
కాంట్రాక్ట్ టీచర్ల సమ్మె విరమణ
అంబర్‌పేట: ప్రభుత్వంపై విశ్వాసంతో తమ సమ్మెను విరమిస్తున్నట్టు తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ కాంట్రాక్ట్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.రామేశ్వర్‌రావు తెలిపారు. ఆదివారం టీఆర్‌ఎస్ అంబర్‌పేట నియోజకవర్గ ఇన్‌చార్జి ఎడ్ల సుధాకర్‌రెడ్డి నేతృత్వంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిని కలిసి తమ సమస్యలను చెప్పగా పరిష్కరానికి ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. ఛే నంబర్ చౌరస్తాలో సుధాకర్‌రెడ్డితో కలిసి రామేశ్వర్‌రావు విలేకరులతో మాట్లాడారు.
సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత, రెగ్యులరైజేషన్ ప్రక్రియ వేగవంతం వంటి డిమాండ్లతో 13 రోజులుగా తాము సమ్మె చేస్తున్నామన్నారు. తమ డిమాండ్లకు డిప్యూటీ సీఎం సానుకూలంగా స్పందించారన్నారు. ఓయూ మాజీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ తిరుపతిరావు నేతృత్వంలో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసి 30 రోజుల్లో సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారన్నారు. దీంతో అసోసియేషన్ ఆయనకు కృతజ్ఞతలు తెలిపి సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించిందన్నారు. ఈ సమావేశంలో అసోసియేషన్ ప్రతినిధులు సుధీర్‌కుమార్, ఎ.దత్తాత్రి, నారాయణ, సూర్యం, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎం.తిరుపతి, రవీందర్‌రెడ్డి, సురేష్‌నాయక్, చక్రవర్తి, డాక్టర్ పరుశరాం, డాక్టర్ ధర్మతేజ, డాక్టర్ వేల్పుల కుమార్ పాల్గొన్నారు.