నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలంలోని అంబం (ఆర్)శివారులో ఆటో, బైక్‌లపై కూలిన చెట్టు
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం
వేర్వేరు ఘటనల్లో ముగ్గురు చిన్నారులు సహా 13 మంది మృత్యువాత
ఒక్క నాగర్‌కర్నూల్ జిల్లాలోనే ఇద్దరు చిన్నారులు సహా ఏడుగురు మృతి
కీసరలో మోటార్ సైకిల్‌పై కూలిన భారీ వృక్షం..ఇద్దరి దుర్మరణం
పలు ప్రాంతాల్లో విరిగిపడిన చెట్లు..నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు
మరోవైపు మండిపోయిన ఎండలు
అత్యధికంగా జగిత్యాల జిల్లా జైనలో 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత
సాక్షి, నెట్‌వర్క్: హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఆదివారం ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. ముఖ్యంగా పలు ప్రాంతాల్లో పెనుగాలులు వీచాయి. దీంతో అనేకచోట్ల ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. భారీ వృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, నాగర్‌కర్నూల్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఉమ్మడి నల్లగొండ, సిద్దిపేట, వికారాబాద్ తదితర జిల్లాల్లో గాలివాన హడలెత్తించింది. వేర్వేరు ఘటనల్లో మొత్తం 13 మంది మృత్యువాత పడ్డారు. ఒక్క నాగర్‌కర్నూల్ జిల్లాలోనే ఏడుగురు మరణించారు. మరోవైపు తగ్గేదేలే అన్నట్టు పలు ప్రాంతాల్లో ఎండలు మండిపోయాయి. 45 డిగ్రీ సెల్సీయస్‌కు మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోయారు.
నాగర్‌కర్నూల్ జిల్లాలో విషాదం
నాగర్‌కర్నూల్ జిల్లాలో అకాల వర్షాలు పెను విషాదం నింపాయి. ఆదివారం సాయంత్రం వేర్వేరు ఘటనల్లో ఏడుగురు మృతి చెందారు. తాడూరుకు చెందిన రైతు బెల్లె మల్లేష్ (38) గ్రామ శివారులోని తన సొంత పొలంలో రేకుల షెడ్ నిర్మిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం మల్లేష్, పెద్దకొత్తపల్లి మండలం ముష్టిపల్లికి చెందిన కూలీలు చెన్నమ్మ (45), రాములు (53) షెడ్‌పై పని చేస్తుండగా ఈదురుగాలులతో కూడిన వర్షానికి షెడ్ ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది. దీంతో ఈ ముగ్గురు, అదే సమయంలో తండ్రి వద్దకు వచి్చన మల్లేష్ కూతురు అనూష (12) అక్కడికక్కడే చనిపోయారు.
అక్కడే పనిచేస్తున్న మరో నలుగురు.. చిన్న నాగులు, పార్వతమ్మ, బి.రాజు, రాజు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని నాగర్‌కర్నూల్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. అయితే పార్వతమ్మ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. మరోవైపు నాగర్‌కర్నూల్ మండలంలోని మంతటి గేట్ వద్ద ఈదురు గాలుల ప్రభావంతో రేకుల షెడ్‌పై ఉన్న రాయి వచ్చి వికారాబాద్ జిల్లా బషీర్‌బాగ్ మండలం నలవెల్లి గ్రామానికి చెందిన క్రూజర్ వాహన డ్రైవర్ వేణుగోపాల్ (38)కు తగలడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు.
వేణుగోపాల్ కిరాయికి శ్రీశైలం వెళ్లి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఇక ఇదే జిల్లాలోని తెలకపల్లికి చెందిన దండు లక్ష్మణ్ (12), మారేపల్లికి చెందిన వెంకటయ్య (52) పొలంలో పిడుగుపాట్లకు గురై మరణించారు. ఇలావుండగా కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్‌పేట్ మండలం కొండపల్లి గ్రామంలో శనివారం రాత్రి ఎడ్ల బండిపై పిడుగు పడింది. ఈ ఘటనలో రెండు దుక్కిటెడ్లు మృతిచెందగా రైతు ఎల్కరి సత్తన్నకు గాయాలయ్యాయి.
ఇద్దరు మిత్రుల విషాదాంతం
మేడ్చల్ జిల్లా కీసరలో ఈదురుగాలులకు భారీ వృక్షం విరిగి మోటార్ సైకిల్‌పై పడటంతో దానిపై ఉన్న యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండల కేంద్రానికి చెందిన నాగిరెడ్డి రాంరెడ్డి (60), అదే మండలంలోని దన్‌రెడ్డిగూడెంలో ఉంటున్న ఏపీలోని తూర్పు గోదావరిజిల్లాకు చెందిన ధనుంజయ్ (46) అనే ఇద్దరు స్నేహితులు మరణించారు. శామీర్‌పేటలో ఉన్న తమకు తెలిసిన వారికి మామిడికాయలు ఇచ్చేందుకు వెళ్తుండగా..కీసర మండలం తిమ్మాయిపల్లి గ్రామ సమీపంలో ఈ దుర్ఘటన జరిగినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.
గోడలు కూలి బాలుడు, వ్యాపారి మృతి
హైదరాబాద్‌లోని మియాపూర్, ఓల్డ్ హాఫిజ్‌పేట సాయినగర్‌లో ఆదివారం గాలివానకు గోడ కూలి పడటంతో అబ్దుల్ సమద్ (3) మృతి చెందాడు. డ్రై క్లీనింగ్ చేయడంతో పాటు రోడ్ల ప్రక్కన దుస్తులను అమ్ముకుంటూ జీవించే యూపీకి చెందిన నసీముద్దీన్ కనోదియా, షబానా దంపతుల కుమారుడు సమద్ ఆదివారం సాయంత్రం రేకుల గదిలో నిద్రిస్తుండగా, పక్కనే ఉన్న రఫీయుద్దీన్ బిల్డింగ్‌పై నుండి ఇటుక గోడకూలి రేకులపై పడింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సమద్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.
మరో ఘటనలో ఓ భవనం పై నుండి ఇటుక గోడకూలి ద్విచక్రవాహనంపై వెళ్తున్న వ్యాపారి రషీద్ (45)పై పడటంతో తీవ్రంగా గాయపడిన అతను స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొదుతూ మరణించాడు. ఈ దుర్ఘటన కూడా ఆదివారం మియాపూర్ ఓల్డ్ హాఫిజ్‌పేటలోని సాయినగర్ కాలనీలోనే చోటు చేసుకుంది. నగరంలోని ఎల్‌బీనగర్, వనస్థలిపురం, ఉప్పల్, ఘట్‌కేసర్ ప్రాంతాల్లో కూడా గాలివాన బీభత్సం సృష్టించింది. హయత్‌నగర్ ఆర్టీసీ డిపోలో పెద్ద వృక్షం కూలిపడటంతో బస్సు ధ్వంసమైంది.
కోళ్లఫారం గోడ కూలి ఇద్దరు మృతి
సిద్దిపేట జిల్లా ములుగు మండలం క్షీరసాగర్‌లో ఆదివారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షానికి కోళ్ల ఫారం గోడకూలడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. తూప్రాన్ మండలం ఘన్‌పూర్‌కు చెందిన గంగ గౌరిశంకర్ (30), గంగ మాధవి, విభూతి శ్వేత, ఇంద్రజ, చంద్రిక, చంద్రాయణగుట్టకు చెందిన భాగ్యమ్మ(40) క్షీరసాగర్ గ్రామంలోని శ్రీనివాస్ ఇంటికి చుట్టం చూపుగా వచ్చారు. అంతా కలిసి సరదాగా పొలంలోని బావి వద్దకు వెళ్లారు. తిరిగి వస్తుండగా వర్షం కురవడంతో తల దాచుకునేందుకు దారిలో ఉన్న ఓ కోళ్ల ఫారం వద్దకు వెళ్లారు. గాలుల ధాటికి ఫారం గోడ కూలి వీరిపై పడింది. ఈ ఘటనలో గంగ గౌరిశంకర్, భాగ్యమ్మ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో నలుగురు మాధవి, శ్వేత, ఇంద్రజ, చంద్రిక తీవ్రంగా గాయపడ్డారు.
అంతర్రాష్ట్ర రహదారిపై రాకపోకలకు అంతరాయం
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలో రుద్రూర్, బాన్సువాడ, బీర్కూర్ మండలాల్లో ఆదివారం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. రుద్రూర్‌లో కారుపై, అంబం శివారులో ఆటో, రెండు బైకులపై చెట్లు విరిగిపడ్డాయి. బాన్సువాడలోని కల్కి చెరువు కట్టపై ఉన్న హైమాస్ట్ విద్యుత్ స్తంభంతో పాటు పలు కరెంటు స్తంభాలు పడిపోయాయి. ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని పలు గ్రామాల్లో కూడా ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. హస్నాపూర్ గ్రామ సమీపంలో అంతర్రాష్ట్ర రహదారిపై భారీ వృక్షం పడిపోవడంతో 3 గంటల పాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పలు ఇళ్లు, కోళ్ల ఫారాల రేకులు లేచిపోయాయి. కరెంట్ స్తంభాలు, చెట్లు నేలకూలాయి. ధర్మారెడ్డి పల్లి గ్రామంలోని ఐకేపీ కేంద్రంలో కాంటా చేసిన వెయ్యి బస్తాల ధాన్యం పాక్షికంగా తడిసింది. కొండమల్లేపల్లి మండ లం గుమ్మడవెల్లిలో పిడుగుపాటుకు 2 గడ్డివాములు దగ్ధమ య్యాయి. వికారాబాద్ జిల్లాలో గాలివానకు పలు ప్రాంతాల్లో రహదారులు, ఇళ్లపై చెట్లు విరిగి పడ్డాయి. విద్యుత్ స్తంభాలు నేల కూలాయి. పరిగి మండల పరిధి రూప్‌సింగ్ తండాలో పిడుగుపాటుకు ఓ ఎద్దు మృత్యువాత పడింది.
Comments
Please login to add a commentAdd a comment