సాక్షి, హైదరాబాద్ : లారీల సమ్మె సెగ మొదలైంది. ప్రభుత్వంతో పాటు పారిశ్రామిక వర్గాలు, సామాన్యులపైనా ప్రభావం పడుతోంది. నిత్యావసర వస్తువుల ధరలు క్రమంగా పెరుగుతు న్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కాళేశ్వరానికీ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రవాణా నిలిచి పోవడంతో పారిశ్రామిక ఉత్పత్తులు ఎక్కడికక్కడే నిలిచిపో యాయి. లారీల సమ్మె గురువారంతో వారానికి చేరింది. లారీ యజమానుల సమస్యలతో పాటు డీజిల్‌ను వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) పరిధిలోకి తేవాలని, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తదితర డిమాండ్లతో సాగుతోన్న సమ్మె ప్రభావం నెమ్మదిగా కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో సమ్మె మొదలైతే సాధ్యమైనంత త్వరగా రాష్ట్ర ప్రభుత్వాలు లారీ యజమానులను చర్చలకు ఆహ్వానించేవి. కానీ, లారీ యజమానుల డిమాండ్లన్నీ కేంద్ర పరిధిలోనివే కావడంతో రాష్ట్ర ప్రభుత్వాలు ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది.
పెరుగుతున్న ధరలు.. ప్రత్యామ్నాయ చర్యలు
నిత్యావసర సరుకుల లారీలు సమ్మెలో పాల్గొనకపో వడంతో సామాన్యులకు పెద్దగా ఇబ్బంది లేకున్నా.. రవాణా మీద ఆధారపడ్డ పప్పులు, ధాన్యాలు, ఇతర నిత్యావసరాలపై దాని ప్రభావం పడుతోంది. దీంతో ధరలు పెరిగే అవకాశాలున్నాయి. వాస్తవానికి ప్రభుత్వ పరిధిలోని గోదాముల్లో నెలరోజులకు సరిపడా ఆహారపదార్థాలున్నాయి. వ్యాపారులు కూడా ఈ మేరకు ఏర్పాట్లు చేసుకున్నారు. నిల్వలు తగ్గకుండా, నిత్యావసరాల రవాణాకు ఆటంకం కలగకుండా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతోందని సమాచారం. డీసీఎం వ్యానులు, త్రీవీలర్స్ ద్వారా కూరగాయలు, ధాన్యం, ఇతర నిత్యావసరాలను రవాణా చేయాలని.. ఫలితంగా ధరలు పెరగకుండా, బ్లాక్ మార్కెట్ నియంత్రణకు తన వంతు ప్రణాళికను సిద్ధం చేస్తోన్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఎస్కార్ట్ సాయంతో కాళేశ్వరానికి సిమెంట్
కాళేశ్వరానికి సిమెంటు కొరత ఏర్పడకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. సిమెంటు లారీలు సమ్మెలో పాల్గొనడం.. ప్రాజెక్టు వద్ద నిల్వ ఉంచిన సిమెంట్ నిండుకోవడంతో పోలీసు పహారాలో సిమెంటు సరఫరా చేస్తున్నారు. పెద్దపల్లి, మహారాష్ట్ర నుంచి రావాల్సిన సిమెంట్ లారీలను భారీ బందోబస్తు మధ్య తరలిస్తున్నారు. మేడిగడ్డ ప్రాజెక్టుకు కంకర కొరత తీర్చేందుకు పరకాల, రామడుగు నుంచి పోలీసు పహారాలో లారీలను తరలించాలని కలెక్టర్లు, ఎస్పీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
బంగాళాదుంపకూ కొరతే..
సమ్మె కారణంగా బంగాళాదుంపకూ కొరత ఏర్పడింది. రాష్ట్రానికి ఉత్తర్‌ప్రదేశ్ నుంచి ఆలూ సరఫరా అవుతుంది. బంగాళాదుంప నిల్వలు చాలాచోట్ల నిండుకున్నట్లు సమాచారం. త్రీవీలర్లు, డీసీఎంల్లో ఇతర కూరగాయలు తరలిస్తుండటంతో మిగిలిన కూరగాయలకు కొరత లేదని అధికారులు పేర్కొంటున్నారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ నుంచి రావాల్సిన క్యాప్సికం, క్యాబేజీ, క్యారెట్ల నిల్వలు కూడా నిండుకున్నాయి. మొత్తం మీద ఇతర రాష్ట్రాల నుంచి రావాల్సిన కూరగాయలకు కొరత ఏర్పడుతోంది.
పేరుకుపోతోన్న ఉత్పత్తులు..
దేశవ్యాప్తంగా రవాణా స్తంభించడంతో తెలంగాణలాంటి తీర ప్రాంతం లేని రాష్ట్రాల్లో ఉత్పత్తులన్నీ పేరుకుపోతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో విస్తరించిన సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి జరుగుతున్నా.. రవాణా స్తంభించిపోయింది. కరీంనగర్ నుంచి జరగాల్సిన ఇసుక, గ్రానైట్ కూడా నిలిచిపోయాయి. సమ్మె కారణంగా ఎక్కువ ప్రభావితమైంది సిమెంటు రంగమే. ఉత్పత్తి జరుగుతున్నా.. లారీలు కదలకపోవడంతో సిమెంట్ ఫ్యాక్టరీల యాజమాన్యాలు ఆందోళనలో ఉన్నాయి. నిర్మాణరంగానికి కీలకమైన సిమెంటు, ఇసుక, గ్రానైటు, మట్టి, కంకర తదితర వస్తువుల రవాణా నిలిచిపోయింది.
ఆఖరు అస్త్రంగా..
సమ్మె మరింత ఉదృతమైతే.. ఆయిల్, పాలు, నీళ్లు లాంటి నిత్యావసరాల ట్యాంకర్లు కూడా సమ్మెలో పాల్గొనే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటికే ఆయిల్ ట్యాంకర్ అసోసియేషన్ సమ్మెకు మద్దతుగా 24న తెలంగాణవ్యాప్తంగా ఒక్కరోజు బంద్‌లో పాల్గొంది. కేంద్రం దిగిరాకపోతే తాము కూడా నిరవధిక సమ్మెలో పాల్గొంటామని స్పష్టం చేసింది. ఇదే జరిగితే.. సమ్మె ప్రభావం సామాన్యులపైనా పడుతుంది.
సమ్మె నష్టం రూ.200 కోట్లు
వారం రోజులుగా సమ్మె చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం శోఛనీయం. సమ్మె వల్ల తెలంగాణ లారీ యజమానులు రూ.200 కోట్లు నష్టపోయారు. అయినా.. న్యాయమైన డిమాండ్ల సాధనలో వెనకడుగు వేసేది లేదు. మా కోర్కెలు నెరవేరేదాకా సమ్మె కొనసాగిస్తాం.
– భాస్కర్‌రెడ్డి, తెలంగాణ లారీ యజమానుల సంఘం, అధ్యక్షుడు
డిమాండ్లు నెరవేర్చాల్సిందే: శ్రీనివాస్‌గౌడ్
లారీ యజమానుల న్యాయపరమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని తెలంగాణ లారీ యజమానుల సంఘం గౌరవాధ్యక్షుడు, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. గురువారం మహబూబ్‌నగర్‌లో లారీ యజమానులు రోడ్డుపై నిర్వహించిన వంటా–వార్పులో లారీ కార్మికులతో కలసి పాల్గొన్నారు. సింగిల్ పర్మిట్ విధానానికి ఏపీ సీఎం చంద్రబాబు వెంటనే అనుమతించాలని శ్రీనివాస్‌గౌడ్ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment