నిలిచిపోయిన టిప్పర్ లారీలు. (ఇన్‌సెట్‌లో) చనిపోయిన కోడి
దురాజ్‌పల్లి (సూర్యాపేట): సూర్యాపేట జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ ధాన్యాన్ని మిల్లర్లు అమ్మకొని సొమ్ముచేసుకున్నారు. బుధవారం జిల్లాలో కోదాడ మండలం కాపుగల్లులోని శ్రీ ఉషస్విని పార్‌బాయిల్డ్ మిల్లులో సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్)కు కేటాయించిన ధాన్యం మాయం చేసి మిల్లు యజమాని చేతులెత్తివేసిన విషయం వెలుగులోకి రాగా.. గురువారం మరో ఐదు మిల్లుల్లో ధాన్యం నిల్వలు లేవన్న విషయాన్ని అధికారులు వెల్లడించారు. ఈ ధాన్యం విలువ సుమారు 138.50 కోట్ల వరకు ఉంటుందని తెలిపారు.
బ్లాక్ లిస్టులో 8 మిల్లులు
2020–21 రబీ, 2021–22 ఖరీఫ్, రబీ సీజన్‌లకు సంబంధించి సూర్యాపేట జిల్లాలో అధికారులు 72 మిల్లులకు సీఎంఆర్ ధాన్యం కేటాయించారు. 2020–21 యాసంగి, 2021–22 వానాకాలం సీజన్ సీఎంఆర్ సేకరణకు ప్రభుత్వం గడువు పెంచుతూ పలుమార్లు మిల్లులకు అవకాశం ఇచ్చింది. అయినా 2020–21 రబీలో 6 మిల్లులు 18,880 మెట్రిక్ టన్నుల సీఎంఆర్, 2021–22 వానాకాలంలో 38 మిల్లులు 93,141 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ ధాన్యం బకాయి పడ్డాయి. అయితే 2020–21 రబీలో సీఎంఆర్ పెండింగ్ మిల్లులతో పాటు 2021–22 వానాకాలం ధాన్యం బకాయి ఉన్న మిల్లులను బ్లాక్‌లిస్టులో పెట్టి సీఎంఆర్ సేకరించాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఆదేశించినట్లు అధికారులు తెలిపారు. దీంతో జిల్లాలో 8 మిల్లులను బ్లాక్‌లిస్టులో పెట్టారు.
కోట్ల విలువైన ధాన్యం మాయం
ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి, సీఎంఆర్ కోసం మిల్లులకు అందించిన రూ.138.50 కోట్ల విలువగల ధాన్యాన్ని కొందరు మిల్లర్లు అమ్ముకున్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. జిల్లాలో సీఎంఆర్ ధాన్యం తీసుకున్న ఉషస్విని పార్‌బాయిల్డ్, లక్ష్మీసహస్ర, సంతోషిమాత, ఎంకేఆర్, వెంకటేశ్వర, భువనేశ్వరి, శివదుర్గ, సోమేశ్వర మిల్లులను సకాలంలో సీఎంఆర్ ధాన్యం ఇవ్వకపోవడంతో అధికారులు బ్లాక్‌లిస్టులో పెట్టారు.
అయితే ఇందులో శివదుర్గ, సోమేశ్వర మిల్లులు తమ సీఎంఆర్ ధాన్యం బకాయిలను చెల్లించేశాయి. ఇంకా ఆరు మిల్లులకు సంబంధించి సీఎంఆర్ పెండింగ్‌లో ఉండగా..ఈ మిల్లుల్లో సీఎంఆర్‌కు కేటాయించిన ధాన్యం నిల్వలు లేనట్టు అధికారులు గుర్తించారు. ఈ ధాన్యం విలువ రూ.138.50 కోట్లు ఉంటుందని అంచనా. ఈ ధాన్యాన్ని మిల్లర్లు అమ్ముకున్నారని చెపుతున్నారు.
రెండు మిల్లులపై కేసు..
ఉషస్విని పార్‌బాయిల్డ్ మిల్లు రూ.32.50 కోట్ల విలువ చేసే ధాన్యం, లక్ష్మీసహస్ర మిల్లు రూ.35 కోట్లు, సంతోషిమాత రూ.38 కోట్లు, ఎంకేఆర్ రూ. 25 కోట్లు, వెంకటేశ్వర రూ.18 కోట్లు, భువనేశ్వరి మిల్లులు రూ.2 కోట్ల విలువ చేసే ధాన్యం అమ్ముకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో సీఎంఆర్ పెట్టని ఉషస్విని, లక్ష్మీసహస్ర మిల్లులపై క్రిమినల్ కేసు నమోదు చేసి ఆర్‌ఆర్ యాక్ట్ అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
మిగిలిన నాలుగు మిల్లుల లో ధాన్యం నిల్వలు లేకున్నా ప్రస్తుతం వారికి కేటాయించిన మేరకు సీఎంఆర్ ఇస్తున్నారని, అందుకే కమిషనర్ ఆదేశాల మేరకు వారిపై చర్యలు తీసుకోవడం లేదని అధికారులు వెల్లడించారు. అయితే ప్రస్తుతం సీఎంఆర్ బకాయి ధాన్యం అందజేస్తున్నా, వీరు కూడా ఏ క్షణంలోనైనా చేతులెత్తేసే అవకాశం లేకపోలేదని, ధాన్యం అమ్ముకున్న ఈ మిల్లులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వస్తున్నాయి. ఇవే కాకుండా మరికొన్ని మిల్లుల్లో కూడా ప్రభుత్వ ధాన్యం మాయమైనట్లు చెపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment