నిప్పుల కొలిమి | Sakshi Editorial On Summer Temparature in India | Sakshi
Sakshi News home page

నిప్పుల కొలిమి

Published Thu, Apr 4 2024 12:19 AM | Last Updated on Thu, Apr 4 2024 11:29 AM

Sakshi Editorial On Summer Temparature in India

ఎవరో తరుముకొచ్చినట్టు ఈసారి చాలాముందుగానే ఎండాకాలం వచ్చిపడింది. ఫిబ్రవరి నుంచే సెగలూ పొగలూ ఎగజిమ్మిన సూరీడు అంతకంతకూ తన ప్రతాపాన్ని పెంచుతూ పోతున్నాడు. రోజూ నమోదవుతున్న ఉష్ణోగ్రతలను చూస్తుంటే భారత వాతావరణ విభాగం(ఐఎండీ) హెచ్చరించినట్టు నిరుటికన్నా వేసవితాపం మరింత అధికంగా వుంటుందని అర్థమవుతోంది. ఇంచుమించు రోజూ 39–41 డిగ్రీల సెల్సియస్‌ మధ్య ఉష్ణోగ్రతలుంటున్నాయి. వాస్తవానికి పదేళ్లుగా దేశంలో ఎండల తీవ్రత పెరిగింది. పాత రికార్డులు బద్దలవుతున్నాయి.

నిరుడు మార్చి ఎండ తీవ్రత 1901 నాటి రికార్డును అధిగమించిందని ఐఎండీ తెలిపింది. ఆ తర్వాత వరసగా ఏప్రిల్, మే, జూన్‌ నెలలు వేటికవే అత్యధిక ఉష్ణోగ్రతల్లో కొత్త పోకడలను నమోదు చేశాయి. రానున్న రోజుల్లో ఈ తీవ్రత మరింత పెరుగుతుందే తప్ప తగ్గదని వాతావరణ శాస్త్రజ్ఞులు చెప్తున్న జోస్యాలు భయపెడుతున్నాయి. దీనికి తోడు ఈసారి వానలు సైతం అంతంతమాత్రం కావటంతో జలాశయాలు నిండుకున్నాయి. భూగర్భ జలాలు లోలోతులకు పోతున్నాయి. నిరుడు ఎల్‌నినో ప్రభావం కారణంగా దక్షి ణాసియా ప్రాంత దేశాలన్నీ తక్కువ వర్షపాతాన్ని నమోదు చేశాయి.

రివాజుగా జూన్‌ నెల మొదట్లో కేరళను తాకాల్సిన రుతుపవనాలు ఏడు రోజులు ఆలస్యంగా వచ్చాయి. ఆ తర్వాత సెప్టెంబర్‌ వరకూ మెరుగ్గానే వర్షాలు పడ్డాయి. కొన్నిచోట్ల భారీ వర్షాలు పడటంతో వరదలు కూడా ముంచు కొచ్చాయి. మొత్తానికి దాదాపు 94 శాతం వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత అక్టోబర్‌ మొదలుకొని మార్చి వరకూ వర్షాల మాట అటుంచి కనీసం మబ్బుల జాడైనా కనబడలేదు. ఇది చాలదన్నట్టు ఫిబ్రవరి నుంచే ఎండల తీవ్రత పెరగటంతో జలాశయాల్లో నీరు అంతంతమాత్రంగానే వుంది. 

ఈ మూడు నెలలూ సాధారణంగా అయితే నాలుగు నుంచి ఎనిమిది రోజులు మాత్రమే వడగాడ్పులు తీవ్రంగా వీచాలి. కానీ ఇది పది నుంచి 20 రోజుల వరకూ ఉండొచ్చని ఐఎండీ చెబుతోంది. ముఖ్యంగా గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, లక్షద్వీప్, అండమాన్‌ నికోబార్‌ దీవులు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశాల్లో ఉష్ణోగ్రతలూ, వడగాడ్పుల తీవ్రత అధికంగా వుండొచ్చని వాతావరణ విభాగం హెచ్చరిస్తోంది. మండే ఎండలు, తీవ్ర వడగాడ్పులు, కుండపోత వర్షాలు, ముంచెత్తే వరదలు ఎవరూ ఆపగలిగేవి కాదు.

కానీ ప్రపంచ దేశాలు సమష్టిగా నిర్ణయాలు తీసుకుని, సమర్థంగా అమలు చేయగలిగే కార్యాచరణను రూపొందిస్తే వీటి తీవ్రతను తగ్గించటానికి ఆస్కారం వుంటుంది. ప్రపంచ వాతావరణ సంస్థలు(డబ్ల్యూఎంఓ) మొన్న మార్చి 19న విడుదల చేసిన ప్రపంచ వాతావరణ నివేదిక ఏమంత ఆశాజనకంగా లేదు. నిరుటికన్నా 2024 మరింత ప్రమాదకరంగా వుండగలదని హెచ్చరించింది. కార్బన్‌ డై ఆక్సైడ్, మీథేన్, నైట్రస్‌ ఆక్సైడ్, క్లోరోఫ్లోరో కార్బన్లు వంటి గ్రీన్‌ హౌస్‌ వాయువులు వాతావరణంలో పరిమితులకు మించి పెరిగి పోవటం వల్ల ఉష్ణోగ్రతలు అధికమై సముద్ర ఉపరితల జలాలను వేడెక్కిస్తున్నాయని ఆ నివేదిక తెలిపింది.

ఆఖరికి అంటార్కిటిక్, ఆర్కిటిక్‌ ప్రాంతాల్లో భారీ మంచు పలకలు కరగటం నిరుడు బాగా ఎక్కువైందని వివరించింది. ఆర్థికవృద్ధి పేరుతో ప్రభుత్వాలు పర్యావరణానికి నష్టం చేకూర్చే విధానాలు అవలంబించటమే ప్రస్తుత పరిస్థితికి కారణం. భారత, బంగ్లాదేశ్‌లలో పర్యావరణ విధ్వంసం వల్ల నిరుడు ఏప్రిల్‌ నెలలో వడగాడ్పుల తీవ్రత 30 రెట్లు పెరిగిందని వాతావరణ శాస్త్రవేత్తలు లెక్కేశారు.

ఎండల తీవ్రత, వడగాడ్పుల వల్ల సహజంగానే రానున్న రోజుల్లో నీటి కొరత మరింత ఎక్కువకావొచ్చు. ఎన్నికల సీజన్‌ కావటంతో ఈ సమస్యపై వాగ్యుద్ధాల మోత కూడా ఎక్కువేవుంటున్నది. కారణం మీరంటే మీరని తెలంగాణ రాష్ట్రంలో అధికార, విపక్షాలు మాటలు విసురుకుంటున్నాయి. ఆ మాటెలావున్నా ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండి వడ గాడ్పు లపై, ఎండల తీవ్రతపై ప్రజలను హెచ్చరించటం అవసరం. లేనట్టయితే వడదెబ్బ మరణాలు పెరిగే అవకాశం వుంది. 

మన దేశంలో వడగాడ్పులను ప్రకృతి వైపరీత్యంగా పరిగణించటం లేదు. చెప్పాలంటే వేటిని వడదెబ్బ మరణాలుగా లెక్కేయాలన్న అంశంలో ఎలాంటి కొలమానమూ లేదు. నిరుడు డిసెంబర్‌లో లోక్‌సభలో వడగాడ్పులను ప్రకృతి విపత్తుగా లెక్కేసి, బాధిత ప్రజల సహాయపునరావాసాల కోసం నిధులందించాలని డిమాండ్‌ వచ్చింది. కానీ కేంద్రం నుంచి పెద్దగా స్పందన లేదు.  పర్యవసానంగా బాధిత కుటుంబాలకు ఎలాంటి సాయమూ అందటం లేదు. కేవలం కొన్ని రాష్ట్రాలు మాత్రమే ఇందుకు మినహాయింపు. ఎన్‌డీఎంఏ 2016 నుంచి కొన్ని మార్గదర్శకాలు విడుదల చేస్తోంది.

అక్కడితో దాని పాత్ర ముగుస్తోంది. ఎండ తీవ్రత ఉన్నపుడు ఆరుబయట కార్మికులతో పనిచేయించకుండా చూడటం, ఎక్కడికక్కడ తాగునీటి సౌకర్యం కల్పించటం, ప్రజారోగ్య సిబ్బందిని సంసిద్ధంగా ఉంచటం, అవసరమైన ప్రాంతాలకు సహాయబృందాలను తరలించటం కీలకం. ఇలాంటి జాగ్రత్తలతో వడగాడ్పు మరణాల నివారణ సాధ్యమే.

అలాగే ఇరుకిరుకు ఇళ్లలో మగ్గి పోయే మురికివాడల ప్రజలనూ, మరీ ముఖ్యంగా వృద్ధులనూ, గర్భిణులనూ, బాలింతలనూ వడగాడ్పుల నుంచి సంరక్షించటానికి ఏం చేయగలమో ప్రభుత్వాలు ఆలోచించాలి. ఈ కృషిలో స్థానిక సంస్థల పాత్ర పెంచటం, అందుకు అవసరమైన నిధులు అందించటం ప్రభుత్వాల బాధ్యత. అన్నిటికీ మించి వడగాడ్పులను ప్రకృతి వైపరీత్యంగా పరిగణించి, ఆ విషయంలో పౌరులను అప్రమత్తం చేసేందుకూ, వారిని కాపాడేందుకూ అనుసరించాల్సిన విధానాలను రూపొందించటం తక్షణావసరమని కేంద్ర ప్రభుత్వం గుర్తించాలి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement