత్రం ఇప్పటివరకు నేర్చుకున్న పరిజ్ఞానాన్ని మరిచిపోకుండా ఉండేందుకు ప్రాక్టీస్‌ చేస్తున్నారు. తెలిసీతెలియక ఏదో ఒకటి ఆపరేట్‌ చేస్తే కంప్యూటర్లు చెడిపోతాయనే భావనతో కొన్ని పాఠశాలల్లో కంప్యూటర్‌ గది తాళాలు తీయడం లేదు. కంప్యూటర్‌ విద్యాబోధన బాధ్యతలను ప్రధానోపాధ్యాయులే తీసుకుని పాఠాలు బోధించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి ఉత్తర్వులు జారీ చేసినా.. ఎక్కడా అమలు చేయడం లేదు. గతంలో సర్వశిక్ష అభియాన్, రాజీవ్‌ విద్యామిషన్‌ ద్వారా ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చినప్పటికీ చాలామంది వాటిని మరిచిపోయారు.

కొందరైతే శిక్షణకే హాజరు కాలేదు. రెగ్యులర్‌గా ఆయా అంశాలపై ప్రాక్టీస్‌ లేని కారణంగా వారికి మరోసారి శిక్షణ ఇస్తేగానీ బోధించే పరిస్థితి ఉండదని అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో విద్యార్థులకు కంప్యూటర్‌ పరిజ్ఞానం తప్పనిసరి అయినప్పటికీ అటు విద్యాశాఖ అధికారులు, ఇటు జిల్లా యంత్రాంగం చడీచప్పుడు లేకుండా వ్యవహరిస్తుండడంతో ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్‌ విద్య అందనిద్రాక్షగా మిగిలింది. కంప్యూటర్‌ విద్యను ప్రారంభించాలని జిల్లా ప్రజాపరిషత్‌ సర్వసభ్య సమావేశాల్లో ప్రజాప్రతినిధులు లేవనెత్తినా ఫలితంలేకుండాపోతోంది. ఐదేళ్ల నుంచి కంప్యూటర్లను వినియోగించడంలేదని, ఆ కారణంగా అవి చెడిపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కంప్యూటర్ల విషయమై సంబంధిత అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని పాఠశాలల్లో కంప్యూటర్‌ విద్యాబోధనను కొనసాగించాలని తల్లిదండ్రులు, విద్యార్థులు కోరుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement