telangana millers
-
అంతా ముందస్తు ప్రణాళికతోనే! రూ.35 కోట్ల సీఎంఆర్ ధాన్యం మాయం
కోదాడ: రూ.35 కోట్ల కస్టంమిల్లింగ్ రైస్ (సీఎంఆర్)ను మాయం చేసిన కేసులో సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కాపుగల్లుకు చెందిన మిల్లర్.. అంతా ముందస్తు ప్రణాళికతోనే పకడ్బందీగా పని కానిచ్చినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. మూడు, నాలుగు నెలలుగా దశలవారీగా మిల్లు నుంచి ధాన్యాన్ని పక్కదారి పట్టించినట్లు గ్రామస్తులు చెపుతున్నారు. నాలుగు నెలలుగా అధికారులు మిల్లులో ధాన్యం తనిఖీలు చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు. పౌరసరఫరాల అధికారులు మిల్లర్‌తో కుమ్మక్కు కాకుంటే అది సాధ్యపడదని, దీనిపై ఉన్నతాధికారులు లోతుగా విచారణ చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. మిల్లు సామగ్రి కూడా అమ్మకం?: మిల్లులో సీఎంఆర్ ధాన్యం మాయం చేసిన మిల్లర్, లోపల ఉన్న విలువైన యంత్ర సామగ్రిని కూడా దా దాపు రూ.3 కోట్లకు అమ్ముకున్నట్లు తెలుస్తోంది. మి ల్లంతా ఖాళీ అయిందని, ప్రస్తుతం ఉత్తి షెడ్డు మాత్ర మే ఉందని గ్రామస్తులు చెపుతున్నారు. దానికే అధికారులు తాళం, సీలు వేసి నిఘా పెట్టడం ఆశ్చర్యం కలిగిస్తోందని అంటున్నారు. ఈ మిల్లర్ తన స్వగ్రా మం మేళ్లచెరువు మండలం రేవూరులో గతంలో ధాన్యం కోనుగోలు చేసి, రైతులను మోసగించి ఐపీ పెట్టి కాపుగల్లుకు వచ్చాడని గ్రామస్తులు వెల్లడించారు. బ్యాంక్ తనఖాలో మిల్లు ఆస్తులు! కాపుగల్లు రైస్ మిల్లర్ కోదాడలోని ఓ జాతీయ బ్యాంక్ నుంచి మిల్లు మీద దాదాపు 3 కోట్ల రూపాయల రుణం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీని కోసం మిల్లు ఆస్తులను మొత్తం బ్యాంక్‌కు తనఖా పెట్టాడు. దీంతో ఈ ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి బ్యాంక్ అధికారులు ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో పౌరసరఫరాల విభాగం అధికారులు ఆ మిల్లర్‌పై రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించినా అక్కడ ఏమీ దొరకదని అంటున్నారు. మిల్లర్ కోసం గాలింపు.. రూ.35 కోట్ల సీఎంఆర్ ధాన్యం మాయం చేసిన కేసులో మిల్లర్ ఆచూకీ కోసం కోదాడ రూరల్ పోలీసులు జల్లెడ పడుతున్నారు. మిల్లులో పనిచేసే వారంతా ఇతర రాష్ట్రాలకు చెందినవారు కావడంతో వారి నుంచి పోలీసులకు ఎటువంటి సమాచారం దొరకడం లేదని తెలుస్తోంది. మిల్లర్ కారు డ్రైవర్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది. అతను ఇచ్చి న సమాచారంతో పోలీసులు హైదరాబాద్‌లోని మాదాపూర్‌కు వెళ్లగా, పోలీసులు వస్తున్నారనే సమాచారం తెలుసుకుని మిల్లర్ అక్కడి నుంచి బెంగళూరుకు పారిపోయినట్లు తెలిసింది. దీంతో పోలీసులు వెనుదిరిగి వచ్చినట్లు సమాచారం. -
సీఎంఆర్ ధాన్యం మాయం
దురాజ్‌పల్లి (సూర్యాపేట): సూర్యాపేట జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ ధాన్యాన్ని మిల్లర్లు అమ్మకొని సొమ్ముచేసుకున్నారు. బుధవారం జిల్లాలో కోదాడ మండలం కాపుగల్లులోని శ్రీ ఉషస్విని పార్బాయిల్డ్ మిల్లులో సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్)కు కేటాయించిన ధాన్యం మాయం చేసి మిల్లు యజమాని చేతులెత్తివేసిన విషయం వెలుగులోకి రాగా.. గురువారం మరో ఐదు మిల్లుల్లో ధాన్యం నిల్వలు లేవన్న విషయాన్ని అధికారులు వెల్లడించారు. ఈ ధాన్యం విలువ సుమారు 138.50 కోట్ల వరకు ఉంటుందని తెలిపారు. బ్లాక్ లిస్టులో 8 మిల్లులు 2020–21 రబీ, 2021–22 ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించి సూర్యాపేట జిల్లాలో అధికారులు 72 మిల్లులకు సీఎంఆర్ ధాన్యం కేటాయించారు. 2020–21 యాసంగి, 2021–22 వానాకాలం సీజన్ సీఎంఆర్ సేకరణకు ప్రభుత్వం గడువు పెంచుతూ పలుమార్లు మిల్లులకు అవకాశం ఇచ్చింది. అయినా 2020–21 రబీలో 6 మిల్లులు 18,880 మెట్రిక్ టన్నుల సీఎంఆర్, 2021–22 వానాకాలంలో 38 మిల్లులు 93,141 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ ధాన్యం బకాయి పడ్డాయి. అయితే 2020–21 రబీలో సీఎంఆర్ పెండింగ్ మిల్లులతో పాటు 2021–22 వానాకాలం ధాన్యం బకాయి ఉన్న మిల్లులను బ్లాక్‌లిస్టులో పెట్టి సీఎంఆర్ సేకరించాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఆదేశించినట్లు అధికారులు తెలిపారు. దీంతో జిల్లాలో 8 మిల్లులను బ్లాక్‌లిస్టులో పెట్టారు. కోట్ల విలువైన ధాన్యం మాయం ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి, సీఎంఆర్ కోసం మిల్లులకు అందించిన రూ.138.50 కోట్ల విలువగల ధాన్యాన్ని కొందరు మిల్లర్లు అమ్ముకున్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. జిల్లాలో సీఎంఆర్ ధాన్యం తీసుకున్న ఉషస్విని పార్బాయిల్డ్, లక్ష్మీసహస్ర, సంతోషిమాత, ఎంకేఆర్, వెంకటేశ్వర, భువనేశ్వరి, శివదుర్గ, సోమేశ్వర మిల్లులను సకాలంలో సీఎంఆర్ ధాన్యం ఇవ్వకపోవడంతో అధికారులు బ్లాక్‌లిస్టులో పెట్టారు. అయితే ఇందులో శివదుర్గ, సోమేశ్వర మిల్లులు తమ సీఎంఆర్ ధాన్యం బకాయిలను చెల్లించేశాయి. ఇంకా ఆరు మిల్లులకు సంబంధించి సీఎంఆర్ పెండింగ్‌లో ఉండగా..ఈ మిల్లుల్లో సీఎంఆర్‌కు కేటాయించిన ధాన్యం నిల్వలు లేనట్టు అధికారులు గుర్తించారు. ఈ ధాన్యం విలువ రూ.138.50 కోట్లు ఉంటుందని అంచనా. ఈ ధాన్యాన్ని మిల్లర్లు అమ్ముకున్నారని చెపుతున్నారు. రెండు మిల్లులపై కేసు.. ఉషస్విని పార్బాయిల్డ్ మిల్లు రూ.32.50 కోట్ల విలువ చేసే ధాన్యం, లక్ష్మీసహస్ర మిల్లు రూ.35 కోట్లు, సంతోషిమాత రూ.38 కోట్లు, ఎంకేఆర్ రూ. 25 కోట్లు, వెంకటేశ్వర రూ.18 కోట్లు, భువనేశ్వరి మిల్లులు రూ.2 కోట్ల విలువ చేసే ధాన్యం అమ్ముకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో సీఎంఆర్ పెట్టని ఉషస్విని, లక్ష్మీసహస్ర మిల్లులపై క్రిమినల్ కేసు నమోదు చేసి ఆర్ఆర్ యాక్ట్ అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. మిగిలిన నాలుగు మిల్లుల లో ధాన్యం నిల్వలు లేకున్నా ప్రస్తుతం వారికి కేటాయించిన మేరకు సీఎంఆర్ ఇస్తున్నారని, అందుకే కమిషనర్ ఆదేశాల మేరకు వారిపై చర్యలు తీసుకోవడం లేదని అధికారులు వెల్లడించారు. అయితే ప్రస్తుతం సీఎంఆర్ బకాయి ధాన్యం అందజేస్తున్నా, వీరు కూడా ఏ క్షణంలోనైనా చేతులెత్తేసే అవకాశం లేకపోలేదని, ధాన్యం అమ్ముకున్న ఈ మిల్లులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వస్తున్నాయి. ఇవే కాకుండా మరికొన్ని మిల్లుల్లో కూడా ప్రభుత్వ ధాన్యం మాయమైనట్లు చెపుతున్నారు. -
పత్తి రైతుల సమస్యలు పరిష్కరించండి
కేంద్రమంత్రికి టీ కాటన్ మిల్లర్స్, ట్రేడర్స్ అసోసియేషన్ వినతి సాక్షి, న్యూఢిల్లీ: పత్తి కొనుగోళ్లలో ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ కాటన్ మిల్లర్స్, ట్రేడ ర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కేంద్ర చేనేత శాఖ మంత్రి సంతోష్ గంగ్వర్‌కి వినతిపత్రాన్ని సమర్పించారు. గుర్గావ్లో శనివారం నిర్వహించిన ఎన్ఐసీఏ(నార్త్ ఇండియా కాటన్ కార్పొరేషన్) సదస్సులో పాల్గొన్న కేంద్ర మంత్రిని అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం కలసింది. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)ద్వారా పత్తి సేకరణకు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, మద్దతు ధర చెల్లించడం వంటి అంశాల్లోని లోపాలను వారు మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు కేంద్రమంత్రులు రాధామోహన్‌సింగ్, బండారు దత్తాత్రేయ, నిర్మలా సీతారామన్ నేతృత్వంలో ఈనెల 11న ఓ సమావేశాన్ని నిర్వహించామని, మరోసారి ఈనెల 17 సమావేశం కానున్నామని మంత్రి చెప్పినట్టు ప్రతినిధి బృందం వెల్లడించింది.