ధాన్యం కేటాయింపుల్లో అవకతవకలు.. రీసైక్లింగ్ దందాకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా చిరునామా నిలుస్తోంది..! ఓ వైపు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ ప్రత్యేక కార్యాచరణతో శాఖను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నా.. పైరవీలు, అవినీతి వ్యవహారాలతో అక్రమ దందాకు అడ్డుకట్టపడడం లేదు. ఖరీఫ్ ధాన్యాన్ని అలాట్ చేయడంలోనే మిల్లర్లతో కమిట్‌మెంట్ జరిగింది. ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా రైస్‌మిల్లులున్న కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి పోను ప్రత్యేకంగా రాజన్నసిరిసిల్ల జిల్లాలో ధాన్యం కేటాయింపుల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోంది..!
సాక్షిప్రతినిధి కరీంనగర్/కరీంనగర్‌సిటీ:
కాలం కలిసొచ్చి ఖరీఫ్ సీజన్‌లో రైతులకు ఆశించిన మేర దిగుబడి వచ్చింది. రాష్ట్రంలోనే రికార్డుస్థాయిలో ఉమ్మడి జిల్లా ధాన్యం కొనుగోళ్లలో ప్రత్యేక స్థానం సాధించింది. అయితే.. కొనుగోలు చేసిన «వడ్లను మరాడించి తిరిగి ప్రభుత్వానికి బియ్యంగా ఇవ్వడానికి ఆయా జిల్లాలో నిబంధనల ప్రకారం రైస్‌మిల్లులకు కేటాయించాల్సి ఉంటుంది. పౌరసరఫరాల శాఖ నుంచి జీవో 21 ప్రకారం రా రైస్ 2 టన్నుల కెపాసిటీ మిల్లుకు 100 లారీలు, బాయిల్డ్ రైస్ 4 టన్ను కెపాసిటీ మిల్లుకు 300 లారీల చొప్పున మిల్లు కెపాసిటీని బట్టి కేటాయించాలి. కరీంనగర్ జిల్లాలో 140 రైస్ మిల్లులున్నాయి. అందులో 80 బాయిల్డ్, 60 రారైస్ మిల్లులున్నాయి. పెద్దపల్లి జిల్లాలో 140 బాయిల్డ్ రైస్‌మిల్లులున్నాయి. అయితే.. మిగిలిన జిల్లాలకు పోల్చుకుంటే ఈ రెండు జిల్లాలోనే మొత్తంగా 280 రైస్‌మిల్లులు అధికంగా ఉన్నాయి. కానీ.. వరిధాన్యం మాత్రం తక్కువగా వచ్చింది. కరీంనగర్‌లో 1.40 లక్షల టన్నులు, పెద్దపల్లి జిల్లాలో 60 వేల టన్నుల వరిధాన్యం కొనుగోలు చేయగా ఈ రెండు జిల్లాలోని 280 మిల్లులకు నిబంధనల ప్రకారం కేటాయించారు. ఇందులో 220 బాయిల్డ్ మిల్లులు కావడంతో 300 లారీల చొప్పున కేటాయించాల్సి ఉన్నా 150 నుంచి 200 లారీలే కేటాయించారని తెలిసింది.
మిల్లులు ఎక్కువగా ఉండి వరిధాన్యం తక్కువగా ఉండడంతో సీఎంఆర్ సకాలంలో ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ శాఖ కమిషనరేట్ ఆదేశాల మేరకు జిల్లాల పరిధిలో కేటాయింపుల కన్నా అధికంగా ఉన్న ధాన్యాన్ని ఇతర జిల్లాల మిల్లులకు కేటాయించాలని ఆదేశాలిచ్చారు. జగిత్యాలలో 1.60 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం కొనుగోలు చేశారు. ఇక్కడి 40 మిల్లులకు కేటాయింపులకు పోను 70 వేల మెట్రిక్ టన్నులను పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలోని రైస్‌మిల్లులకు కేటాయించారు. దీంతోపాటు భూపాలపల్లి, నిర్మల్ నుంచి కరీంనగర్, పెద్దపల్లి మిల్లులుకు వరిధాన్యం కేటాయించారు. అయితే.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 1.20 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా 40 మిల్లులకు కేటాయించారు. సిరిసిల్లలో 2 టన్నుల కెపాసిటీ మిల్లులే అధికంగా ఉన్నాయి. దీనికితోడు అక్కడ 50 వేల మెట్రిక్ టన్నులు కేటాయింపులకు సరిపోతాయని అంచనా..! అయితే.. జీవో 21 నిబంధనలు తోసిరాజని ఒక్కో మిల్లుకు రెట్టింపు స్థాయిలో వరిధాన్యం కేటాయించడంపై మిల్లర్లలో అసంతృప్తి వ్యక్తమవుతోంది.
సిరిసిల్లలోని సంఘ నేత ప్రజాప్రతినిధులు, వారి అనుచరుల పేరుతో కొందరు అధికారులతో మిలాఖతై మిలర్లకు అధిక ధాన్యం కేటాయింపులు చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రారైస్ మిల్లుకు 100 లారీలకు బదులు 350 లారీల వరకు, బాయిల్డ్ రైస్ 300కు మించి 500 లారీల వరకు కేటాయించినట్లు సమాచారం. పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఆదేశాలు బేఖాతరు చేస్తూనే ఇతర జిల్లాలకు కేటాయింపు విషయంలో పక్షపాత వైఖరి చూపడంలో ఆంతర్యమేమిటనేది ప్రశ్నార్థకం! ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి కేటాయించిన ఈ వడ్లను మరాడించి సీఎంఆర్ రూపంలో ఫిబ్రవరి చివరికల్లా తిరిగి ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుంది. అయితే.. ఈ ప్రత్యేక కేటాయింపుల జిల్లాలో మరో 5 నెలలైనా సీఎంఆర్ పెట్టే పరిస్థితులు లేవని తెలుస్తోంది. అందుకోసం మిల్లర్లు అక్రమంగా రీసైక్లింగ్ దందాను ఎంచుకుంటున్నారు.
ప్రభుత్వం అప్పజెప్పిన వడ్లను అమ్ముకుంటూ.. ప్రజల వద్ద రేషన్ బియ్యాన్ని 16 రూపాయలకు కిలో చొప్పున కొనుగోలు చేసి రీసైక్లింగ్ చేసి ప్రభుత్వానికి ధాన్యంగా అప్పగిస్తున్నారు. ఇటీవల ఓ మిల్లులో రీసైక్లింగ్ బయటపడ్డ విషయం తెలిసిందే. ఇటీవలే సిరిసిల్ల దగ్గరలోని గూడెం గోడౌన్‌లో 500 లారీల రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తుండగా అధికారులు పట్టుకుని సీజ్ చేశారు. ఈ విషయంలో స్వయంగా పౌరసరఫరాల శాఖ కమిషనర్ సిరిసిల్ల జిల్లాకు చెందిన సంబంధిత అధికారిని, మిల్లర్లను, సంఘనేతను పిలిపించుకుని తీవ్రంగా మందలించి బ్లాక్‌లిస్టులో పెడతానని హెచ్చరించినట్లు సమాచారం. అయితే.. ఈ కేటాయింపుల విషయంలో కమిషనర్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి..!!
నిబంధనల ప్రకారమే...
– పద్మ, డీసీఎస్‌వో, రాజన్న సిరిసిల్ల జిల్లా
నిబంధనల ప్రకారమే ధాన్యం కేటాయింపులు జరిపాం. అధికంగా ఇవ్వడమంటూ ఏమీ లేదు. ఇతర జిల్లాల మిల్లులకు కేటాయించాలనీ లేదు. మిల్లింగ్ చేసుకోగలుగుతామనే జిల్లాలోని మిల్లులకు తగిన కేటాయింపులు చేశాం.
Comments
Please login to add a commentAdd a comment