సవాలుకు సిద్ధమవుదాం! | Sakshi Editorial On climate changes in India | Sakshi
Sakshi News home page

సవాలుకు సిద్ధమవుదాం!

Published Thu, Mar 9 2023 2:41 AM | Last Updated on Thu, Mar 9 2023 2:41 AM

Sakshi Editorial On climate changes in India

గ్రీష్మ ఋతువు ఇంకా మొదలుకానే లేదు. కానీ శిశిరంలోనే, ఇంకా చెప్పాలంటే ఫిబ్రవరిలోనే గ్రీష్మ తాపం మొదలైపోయింది. 1901 నుంచి గత 122 ఏళ్ళలో ఎన్నడూ లేనంతటి సగటు పగటి ఉష్ణో గ్రత (29.54 డిగ్రీలు) ఫిబ్రవరిలో నమోదైంది. నిరుడు మార్చి కూడా ఇలాగే భారత ఉపఖండమంతటా చండ్రనిప్పులు చెరిగింది. దీన్ని బట్టి ఇక ఈ వేసవి ఎలా ఉండనుందో ఇప్పటికే అర్థమైపోయింది. దేశంలో ఇటు వేసవిలో, అటు శీతకాలంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి.

దేశంలో వాతావరణంపై అధ్యయనం చేసే ‘సెంటర్‌ ఫర్‌ స్టడీ ఆఫ్‌ సైన్స్, టెక్నాలజీ అండ్‌ పాలసీ’ (సీస్టెప్‌) ఈ సంగతి వెల్లడించింది. ఒక్కమాటలో వాతావరణ సంక్షోభం ఇక ఎప్పుడో నిజమయ్యే జోస్యం కానే కాదు. ఇప్పటికే రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, ఆకస్మిక వర్షాలతో తరచూ సంభవిస్తున్న సంఘటన. ఈ వేసవిలో భానుప్రతాపం తీవ్రంగా ఉండనుందన్న హెచ్చరికలతో, స్వయంగా ప్రధాని మోదీ రంగంలోకి దిగి, ఈ సోమవారం నిపుణులతో సమావేశం జరపడం గమనార్హం.

గత రెండు దశాబ్దాల (2000 – 2019) డేటా చూస్తే, కనివిని ఎరుగని ఉష్ణోగ్రతలతో ప్రపంచ వ్యాప్తంగా ఏటా సగటున 50 లక్షల మంది మరణిస్తున్నారు. ఇది 2021 జూలైలో ప్రచురితమైన ‘ది లాన్సెట్‌’ అధ్యయనం తేల్చిన మాట. మన దేశంలోనే 7.4 లక్షల మంది చనిపోతున్నారు. దేశంలో వాతావరణ మార్పులతో దుర్మరణాలు 55 శాతం పెరిగాయి. ఇక, కేవలం 30 ఏళ్ళలో (1990 – 2019) వేసవిలో మన కనిష్ఠ, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 0.5 డిగ్రీల నుంచి 0.9 డిగ్రీల మేర పెరిగాయి.

దేశంలో నూటికి 54 జిల్లాల్లో చలికాలంలోనూ ఇదే స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరిగాయి. చర్మాన్ని చీల్చే ఎండతో వ్యవసాయం సహా వాతావరణ ఆధారిత రంగాలు ప్రభావితమై, జీవనోపాధి దెబ్బ తింటోంది. దాదాపు 167.2 బిలియన్‌ పని గంటలు నష్టం. తక్కువ వర్షపాతం, ఎక్కువ ఉష్ణోగ్రతలతో గోదుమల దిగుబడి 2020–21తో పోలిస్తే 2021–22లో దాదాపు 30 లక్షల టన్నులు పడిపోయింది.   

రానురానూ భూతాపోన్నతితో పాటు వడగాడ్పులు, పర్యవసానాలూ పెరుగుతాయని వాతావ రణ మార్పులపై అంతర్‌ ప్రభుత్వ సంఘం ఆరో అంచనా నివేదిక సారాంశం. ఈ నేపథ్యంలోనే ప్రకృతి వైపరీత్యాల ముప్పు తగ్గింపు జాతీయ వేదిక (ఎన్పీడీఆర్‌ఆర్‌) సైతం ఈసారి ‘మారుతున్న వాతావరణానికి తగ్గట్టు స్థానిక సంసిద్ధత’ అనే అంశాన్ని చేపట్టింది. రేపు శుక్రవారం జరిగే ఈ 3వ సదస్సును ప్రధానే ప్రారంభిస్తుండడం విశేషం. జోషీమఠ్ లో భూపాతాలు సహా పలు అంశాలపై చర్యల్ని ఇందులో చర్చించనున్నారు. ముంచుకొస్తున్న మార్పులపై ప్రభుత్వం దృష్టి పెట్టడం స్వాగత నీయం. వాతావరణ సవాలుపై చర్యలకు ప్రభుత్వనిధుల కేటాయింపు తగ్గిందన్న వార్తలే విషాదం.

పసిఫిక్‌ మహాసముద్రంలో పవనాల సహజ మార్పు వల్ల ఈ ఏడాది ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరిగి, వాతావరణ ధోరణుల్లో సంక్షోభం తప్పకపోవచ్చని శాస్త్రవేత్తల హెచ్చరిక. ఈ 2023లో ఉష్ణవాతావరణ ధోరణి అయిన ఎల్‌ నినో మళ్ళీ విరుచుకుపడే ప్రమాదం నూటికి తొంభై పాళ్ళుందట. అదే జరిగితే, ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల మేర పెరుగుతాయి.

అంటే, ఈ శతాబ్దం చివరికి భూతాపోన్నతిని ఏ స్థాయికి నియంత్రించాలని ప్రపంచ నేతలు అంగీకరించారో ఆ చెలియలికట్టను ఇప్పుడే చేరుకుంటాం. దీనివల్ల 70 – 90 శాతం మేర పగడపు దిబ్బలు కనుమరుగై పోతాయట. ఇవన్నీ యావత్‌ ప్రపంచానికి, వ్యవసాయ ఆధారిత భారత్‌కు ప్రమాద ఘంటికలు.  ఈ అత్యవసర పరిస్థితిని తట్టుకోవాలంటే 2030 కల్లా వర్ధమాన దేశాలు ఏటా 30 వేల కోట్ల డాలర్లు ఖర్చు చేయాలని ఐరాస అంచనా. ప్రపంచ జనాభాలో 12 శాతమే ఉన్నా, గ్రీన్‌ హౌస్‌ వాయువుల్లో 50 శాతానికి బాధ్యులైన ధనిక దేశాలు వర్ధమాన దేశాలకు అండగా నిలవాలి. 

మన వద్ద మార్చి, మే మధ్య ఉష్ణపవనాలకు తోడు మరో సమస్య రానుంది. వినియోగం బాగా పెరిగే వేసవిలో విద్యుత్‌ కొరత సహజం. గత అయిదేళ్ళలో దేశంలో సౌర విద్యుదుత్పత్తి 4 రెట్లు పెరిగింది గనక నడిచిపోయింది. అది పగటివేళ వరకు ఓకే. కొత్తగా థర్మల్, హైడ్రోపవర్‌ సామర్థ్యా లను పెంచుకోనందు వల్ల రాత్రి వేళల్లో కష్టం కానుంది.

ఈ వేసవి రాత్రుళ్ళలో గిరాకీ, సరఫరాల మధ్య 1.7 శాతం లోటు రానుంది. ఒక్కమాటలో, ఈ వేసవిలో రాత్రిపూట దేశంలో కరెంట్‌ కష్టాలు తీవ్రం కానున్నాయి. ఆందోళన పడాల్సింది లేదని ప్రభుత్వాధికారులు పైకి అంటున్నా, త్వరితగతిన థర్మల్, హైడ్రో విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోకుంటే ఈ వేసవిలో ప్రజలకు కష్టాలు తప్పవు. ముఖ్యంగా రాత్రింబవళ్ళు నడిచే ఆటో, ఉక్కు, ఎరువుల తయారీ పరిశ్రమలు చిక్కుల్లో పడతాయి.

ముందే ఒక అంచనా రావడంతో నగర వ్యూహకర్తల మొదలు గ్రామీణ రైతుల దాకా అందరూ ఇప్పుడిక నష్టనివారణ చర్యలకు దిగాలి. భూ, జల నిర్వహణల్లో తగు మార్పులు చేసుకోవాలి. త్వరిత దిగుబడినిచ్చే కొత్త పంట రకాలపై రైతులకు మార్గదర్శనం చేయాలి. స్థానిక పాలనాయంత్రాంగాలు ఎప్పటికప్పుడు ముందస్తు హెచ్చరికలు చేయాలి.

నీడనిచ్చే ఉద్యానాలు, నీటి వసతి లాంటి పరిష్కార మార్గాలు చూపాలి. అహ్మదాబాద్‌లో 2010లో గాడ్పులకు 1300కు పైగా మరణించాక, సిద్ధం చేసిన కార్యాచరణ ప్రణాళిక ఏటా 1200 మరణాల్ని నివారిస్తున్నట్టు అంచనా. అలాంటివి అంతటా అమలు చేయాలి. ఉష్ణతాపంతో తలెత్తే ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొనేలా ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థను సమాయత్తం చేయాలి. వాతావరణ సంక్షోభాలు ఇక నిత్యకృత్యం కానున్నందున వీటి దుష్ప్రభావాన్ని దీటుగా ఎదుర్కొనేలా పటిష్ఠమైన విధాన రూపకల్పనే పాలకుల తక్షణ కర్తవ్యం.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement