నెల్లూరులోని స్టోన్‌హౌస్‌పేటలో ఉన్న వంటనూనెల హోల్‌సేల్ వ్యాపార గోడౌన్‌లో అధికారుల తనిఖీలు
సాక్షి, అమరావతి: రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నెపంతో వంటనూనెలు, నిత్యావసరాల కృత్రిమ కొరత సృష్టిస్తున్నవారిపై రాష్ట్ర ప్రభుత్వం రెండో రోజూ కొరడా ఝుళిపించింది. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా 126 చోట్ల తనిఖీలు చేసిన విజిలెన్స్ అండ్ ఎన్‌ఫో ర్స్‌మెంట్ సోమవారం మరో 142 చోట్ల తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో పరిమితికి మించి నిల్వలు కలిగి ఉన్న నలుగురు వ్యాపారులపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో రెండు రోజుల్లో ఈ చట్టం కింద మొత్తం 20 కేసులు నమోదు చేసినట్లయ్యింది.
అదే విధంగా తూనికలు కొలతల చట్టానికి విరుద్ధంగా గరిష్ట చిల్లర ధర కంటే అధిక ధరకు విక్రయిస్తున్న వారిపై 73 కేసులు నమోదు చేశారు. ఈ చట్టం కింద రెండు రోజుల్లో 127 కేసులు నమోదు చేశారు. ఆహార భద్రతా చట్టం కింద నాణ్యత సరిగాలేకపోవడంతో 15 కేసులు నమోదు చేశారు. దీంతో రెండు రోజుల్లో ఈ కేసుల సఖ్య 27కి చేరింది. మొత్తం మీద రెండు రోజుల్లో వంట నూనెలు, పప్పుధాన్యాల నిల్వలపై నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో మొత్తం 174 కేసులను రాష్ట్ర ప్రభుత్వం నమోదు చేసింది. ధరలు పెంచి విక్రయించే వ్యాపారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment