=తాత్కాలికంగా ఉద్యోగుల సమ్మె విరమణ
=నేటినుంచి తెరుచుకోనున్న కార్యాలయాలు
=కదలనున్న ఫైళ్లు
={పజలకు అందనున్న సేవలు
విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : ప్రభుత్వ కార్యాలయాల్లో ఇకపై ఫైళ్లకు కదలిక రానుంది. యథావిధిగా ప్రభుత్వ పనులు జరగనున్నాయి. సమైక్యాంధ్ర కోసం 65 రోజుల నుంచి ఏపీఎన్‌జీఓలు చేస్తున్న సమ్మెను తాత్కాలికంగా విరమించారు. శుక్రవారం నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు తెరుచుకోనున్నాయి. ఉద్యోగులందరూ తిరిగి విధుల్లో చేరనున్నారు. రాష్ట్ర విభజనపై జూలై 31న సీడబ్ల్యూసీ నిర్ణయం ప్రకటించిన వెంటనే సమైక్యాంధ్ర కోసం ప్రజా ఉద్యమం ప్రారంభమైంది.
అనంతరం ఆగస్టు 12వ తేదీ అర్ధరాత్రి నుంచి ఏపీఎన్‌జీఓలు సమ్మె బాట పట్టారు. వీరికి అన్ని ఉద్యోగ సంఘాలు మద్దతు తెలిపాయి. దీంతో జిల్లాలో ఉన్న 40 వేల మంది ఉద్యోగులు విధులను బహిష్కరించారు. ఫలితంగా కలెక్టరేట్ నుంచి గ్రామ కార్యాలయాల వరకు అన్నీ మూతపడ్డాయి. ప్రభుత్వ సేవలన్నీ స్తంభించాయి. ఎప్పుడూ ఆఫీసులకే పరిమితమయ్యే ఉద్యోగులు సమైక్యాంధ్ర కోసం రోడ్ల మీదకొచ్చి నిరసనలు వ్యక్తం చేశారు.
విభిన్న తరహాలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. వీరికి జీతాలు రాకపోయినా వెరవకుండా ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. విద్యార్థుల కౌన్సెలింగ్ సమయంలో ఉద్యోగులు సమ్మెలో ఉండడంతో వారికి అవసరమైన కుల, ఆదాయ, నివాస, ఇతర ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేసేవారు లేకుండా పోయారు. కానీ ప్రజల నుంచి ఎటువంటి వ్యతిరేకత రాలేదు. సమైక్యాంధ్ర కోసం ఆందోళన చేపడుతున్న ఉద్యోగులకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభించింది.
నేటి నుంచి కార్యకలాపాలు
అసెంబ్లీలో తెలంగాణ బిల్లును అడ్డుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇవ్వడంతో సమ్మెను తాత్కాలికంగా విరమిస్తున్నట్టు ఏపీఎన్‌జీఓ నాయకులు ప్రకటించారు. దీనికి అన్ని ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు అంగీకారం తెలపడంతో శుక్రవారం నుంచి ప్రభుత్వ కార్యాలయాలన్నీ తెరుచుకోనున్నాయి. జిల్లా అధికారుల నుంచి వీఆర్వోల వరకు అందరూ విధుల్లో చేరనున్నారు. దీంతో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోను కార్యాకలాపాలు ప్రారంభం కానున్నాయి. అన్ని ప్రభుత్వ సేవలు శుక్రవారం నుంచి ప్రజలకు యథావిధిగా అందనున్నాయి.
ఈ సమ్మె కారణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో వేల సంఖ్యలో దరఖాస్తులకు మోక్షం లభించలేదు. కుల, ఆదాయ, నివాస ధ్రువపత్రాలతో పాటు, ఇతరత్రా వాటి కోసం ఒక్క అర్బన్ తహశీల్దార్ కార్యాలయంలోనే సుమారుగా 16 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రతీ మండల కార్యాలయంలోను 1500 నుంచి 2 వేల వరకు దరఖాస్తులు ఉన్నాయి. వీటిని వీలైనంత త్వరగా మంజూరు చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.
పుంజుకోనున్న ఖజానా
గత 65 రోజులు ఉద్యోగుల సమ్మె కారణంగా సర్కారు ఖజానాకు తీవ్ర లోటు ఏర్పడింది. ఖజానా శాఖ ఉద్యోగులు కూడా విధులను బహిష్కరించడంతో ఇప్పటి వరకు దాదాపుగా రూ.1500 కోట్లు మేర లావాదేవీలకు బ్రేక్ పడింది. సమ్మెలో లేని అత్యవసర సేవలందించే ఉద్యోగులకు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరులలో ఒకటైన రిజిస్ట్రేషన్ శాఖ నుంచి ఆదాయం నిలిచిపోయింది. అన్ని రకాల రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో దాదాపుగా రూ.230 కోట్లు ప్రభుత్వ ఖజానాకు గండిపడింది. శుక్రవారం నుంచి సమ్మె విరమించడంతో తిరిగి ప్రభుత్వ ఖజానా కళకళలాడనుంది. అన్ని రకాల రిజిస్ట్రేషన్లు యథావిధిగా జరగనున్నాయి.
కలెక్టర్‌ను కలిసిన ఉద్యోగులు
ఉద్యోగ సంఘాలు గురువారం జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్, జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్‌లను కలిశాయి. సమ్మెను తాత్కాలికంగా విరమిస్తున్నట్టు తెలిపాయి. శుక్రవారం నుంచి విధుల్లో చేరుతున్నట్టు నాయకులు కలెక్టర్‌కు చెప్పారు. పరిపాలన, ప్రాధాన్యతాపరమైన పనులను వేగవంతంగా పూర్తి చేయడంతో పాటు జిల్లా అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని ఉద్యోగ సంఘాల నాయకులకు కలెక్టర్ సూచించారు.
తాత్కాలికంగా విరమించాం
అసెంబ్లీలో తెలంగాణ బిల్లును అడ్డుకుంటామని ఎమ్మెలు హామీ ఇవ్వడంతో అప్పటి వరకు తాత్కాలికంగా సమ్మెను విరమించామని ఏపీఆర్‌ఎస్‌ఏ జిల్లా అధ్యక్షుడు ఎస్.నాగేశ్వరరెడ్డి తెలిపారు. కేంద్రం అసెంబ్లీ తీర్మానం అవసరం లేదని రాజకీయ నిర్ణయం తీసుకుంటే ఇప్పటికంటే తీవ్రమైన ఉద్యమం చేపడతామన్నారు. ఏపీఎన్‌జీఓల పిలుపు మేరకు సమ్మెను విరమిస్తున్నామని పంచాయతీరాజ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కూర్మారావు చెప్పారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా చేపట్టే ప్రతి కార్యక్రమానికి తమ మద్దతు ఉంటుందన్నారు. అసెంబ్లీలో బిల్లు పెట్టే సమయంలో ఎమ్మెల్యేలు, మంత్రులపై ఒత్తిడి చేసేందుకు మళ్లీ సమ్మె చేస్తామని వీఆర్వో సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్.టి.రామకాసు తెలిపారు.