సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మిల్లర్లు రాష్ట్ర ప్రభుత్వానికి రూ. వేల కోట్లలో బకాయి పడ్డారు. కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కోసం ఇచ్చిన ధాన్యాన్ని సకాలంలో మిల్లింగ్ చేసి ఎఫ్‌సీఐకి ఇవ్వకుండా సొంత ప్రయోజనాలు చూసుకుంటున్నారు. దీంతో 2019 యాసంగి నుంచి 2022 యాసంగి వరకు పౌరసరఫరాల సంస్థకు రూ. 2,072 కోట్ల విలువైన 5.83 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం బకాయిపడ్డారు.
ఈ మొత్తం బియ్యాన్ని లేదా అందుకు సమానమైన నగదును 25 శాతం జరిమానాతో డిఫాల్ట్ అయిన మిల్లుల నుంచి వసూలు చేయాల్సి ఉంది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ ఎక్స్‌అఫీషియో కార్యదర్శి హోదాలో కమిషనర్ అనిల్ కుమార్ ఇప్పటివరకు నాలుగు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్లు ఆయా మిల్లులకు రికవరీ నోటీసులు జారీ చేస్తున్నారు.
ఆ బియ్యం విలువే రూ. 1,630 కోట్లు
2021–22 యాసంగికి సంబంధించి 2,37,310 మెట్రిక్ టన్నుల బియాన్ని ఎఫ్‌సీఐకి అప్పగించాల్సి ఉండగా ఈ గడువు గత మే నెలాఖరుతో ముగిసింది. దీంతో ఈ బియ్యాన్ని 25 శాతం పెనాల్టితో రికవరీ చేయాలని లేదంటే బియ్యం విలువ రూ. 842.09 కోట్లను 25 శాతం పెనాల్టితో వసూలు చేయాలని పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్లు ఉత్తర్వులు జారీ చేశారు.
అలాగే గత నెల 23న 2021–22 వానాకాలానికి సంబంధించిన 2.22 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని 25 శాతం పెనాల్టితో 494 మిల్లుల నుంచి రికవరీ చేసేందుకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ బియ్యం విలువ రూ. 787.67 కోట్లు. ఈ రెండు సీజన్‌లలోనే రూ. 1,630 కోట్ల వరకు రావాల్సి ఉంది.
2019 యాసంగి బకాయి 48,762 మెట్రిక్ టన్నులు
ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే 2019 యాసంగి సీజన్‌కు సంబంధించి 118 మిల్లుల నుంచి సీఎంఆర్ కింద లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం రావాల్సి ఉంది. దీనికి సంబంధించి ఈ ఏడాది మార్చిలోనే పెనాల్టీతో 125 శాతం రికవరీ చేయాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే ఈ మిల్లులు గడువులోగా బియ్యం ఇవ్వకపోవడంతో నెలకోసారి గడువును పెంచుతూ వచ్చారు. ఎట్టకేలకు ఈ నెలలో 14 మిల్లులు 125 శాతం బియ్యం రికవరీ చేశాయి.
మరో 89 మిల్లులు 100 శాతం రికవరీ కింద సర్కారుకు సీఎంఆర్ అప్పగించాయి. ఇంకా 15 మిల్లులు ఎలాంటి రికవరీ చేయలేదు. దీంతో ఇంకా 48,762 మెట్రిక్ టన్నుల బియ్యం ఆయా మిల్లుల నుంచి రావాల్సి ఉంది. ఇప్పటికీ ఈ మిల్లులకు పెండింగ్ సీఎంఆర్ రికవరీ చేసుకొనే అవకాశం ఇస్తూ ఈ నెల 19న ఉత్తర్వులు జారీ చేశారు.
అలాగే 2020–21 సంవత్సరం యాసంగికి సంబంధించి మరో 73 మిల్లుల నుంచి 75,878 మెట్రిక్ టన్నుల బియ్యం రావాల్సి ఉండగా ఈ మొత్తాన్ని కూడా పెనాల్టితో 125 శాతం రికవరీ చేయాలని సైతం ఈ నెల 19నే ఉత్తర్వులు జారీ చేశారు. ఈ రెండు సంవత్సరాలకు సంబంధించిన బియ్యం 1.25 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, ఈ బియ్యం విలువనే రూ. 442 కోట్లు.
25 శాతం నగదు... 100 శాతం బియ్యం రికవరీ
డిఫాల్ట్ మిల్లర్ల నుంచి 125 శాతం బియ్యాన్ని రికవరీ చేసే ప్రక్రియలో ముందుగా 25 శాతం బియ్యాన్ని లేదా అందుకు సమానమైన మొత్తాన్ని పెనాల్టీ రూపంలో ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుంది. ఇందులో 5 శాతం ఈ ఉత్తర్వులు వెలువడిన వెంటనే ఇవ్వాల్సి ఉంటుంది.
అలా చేస్తేనే తరువాత సీజన్‌కు మళ్లీ సీఎంఆర్ ఇచ్చేందుకు వీలు కలుగుతుంది. అయితే 25 శాతం పెనాల్టిలో ఐదు శాతమే ఇప్పటికిప్పుడు ఇవ్వడం, మిగతా పెనాల్టీ మొత్తాన్ని 4 వాయిదాల్లో చెల్లించే వెసులుబాటు ఉండటంతో మిల్లర్లు ఇదే అదనుగా వ్యాపారాన్ని య«థేచ్ఛగా సాగిస్తున్నారనే విమర్శలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment