ఎండలు మండిపోతాయని ప్రతిసారీ చెప్పుకొంటున్నప్పటికీ, ఈసారి ఆ మండిపోవడం అక్షరాలా నిజమని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఆసియా ఖండ చరిత్రలోనే విలయతాండవం చేస్తాయని భయపెడుతున్నారు కూడా. అయితే వాతావరణ మార్పుల వల్ల దుర్భరమైన వేడిగాడ్పులు ఎలా వస్తున్నాయో, భరించలేని చలిగాలులు కూడా అంతే వీస్తున్నాయి.
ఇలాంటివన్నీ ఎప్పుడో మనకు కవి సమయాలయ్యాయి. దప్పిక వల్ల చెట్లు తమ నీడల్ని తామే తాగుతున్నట్లు చిత్రించాడు నన్నెచోడుడు. శివుడు కూడా చలి భరించలేక హిమాలయాలను వదిలాడని చమత్కరించాడు సారంగు తమ్మయ్య. ఏమైనా మనుషుల శరీరాలు ఈ రెంటికీ అలవాటు పడాలి. వీటన్నింటినీ భరిస్తూనే లోకయాత్ర చేస్తూ ఉండాలి.
‘‘చరిత్రలో ఇంతవరకు కనీవినీ ఎరుగని ఎండలు, వేడి గాలులు ఆసియా దేశాల్ని పీల్చి పిప్పి చేస్తాయి. ఈ అసాధారణ పరిణామం భారత, చైనా దేశాలలో పెక్కుమంది ప్రజల దుర్మరణాలకు దారి తీస్తుంది. ముఖ్యంగా ఏప్రిల్–మే నెలలు ఆసియా ఖండ చరిత్రలోనే విలయతాండవంగా భావించవచ్చు. ఉత్తర, తూర్పు భారత రాష్ట్రాలలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు తగ్గవు. ఒకవేళ వేడి తీవ్రత తగ్గని పక్షంలో పరిణామాలు ప్రమాదకరంగా మారవచ్చు’’
– మాక్సిమిలియానో హెరీరా, వాతావరణ శాస్త్రవేత్త (‘గార్డియన్’ పత్రిక; 20 ఏప్రిల్ 2023)
వాతావరణ శాస్త్రవేత్తల తాజా అధ్యయనం ప్రకారం, భూమిపై ఏకంగా 20 లక్షల ఏళ్లపాటు వర్షం పడిందన్న వార్త ‘కలగుండు’ పడినట్లయింది. అంటే సృష్టి, వినాశాల మధ్య భూమి, ప్రకృతి పబ్బం గడుపుకుంటూ వచ్చాయని భావించాలి. సృష్టి, వినాశాలు ప్రాకృతిక సహజాలు. పెరుగుతూ వచ్చిన సృష్టి రహస్యాల పరిజ్ఞానంతో మానవ జాతి తన మనుగడను కాపాడుకుంటూ వస్తోంది.
ఇదిలా ఉండగా, దక్షిణాసియా దేశాలకు దఫదఫాలుగా వినాశంగా పరిణమి స్తున్న ఇండో–పసిఫిక్ వాతావరణ మార్పులు ఒకసారి దుర్భరమైన వేడి గాలులకు (ఎల్‌నినో), మరోసారి అమితమైన చలి గాడ్పులకు (లానినా) కారణమవుతున్నాయి. 2009 నుంచి 2018 వరకు మన దేశంలో అసాధారణ వేడిగాడ్పులకు కారణమైనది ఎల్‌నినో. ఫలితంగా ఖరీఫ్ పంటలు దెబ్బతిన్నాయి. ప్రతీ 2–7 సంవత్సరాలకు ఎల్‌నినో వరసగా దెబ్బతీస్తూనే వచ్చింది.
ప్రకృతి వైపరీత్యం ఎంత దెబ్బతీయకపోతే, లోకాల్ని శాసించే శివుడు సహితం చలికి తట్టుకోలేక హిమాలయాల్ని వదిలి భూమ్మీద చెట్ల నీడను ఆశ్రయించాల్సిన గతి పడుతుంది! (‘హరుడు కైలాస కుధర నాథాగ్ర వసతి విడిచి/ వటమూల తలముల విశ్రమించె’.) ఈ సత్యాన్ని ‘వైజయంతీ విలాసం’ కావ్యం ద్వారా సారంగు తమ్మయ్య ప్రజలపై ప్రకృతి ప్రభావాన్ని తెలియ జెప్పడం కోసం ప్రకటించాడు. దుర్భాక రాజశేఖర శతావధాని తన ‘రాణా ప్రతాప సింహ చరిత్ర’లో హల్దీ్దఘాట్ కనుమ దగ్గర రాజపుత్రులకూ, మొగలాయీలకూ మధ్య జరిగిన యుద్ధాన్ని వర్ణిస్తూ, మధ్యాహ్నాన్నిలా చిత్రించాడు:
‘‘మెండై ఎండలు నిండె, నల్దెసల గ్రమ్మెన్ నిప్పులన్ గుప్పుచు
ద్దండ గ్రీష్మ సమీరముల్ నిఖిల జగంబుల్ కడున్ డస్సె బ్ర
హ్మాండబందు పొగల్ సెగల్ తటుములై వ్యాపించి మధ్యాహ్నమా
ర్తాండుండుజ్వల కాండుడై గగనమధ్యం బందు మెల్గొందగన్.’’
ఇదిలా ఉండగా నన్నెచోడుడు ‘కుమార సంభవం’ కావ్యంలో, పార్వతి మండుటెండలకు పంచాగ్ని మధ్యంలో ఘోర తపస్సు చేస్తున్న సందర్భాన్ని వర్ణించాడు. ‘లోకులు భయపడేంత’గా వడగాలి వీచడాన్ని, ఆ వడగాలికి ఏనుగుల తలలు పేలిపోయి లోపలి ముత్యాలు పేలాలుగా పటపటా చిట్లిపోయినట్లు, దప్పిక కోసం ఎదురు చూసే చెట్లు తమ నీడల్ని తామే తాగుతున్నట్లు చిత్రించాడు. ఇక విశ్వనాథ పగటి ఎండల తీవ్రతల వల్ల జిల్లేడు కాయల్లా, వడ్లగింజల్లా, సున్నపురాయిలా విరిగిపోయి భూమి కాస్తా కకావికలైపోయిందని వర్ణించాడు!
ఆధునికుడైన కవి కాకరపర్తి కృష్ణశాస్త్రి తన కాలంలోనే సముద్రం ఉప్పొంగడం, అది భూమిని ముంచేసిన ఘటనలను ‘ప్రళయ సంరంభం’ కవితలో కళ్లకు కట్టి చూపాడిలా:
‘‘ఆకసమంటుచున్ ఘుమ ఘుమార్భటితో దిశలన్ స్పృశించుచునే
భీకర లీల లేచి అతివేల జవంబున వచ్చి వచ్చియ
స్తోక తరంగ మొండుపడు దుస్సహమై ధరముంచి వైచి తా
నేక పయోధి సూత్రముగ ఎంతయు జేసి శమించెనంతటన్’’!
ఆంధ్ర సామ్రాజ్య విచ్ఛిన్నానికి ‘రాళ్లు’ కూడా దుఃఖంతో ఎలా కరిగిపోయాయో కవి కొడాలి సుబ్బారావు ఎంతో ఆర్ద్రతతో గుండె చెరువై ఇలా వర్ణించాల్సి వచ్చింది:
‘‘శిలలు ద్రవించి యేడ్చినవి, జీర్ణములైనవి తుంగభద్రలో
పల గుడి గోపురంబులు, సభాస్థలులైనవి కొండ ముచ్చుగుం
పులకు, చరిత్రలో మునిగి పోయిన దాంధ్ర వబంధరాధిపో
జ్జ్వల విజయ ప్రతాప రభ సంబొక స్వప్న కథావిశేషమై.’’
ఇంతకూ, సంభవించే ప్రకృతి వైపరీత్యాలకేమిగాని మానవ హృదయంలో సహజంగానే ప్రకృతిని చూసి ఆనందించే లక్షణం మాత్రం చచ్చిపోదని చెబుతూ ప్రసిద్ధ కళాకారుడు, కవి అడవి బాపి రాజు ఓ చిరంతన సత్యాన్ని ప్రకటించిపోయారు:
‘‘అందరికీ ప్రకృతిని చూసి ఆనందించే లక్షణం ఉంది. ఆ ప్రకృతి భౌతిక రూపంగా, మనోమయ రూపంగా, బుద్ధి రూపంగా ప్రత్యక్షం అవుతూనే ఉంటుంది. అలాంటప్పుడు ఆ ప్రకృతిలో మనస్సుకుగాని, హృదయానికిగాని, బుద్ధికిగాని, ఆత్మకుగాని ఆనందం కల్గించే ఒక దృశ్యం, ఒక రూపం, ఒక జీవితం, ఒక భావం, కళాశక్తి కలిగిన రసజ్ఞునికి గోచరించినప్పుడు – తనలో ఉండే ఆ కళా శక్తి పైకి ఒక స్వరూపంగా జన్మించాలని ఆవేదన పొందడం చేత కళా స్వరూపం ఉద్భవిస్తున్నది. ఆ కళా స్వరూపంలో ఉన్న ముఖ్య లక్షణం ఆనందం. ఆ సృష్టి భాషా స్వరూపమైతే కవిత్వం, వర్ణ స్వరూపమైతే చిత్ర లేఖనం, మూర్తి స్వరూపమైతే శిల్పం, అంగ విక్షేప స్వరూపమైతే నృత్యం, భవన స్వరూపమైతే ఆలయం అవుతుంది’’!
ప్రకృతిలో మనం భాగం కాబట్టి, అందులో దఫదఫాలుగా ఇదే మానవుడి చేష్టల వల్లనో, ప్రకృతి సహజంగానో పెల్లుబుకి వచ్చే ఉపద్రవాలను భరిస్తూనే లోకయాత్ర సాగుతూండటం సహజ పరిణామం.
ఏబీకే ప్రసాద్
సీనియర్ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in
Comments
Please login to add a commentAdd a comment