కేంద్రమంత్రికి టీ కాటన్ మిల్లర్స్, ట్రేడర్స్ అసోసియేషన్ వినతి
సాక్షి, న్యూఢిల్లీ: పత్తి కొనుగోళ్లలో ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ కాటన్ మిల్లర్స్, ట్రేడ ర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కేంద్ర చేనేత శాఖ మంత్రి సంతోష్ గంగ్వర్‌కి వినతిపత్రాన్ని సమర్పించారు. గుర్గావ్‌లో శనివారం నిర్వహించిన ఎన్‌ఐసీఏ(నార్త్ ఇండియా కాటన్ కార్పొరేషన్) సదస్సులో పాల్గొన్న కేంద్ర మంత్రిని అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం కలసింది. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)ద్వారా పత్తి సేకరణకు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, మద్దతు ధర చెల్లించడం వంటి అంశాల్లోని లోపాలను వారు మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు కేంద్రమంత్రులు రాధామోహన్‌సింగ్, బండారు దత్తాత్రేయ, నిర్మలా సీతారామన్ నేతృత్వంలో ఈనెల 11న ఓ సమావేశాన్ని నిర్వహించామని, మరోసారి ఈనెల 17 సమావేశం కానున్నామని మంత్రి చెప్పినట్టు ప్రతినిధి బృందం వెల్లడించింది.