సాక్షి, సిటీబ్యూరో/కుషాయిగూడ: చర్లపల్లి టెర్మినల్ సిద్ధమైంది. ఈ నెలాఖరుకు లేదా వచ్చే సెప్టెంబరు మొదటి వారంలో ప్రారంభించేందుకు దక్షిణమధ్య రైల్వే సన్నాహాలు చేపట్టింది. కానీ ఈ స్టేషన్‌కు ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు ఇప్పటి వరకు రవాణా సదుపాయాలు మాత్రం అందుబాటులోకి రాలేదు. ఎంఎంటీఎస్ రెండో దశ పనులు పూర్తయినప్పటికీ వివిధ మార్గాల్లో చర్లపల్లికి చేరుకొనేందుకు ఎలాంటి సర్వీసులను ప్రారంభించలేదు. అలాగే.. ఆర్టీసీ సేవలు కూడా వినియోగంలోకి రాలేదు. చర్లపల్లి స్టేషన్‌కు చేరుకొనేందుకు రెండు మార్గాల్లో రోడ్ల విస్తరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆయా విభాగాల మధ్య సమన్వయలోపం కారణంగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా రోడ్ల అభివృద్ధి, విస్తరణ పనులు నిలిచిపోయాయి. దీంతో నగరంలోనే నాలుగో టెర్మినల్గా వినియోగంలోకి రానున్న చర్లపల్లికి ప్రయాణికులు చేరుకోవడం ప్రశ్నార్థకంగా మారింది.
అత్యాధునిక సదుపాయాలతో..
సుమారు రూ.430 కోట్లతో చర్లపల్లి టెర్మినల్ను అభివృద్ధి చేశారు. లిఫ్టులు, ఎస్కలేటర్లు, బుకింగ్ కేంద్రాలు, 9 ప్లాట్‌ఫాంలు తదితర అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేసిన చర్లపల్లి టెర్మినల్ నుంచి నిత్యం సుమారు 50 రైళ్లు రాకపోకలు సాగించేందుకు అవకాశం ఉంది. కానీ మొదట 25 రైళ్లతో స్టేషన్‌ను వినియోగంలోకి తేనున్నారు. కృష్ణా ఎక్స్‌ప్రెస్, శబరి, శాతవాహన తదితర రైళ్లను చర్లపల్లి నుంచి నడపనున్నట్లు రైల్వేబోర్డు ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ క్రమంలో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రయాణికులు చేరుకొనేందుకు ఎలాంటి సదుపాయాలు లేకపోవడం గమనార్హం.
ఎంఎంటీఎస్ ఎప్పుడు?
ఎంఎంటీఎస్ రెండో దశ పనులు పూర్తయ్యాయి. మేడ్చల్ నుంచి బొల్లారం మీదుగా ఫలక్‌నుమా, ఉందానగర్ వరకు, లింగంపల్లి నుంచి తెల్లాపూర్ వరకు, సనత్‌నగర్ నుంచి మౌలాలీ మీదుగా చర్లపల్లి, ఘట్కేసర్ వరకు అన్ని మార్గాల్లో పనులు పూర్తి చేసినప్పటికీ ఎంఎంటీఎస్ సరీ్వసులు మాత్రం అందుబాటులోకి రాలేదు. టెర్మినల్ ప్రారంభమైతే లింగంపల్లి చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన ప్రయాణికులు కూడా ఎంఎంటీఎస్‌లో నేరుగా చర్లపల్లికి చేరుకొని అక్కడి నుంచి ప్రధాన రైళ్లలో బయలుదేరేందుకు అవకాశం ఉంటుంది.
ఇటు మేడ్చల్, మల్కాజిగిరి, అటు కాచిగూడ చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన ప్రయాణికులు కూడా చర్లపల్లికి చేరేలా ఎంఎంటీఎస్ సేవలను విస్తరించాల్సి ఉంది. రెండో దశలో నిర్మించిన మార్గాల్లో ప్రస్తుతం మేడ్చల్– ఫలక్‌నుమా, లింగంపల్లి–తెల్లాపూర్, మేడ్చల్–లింగంపల్లి తదితర రూట్లలో ఉదయం, సాయంత్రం మాత్రమే పరిమితంగా రైళ్లు నడుస్తున్నాయి. గతంలో రోజుకు 121 సర్వీసులు నడిస్తే ఇప్పుడు వాటి సంఖ్య 78కి తగ్గింది. మరోవైపు సికింద్రాబాద్ – చర్లపల్లి, మేడ్చల్– మల్కాజిగిరి– చర్లపల్లి, కాచిగూడ–చర్లపల్లి తదితర మార్గాల్లో సరీ్వసులను ప్రారంభించాలంటే మరిన్ని రైళ్లు అవసరం. కానీ ఈ దిశగా ఇప్పటి వరకు ఎలాంటి ప్రణాళికలు లేవు.
విస్తరణకు నోచుకోని రహదారులు..
నగరంలోని వివిధ మార్గాల్లో సుమారు 40 కిలోమీటర్ల పరిధి నుంచి ప్రయాణికులు చర్లపల్లికి చేరుకొనేందుకు రెండు ప్రధాన రహదారులు ఉన్నాయి. మహాలక్ష్మీనగర్ కాలనీ నుంచి చర్లపల్లి రైల్వేస్టేషన్ వరకు ఉన్న 40 ఫీట్ల పాత రోడ్డును 80 ఫీట్లకు విస్తరించాల్సి ఉంది. అలాగే.. చర్లపల్లి టెర్మినల్ ముఖద్వారం నుంచి ఐఓసీఎల్‌ను కలుపుతూ మరో 100 ఫీట్ల రోడ్డును విస్తరించాలని ప్రతిపాదించారు. ఈమేరకు జీహెచ్‌ఎంసీ అధికారులు సర్వేలు నిర్వహించారు. మహాలక్ష్మినగర్ రోడ్డును విస్తరించేందుకు 15 చోట్ల ఆస్తులను తొలగించాల్సి ఉంటుందని గుర్తించారు.
ఆస్తులు కోల్పోయిన వారికి టీడీఆర్‌లు, పరిహారం చెల్లింపునకు కాప్రా మున్సిపల్ అధికారులు నోటీసులు కూడా జారీ చేశారు. స్థలాలు, ఆస్తులను ఇచ్చేందుకు కాలనీవాసులు సుముఖంగా లేకపోవడంతో రోడ్డు విస్తరణ పెండింగ్‌లో పడిపోయింది. ఈ మార్గంలో భూసేకరణపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. మరోవైపు చర్లపల్లి టెర్మినల్ ముఖద్వారం నుంచి ఐఓసీఎల్ రోడ్డును కలుపుతూ ప్రతిపాదించిన 100 ఫీట్ల రోడ్డు విస్తరణలో 80 శాతం భూములను అటవీశాఖ నుంచి, మరో 20 శాతం భూములను చర్లపల్లి ఐలా నుంచి సేకరించాల్సి ఉంది. గత మార్చి నెలలో రోడ్డు నిర్మాణానికి స్థలాలు ఇవ్వాలని కోరుతూ జీహెచ్‌ఎంసీ అధికారులు అటవీశాఖ అధికారులు, ఐలా అధికారులకు లేఖలు రాసినట్లు సమాచారం. కానీ ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం రాకపోవడంతో ఈ రోడ్డు నిర్మాణ పనులు కూడా స్తంభించాయి.
కొరవడిన సమన్వయం..
అప్రోచ్ రోడ్ల నిర్మాణం చేయకుండానే చర్లపల్లి టెర్మినల్ ప్రారంభమైతే పెద్ద ఎత్తున ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతారు. సకాలంలో స్టేషన్‌కు చేరుకోవడం కూడా కష్టమే. వివిధ విభాగాల మధ్య సమన్వయం కొరవడడంతోనే రోడ్ల నిర్మాణం ముందుకు సాగడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అనుమతుల కోసం నిరీక్షిస్తున్నాం..
చర్లపల్లి రైల్వే టెర్మినల్ అప్రోచ్ రోడ్ల నిర్మాణ స్థల సేకరణకు చర్యలు తీసుకున్నాం. స్థల యజమానులకు నోటీసులు కూడా అందజేశాం. నివేదికలను భూసేకరణ అధికారులకు, జిల్లా కలెక్టర్‌కు, జీహెచ్‌ఎంసీకి పంపించాం. ప్రస్తుతం వారి పరిశీలనలో ఉంది. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచి్చన వెంటనే రోడ్ల నిర్మాణం చేపడతాం.
– ముకుంద్‌రెడ్డి, కాప్రా డిప్యూటీ కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment