సాక్షి, హైదరాబాద్: విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికు (ఆర్టిజన్లు)లకు శుభవార్త. ఆర్టిజన్ల వేతనాలు పెంచుతూ తెలంగాణ ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం పొందుతున్న వేతనాలతో పోలిస్తే.. గ్రేడ్–1 ఆర్టిజన్లకు రూ.3,477, గ్రేడ్–2 ఆర్టిజన్లకు రూ.2,865, గ్రేడ్–3 ఆర్టిజన్లకు రూ.2,181, గ్రేడ్–4 ఆర్టిజన్లకు రూ.1,900 వేతనం పెరగనుంది. ఆగస్టు 1 నుంచి పెరిగిన వేతనాలు అమల్లోకి రానున్నాయి.
అలాగే ఈఎస్‌ఐ, పీఎఫ్ యాజమాన్య వాటాలను ఇకపై యాజమాన్యాలే చెల్లించనున్నాయి. ఇప్పటివరకు యాజమాన్య వాటాలను కూడా కార్మికుల వేతనాల నుంచే చెల్లిస్తున్నారు. తాజా నిర్ణయంతో ఆ మొత్తం కార్మికులకే మిగిలి ఆ మేరకు వారి వేతనాల్లో పెరుగుదల కనిపిస్తుంది. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈనెల 21 నుంచి విద్యుత్ కాంట్రాక్ట్ కార్మిక సంఘాలు సమ్మెబాట పట్టిన విషయం తెలిసిందే.
విద్యుత్‌శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో గత శనివారం సచివాలయంలో జరిగిన చర్చల సందర్భంగా ఆర్టిజన్ల వేతనాల పెంపుతోపాటు ఈఎస్‌ఐ, పీఎఫ్ వాటాల చెల్లింపు తదితర డిమాండ్ల పరిష్కారానికి విద్యుత్ సంస్థల యాజమాన్యాలు హామీ ఇవ్వడంతో అదే రోజు కార్మిక సంఘాలు సమ్మె విరమించాయి. ఈ నేపథ్యంలో ఆ హామీలను అమలుచేస్తూ ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కింది హామీలను అమలు చేస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న 20,803 మంది ఆర్టిజన్లకు ప్రయోజనం కలగనుంది.
అమలు చేయనున్న హామీలివే...
♦ విద్యుత్ సంస్థల్లో ఆర్టిజన్ల విలీనంపై హైకోర్టులో విధించిన యథాతథ స్థితి(స్టే) తొలగింపునకు తక్షణమే విద్యుత్ సంస్థలు అదనపు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేస్తాయి.
♦ విద్యుత్ రెగ్యులర్ ఉద్యోగుల వేతన సవరణ జరగనున్న నేపథ్యంలో ఆర్టిజన్ల ఏకమొత్తం వేతనాల పెంపునకు అంగీకరించాం. పీఆర్సీ అమల్లోకి వచ్చిన తర్వాత మళ్లీ ఆర్టిజన్ల వేతనాల పెంపు ఉండదు.
♦ నిరంతర విద్యుత్ సరఫరాకు ప్రోత్సాహకంగా ఆర్టిజన్లకు ప్రత్యేక అలవెన్స్ మంజూరు.
♦ సాధారణ మరణం/ప్రమాదాల్లో మరణించిన ఆర్టిజన్ల కుటుంబంలో అర్హులైన ఒకరికి విద్యార్హతల ఆధారంగా ఉద్యోగావకాశం కల్పిస్తాం.
♦ ఆర్టిజన్ గ్రేడ్–3, గ్రేడ్–4గా కొనసాగుతూ పోల్ టూ పోల్, ఎఫ్‌ఓసీ, సబ్‌స్టేషన్ ఆపరేటర్, ఎంఆర్‌టీ, సీబీడీ, లైన్ బ్రేక్ డౌన్ గ్యాంగ్, డీపీఈగా నైపుణ్యం కలిగి విధులు నిర్వహిస్తున్న వారికి ఆర్టిజన్ గ్రేడ్–2 వేతనం చెల్లింపు.
♦ టీఎస్‌ఎస్పీడీసీఎల్‌లోని ఫీల్డ్ కార్యాలయాలు, సబ్‌స్టేషన్లలో గత రెండేళ్లుగా పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిశీలిస్తున్నాం.
♦ విధి నిర్వహణలో ప్రమాదాలకు లోనైతే చికిత్స కల్పించేందుకు మెడికల్ క్రెడిట్ కార్డులు జారీ.
♦ రెగ్యులర్ ఉద్యోగుల తరహాలోనే ఆర్టిజన్లకు సైతం సాధారణ మరణానికి రూ.10 లక్షల జీవిత బీమా చెల్లింపు.
♦ కార్మికుల ఈఎస్‌ఐ, పీఎఫ్ వాటాలను ఆయా చట్టాల ప్రకారమే వారి వేతనాల్లో కోత విధింపు.
Comments
Please login to add a commentAdd a comment