మృతదేహాల వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు, కోదాడ : రంగనాయకమ్మ (ఫైల్)
మోత్కూరు (తుంగతుర్తి) : మండల కేంద్రంలోని అంబేద్కర్‌నగర్‌కు చెందిన ఎడ్లబండి కార్మికుడు గాలి నర్సయ్య(28) వడదెబ్బతో సోమవారం తెల్లవారుజామున మృతిచెందాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నర్సయ్య కుటుంబాన్ని సాకేందుకు.. ఎడ్ల బండే జీవనాధారంగా బతుకుతున్నాడు. అతనికి తల్లిదండ్రులు, భార్య, ముగ్గురు పిల్లలను ఎడ్లబండి తోలగా వచ్చిన కిరాయితోనే.. సాకుతున్నాడు. వారంరోజులుగా ఎండలు తీవ్రం కావడంతో ఎడ్ల బండిద్వారా ఇసుక తరలిస్తూ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఆదివారం సాయంత్రం నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించి మృతిచెందాడు. నర్సయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలన్ని అంబేద్కర్‌యువజన సంఘం మండల కన్వీనర్ గుంటిదేవ కోరాడు.
నకిరేకల్‌లో.. కూలీ
నకిరేకల్ : వడదెబ్బతో నకిరేకల్ పట్టణంలోని మార్కెట్ రోడ్డుకు చెందిన సరికొండ జానయ్య(40) సోమవారం మృతిచెందాడు. జానయ్య రోజువారిగా కూలిపని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో వడదెబ్బకు గురై సోమవారం మృతి చెందాడు. మృతదేహాన్ని సర్పంచ్ పన్నాల రంగమ్మ రాఘవరెడ్డి సందర్శించి నివాళులర్పించారు. మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. వారివెంట వార్డు సభ్యుడు ఏశబోయిన కిరణ్ ఉన్నారు.
లక్ష్మిదేవికాల్వలో.. సెంట్రింగ్ కార్మికుడు
అడ్డగూడూరు : మండల పరిధిలోని లక్ష్మిదేవికాల్వ గ్రామానికి చెందిన చింత సైదులు(34) వడదెబ్బకు గురై మృతి చెందాడు. సైదులు సెంట్రింగ్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఎండ తీవ్రతకు రెండు రోజుల నుంచి అస్వస్థతకు గురయ్యాడు. చికిత్స కోసం సోమవారం తిరుమలగిరి తరలిస్తుండగా.. మార్గమధ్యంలోనే మృతిచెందాడు. సైదులు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.
గొల్లగూడెంలో వృద్ధురాలు..
బీబీనగర్ : మండలంలోని గొల్లగూడెం గ్రామంలో వడదెబ్బకు సోమవారం ఓ వృద్ధురాలు మృతి చెందింది. గ్రామానికి చెందిన గుండెబోయిన యాదమ్మ(65) గ్రామ శివారులోని నర్సరీలో పనిచేసేందుకు వెళ్లగా మధ్యాహ్న సమయంలో ఎండవేడిమికి తట్టుకోలేక అక్కడికక్కడే మృతి మృతిచెందింది.
కోదాడలో స్వాతంత్య్ర సమరయోధురాలు..
కోదాడఅర్బన్ : పట్టణంలోని 8వ వార్డు గోపిరెడ్డినగర్‌కు చెం దిన స్వాతంత్య్ర సమరయోధురాలు పోనుగోటి రంగనా యకమ్మ(95) వడదెబ్బతో సోమవారం మృతిచెందింది. ఆమె మృతదేహాన్ని పలువురు సందర్శించి నివాళులర్పించారు.
రాజేంద్రనగర్‌లో వ్యవసాయ కూలీ
త్రిపురారం : మండలంలోని రాజేంద్రనగర్ గ్రామానికి చెందిన ఇస్లావత్ కృష్ణ(32) సోమవారం వడదెబ్బతో మృత్యువాత పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఇస్లావత్ కృష్ణ వ్యవసాయ కూలీ. గత రెండు రోజులుగా వీస్తున్న వడగాల్పులతో కృష్ణ అస్వస్థతకు గురయ్యాడు. ఇంటి వద్ద చికిత్స పొం దుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి బార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment