సాక్షి, హైదరాబాద్: అధికారులు ఎన్నిసార్లు హెచ్చరించినా రాష్ట్రంలో మిల్లర్ల తీరు మారడం లేదని తెలుస్తోంది. కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)ను ఎఫ్‌సీఐకి సకాలంలో అప్పగించాల్సిన మిల్లర్లు ఎన్నిసార్లు గడువు పెంచినా లక్ష్యాన్ని అందుకోవడం లేదు. 2020–21 యాసంగికి సంబంధించి 1.36 లక్షల మెట్రిక్ టన్నుల సీఎంఆర్ అప్పగింత గడువు ముగియడంతో ఆ మొత్తాన్ని స్టేట్ పూల్ కింద రాష్ట్ర అవసరాలకు మళ్లించారు.
2021–22 వానాకాలం సీఎంఆర్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్రం ఈనెలాఖరు వరకు గడువు ఇచ్చినప్పటికీ అప్పగింత ఇంకా పూర్తికాలేదు. వానాకాలం సీఎంఆర్ కింద 47.04 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మిల్లర్లు పౌరసరఫరాల సంస్థకు అప్పగించాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు 36 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే లెవీ రూపంలో ఎఫ్‌సీఐకి చేరింది. అంటే ఇంకా 11 లక్షల మెట్రిక్ టన్నులు రావలసి ఉంది.
నెల రోజులలో 9 ఎల్‌ఎంటీ
సీఎంఆర్ అప్పగింత విషయంలో జాప్యంపై గత నెలలో రాష్ట్ర ప్రభుత్వం మిల్లర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. గత నెల 24వ తేదీ నాటికి 27 లక్షల మెట్రిక్ టన్నుల సీఎంఆర్ అప్పగించారు. లక్ష్యాన్ని పూర్తి చేయాలని అప్పట్లో మంత్రి గంగుల అధికారులతో సమావేశం అయి గట్టిగా చెప్పడంతో, కష్టంమీద నెలరోజుల్లో 9 లక్షల మెట్రిక్ టన్నుల సీఎంఆర్‌ను అప్పగించారు. ఇక మిగిలింది 11 లక్షల మెట్రిక్ టన్నులు అయినా.. ఇంత బియ్యం మిల్లింగ్ చేసి అప్పగించడం అసాధ్యమేనని అర్థమవుతోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం మరో నెల గడువు కోసం కేంద్రానికి విజ్ఞప్తి చేయడమో.. లేక స్టేట్ పూల్ కింద సొంతానికి వాడుకోవడమో చేయాల్సి ఉంటుందని చెపుతున్నారు.
ముందుకు కదలని గత యాసంగి సీఎంఆర్
2021–22 యాసంగికి సంబంధించిన సీఎంఆర్ కూడా ముందుకు సాగడం లేదని అధికారవర్గాలు చెపుతున్నాయి. యాసంగిలో 50.39 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి మిల్లులకు పంపగా, సీఎంఆర్ కింద 33.93 లక్షల మెట్రిక్ టన్నులను ఎఫ్‌సీఐకి ఇవ్వాల్సి ఉంది. అయితే గతనెల 24వ తేదీ నాటికి కేవలం 9.18 లక్షల మెట్రిక్ టన్నులను మాత్రమే సీఎంఆర్ కింద ఇచ్చారు.
అప్పటి నుంచి ఈ నెలరోజుల్లో కేవలం 4 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే అదనంగా మిల్లింగ్ చేసి పౌరసరఫరాల సంస్థ ద్వారా ఎఫ్‌సీఐకి అప్పగించారు. ఇంకా 20.06 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అప్పగించాల్సి ఉంది. దీనికోసం మరో మూడు నెలల వరకు గడువు తీసుకునే అవకాశం ఉందని అధికారులు చెపుతున్నారు.
4,183 కొనుగోలు కేంద్రాలు మూసివేత
2022–23 వానాకాలం సీజన్‌కు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లు ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 7,007 కొనుగోలు కేంద్రాలను తెరిచి రూ. 11,542 కోట్ల విలువైన 56.06 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఈ నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లు పూర్తయిన 4,183 కేంద్రాలను మూసివేశారు. రాష్ట్రంలో 9.95 లక్షల మంది రైతులకు సంబంధించిన ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు పౌరసరఫరాల సంస్థ అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment