ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సైతం కార్పొరేట్ స్థాయిలో బోధనలుండాలని ప్రవేశపెట్టిన కంప్యూటర్ విద్య ఈ నెలతో దూరం కానుంది. ఉన్నత పాఠశాలల విద్యార్థులకు కంప్యూటర్ విద్య అందించేందుకు శిక్షణ సంస్థ నిట్‌తో కుదుర్చుకున్న ఒప్పందం ముగియనుండడంతో ఇక కంప్యూటర్ విద్య మిథ్యే కానుంది.
జగిత్యాల, న్యూస్‌లైన్ : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సైతం కంప్యూటర్ విద్య అందించాలని నిర్ణయించిన ప్రభుత్వం శిక్షణ సంస్థ నిట్‌తో 2008లో ఐదేళ్ల ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకు కేంద్రం 85 శాతం నిధులు, రాష్ట్రం వాటాగా 15 శాతం నిధులు ఖర్చు చేయాలి. జిల్లాలో 240 పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు కంప్యూటర్ పరిజ్ఞానం నేర్చుకుంటున్నారు. ప్రతీ పాఠశాలలో 10 నుంచి 15 కంప్యూటర్లు ఉన్నాయి. ఎంఎస్ ఆఫీస్, హెచ్‌ఎంఎల్, ఇంటర్‌నెట్, బొమ్మలు గీయడం తదితర బేసిక్స్‌ను నేర్పుతున్నారు. శిక్షణ సంస్థ పాఠశాలకు ఇద్దరు ట్యూటర్లను నియమించింది.
వీరికి నెలకు రూ.2600 వేతనం చెల్లిస్తోంది. ప్రస్తుతం జిల్లాలో 516 మంది ట్యూటర్లు ఉపాధి పొందుతున్నారు. నిట్‌తో ఒప్పందం ఈ నెల 22తో ముగియనుండగా పాఠశాలల్లో కంప్యూటర్ విద్య కొనసాగింపుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో విద్యార్థులకు కంప్యూటర్ శిక్షణ అందే అవకాశం లేదు. 516 మంది ట్యూటర్లకు ఉపాధి దూరం కానుంది. ఒప్పందం ముగుస్తుండడంతో కంప్యూటర్ గదులను స్వాధీనం చేసుకోవాలని డెప్యూటీ ఈవోలకు, ప్రధానోపాధ్యాయులకు పాఠశాల విద్యాశాఖ నుంచి ఇప్పటికే ఆదేశాలు అందాయి. ఇదే సంస్థతో ప్రభుత్వం 2009లో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఐదేళ్ల కాలపరిమితి మేరకు జిల్లాలో 12 పాఠశాలల్లో మరో ఏడాది పాటు కంప్యూటర్ విద్య కొనసాగనుంది. విద్యార్థులు పై చదువులకు వెళ్లినప్పుడు కంప్యూటర్ పరిజ్ఞానం ఎంతో ఉపయోగపడుతుందని, ఇలాంటి అవకాశాన్ని వారికి దూరం చేయడం సరికాదని కంప్యూటర్ ట్యూటర్ భాగ్యలక్ష్మితోపాటు పలువురు ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు.
మాకు తెలియదు
రోజూ స్కూళ్లో ఒక క్లాస్ కంప్యూటర్ నేర్పుతారు. మాకు భవిష్యత్‌లో ఉపయోగపడుతదని ఎంతో శ్రద్ధగా నేర్చుకుంటున్నాం. ఈ శిక్షణ ఆగిపోతుందనే విషయం నాకు తెలియదు. కంప్యూటర్ విద్యను కొనసాగించాలి.
- సీహెచ్ రాధ, విద్యార్థిని జగిత్యాల
శిక్షణ నిలిపివేయొద్దు
రోజూ కంప్యూటర్ క్లాస్ చెబుతారు. మాకు అవకాశం వచ్చినప్పుడు కంప్యూటర్‌పై ప్రాక్టికల్స్ చేసుకుంటున్నాం. ఈ క్లాస్‌లు ఉండవనే విషయమైతే ఎవరూ చెప్పలేదు. కానీ, శిక్షణను నిలిపివేయొద్దు.
- సువర్ణ, విద్యార్థిని జగిత్యాల
పది వరకు నేర్పించాలి
ఆరో తరగతి నుంచి కొద్ది కొద్దిగా నేర్చుకుంటున్నాం. ఈ సంవత్సరం కంప్యూటర్ క్లాస్‌లు మొదలయ్యాయి. అప్పుడే కంప్యూటర్ శిక్షణ ఆగిపోతుందనే విషయం బాధగా ఉంది. కంప్యూటర్ విద్యను పదో తరగతి దాకా చెప్పాలి.
- ప్రియ, విద్యార్థిని, జగిత్యాల
వాస్తవమే...
కంప్యూటర్ శిక్షణ సంస్థతో ఒప్పందం ముగుస్తున్న విషయం వాస్తవమే. ప్రస్తుతం పాఠశాలల్లో ఉన్న కంప్యూటర్లను సంబంధిత ప్రధానోపాధ్యాయులకు అప్పగించాలని ఆదేశాలు వచ్చాయి. ఉపాధ్యాయుల్లోంచి ఒకరిని కంప్యూటర్ శిక్షణ ఇచ్చేందుకు నియమించాలని ఆదేశించారు. ఈ మేరకు హెచ్‌ఎంలను కంప్యూటర్లు స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలిచ్చాం.
- జగన్‌మోహన్‌రెడ్డి, డెప్యూటీ ఈవో, జగిత్యాల
కంప్యూటర్ విద్య మిథ్యేనా..?
Published Sat, Sep 14 2013 3:00 AM | Last Updated on Fri, Jul 26 2019 6:25 PM
Advertisement
Advertisement