► సెప్టెంబర్ 15లోగా కస్టం మిల్లింగ్ పూర్తి చేయాలి
► ఇప్పటి వరకు 60,872 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అప్పగించిన మిల్లర్లు
ఇందూరు(నిజామాబాద్ అర్బన్): రబీ సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 3 లక్షల 55వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని సేకరించింది జిల్లా యంత్రాంగం. అయితే ఈ మొత్తం ధాన్యాన్ని కస్టం మిల్లింగ్ (సీఎంఆర్) చేసివ్వడానికి 65 రైస్ మిల్లర్లకు బాధ్యతలు అప్పగించారు. ప్రతిఏడాది ధాన్యాన్ని తీసుకున్న రైస్‌మిల్లర్లు జిల్లా యంత్రాంగం విధించిన గడువు తేదీలోగా ఇవ్వకపోవడం సర్వసాధారణంగా మారింది. ధాన్యాన్ని ఎగ్గొట్టి పక్కదారి పట్టించిన దాఖలాలు ఉండడంతో ఆ రైస్‌మిల్లర్లకు జరిమానాలు, కేసులు నమోదు చేసిన సందర్భాలున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం అలా జరగకుండా ఉండేందుకు జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం 65 రైస్‌మిల్లర్లకు కలిపి ధాన్యాన్ని కస్టం మిల్లింగ్ చేసి 2 లక్షల 41,400 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సెప్టెంబర్ 15వ తేదీలోగా ఎఫ్‌సీఐకి ఇవ్వాల్సి ఉంది. నేటి వరకు కేవలం 60,872 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని (25శాతం) మాత్రమే రైస్‌మిల్లర్లు ఇచ్చారు. ఇంకా లక్షా 80వేల మెట్రిక్ టన్నుల బియ్యం రావాల్సి ఉంది. అయితే సీఎంఆర్ చేసివ్వడానికి విధించిన గడువుకు ఇంకా 14 వారాలు మాత్రమే మిగిలి ఉంది. ఈ క్రమంలో సీఎంఆర్‌ను వేగవంతం చేయడానికి అధికారులు రైస్‌మిల్లర్లపై ఒత్తిడిని తీవ్రతరం చేశారు.
వారానికి ఇంత మొత్తం ధాన్యం సీఎంఆర్ చేసి ఇవ్వాలని రైస్ మిల్లర్ల వారీగా లక్ష్యాలను విధించారు. ప్రతివారం రైస్‌మిల్లర్లు ఇస్తున్న ధాన్యంపై సివిల్ సప్లయి అధికారులే కాకుండా జాయింట్ కలెక్టర్ రవీందర్ రెడ్డి కూడా సమీక్షించనున్నారు. వారానికి ఇచ్చిన లక్ష్యాన్ని పూర్తిచేయని రైస్ మిల్లర్లపై ఒత్తిడిని మరింత తీవ్రతరం చేయడం, లేదంటే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సీఎంఆర్ ఇవ్వడంలో వెనుకబడి ఉన్న రైస్‌మిల్లర్లపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు.
రైతులకు రూ. 536 కోట్లు చెల్లింపులు
జిల్లా వ్యాప్తంగా ఐకేపీ, పీఏసీఎస్, మెప్మా ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి 3 లక్షల 55వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. అయితే ఈ మొత్తం ధాన్యం విలువ రూ. 536 కోట్లు కాగా నేటి వరకు రూ. 530 కోట్లు రైతులకు చెల్లింపులు జరిగాయి. ఇంకా రూ. 6 కోట్ల వరకు రైతులకు డబ్బులు చెల్లించాల్సి ఉండగా వీటిని కూడా రెండు మూడు రోజుల్లో చెల్లించడానికి చర్యలు చేపట్టారు.