ఇదో రకం దందా! | Gas Cylinders Black Marketing in Nalgonda | Sakshi
Sakshi News home page

ఇదో రకం దందా!

Published Mon, Jul 20 2020 11:56 AM | Last Updated on Mon, Jul 20 2020 11:56 AM

Gas Cylinders Black Marketing in Nalgonda - Sakshi

సంస్థాన్‌నారాయణపురం మండలం పల్లగట్టుతండా పంచాయతీకి చెందిన మేగావత్‌ దేవా చౌటుప్పల్‌లోని ఇండియన్‌ గ్యాస్‌ ఏజెన్సీ లబ్ధిదారుడు. గ్యాస్‌ అయిపోవడంతో బుకింగ్‌ చేశాడు. తండాకు రోడ్డు బాగున్నా  గ్యాస్‌ బండి వెళ్లడం లేదు. దీంతో దేవా తన తండా సమీపంలోని జనగాంలో ఓ దళారికి ఖాళీ సిలిండర్, గ్యాస్‌బుక్‌ ఇచ్చి వెళ్లాడు. సదరు దళారి అదనంగా కొంత మొత్తం తీసుకొని దేవాకు సిలిండర్‌ సమకూర్చాడు. ఈ పరిస్థితి దేవా ఒక్కడిదే కాదు.. మారుమూల గ్రామాలు, తండాలకు గ్యాస్‌ వాహనాలు వెళ్లపోవడంతో ఎంతోమంది లబ్ధిదారులపై అదనపు భారం పడుతుంది.  

 సంస్థాన్‌ నారాయణపురం : జిల్లాలోని మారుమూల గ్రామాలు, తండాలకు వివిధ కారణాలతో వంట గ్యాస్‌ వాహనాలు వెళ్లడం లేదు. దళారులు ఈ అవకాశాన్ని అదునుగా తీసుకొని దందాకు తెరలేపుతున్నారు. ఏజెన్సీకి వెళ్లి గ్యాస్‌ తెచ్చుకోలేని లబ్ధిదారులకు తామే బుకింగ్‌ జేసి అందజేస్తున్నారు. అందుకు గాను ఒక్కో సిలిండర్‌పై రూ.100నుంచి రూ.200 అదనంగా వసూలు చేస్తున్నారు.  

దందా సాగుతుందిలా..
తండాలు, మారుమూల గ్రామాలకు రోడ్లు లేవని, ఉన్న చోట అధ్వానంగా ఉన్నాయని తదితర కారణాలు సాకుగా చూపి గ్యాస్‌ సరఫరా చేయడం లేదు. దీంతో లబ్ధిదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఏజెన్సీకి వెళ్లి తెచ్చుకోవాలంటే రోజంతా పడుతుండడం, అంతా వ్యవసాయ కూలీలు కావడంతోపనులు వదులుకొని పట్టణం పోలేని పరిస్థితి ఉంది. దీన్ని సమీప గ్రామాల్లోని దళారులు అవకాశంగా మల్చుకుంటున్నారు. తామే రీఫిల్‌ సిలిండర్లు సమకూరుస్తామని లబ్ధిదారుల నుంచి గ్యాస్‌ బుక్‌లు సేకరిస్తారు.వారి సెల్‌ఫోన్ల నుంచే బుకింగ్‌ చేస్తారు. గ్యాస్‌ ఏజెన్సీ వాహనం సిబ్బందితో కుమ్మక్కై వారికి ప్రతి నెలా కొంత ముట్టజెబుతారు. దీంతో సదరు వాహన సిబ్బంది రీఫిల్‌ గ్యాస్‌ సిలిండర్లను దళారి ఇంటి వద్ద వేసి వెళ్తారు.

బుకింగ్‌ చేసి ఏజెన్సీ నుంచి తెప్పించి ఇచ్చినందుకు గాను దళారి ఒక్కో సిలిండర్‌పై రూ.100నుంచి రూ.200 వరకు అదనంగా తీసుకుంటాడు. ఇక గ్యాస్‌ కనెక్షన్‌ లేని వారికి దళారులు తమ వద్ద అక్రమంగా ఉన్న సిలిండర్‌ను రీఫిల్‌ చేయించి రూ.200 నుంచి రూ.250 వరకు అదనంగా వసూలు చేస్తారు. కొంతమంది దళారులు అమాయక లబ్ధిదారులు ఉంటే వారి ఏటీఎం కార్డులను తీసుకొని సిలిండర్‌పై వచ్చే సబ్సిడీని నొక్కేస్తున్నారు. చిన్నచిన్న హోటళ్ల నిర్వాహకులు కూడా కమర్షియల్‌ దళారుల వద్దనే కొనుగోలు చేస్తారు. ఈ విధంగా ఒక్కో దళారి నెలకు నెలకు 60నుంచి 70 వరకు సిలిండర్లు రీఫిల్‌ చేయిస్తూ రూ.15వేల వరకు సంపాదిస్తున్నారు. వానాకాలం, చలికాలం సంపాదన ఎక్కువగా ఉంటుందని లబ్ధిదారులు అంటున్నారు.

నిబంధనలు గాలికి
జిల్లాలో వివిధ గ్యాస్‌ కంపెనీలకు చెందిన 19 ఏజెన్సీలు ఉన్నాయి. వీటిలో చాలా వరకు నిబంధనలు పాటించడం లేదన్న విమర్శలు ఉనాయి. ఏజెన్సీలు నింబంధనల ప్రకారం గ్యాస్‌ బుకింగ్‌ చేసుకున్న లబ్ధిదారుల ఇళ్లకు సిలిండర్‌ తీసుకెళ్లి ఇవ్వాలి. రవాణా ఖర్చులు తీసుకుంటున్నా అందించడం లేదు. గ్యాస్‌ ఏజెన్సీలు, అధికారుల నిర్లక్ష్యం వల్ల తండాలు, మారుమూల ప్రాంతాల్లో లబ్ధిదారులకు అదనపు

బారం తప్పడం లేదు.గ్యాస్‌ కనెక్షన్లు ఇలా..
జిల్లాలో వివిధ గ్యాస్‌ కంపెనీలకు చెందిన 19 ఏజెన్సీలు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 2,31,283 కనెక్షన్లు ఉన్నా యి. ఇందులో సీఎస్‌ఆర్‌ 23,566, డొమస్టిక్‌ 1,43,645, కమర్షియల్‌ 2288, దీపం 48,950, ఉజ్వల పథకం కనెక్ష న్లు 12,384 ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement