రూ.115 కోట్లు నొక్కేశారు ! | gole mall | Sakshi
Sakshi News home page

రూ.115 కోట్లు నొక్కేశారు !

Published Thu, Sep 29 2016 10:58 PM | Last Updated on Mon, Sep 4 2017 3:31 PM

రూ.115 కోట్లు నొక్కేశారు !

రూ.115 కోట్లు నొక్కేశారు !

  • గన్నీల పేరిట రైస్‌ మిల్లర్ల చిలక్కొట్టుడు
  • 2009 నుంచి పౌరసరఫరాల శాఖకు 2.84 కోట్ల గన్నీ బ్యాగుల బాకీ
  • మిల్లర్లకు తొత్తులుగా మారిన పౌరసరఫరాల శాఖ అధికారులు
  • ముక్కుపిండి వసూలు చేయాలని కమిషనర్‌ నిర్ణయం
  • రేపు హైదరాబాద్‌లో డీఎం, డీఎస్‌వోలతో సీవీ ఆనంద్‌ సమీక్ష
  • సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌ : సకాలంలో కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎమ్మార్‌) అందించకుండా ప్రభుత్వాన్ని తిప్పలు పెట్టిన రైస్‌ మిల్లర్లు గన్నీ సంచుల విషయంలోనూ కక్కుర్తి ప్రదర్శిస్తున్నారు. గన్నీ బ్యాగే కదా!...అదేం భాగ్యం అనుకుంటున్నారా?....ఒకటి, రెండు బ్యాగులు కాదు సుమా...ఏకంగా 2.84 కోట్లకుపైగా గన్నీ బ్యాగులను మిల్లర్లు నొక్కేశారు. వీటి ఖరీదెంతో తెలుసా....రూ.115 కోట్లు. అక్షరాల నూటా పదిహేను కోట్ల రూపాయలు. 2009 నుంచి నేటి వరకు దాదాపు ఏడేళ్లుగా పౌరసరఫరాల సంస్థకు గన్నీలను అప్పగించకుండా తమ జేబులో వేసుకుంటున్నారు. ప్రతి ఏటా సీజన్‌ అయిపోయిన వెంటనే గన్నీ బ్యాగులను స్వాధీనపర్చుకోవాల్సిన పౌరసరఫరాల సంస్థ అధికారులు ఆ విషయాన్నే మర్చిపోయారు. మిల్లర్లకు తొత్తులుగా మారారు. వాళ్లిచ్చే అమ్యామ్యాలకు కక్కుర్తి పడ్డారు. అంతిమంగా ప్రభుత్వానికి కోట్లాది రూపాయలు నష్టం చేకూర్చే పనికి ఒడిగట్టారు. అడుగడుగునా అవినీతి, అక్రమాల్లో కూరుకుపోయిన రాష్ట్ర పౌరసరఫరాల శాఖను ప్రక్షాళన చేసేందుకు  కంకణం కట్టుకున్న ఆ శాఖ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ దృష్టికి గన్నీల వ్యవహారం వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా మిల్లర్లు ఎన్నీ గన్నీ సంచులు బకాయి పడ్డారు? వాటి విలువ ఎంత? అని లెక్కలేసే పనిలో పడ్డారు. అధికారవర్గాల సమాచారం ప్రకారం...రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5.45 కోట్ల గన్నీ సంచులు మిల్లర్లు పౌరసరఫరాల సంస్థకు బకాయిపడ్డట్లు తేలింది. వాటి విలువ ఏకంగా రూ.203 కోట్లుగా నిర్దారించారు. అందులో ఒక్క కరీంనగర్‌ జిల్లాలోనే రూ.115.99 కోట్లు ఉండటం గమనార్హం.
     
    అసలేం జరిగిందంటే..
    పౌరసరఫరాల శాఖ అధికారులు ప్రతి సీజన్‌లో రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించిన అనంతరం వాటిని కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌(సీఎంఆర్‌)గా మార్చేందుకు మిల్లర్లకు అప్పగిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఖరీఫ్, రబీసహా ప్రతి సీజన్‌లో మిల్లర్లు అడిగనన్ని గన్నీ బ్యాగులను అందిస్తున్నారు. వాస్తవానికి ఏ మిల్లర్‌కు ఎంత ధాన్యం అప్పగిస్తామో...అందుకు అవసరమైన గన్నీ బ్యాగులను మాత్రమే సరఫరా చేయాలి. అందులో సగం కొత్తవి, సగం పాతవి అందజేయాలి. కానీ జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులకు మిల్లర్లంటే వల్లమాలిన ప్రేమ. మిల్లర్లు ఎన్ని గన్నీ బ్యాగులు అడిగితే అన్ని ఇచ్చేస్తున్నారు. పైగా ఇష్టమైన మిల్లర్లు కదా! అని దాదాపు ప్రతి ఏటా ఎక్కువ శాతం కొత్త గన్నీ బ్యాగులే సరఫరా చేస్తున్నారు. 2009 నుంచి ఇప్పటి వరకు జిల్లాలోని మిల్లర్లకు 2,84,78,892 గన్నీ బ్యాగులను సరఫరా చేసినట్లు లెక్క తేలింది. వీటిలో 1,52,79,139 గన్నీ బ్యాగులు కొత్తవే. ఒక్కో కొత్త గన్నీ బ్యాగు ధర రూ.50 లు. ఈ లెక్కన వీటి ఖరీదు రూ.76.40 కోట్లు. ఇవిపోగా మిగిలిన 1,31,99,753 గన్నీ బ్యాగులు ఒకసారి వాడినవి. వీటికి సంబంధించి ఒక్కో బ్యాగు ఖరీదు రూ.30లుగా లెక్కకట్టిన అధికారులు రూ.39.60 కోట్లుగా నిర్దారించారు. పాత, కొత్త గన్నీ బ్యాగుల ఖరీదు రూ.115.99 కోట్లుగా లెక్కించారు. ఇంత పెద్ద మొత్తంలో గన్నీ బ్యాగులు బకాయి పడినా పౌరసరఫరాల సంస్థ అధికారులు ఇప్పటి వరకు ఈ అంశాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదనేది ప్రశ్నార్ధకంగా మారింది. రైస్‌ మిల్లర్లంతా అంటకాగుతూ వారిచ్చే అమ్యామ్యాలకు ఆశపడి సంస్థకు రావాల్సిన బకాయిలను వసూలు చేయకుండా మిన్నుకుండిపోయారని తెలుస్తోంది. ఈ విషయాన్ని గమనించిన పౌరసరఫరాల సంస్థ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ శనివారం హైదరాబాద్‌లో జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్లు, డీఎస్‌వోలతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నారు. గన్నీ బ్యాగుల విషయంలో అధికారుల నిర్లక్ష్యాన్ని ఎండగట్టడంతోపాటు ఆ మొత్తాన్ని ఏ విధంగా వసూలు చేయాలనే అంశంపై దిశానిర్దేశం చేయనున్నట్లు తెలిసింది.
     
    ముగిసిన సీఎమ్మార్‌ గడువు 
    రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ రైస్‌ మిల్లర్లకు ఇచ్చిన కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌(సీఎమ్మార్‌) గడువు ముగిసింది. జిల్లాలోని మిల్లర్లకు 2015–16 సంవత్సరానికి గాను  604679 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సంస్థ అప్పగించింది. వాటిని మరగా ఆడించి 407297 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని(67 శాతం) సంస్థకు  అందించాల్సి ఉంది. అయితే సీఎవ్మూర్‌ అప్పగించేందుకు నెలల తరబడి మొండికేసిన మిల్లర్లు సీవీ ఆనంద్‌ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టాక కొరడా ఝుళిపించారు. దీంతో ఇప్పటి వరకు 405350 మెట్రిక్‌ టన్నుల (99.52 శాతం) బియ్యాన్ని పౌరసరఫరాల సంస్థకు అప్పగించారు. ఇంకా 1947 మెట్రిక్‌ టన్నుల బియ్యం మిల్లర్ల నుంచి రావాల్సి ఉంది. మిల్లర్లకు ఇచ్చిన గడువు నేటితో ముగుస్తున్నందున కమిషనర్‌ సకాలంలో సీఎమ్మార్‌ అప్పగించిన వారి విషయంలో ఏం చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement