విజయవాడలో వంట నూనెల బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడుతున్న దుకాణాల్లో విజిలెన్స్ అధికారుల తనిఖీలు
సాక్షి, అమరావతి: రష్యా–ఉక్రెయిన్ యుద్ధం పేరిట రాష్ట్రంలో నిత్యావసర సరుకులకు కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచి విక్రయించే వ్యాపారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆహార, పౌర సరఫరాల చట్టం ప్రకారం పరిమితికి మించి వంట నూనెలు, పప్పు దినుసుల నిల్వలను కలిగి ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేసింది.
రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో వంట నూనెల ధరలతో పాటు నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్న వైనంపై ‘ధరల దాడి’ శీర్షికన ఆదివారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. పామాయిల్‌తోపాటు పెరుగుతున్న ఇతర వంట నూనెల ధరలు, పప్పు దినుసుల ధరలను నియంత్రించడానికి విజిలెన్స్ అధికారులు ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. 126 చోట్ల తనిఖీలు నిర్వహించగా.. 16 చోట్ల పరిమితిని మించి నిల్వలు కలిగి ఉండటాన్ని గుర్తించి కేసులు నమోదు చేశారు.
నెల్లూరులోని స్టోన్‌హౌస్‌పేటలో ఉన్న వంటనూనెల హోల్‌సేల్ వ్యాపార గోడౌన్‌లో అధికారుల తనిఖీలు
అధిక ధరలకు విక్రయిస్తున్న 15 మందిపై లీగల్ మెట్రాలజీ యాక్ట్–2009 ప్రకారం కేసులు నమోదు చేశారు. కొన్నిచోట్ల వంట నూనెల నాణ్యతను పరిశీలించేందుకు శాంపిల్స్ సేకరించారు. హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులతో పాటు సూపర్ మార్కెట్లు, తయారీ యూనిట్లు పరిమితిని మించి నిల్వలు కలిగి ఉన్నా, అధిక ధరలకు విక్రయించినా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ హెచ్చరించింది.
Comments
Please login to add a commentAdd a comment