ప్రచండ భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. మార్చిలోనే విరుచుకుపడుతూ ప్రజలను బెంబేలెత్తిస్తున్నాడు. అంతకంతకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వేడి సెగలతో జిల్లా వాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఏటా ఏప్రిల్ నెలాఖరులో అసాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యేవి. కానీ.. వాతావరణ సమతుల్యత లోపించిన కారణంగా మార్చి నెలాఖరులోనే సూర్యుడు మండిపోతున్నాడు.
గత నాలుగేళ్లతో పోల్చితే ఈ ఏడాది ఉష్ణోగ్రతలు నెల రోజుల ముందే అమాంతంగా పెరిగిపోవడంతో జనం ఆందోళన చెందుతున్నారు. ఫిబ్రవరి ఆరంభంలో 31 డిగ్రీలుగా నమోదైన ఉష్ణోగ్రత.. ఆ నెల చివరికే 36 డిగ్రీలుగా నమోదైంది. అదే వేగంతో పెరుగుతూ మార్చి నెల చివరి వారంలో 41 డిగ్రీలకు చేరుకుంది. దీనికి తోడు వడగాల్పులు అధికమయ్యాయి. పగలంతా ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతూ కూలర్ల ముందే సేదతీరుతున్నారు.
సాక్షి – కరీంనగర్
ఉదయం 10 గంటలకే...
వారం రోజులుగా ఉదయం 10 గంటలకే ఎండలు మండుతుండడంతో జిల్లా వాసులు బయటకు రావాలంటేనే అల్లాడిపోతున్నారు. ఒకవేళ వచ్చినా 11 గంటలకల్లా నీడను ఆశ్రయిస్తున్నారు. దీంతో 12 కొట్టే సరికి రోడ్లన్నీ బోసిపోతున్నాయి. ఎప్పుడూ రద్దీగా ఉండే టవర్‌సర్కిల్, బస్టాండ్ రోడ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. వారం రోజుల్లోనే ఉష్ణోగ్రతల్లో భారీ మార్పులు చోటు చేసుకోవడంతో ఇబ్బంది తలెత్తింది. ఏప్రిల్ ఆరంభం కాకముందే పరిస్థితి ఇలా ఉంటే.. ఇక సెగలు కక్కే ‘మే’ నాటికి పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.
వడదెబ్బ తగలకుండా..
చెమటపట్టకపోవడం.. శరీర ఉష్ణోగ్రతలు పెరగడం.. వణుకు పుట్టడం.. ఫిట్స్ లేదా పాక్షికంగా అపస్మారక స్థితి రావడం వడదెబ్బ లక్షణాలు. వడదెబ్బ తగలకుండా ఉండాలంటే తీవ్ర ఉష్ణోగ్రతలు ఉండే సమయంలో ఎక్కువగా ఎండలో తిరగద్దు. రోడ్ల వెంట విక్రయించే చల్లని రంగు పానీయాలు, కలుషిత ఆహారానికి దూరంగా ఉండాలి. మద్యం, మాంసం తగ్గించాలి. నీరు, పళ్ల రసాలు, కొబ్బరినీళ్లు, మజ్జిగ ఎక్కువగా తీసుకోవాలి. ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగు వాడడం, టోపీ ధరించడం మంచిది.
నిర్లక్ష్యం చేయవద్దు..
వడదెబ్బ తగిలిన వ్యక్తిని వీలైనంత త్వరగా చల్లని గాలి తగిలే ప్రదేశానికి చేర్చాలి. ఉప్పు కలిపిన మజ్జిగ, గ్లూకోజు ద్రావణం లేదా ఓఆర్‌ఎస్ తాగించాలి. పిల్లలు, గర్భిణులు, వృద్ధులు మరింత జాగ్రత్త తీసుకోవాలి. వడదెబ్బ తగిలి అపస్మారక స్థితిలోకి వెళ్లిన వ్యక్తికి బీపీ హెచ్చుతగ్గుల వల్ల కార్డియాక్ అరెస్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వెంటనే ఆసుపత్రికి తరలించాలి.
– డాక్టర్ కొండపాక కిరణ్, కార్డియాలజిస్టు
Comments
Please login to add a commentAdd a comment