![Be Careful With Heat Stroke: Symptoms And Treatment In Telugu - Sakshi](/styles/webp/s3/article_images/2022/04/25/summer3.jpg.webp?itok=-PZ0dgq9)
సాక్షి, ఖమ్మం: ఎండలు తీవ్రంగా మండుతుండటంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఉదయం 10 గంటలకే ఎండ తీవ్రత పెరిగిపోతుండటంతో బయటకు వెళ్తే ముచ్చెమటలు పడుతున్నాయి. ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతుండటంతో చాలామంది వడదెబ్బ బారిన పడుతున్నారు. ఇక వచ్చే మే నెలలో మరింతగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉండటంతో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది.
రోజురోజుకూ పెరుగుతున్న వేడి నేపథ్యంలో ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. పెరగనున్న ఉష్ణోగ్రతలతో వడదెబ్బ బారినపడి చిన్నాపెద్ద అల్లాడిపోయే అవకాశాలు ఉన్న నేపథ్యంలో వడదెబ్బ లక్షణాలు, నివారణ మార్గాల గురించి తెలుసుకుందాం.
లక్షణాలు ఇవీ..
కళ్లు తిరగడం, శరీరంలో నీటి శాతం కోల్పోవడం, శరీర కండరాలు పట్టుకోవడం, కాళ్లు వాపులు రావడం, తీవ్ర జ్వరం వంటివి కనిపిస్తాయి. అధిక చెమట పట్టడం, తల తిరిగి పడిపోవడం వంటివి జరుగుతుంటాయి. గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండ సమస్యలు కలిగి ఉన్నవారి శరీరం సూర్యరశ్మి వలన త్వరగా డీహైడ్రేషన్‌కు గురై వడదెబ్బ తీవ్రత అధికంగా ఉంటుంది.
ప్రాథమిక చికిత్స..
►వడదెబ్బ తగిలిన వ్యక్తి వెంటనే నీడకు తీసుకెళ్లాలి. చల్లని నీరు, ఐస్‌తో ఒళ్లంతా తుడవాలి.
►వదులుగా ఉన్న నూలు దుస్తులు వేయాలి.
►చల్లని గాలి తగిలేలా చూడాలి.
►ఉప్పు కలిపిన మజ్జిగ లేదా కొబ్బరి బొండాం నీరు, చిటికెడు ఉప్పు, చక్కర కలిపిన నిమ్మరసం, గ్లూకోజు ద్రావణం లేదా ఓరల్ రీ హైడ్రేషన్ ద్రావణం(ఓఆర్‌ఎస్) తాగించవచ్చు.
►వడదెబ్బ తగిలి అపస్మారక స్థితిలోకి వెళ్తే దగ్గరలోని ఆస్పత్రికి తరలించాలి.
జాగ్రత్తలు..
►ఎండలో వెళ్లేటప్పుడు కళ్లకు సన్ గ్లాసెస్, తలకు టోపి వంటివి ధరించాలి.
►ఉదయం, సాయంత్రం సమయాల్లో మాత్రమే బయటకు వెళ్లేలా ప్లాన్ చేసుకోవాలి.
►హారంలో ఎక్కువగా ద్రవ పదార్థాలు ఉండేలా చూసుకోవాలి.
►వదులైన నూలు దుస్తులు ధరించాలి.
►వేసవి కాలంలో డీహైడ్రేషన్ అధికంగా ఉంటుంది. రోజుకు కనీసం 15 గ్లాసుల నీరు తాగాలి. భోజనం మితంగా చేయాలి.
►మాంసామారం తగ్గించి, తాజా కూరగాయల్ని ఎక్కువగా భోజనంలో తీసుకోవాలి.
►నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలను ఆహారంగా తీసుకోవాలి. పుచ్చకాయలు, కీర, తాటి ముంజలు, బీర పొట్టు వంటి వాటిలో నీటి శాతం పుష్కలంగా ఉంటుంది. వీటి ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. దీంతో కడుపు నిండినట్లుగా ఉండి డైట్ కంట్రోల్ అవుతుంది.
►వేసవిలో ఆకలి తక్కువగా, దాహం ఎక్కువగా ఉంటుంది. సరైన డైట్ పాటించాలి. నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు తీసుకోవాలి.
చేయకూడని పనులు..
►మండు వేసవిలో తీవ్ర ఉష్ణోగ్రత సమయంలో ఎక్కువగా తిరగరాదు.
►రోడ్లపై చల్లగా ఉండే రంగు పానీయాలు తాగొద్దు.
►రోడ్లపై విక్రయించే కలుషిత ఆహారం తినకూడదు. ఇంట్లో వండుకున్నవే తినాలి.
►శీతల పానీయాలు అధికంగా షుగర్ వేసిన జ్యూస్‌లు తీసుకుంటే కొత్త సమస్యలు ఉత్పన్నమవుతాయి.
Comments
Please login to add a commentAdd a comment