లారీల సమ్మెతో జిల్లా వ్యాప్తంగా మార్కెట్ యార్డులు, లారీ యూనియన్ కార్యాలయాల ఇలాంటి దృశ్యాలే కనిపించాయి
అమలాపురం: దేశవ్యాప్తంగా ఎనిమిది రోజుల పాటు సాగిన లారీల సమ్మె ముగిసింది. కేంద్ర రవాణా శాఖాధికారులతో న్యూఢిల్లీలో శుక్రవారం చర్చలు ముగిసిన అనంతరం సమ్మె విరమిస్తున్నట్టు లారీ యజమాన్య సంఘాలు ప్రకటించాయి. ఈ విషయాన్ని ఏపీ లారీ యజమాన్యాల సంఘం ప్రధాన కార్యదర్శి ఈశ్వరన్ ధ్రువీకరించారు. దీనితో ఎనిమిది రోజుల పాటు అసోసియేషన్ల ఆవరణలు, ప్రధాన రహదారులకు పరిమితమైన లారీలు శనివారం తెల్లవారు జాము నుంచి రోడ్డెక్కనున్నాయి. పెరిగిన డీజిల్, పెట్రోల్ ధరలను, టోల్‌గేట్ వ్యవస్థను పారదర్శకం చేయాలనే పలు డిమాండ్లతో గత గురువారం అర్ధరాత్రి నుంచి లారీ యాజమాన్యాలు సమ్మె చేపట్టిన విషయం తెలిసిందే. జిల్లాలో ఎనిమిది వేల వరకు లారీలు ఉండగా, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే లారీలను కలిపితే రోజుకు సుమారు 15 వేల లారీల ద్వారా సరుకు ఎగుమతి, దిగుమతులు జరుగుతాయని అంచనా.
నిత్యావసర వస్తువులు, సిమెంట్, ఐరెన్ వంటి ఉత్పత్తుల దిగుమతి, కొబ్బరి, ఇతర వాణిజ్య, వ్యవసాయ పంటలు, కోడిగుడ్లు, ఆక్వా, ఇసుక, ఇటుకలు, కంకర వంటి ఎగుమతులు జరుగుతుంటాయి. ఎనిమిది రోజుల పాటు సమ్మె వల్ల జిల్లా వ్యాప్తంగా సుమారు 1,900 కోట్ల మేర వ్యాపార లావాదేవీలు నిలిచిపోయినట్టు అసోసియేషన్ ప్రతినిధులు అంచనా వేస్తున్నారు. జిల్లా నుంచి ఉత్తర భారతదేశానికి ఎగుమతులు నిలిచిపోవడంతో ఒక్క కొబ్బరికే రూ.24 కోట్ల లావాదేవీలు నిలిచాయని అంచనా. కాకినాడ పోర్టులో రూ.400 కోట్లు, రాజమహేంద్రవరం కేంద్రంగా రూ.300 కోట్లు, కోడిగుడ్ల ఎగుమతులు నిలవడం వల్ల రూ.32 కోట్ల లావాదేవీలు నిలిచాయి. ఇక మిగిలిన రంగాలు సైతం లారీ సమ్మెల వల్ల ఒడుదొడుకులకు లోనయ్యాయి.
కార్మిక, రోజు వారీ ఎగుమతి, స్థానికంగా సరుకు రవాణా కూలీలపై సమ్మె తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఎనిమిది రోజుల పాటు సాగిన సమ్మె వల్ల జిల్లా వ్యాప్తంగా లారీల మీద ఆధారపడే డ్రైవర్లు, క్లీనర్లు, మెకానిక్‌లు, ట్రాన్స్‌పోర్టు అసోసియేషన్లలో పనిచేసే కార్మికులకు, నిత్యావసర వస్తువులు, కూరగాయలు, వ్యవసాయ ఉత్పత్తులు, ఆక్వా, సిమెంట్, కాకినాడ పోర్టు, రాజమహేంద్రవరం హోల్‌సేల్ మార్కెట్, జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎఫ్‌సీఐ గొడౌన్లు, రైల్వే గూడ్స్ షెడ్లు వంటి ఎగుమతి, దిగుమతి చేసే ప్రాంతాల్లో ఉండే కూలీలు, కార్మికులకు వారం రోజులుగా ఉపాధి లేకుండా పోయింది. సమ్మె విరమణతో రైతులు, కార్మికులు ఊరట చెందారు.
Comments
Please login to add a commentAdd a comment