సాక్షి, హైదరాబాద్ : లారీల సమ్మె ప్రభావం పెట్రో ట్యాంకర్లపైనా పడింది. ఐదో రోజున మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా 4,500 ఆయిల్ ట్యాంకర్లు నిలిచిపోయాయి. దీంతో అనేక చోట్ల పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. మంగళవారం నుంచి ఆయిల్ ట్యాంకర్లను నిలిపేస్తామని లారీ ఆపరేటర్లు హెచ్చరించడంతో వాహనదారులు సోమవారం బంకుల వద్ద క్యూ కట్టారు. సమ్మె కొనసాగితే గురువారం నాటికి పెట్రోల్ బంకులు పూర్తిగా మూత పడే అవకాశం లేకపోలేదు.
పెరిగిన సమ్మె ప్రభావం..
మొదటి నాలుగు రోజులూ తెలంగాణలో లారీల సమ్మె పాక్షికంగా జరిగినా మంగళవారం నుంచి దాని ప్రభావం పెరిగింది. సమ్మె కారణంగా నిత్యావసర సరుకులకు కొంత కొరత ఏర్పడింది. పండ్లు, కూరగాయల ధరలు పెరిగాయి. సమ్మెను బూచీగా చూపించి వ్యాపారులు నిత్యావసర వస్తువుల ధరలు పెంచి దండుకుంటున్నారు. కీలకమైన వ్యవసాయ సీజన్లో రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులను సరఫరా చేయడానికి సమ్మె అడ్డంకిగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా ఎరువులు, విత్తనాల సరఫరా నిలిచిపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల యూరియా సరఫరాకూ అడ్డంకులు ఏర్పడ్డాయి. వ్యవసాయ శాఖ ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. అయితే, విమానాల కోసం ఉపయోగించే ఇంధన సరఫరాకు ఇబ్బందులు లేకుండా చూస్తామని ఆపరేటర్లు హామీ ఇచ్చినట్లు తెలిసింది.
సమ్మెలో 90 లక్షల లారీలు: శ్రీనివాస్‌గౌడ్
లారీల సమ్మెకు సంఘీభావంగా హైదరాబాద్ చర్లపల్లిలోని ఇండియన్ ఆయిల్, భారత్, హెచ్‌పీ పెట్రోలియం కార్పొరేషన్ల వద్ద లారీ ఓనర్స్, ట్యాంక్ ట్రక్ ఓనర్స్ అసోసియేషన్స్ నిర్వహించిన నిరసన కార్యక్రమానికి మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే, తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు వి.శ్రీనివాస్‌గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లారీల యజమానుల న్యాయమైన డిమాండ్లు నెరవేరేదాకా సమ్మె కొనసాగుతుందన్నారు. దేశవ్యాప్తంగా సమ్మెలో 90 లక్షల లారీలు పాల్గొంటున్నాయన్నారు. సమ్మె కారణంగా లారీలపై ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్న 10 కోట్ల కుటుంబాలకు ఇబ్బందిగా మారిందని, దీనిని దృష్టిలో ఉంచుకుని వెంటనే సమ్మె విరమణకు కేంద్రం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ, ఏపీ మధ్య లారీల రాకపోకలకు ఉద్దేశించిన సింగిల్ పర్మిట్‌ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిత్యావసర సరుకుల పంపిణీకి బంద్ నుండి మినహాయింపు ఇచ్చామన్నారు. త్వరలో పెట్రోల్ బంక్‌ల యజమానులు కూడా బంద్‌కు మద్దతు తెలిపి పాల్గొంటారన్నారు. తెలంగాణ పెట్రోలియం ట్యాంకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ సీఎస్ సూచనల మేరకు అత్యవసర సర్వీసులను దృష్టిలో ఉంచుకుని ఒక్కరోజే సమ్మె చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి దుర్గాప్రసాద్, జనార్దన్, సయ్యద్ అరిఫ్ ఉల్ హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు. కాగా, చర్లపల్లి, ఘట్‌కేసర్, రామగుండం, వరంగల్, సూర్యాపేట ఐఓసీ డిపోల్లో ఆయిల్ ట్యాంకర్ అసోసియేషన్లుసమ్మెలో పాల్గొన్నాయి.
రూ.150 కోట్లు నష్టం
లారీల సమ్మె కారణంగా నిత్యం దాదాపు రూ.25–30 కోట్ల మేర నష్టం వాటిల్లిందని తెలంగాణ లారీ యజమానుల సంఘం అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి తెలిపారు. 5 రోజుల సమ్మె కారణంగా లారీ యజమానులకు రూ.150 కోట్లు నష్టం వచ్చిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ లారీలు నిలిచిపోయినా ఇప్పటివరకూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తమకు ఆహ్వానం రాలేదన్నారు. ప్రభుత్వాలు స్పందించకపోతే తమకు మద్దతుగా ఆయిల్, పాలు, తాగునీటి ట్యాంకర్లు కూడా సమ్మెలో పాల్గొంటాయని ఆయన స్పష్టంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment