వడగాడ్పులకు జనం బెంబేలు
మార్చి నుంచి ఇప్పటివరకు 90 మందికి వడదెబ్బ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. దీనికి తోడు వడగాడ్పులూ వీస్తుండటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఉదయం 8, 9 గంటల ప్రాంతంలోనే ఇంటినుంచి అడుగు బయట పెట్టలేని పరిస్థితి నెలకొంటోంది. తీవ్రమైన ఎండలు, వడగాడ్పుల కారణంగా.. మార్చి నుంచి ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా 90 మంది వడదెబ్బ బారినపడ్డారు. ఈ క్రమంలో రైతులు, భవన నిర్మాణ, ఇతర కార్మికులు, ఉపాధి కూలీలు, సాధారణ ప్రజలు సైతం ముందు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా గర్భిణులు, చిన్న పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఉదయం 11 గంటల తర్వాత నుంచి సాయంత్రం ఎండ తగ్గే వరకూ ఇంటి నుంచి బయటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు.
వడదెబ్బ తగిలితే..
బాధితుడిని వెంటనే చల్లని ప్రదేశానికి చేర్చి ప్రథమ చికిత్స చేయాలి. దుస్తులు వదులు చేసి చన్నీటితో శరీరాన్ని తడపాలి. ఈ విధంగా చేస్తే రక్తనాళాలు కుచుకుపోకుండా ఆపే అవకాశం ఉంటుంది. గజ్జల్లో, చంకల్లో, మెడ వద్ద ఐస్ ప్యాక్‌లు ఉంచాలి. ఈ చర్యలు తీసుకుంటూనే వీలైనంత త్వరగా ఆస్పత్రికి తరలించడం కోసం 108కు ఫోన్ చేయాలి.
72 ఆస్పత్రుల్లో ప్రత్యేక ఏర్పాట్లు
రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతుండటంతో ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలు చేపడుతోంది. వడదెబ్బ నివారణకు, అనుసరించాల్సిన విధానాలపై ఇప్పటికే వైద్య శాఖ మార్గదర్శకాలిచి్చంది. పీహెచ్‌సీ వైద్యులు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లో పనిచేసే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్‌వో), ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్‌లు క్షేత్ర స్థాయిలో ప్రజలకు ముందస్తు జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు.
అంగన్‌వాడీలకు ప్రభుత్వం ఓఆర్‌ఎస్ ప్యాకెట్ల పంపిణీ చేసింది. గర్భిణులు, ఆరేళ్లలోపు పిల్లలకు వీటిని పంపిణీ చేస్తున్నారు. గతేడాది అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదై, వడదెబ్బ కేసులు ఎక్కువగా నమోదైన 72 ఆస్పత్రులను వైద్య శాఖ గుర్తించింది. వీటిల్లో క్‌లైమేట్ రెసిలియంట్ వార్డుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటోంది. వడదెబ్బ బాధితులకు వైద్యం అందించడానికి వీలుగా ఈ వార్డుల్లో ప్రత్యేక వసతులను ఏర్పాటు చేస్తున్నారు.
మండిన సన్‌డే
సాక్షి, విశాఖపట్నం: ఇప్పటికే నిప్పులు కక్కుతున్న భానుడు ఆదివారం మరింత చెలరేగిపోయాడు. శనివారం నమోదైన 44.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు.. ఆదివారానికి 46 డిగ్రీలకు దూసుకెళ్లాయి. అత్యధికంగా మార్కాపురంలో 46 డిగ్రీలు, నంద్యాల జిల్లా చాగలమర్రి, నెల్లూరు జిల్లా కలిగిరిలో 45.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వైఎస్సార్ జిల్లా కాజీపేట, సింహాద్రిపురంలలో 45.6, బాపట్ల జిల్లా జనకవరం పంగులూరులో 45.5, కర్నూలు జిల్లా అలూరు, ప్రకాశం జిల్లా బోట్ల గూడూరులో 45.4, పల్నాడు జిల్లా విజయపురిలో 45.2 డిగ్రీల చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఇంకా అనేక చోట్ల 40–44 డిగ్రీలు రికార్డయ్యాయి. వీటి ప్రభావంతో 107 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 235 మండలాల్లో వడగాడ్పులు వీచాయి. అంటే రాష్ట్రంలో ఉన్న మొత్తం 670 మండలాలకు గాను సగానికి పైగా (342) మండలాల్లో వడగాడ్పులు వీచాయన్నమాట. దీంతో ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. అయితే సోమవారం నుంచి రెండు రోజుల పాటు ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుముఖం పట్టనున్నాయి. సోమవారం కేవలం రెండు మండలాల్లో (అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు, కూనవరం మండలాల్లో) తీవ్ర వడగాడ్పులు వీయనున్నాయి.
మరో 93 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశాలున్నాయని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. శ్రీకాకుళం జిల్లాలో 6 మండలాలు, విజయనగరం 20, పార్వతీపురం మన్యం 8, అల్లూరి 8, అనకాపల్లి 11, కాకినాడ 6, కోనసీమ 4, ఏలూరు 4, ఎన్టీఆర్ 2, గుంటూరు 7, పల్నాడు 2, తూర్పు గోదావరి జిల్లాలో 15 మండలాల్లోను వడగాడ్పులకు ఆస్కారం ఉందని తెలిపింది. అలాగే మంగళవారం అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలంలో తీవ్ర వడగాడ్పులు, మరో 27 మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని పేర్కొంది.
ద్రోణి ప్రభావంతో తేలికపాటి వర్షాలు
దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి కొమరిన్ ప్రాంతం వరకు విస్తరించి ఉన్న ద్రోణి సముద్రమట్టానికి 1.5 కి.మీల ఎత్తులో కొనసాగుతోంది. ఈ ద్రోణి ప్రస్తుతం అంతర్గత ఒడిశా నుంచి ఉత్తర తమిళనాడు వరకు ఛత్తీస్‌గఢ్, విదర్భ, మరఠ్వాడా, అంతర్గత కర్నాటక మీదుగా పయనిస్తోంది. దీని ప్రభావంతో సోమ, మంగళ, బుధవారాల్లో ఉత్తర కోస్తాంధ్రలోను ఈ నెల 10, 11 తేదీల్లో రాయలసీమలోను అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఆదివారం తెలిపింది. ద్రోణి ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో సోమ, మంగళవారాల్లో పొడి వాతావరణం నెలకొంటుందని పేర్కొంది. ద్రోణి కారణంగా రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టి వడగాడ్పుల నుంచి ఉపశమనం కలగనుంది.
కూల్‌డ్రింక్స్ తాగొద్దు
ఇంట్లో ఉన్నా, బయట పనిలో ఉన్నా తప్పనిసరిగా గంట గంటకూ ఉప్పు, చక్కెర కలిపిన ద్రవాలు తీసుకోవాలి. కూల్‌డ్రింక్స్‌కు బదులు కొబ్బరి నీళ్లు, మజ్జిగ, నిమ్మరసం తీసుకోవాలి. శరీరంలో నీటి శాతాన్ని పెంచే పుచ్చకాయ, కీరదోస తినాలి. రోజుకు కనీసం 4 లీటర్ల నీరైనా తాగాలి. ఎండలో పనిచేస్తున్న వారైతే గంటకు 10 నిమిషాల చొప్పున నీడ పట్టున చేరి విశ్రాంతి తీసుకోవాలి. గాలి బాగా ఆడేలా వదులు దుస్తులు, ముఖ్యంగా నూలు వస్త్రాలు, తలకు టోపీ, గొడుగు ధరించాలి. బాటిల్‌లో తాగు నీటిని వెంటబెట్టుకోవాలి. వాంతులు, విరేచనాల వంటి సమస్యలు తలెత్తితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
– డాక్టర్ నాగా చక్రవర్తి, అసిస్టెంట్ ప్రొఫెసర్, సిద్ధార్థ వైద్య కళాశాల, విజయవాడ
Comments
Please login to add a commentAdd a comment