
పారిశుధ్య కార్మికుల సమ్మె విరమణ
సాక్షి, హైదరాబాద్: నలభై నాలుగు రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికులు ఎట్టకేలకు తమ ఆందోళనను విరమించారు. తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగుల, పారిశుధ్య కార్మికుల సంఘం నేతలు, సమ్మెకు మద్దతిస్తున్న వివిధ కార్మిక సంఘాలు, వామపక్ష పార్టీల ప్రతినిధులతో పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారకరామారావు గురువారం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామజ్యోతి కార్యక్రమం ఈనెల 17నుంచి ప్రారంభం కానున్నందున సమ్మెను విరమించి విధుల్లో చేరాలని మంత్రి కేటీఆర్ వారికి విజ్ఞప్తి చేశారు.
కార్మికుల న్యాయమైన డిమాండ్లను తప్పక నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. దీంతో సమ్మెను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు కార్మిక సంఘాల నేతలు ప్రకటించారు. చర్చల్లో పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి రేమండ్ పీటర్, కమిషనర్ అనితా రాంచంద్రన్, డిప్యూటీ కమిషనర్ రామారావు, ఎమ్మెల్యేలు సున్నం రాజయ్య, రవీంద్రనాయక్, తెలంగాణ పంచాయతీ ఉద్యోగుల, పారిశుద్ధ్య కార్మికుల సంఘం అధ్యక్షుడు గణపతిరెడ్డి, ఉపాధ్యక్షుడు కోటిలింగం, ప్రధాన కార్యదర్శి శ్రీపతిరావు, సీఐటీయూ, ఏఐటీయూసీ, ఏఐఎఫ్‌టీయూ, ఐఫ్‌టీయూ తదితర సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
కమిటీని నియమించాం: కేటీఆర్
‘అతి తక్కువ వేతనంతో పనిచేస్తున్న గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికుల డిమాండ్లు న్యాయమైనవే. కనీస వేతనం పెంపు, ఆరోగ్య బీమా, ఉద్యోగ భద్రత, గుర్తింపు కార్డులు తదితర డిమాండ్ల పరిష్కారం గురించి అధ్యయనం చేసేందుకు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్ నేతృత్వంలో పంచాయతీరాజ్, ఆర్థిక, న్యాయ శాఖల అధికారులతో కమిటీని వేశాం. రెండు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని కమిటీకి గడువు విధించాం.
కమిటీ నివేదిక అందగానే ముఖ్యమంత్రితో చర్చించి పరిష్కారానికి చర్యలు చేపడతాం. పంచాయతీల ఆదాయం నుంచి ఉద్యోగుల వేతనాలను భరించేందుకు ప్రస్తుతం ఉన్న 30శాతం పరిమితిని 50 శాతానికి పెంచుతూ ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రకటించారు. ఈ మేరకు వెంటనే ఉత్తర్వులు కూడా ఇవ్వనున్నాం. గ్రామాలకు ఆర్థిక స్వావలంబన చేకూర్చే ఉద్దేశంతో చేపట్టిన గ్రామజ్యోతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో పారిశుధ్య కార్మికులు భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం’ అని కేటీఆర్ చెప్పారు.
విరమణ తాత్కాలికమే..: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 30 వేలమంది పంచాయతీ పారిశుధ్య కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని తెలంగాణ పంచాయతీ ఉద్యోగుల, పారిశుద్ధ్య కార్మికుల సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీపతిరావు చెప్పారు. మంత్రి హామీ మేరకు సమ్మెను తాత్కాలికంగా విరమిస్తున్నామని, శుక్రవారం నుంచి విధుల్లో చేరతామని చెప్పారు. సమ్మె కాలానికి కూడా వేతనం చెల్లిస్తామన్నారని, రెండు నెలల్లో సమస్యలు పరిష్కరించకుంటే మళ్లీ ఆందోళనకు దిగుతామని పేర్కొన్నారు.