సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: రాష్ట్రంలో ‘రైస్ మాఫియా’మరింతగా రెచ్చిపోతోంది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి (సీఎంఆర్) బియ్యాన్ని భారత ఆహా ర సంస్థ (ఎఫ్‌సీఐ)కి పంపాల్సిన మిల్లర్లు.. అడ్డ గోలుగా అక్రమాలకు పాల్పడుతున్నారు. రైతుల నుంచి వచ్చిన నాణ్యమైన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి, ఆ మంచి బియ్యాన్ని అధిక ధరలకు బయట అమ్ముకుంటున్నారు.
ఆ స్థానంలో బయటకొన్న నాణ్యతలేని ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తూ, రేషన్ బి య్యాన్ని రీసైక్లింగ్ చేస్తూ.. ఎఫ్‌సీఐకి అంటగడుతున్నారు. సివిల్ సప్లైస్, మార్కెటింగ్ అధికారులు, సిబ్బందికి ముడుపులు ఇస్తూ దందా నడిపిస్తున్నారు. కర్ణాటక, ఇతర రాష్ట్రాల నుంచి ఇటీవల పోటెత్తిన ధాన్యం లారీలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. చెక్‌పోస్టులున్నా రవాణా కొనసాగుతుండటాన్ని బట్టి ఆయా శాఖల అధికారుల సహకారమున్నట్టు స్పష్టమవుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
రాష్ట్రంలో సుమారు 2,200 రైస్ మిల్లులు ఉండగా.. అందులో వెయ్యి వరకు పారాబాయిల్డ్ మిల్లులు. 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ ఏడాది జనవరి 24నాటికి రాష్ట్ర ప్రభుత్వం 69.08 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సీఎంఆర్ కోసం మిల్లర్లకు అప్పగించింది. దీనికి సంబంధించి మిల్లర్లు 46.28 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎఫ్‌సీఐకి అప్పగించాలి.
కానీ ఇప్పటివరకు 65శాతం మేర కూడా బియ్యాన్ని ఇవ్వలేదని తెలుస్తోంది. ప్రధానంగా ఉమ్మడి నల్లగొండ, వరంగల్‌తోపాటు పాలమూ రులో ఈ పరిస్థితి ఉంది. మిల్లర్లకు చేసిన కేటాయింపులకు, సీఎంఆర్ లెక్కలకు ప్రతి సీజన్‌లోనూ తేడాలు ఉండటం ఈ అక్రమాలకు నిదర్శనమని ఆరోపణలు వస్తున్నాయి.
క్వింటాల్ రూ.1,400కే కొని..
రాష్ట్రంలోని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో క్విం టాల్ ధాన్యం ఏ–గ్రేడ్ రకానికి రూ.1,960, సాధారణ రకానికి రూ.1,940 మద్దతు ధర పలుకుతోం ది. అదే కర్ణాటకలో క్వింటాల్‌కు రూ.1,400లే పలుకుతోంది. దీంతో కొందరు మిల్లర్లు ముఠాగా ఏర్పడ్డారు. నకిలీ వేబిల్లులతో కర్ణాటక నుంచి నాసిరకం ధాన్యాన్ని తీసుకొచ్చి, సీఎంఆర్ కింద ఎఫ్‌సీఐకి అప్పగిస్తున్నారు. మరోవైపు రేషన్ డీలర్లు, వినియోగదారుల నుంచి రేషన్ బియ్యం కొని రీసైక్లింగ్ చేసి సీఎంఆర్ కోటాకు మళ్లిస్తున్నారు.
చెక్‌పోస్టులను తప్పించుకుని..
కర్ణాటక సరిహద్దుల్లో తెలంగాణ పరిధిలోని నారాయణపేట జిల్లాలో, గద్వాల జిల్లాలో ఏడు చొప్పున చెక్‌పోస్టులు ఉన్నాయి. పలు చెక్‌పోస్టుల వద్ద రాత్రివేళ నిఘా అంతంత మాత్రంగానే ఉంటోందని.. సిబ్బంది ఒక్కో ధాన్యం లారీకి రూ.2 వేలు చొప్పున తీసుకుని వదిలేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు ఈ చెక్‌పోస్టులే గాకుండా ఇతర దారుల ద్వారా కూడా ధాన్యం లారీలు తెలంగాణలోకి ప్రవేశిస్తున్నాయి.
ఎన్ని లారీలు పట్టుబడ్డా..
♦ఈ నెల 11న కర్ణాటక నుంచి హైదరాబాద్ లోని మిల్లులకు ధాన్యం తరలిస్తున్న 2 లారీల ను కాన్కుర్తిలోని చెక్‌పోస్టు వద్ద పట్టుకున్నారు.
♦ఈ నెల 15న నారాయణపేట జిల్లా మక్తల్‌లో ధాన్యం లోడ్‌తో వస్తున్న 16 లారీలను పోలీసులు పట్టుకున్నారు. కర్ణాటకలోని సిర్పూర్, యాద్గిర్, మాన్విల నుంచి ఎలాంటి బిల్లులు లే కుండా హైదరాబాద్, నల్లగొండ జిల్లాల్లోని మి ల్లులకు అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు.
♦ఈ నెల 19న కర్ణాటకలోని మాన్వి నుంచి మిర్యాలగూడ, హైదరాబాద్‌లకు ధాన్యం లోడ్‌తో వస్తున్న నాలుగు లారీలను గద్వాల జిల్లా నందిన్నె చెక్‌పోస్టు వద్ద.. మరో రెండు లారీలను ఎర్రవెల్లి చౌరస్తా వద్ద పట్టుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment