Dehydration
-
సైలెంట్ డీహైడ్రేషన్ అంటే ఏంటి?ఎలక్ట్రోలైట్ల ప్రాధాన్యత ఎంత?
రోజూ తగినన్ని నీళ్లు తాగుతున్నా, తరచూ నిస్సత్తువ, జబ్బుల బారిన పడితే ‘సైలెంట్ డీహైడ్రేషన్’ బారినపడ్డట్లే అంటున్నారు వైద్యులు. తెలంగాణా సహా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో లక్షల మంది ఈ సైలెంట్ డీహైడ్రేషన్‌కు గురవుతున్నారు.కొద్దిపాటి జాగ్రత్త, ముందుచూపుతో ఈ సమస్యను అధిగమించడం చాలా సులువు అంటున్నారు నిపుణులు.ఆహారంతో పాటు శరీరానికి తగినంత నీరు కూడా అవసనం, నీటితోపాటే శరీరానికి అవసరమైన లవణాలు కొన్నింటిని జోడిస్తేనే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే... దాహమేస్తే నీళ్లు తాగుతాం కానీ... ఖనిజ, లవణాలు తగ్గిపోతే ఎలాంటి లక్షణాలూ కనిపించవు. అందుకే దీన్ని ‘సైలెంట్ డీహైడ్రేషన్’ అంటారు దీన్ని. శరీరంలో నీటి మోతాదు, ఇతర లవణాలు తగ్గిపోవడం, అతిసారం వంటి వ్యాధుల వల్ల డీహైడ్రేషన్ ఏర్పడుతుంది.హైదరాబాద్ నగరంలో ఏటికేడాదీ కిడ్నీ జబ్బుల బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోందని, మొత్తం వ్యాధిగ్రస్తుల్లో 10 - 15 శాతం మందికి సైలెంట్ డీహైడ్రేషనే కారణమని గాంధీ వైద్య కళాశాల మాజీ అధ్యాపకులు, పీడియాట్రిక్స్ విభాగాధిపత్రి డాక్టర్ సి.సురేశ్‌కుమార్ తెలిపారు. పరిస్థితి చేయి దాటకముందే ఈ సైలెంట్ డీహైడ్రేషన్‌ను గుర్తించాలనీ, ముఖ్యంగా ద్రవ సమతౌల్యం కోసం ఎలక్ట్రోలైట్లు కచ్చితంగా కావాలి. నాడీ, కండరాల పనితీరును నియంత్రించేందుకు, కణాల్లో జరిగే జీవక్రియల కోసం ఈ ఎలక్ట్రోలైట్లు కీలకం. పైగా... సైలెంట్ డీహైడ్రేషన్‌కు దారితీసే పరిస్థితుల్లో (అతిసారం కాకున్నా) శరీరానికి చాలా ఎక్కువ శక్తి అవసరమవుతుందన్నది గుర్తించాలన్నారు.డబ్ల్యూహెచ్ఓ ఓఆర్ఎస్తో లాభం...శరీరంలో ద్రవ సంతులనాన్ని కాపాడుకునేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫారసు చేసే ఓఆర్ఎస్ ఎంతో ఉపయోగపడుతుందని, డీహైడ్రేషన్, అతిసారం రెండింటి నియంత్రణకు వాడుకోవచ్చునని డాక్టర్ సి.సురేశ్ కుమార్ తెలిపారు. సైలెంట్ డీహైడ్రేషన్‌కు దారితీసే పరిస్థితుల నుంచి కోలుకునేందుకు కూడా ఓఆర్ఎస్లోని ఎలక్ట్రోలైట్లు బాగా ఉపయోగపడతాయన్నారు.జ్వరం, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, వేడి కారణంగా వచ్చే జబ్బులు, వాంతులు లాంటి ఇతర సందర్భాల్లో తగినన్ని నీళ్లు, ఎలక్ట్రోలైట్లు తీసుకోవడం మంచిదని, పిల్లలు, వృద్ధులు ఈ విషయంపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలని కోరారు. ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా చాలామంది వడదెబ్బ కారణంగా ఏర్పడ్డ డీహైడ్రేషన్‌తో ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని, హైదరాబాద్‌లో పిల్లలు కూడా బలయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ అధ్యాపకులు డాక్టర్ ఎన్.ఎల్.శ్రీధర్ మాట్లాడుతూ ‘‘సైలెంట్ డీహైడ్రేషన్‌పై అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది. పిల్లలు, వృద్ధుల్లో ఇది చాలా త్వరితగతిలో ముదిరిపోతుంది. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకూ దారితీయవచ్చు’’ అని ఆయన తెలిపారు. -
జర జాగ్రత్త.. అవి ఓఆర్ఎస్లు కాదు.. ప్యాకేజ్డ్ జ్యూస్‌లే!
సాక్షి, హైదరాబాద్: వేసవిలో చాలా మందికి ఎదురయ్యే సమస్య డీహైడ్రేషన్. అయితే దీని చికిత్సకు తక్షణ పరిష్కారంగా బాధితులు మెడికల్ షాపుల నుంచి ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్ (ఓఆర్ఎస్)ను పోలిన వాటిని వాడుతూ మరింత అనారోగ్యం పాలవుతున్న ఉదంతాలు హైదరాబాద్‌లో ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా చిన్నారుల్లో ఈ సమస్య మరింతగా కనిపిస్తోంది. దీనికి కారణం బాధితులు వినియోగించినవి నిజమైన ఓఆర్ఎస్లు కాకపోవడమేనని వైద్యులు నిర్ధారిస్తున్నారు. ప్రస్తుతం నగరవాసులు వినియోగిస్తున్న వాటిలో అనేకం నిజానికి ఓఆర్ఎస్లు కావని... అవి కేవలం ప్యాకేజ్డ్ పండ్ల రసాలు మాత్రమేనని స్పష్టం చేస్తున్నారు. అవగాహన లేమితో వాటిని వినియోగించడం అనర్థాలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. సరైన చికిత్స తీసుకోకుంటే ప్రాణాపాయమే.. ఆకస్మిక అనారోగ్యం తద్వారా నీళ్ల విరేచనాలు, వాంతుల వల్ల శరీరం నుంచి లవణాలు,నీరు అధికంగా కోల్పోవడాన్నే డీహైడ్రేషన్‌గా పేర్కొంటారు. ఈ పరిస్థితి ఏర్పడడం వల్ల శరీరంలో రక్తసరఫరా తగ్గిపోతుంది. అది అనంతరం ఫిట్స్ రావడానికి లేదా కిడ్నీ ఫెయిల్ కావడం వంటి తీవ్ర సమస్యలకు కూడా దారితీయొచ్చు. ఈ ప్రమాదాల్ని నివారించడానికి బాధితులకు వెంటనే ఓఆర్ఎస్ ఇవ్వాలని వైద్యులు సూచిస్తుంటారు. డీహైడ్రేషన్ ద్వారా మనం కోల్పోయిన నీటిని, లవణాలను భర్తీ చేసేదే ఓఆర్ఎస్. అలవాటులో పొరపాటుగా... కానీ భాగ్యనగరంలో అనేక మంది డీహైడ్రేషన్‌కు గురవగానే ఓఆర్ఎస్లుగా భావించి వాటిని పోలిన పేర్లతో ఉండే వాటిని వినియోగిస్తున్నారు. ఆకర్షణీయమైన ప్యాకింగ్‌తో కనిపించే వాటిని ఓఆర్ఎస్ఎల్ అని, రీబ్యాలెన్స్ విట్ ఓఆర్ఎస్ మొదలైన పేర్లతో కంపెనీలు అందుబాటులోకి తెచ్చాయి. అయితే వీటిని ఓఆర్ఎస్గా వాడకూడదని చిన్న అక్షరాల్లో ఓ మూలకు రాస్తుండటంతో చాలా మంది వాటిని గమనించక ఓఆర్ఎస్గా భావించి వాడుతున్నారు. రివర్స్ రిజల్ట్... పండ్ల రసాలను ఓఆర్ఎస్గా భ్రమింపజేసేలా లేబుల్ అతికించి విక్రయించడంపై ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (ఐఎపి) వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇవి అధిక చక్కెరను కలిగి ఉంటాయని, అతిసారాన్ని తగ్గించే బదులు మరింత పెంచుతాయని హెచ్చరిస్తున్నారు. చక్కెర శాతం అధికంగా ఉండే జ్యూస్‌ల వాడకం వల్ల మనం ఏ ప్రయోజనం ఆశించి వాటిని తీసుకుంటున్నామో వాటికి పూర్తి వ్యతిరేక ఫలితాలు వస్తాయని చెబుతున్నారు. అంటే విరేచనాలు, వాంతులు మరింతగా పెరుగుతాయని వివరిస్తున్నారు. డబ్ల్యూహెచ్ఓ ఫార్ములా కీలకం... కేవలం డబ్ల్యూహెచ్ఓ ఫార్ములాను అనుసరించి తయారైన ఓఆర్‌ఎస్‌లనే వాడాలని ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (ఐఓపీ) వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. డబ్ల్యూహెచ్ఓ సిఫార్సు చేసిన ఫార్ములా ప్రకారం తయారైన ఓఆర్ఎస్లో సోడియం క్లోరైడ్, గ్లూకోజ్, పొటాíÙయం క్లోరైడ్, ట్రైసోడియం సిట్రేట్ మాత్రమే ఉంటాయని... కాచి చల్లార్చిన లీటర్ నీటిలో ఈ మిశ్రమాన్ని కలిపి 24 గంటల వ్యవధిలో తాగితే డయేరియా వల్ల కలిగే నిర్జలీకరణాన్ని సమర్థంగా ఎదుర్కోవడానికి ఉపకరిస్తుందని వైద్యులు చెబుతున్నారు. అవగాహన కల్పించాలి.. ఈ సమస్యపై కొన్నేళ్లుగా రకరకాల వేదికలపై పోరాడుతున్నా. అసలైన ఓఆర్ఎస్ను పోలిన లేబుల్స్‌తో ఉన్న ప్యాకేజ్డ్ జ్యూస్‌లను వాడటం వల్ల చిన్నారులు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్న ఉదంతాలు పెరుగుతున్నాయి. దీనిపై వినియోగదారుల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. – డాక్టర్ శివరంజని సంతోష్, పిల్లల వైద్య నిపుణురాలు -
వెజి‘ట్రబుల్’కు విరుగుడు.. టమాటా, ఉల్లిపాయల ప్రాసెసింగ్‌తో దీర్ఘకాలం నిల్వ
-పల్లా రవికిరణ్, ఏపీ సెంట్రల్ డెస్క్ నిన్నటిదాకా వినియోగదారులను ఏడిపించిన టమాటా నేడు రైతన్నలతో కన్నీళ్లు పెట్టిస్తోంది! టమాటాతో పోటీగా ఎగబాకిన పచ్చి మిర్చి ధరలు సగానికిపైగా పతనమయ్యాయి! ఈదఫా ‘ఉల్లిపాయ’ బాంబు పేలటానికి సిద్ధమైంది!! సామాన్యుడిని ఠారెత్తించిన కూరగాయల ధరలు ఇప్పుడు దిగి వచ్చినా కొద్ది నెలలు దేశ ప్రజలకు చుక్కలు చూపించాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా టమాటాలే. ఐదారు రోజులకు మించి నిల్వ ఉంటే పాడవుతాయి. అకాల వర్షాలకు ఉల్లిపాయలు కుళ్లిపోతాయి. చాలాసార్లు కనీస ఖర్చులు కూడా దక్కకపోవడంతో టమాటాలను రోడ్లపై పారబోసి నిరసన తెలిపిన ఘటనలున్నాయి. అయితే అనావృష్టి లేదంటే అతివృష్టి..! మరి ఏం చేయాలి? సీజన్లో సద్వినియోగం.. వాతావరణ మార్పుల కారణంగా అకాల వర్షాలతో ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లడం నిజమే అసలు కారణం సరైన నిల్వ, ప్రాసెసింగ్ సదుపాయాలు లేకపోవడమే. వరద వచ్చినప్పుడే ఒడిసి పట్టుకోవాలి! టమాటా, ఉల్లి లాంటివి కూడా సీజన్లో విరివిగా, చౌకగా లభ్యమవుతాయి. మరి సమృద్ధిగా దొరికినప్పుడు సేకరించుకుని ప్రాసెస్ చేసి వాడుకుంటే? రాష్ట్రంలో ఇప్పుడు అదే ప్రక్రియ మొదలైంది. సరైన పద్ధతిలో నిల్వ చేయడం, నాణ్యతను సంరక్షించడం కీలకం. అందుకే ప్రాసెసింగ్ యూనిట్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. గ్రామ స్థాయిలో పొదుపు మహిళల ద్వారా వీటిని ఏర్పాటు చేయడంతోపాటు భారీ ప్లాంట్లపై కూడా దృష్టి పెట్టింది. ఒకవైపు ధరలు పతనమైనప్పుడు మార్కెట్ జోక్యంతో అన్నదాతలను ఆదుకుంటూనే మరోవైపు వీటిని అందుబాటులోకి తెస్తోంది. దీనివల్ల ధరల మంటకు, దళారుల దందాకు తెర పడుతుంది! ఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు షేక్‌జుబేదా బీ. పొదుపు సంఘంలో సభ్యురాలు. కర్నూలు జిల్లా కల్లూరు మండలం తడకనపల్లెకు చెందిన ఈమె ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సహకారంతో టమాటా, ఉల్లిపాయల ప్రాసెసింగ్, డ్రయ్యింగ్ ద్వారా నెలకు రూ.18,000 వరకు ఆదాయాన్ని పొందుతోంది. బ్యాంకు లోన్‌తో యంత్రాలు, షెడ్‌ను సమకూర్చుకోగా సబ్సిడీగా రూ.70,000 అందాయి. తన వాటాగా రూ.20 వేలు జత చేసింది. సోలార్ డ్రయ్యర్లు, డీ హైడ్రేషన్ యూనిట్లతో రోజూ 200 కిలోల కూరగాయలను ఇంట్లోనే ప్రాసెసింగ్ చేస్తోంది. వీటిని సరఫరా చేస్తూన్న ‘ఎస్4 ఎస్’ అనే కంపెనీ ప్రాసెసింగ్ అనంతరం తిరిగి ఆమె వద్ద నుంచి సేకరిస్తోంది. 50 కిలోలు ప్రాసెసింగ్ చేసినందుకు రూ.125 చెల్లిస్తుండగా కరెంట్ చార్జీల కింద మరో రూ.20 చొప్పున కంపెనీ ఇస్తోంది. ప్రతి నెలా రూ.4,000 బ్యాంకు కిస్తీ పోనూ నికరంగా నెలకు రూ.14,000 వరకు ఆదాయం లభిస్తోంది. డ్రయ్యర్లతో డీ హైడ్రేషన్ యూనిట్లు.. ఉద్యాన రైతులకు గిట్టుబాటు ధర, మహిళలకు స్వయం ఉపాధి కల్పించడం లక్ష్యంగా సోలార్ డ్రయ్యర్లతో కూడిన డీ హైడ్రేషన్ యూనిట్ల ఏర్పాటును రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున ప్రోత్సహిస్తోంది. పైలట్ ప్రాజెక్టు కింద కర్నూలు జిల్లా తడకనపల్లిలో గతేడాది ఆగస్టులో 35 శాతం సబ్సిడీతో పది యూనిట్లు ఏర్పాటు కాగా కొద్ది రోజుల్లోనే మరిన్ని అందుబాటులోకి వచ్చాయి. రైతులకు కనీస మద్దతు ధర చెల్లిస్తూ ఇప్పటి వరకు 1,200 టన్నుల టమాటా, ఉల్లిని ప్రాసెస్ చేశారు. ఈ ఏడాది జూలైలో మరో వంద యూనిట్లను ప్రారంభించారు. పైలెట్ ప్రాజెక్టు విజయవంతం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా రూ.84 కోట్లతో 5 వేల యూనిట్ల ఏర్పాటుకు బ్యాంక్ ఆఫ్ బరోడాతో ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ అవగాహన ఒప్పందం చేసుకుంది. వీటిలో 3,500 యూనిట్లను రాయలసీమ జిల్లాల్లోనే నెలకొల్పుతున్నారు. ప్రతి 100 సోలార్ యూనిట్లను ఒక క్లసర్ కిందకు తెచ్చి రైతుల నుంచి రోజూ 20 టన్నులు టమాటా, ఉల్లిని సేకరించి రెండు టన్నుల ఫ్లేక్స్ తయారు చేయనున్నారు. కర్నూలు జిల్లా ఆదోని ప్రాంతంలో ఇప్పటికే 900 మంది లబ్ధిదారులను గుర్తించారు. సెప్టెంబరు నాటికి 500 యూనిట్ల ఏర్పాటు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. అనంతపురం జిల్లాలోని తాడిపత్రి, కళ్యాణదుర్గం, సత్యసాయి జిల్లా తనకల్లు ప్రాంతాల్లోనూ లబ్ధిదారులను గుర్తిస్తున్నారు. పత్తికొండలో టమాటా ప్రాసెసింగ్ యూనిట్ కర్నూలు జిల్లా పత్తికొండలో రూ.10 కోట్లతో భారీ స్థాయిలో టమాటా ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణ పనులకు త్వరలో భూమి పూజ జరగనుంది. ఈ యూనిట్లో స్టోరేజీ, సార్టింగ్, గ్రేడింగ్ సదుపాయాలు కల్పిస్తున్నారు. పల్పింగ్ లైన్, డీ హైడ్రేషన్ లైన్ ఉంటాయి. కెచప్, జామ్, గ్రేవీ లాంటి అదనపు విలువతో కూడిన ఉత్పత్తులు తయారవుతాయి. రాజంపేటలో రూ.294.92 కోట్లతో, నంద్యాలలో రూ.165.32 కోట్లతో ఇంటిగ్రేటెడ్ గుజ్జు, ఐక్యూఎఫ్ (టమాటా) పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నారు. రైతన్నకు ‘మద్దతు’.. మహిళలకు ఉపాధి ఉల్లి, టమాటా రైతులకు ఏడాది పొడవునా గిట్టుబాటు ధరలతో పాటు పొదుపు సంఘాల మహిళలకు స్వయం ఉపాధి కల్పన లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా సోలార్ డీ హైడ్రేషన్ యూనిట్ల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నాం. కర్నూలు జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద నెలకొల్పిన 100 యూనిట్లు విజయవంతం కావడంతో సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.84 కోట్ల అంచనాతో 5 వేల యూనిట్లను ఏర్పాటు చేస్తున్నాం. ఈమేరకు బ్యాంక్ ఆఫ్ బరోడాతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాం. ఒక్కో యూనిట్ రూ.1.68 లక్షల అంచనాతో ఏర్పాటు చేస్తున్నాం. లబ్ధిదారుల గుర్తింపు చురుగ్గా సాగుతోంది. – ఎల్.శ్రీధర్‌రెడ్డి, సీఈవో, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ -
అదరగొట్టినా.. పాపం ఎండ వేడిమికి తట్టుకోలేకపోయాడు
లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్ క్వింటన్ డికాక్ ఐపీఎల్ 16వ సీజన్లో తొలి మ్యాచ్ ఆడాడు. ఆదివారం గుజరాత్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో 31 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్న డికాక్ ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. కాగా ఈ సీజన్లో తొలి రెండు మ్యాచ్‌లకు దూరంగా ఉన్న డికాక్ ఆ తర్వాత జట్టుతో కలిసినప్పటికి విదేశీ కోటాలో కైల్ మేయర్స్, స్టోయినిస్, నికోలస్ పూరన్, మార్క్‌వుడ్‌లు ఉండడంతో డికాక్ దాదాపు 10 మ్యాచ్‌లకు దూరంగా ఉండాల్సి వచ్చింది. అందరూ మంచి ప్రదర్శన కనబరుస్తుండడంతో ఎవరిని తీయాలో కేఎల్ రాహుల్‌కు అర్థం కాలేదు. అయితే ఆర్సీబీతో మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన కెప్టెన్ కేఎల్ రాహుల్ తాజాగా టోర్నీ మొత్తానికి దూరం కావడంతో డికాక్ తుది జట్టులోకి వచ్చాడు. గతేడాది ఫామ్‌ను కంటిన్యూ చేసిన డికాక్.. వచ్చీ రావడంతోనే అర్థసెంచరీతో మెరిశాడు. ఇక అహ్మదాబాద్ వేదికగా గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌కు ఎండవేడిమి ఎక్కువగా ఉంది. దీనికి తోడు మ్యాచ్ మధ్యాహ్నం జరగడంతో స్టేడియంలో వడగాలులు వీచాయి. ఎండ వేడిమికి భరించలేని డికాక్ డీ హైడ్రేట్ అయినట్లు కనిపించాడు. అందుకే ఫిఫ్టీ మార్క్ అందుకున్నప్పటికి.. సీజన్లో తొలి అర్థసెంచరీ అయినప్పటికి ఎలాంటి సెలబ్రేషన్ చేసుకోలేకపోయాడు. సింపుల్‌గా బ్యాట్ పైకెత్తిన డికాక్ నీరసంగా స్ట్రైక్ ఎండ్‌వైపు నడవడం కనిపించింది. అంతకముందు బ్రేక్ సమయంలోనూ డికాక్ ప్లూయిడ్స్ తీసుకోవడం కనిపించింది. దీన్నిబట్టి డికాక్ చాలా అలిసిపోయినట్లు అనిపించింది. ఓవరాల్‌గా 41 బంతుల్లో ఏడు ఫోర్లు, మూడు సిక్సర్లతో 71 పరుగులు చేసి ఔటయ్యాడు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 𝗕𝗮𝗰𝗸 𝘄𝗶𝘁𝗵 𝗮 𝗯𝗮𝗻𝗴 👊💥 Quinton de Kock marks his return to #TATAIPL action with a blistering 50 #GTvLSG #IPLonJioCinema #IPL2023 | @QuinnyDeKock69 pic.twitter.com/V1YuVeBOoX — JioCinema (@JioCinema) May 7, 2023 చదవండి: తీసేస్తారన్న సమయంలో ఆడతాడు.. అదే ప్రత్యేకత! -
రోజూ 8 గ్లాసుల నీళ్లు తాగాలా?.. నిపుణులు ఏం చెప్తున్నారంటే..!
‘ఎన్నినీళ్లు తాగితే అంత మంచిది’ మనం తరచూ వినేమాట. అసలు ఒక వ్యక్తి రోజుకెన్ని నీళ్లు తాగాలన్న చర్చ నిత్యం జరుగుతూనే ఉంది. ఒక మనిషి ఆరోగ్యంగా ఉండేందుకు రోజూ కనీసం రెండు లీటర్లు అంటే.. ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగాలని వైద్యులు, నిపుణులు చెప్పేమాట. అయితే.. అన్ని నీళ్లు అవసరం లేదని ఓ అధ్యయనం చెబుతోంది. అబెర్డీన్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు దీనిపై అధ్యయనం చేశారు. 23 దేశాల నుంచి 5,604 మంది అన్ని వయసులవారిని పరిశీలించారు. ఈ సర్వే ప్రకారం ఒకటిన్నర లీటర్లు తాగితే సరిపోతుందని చెబుతున్నారు. నీళ్లు ఎక్కువగా తాగితే ఓవర్‌హైడ్రేషన్ అయి దానివల్లా సమస్యలొస్తాయని వివరించారు. వాతావరణం వేడిగా ఉన్నప్పుడు, శారీరక శ్రమ చేసేవాళ్లు.. ఈ గ్లాసుల సంఖ్య పెంచాలని సూచిస్తున్నారు. అథ్లెట్లు, గర్భిణులు, పాలిచ్చే తల్లులు నీళ్లు ఎక్కువ తీసుకోవాలని సలహా ఇస్తున్నారు. ‘బరువును బట్టి నీళ్లు తాగాలి.. 20 కిలోల బరువుకు లీటర్ చొప్పున.. 40 కిలోల బరువుంటే రెండు లీటర్లు, 80 కిలోలుంటే 4 లీటర్లు తాగాలి’ అని అబెర్డీన్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ జాన్ స్పీక్‌మాన్ చెబుతున్నారు. అయితే ఈ పరిమాణం మీరు తీసుకునే ఆహారం మీద ఆధారపడి ఉంటుందట. చదవండి: ఇరాన్ ఫుట్ బాల్ జట్టు ఓటమి.. స్వదేశంలో సంబరాలు.. కారణం ఇదే! -
బాబోయ్.. ఎండలు.. ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్త! ఇవి మాత్రం వద్దు!
సాక్షి, ఖమ్మం: ఎండలు తీవ్రంగా మండుతుండటంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఉదయం 10 గంటలకే ఎండ తీవ్రత పెరిగిపోతుండటంతో బయటకు వెళ్తే ముచ్చెమటలు పడుతున్నాయి. ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతుండటంతో చాలామంది వడదెబ్బ బారిన పడుతున్నారు. ఇక వచ్చే మే నెలలో మరింతగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉండటంతో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. రోజురోజుకూ పెరుగుతున్న వేడి నేపథ్యంలో ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. పెరగనున్న ఉష్ణోగ్రతలతో వడదెబ్బ బారినపడి చిన్నాపెద్ద అల్లాడిపోయే అవకాశాలు ఉన్న నేపథ్యంలో వడదెబ్బ లక్షణాలు, నివారణ మార్గాల గురించి తెలుసుకుందాం. లక్షణాలు ఇవీ.. కళ్లు తిరగడం, శరీరంలో నీటి శాతం కోల్పోవడం, శరీర కండరాలు పట్టుకోవడం, కాళ్లు వాపులు రావడం, తీవ్ర జ్వరం వంటివి కనిపిస్తాయి. అధిక చెమట పట్టడం, తల తిరిగి పడిపోవడం వంటివి జరుగుతుంటాయి. గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండ సమస్యలు కలిగి ఉన్నవారి శరీరం సూర్యరశ్మి వలన త్వరగా డీహైడ్రేషన్‌కు గురై వడదెబ్బ తీవ్రత అధికంగా ఉంటుంది. ప్రాథమిక చికిత్స.. ►వడదెబ్బ తగిలిన వ్యక్తి వెంటనే నీడకు తీసుకెళ్లాలి. చల్లని నీరు, ఐస్‌తో ఒళ్లంతా తుడవాలి. ►వదులుగా ఉన్న నూలు దుస్తులు వేయాలి. ►చల్లని గాలి తగిలేలా చూడాలి. ►ఉప్పు కలిపిన మజ్జిగ లేదా కొబ్బరి బొండాం నీరు, చిటికెడు ఉప్పు, చక్కర కలిపిన నిమ్మరసం, గ్లూకోజు ద్రావణం లేదా ఓరల్ రీ హైడ్రేషన్ ద్రావణం(ఓఆర్ఎస్) తాగించవచ్చు. ►వడదెబ్బ తగిలి అపస్మారక స్థితిలోకి వెళ్తే దగ్గరలోని ఆస్పత్రికి తరలించాలి. జాగ్రత్తలు.. ►ఎండలో వెళ్లేటప్పుడు కళ్లకు సన్ గ్లాసెస్, తలకు టోపి వంటివి ధరించాలి. ►ఉదయం, సాయంత్రం సమయాల్లో మాత్రమే బయటకు వెళ్లేలా ప్లాన్ చేసుకోవాలి. ►హారంలో ఎక్కువగా ద్రవ పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. ►వదులైన నూలు దుస్తులు ధరించాలి. ►వేసవి కాలంలో డీహైడ్రేషన్ అధికంగా ఉంటుంది. రోజుకు కనీసం 15 గ్లాసుల నీరు తాగాలి. భోజనం మితంగా చేయాలి. ►మాంసామారం తగ్గించి, తాజా కూరగాయల్ని ఎక్కువగా భోజనంలో తీసుకోవాలి. ►నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలను ఆహారంగా తీసుకోవాలి. పుచ్చకాయలు, కీర, తాటి ముంజలు, బీర పొట్టు వంటి వాటిలో నీటి శాతం పుష్కలంగా ఉంటుంది. వీటి ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. దీంతో కడుపు నిండినట్లుగా ఉండి డైట్ కంట్రోల్ అవుతుంది. ►వేసవిలో ఆకలి తక్కువగా, దాహం ఎక్కువగా ఉంటుంది. సరైన డైట్ పాటించాలి. నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు తీసుకోవాలి. చేయకూడని పనులు.. ►మండు వేసవిలో తీవ్ర ఉష్ణోగ్రత సమయంలో ఎక్కువగా తిరగరాదు. ►రోడ్లపై చల్లగా ఉండే రంగు పానీయాలు తాగొద్దు. ►రోడ్లపై విక్రయించే కలుషిత ఆహారం తినకూడదు. ఇంట్లో వండుకున్నవే తినాలి. ►శీతల పానీయాలు అధికంగా షుగర్ వేసిన జ్యూస్‌లు తీసుకుంటే కొత్త సమస్యలు ఉత్పన్నమవుతాయి. -
Aam Panna: చల్లచల్లని ఆమ్‌పన్నా.. వేసవిలో ఇది తాగితే..!
కావలసినవి: పచ్చిమామిడికాయలు – అరకేజీ, పంచదార – అరకప్పు, ఉప్పు – రెండు టీస్పూస్లు, దోరగా వేయించి పొడిచేసిన జీలకర్ర – రెండు టీస్పూన్లు, పుదీనా తరుగు – రెండు టేబుల్ స్పూన్లు, నీళ్లు – రెండు కప్పులు, ఐస్ ముక్కలు – నాలుగు. తయారీ: ∙పచ్చిమామిడికాయలను శుభ్రంగా కడిగి మెత్తగా ఉడికించాలి ∙ఉడికిన కాయల తొక్క తీసేసి, మామిడి కాయ గుజ్జును మిక్సీ జార్లో వేసుకోవాలి ∙ఈ గుజ్జులో జీలకర్ర పొడి, పుదీనా తరుగు, పంచదార వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. అన్నీ గ్రైండ్ అయ్యాక రెండు కప్పుల నీళ్లు పోసి మరోమారు గ్రైండ్ చేసుకుంటే ఆమ్ పన్నా రెడీ. ఆమ్పన్నాను గ్లాసులో వేసి ఐస్ ముక్కలతో సర్వ్ చేసుకోవాలి. ∙ ప్రయోజనాలు: పచ్చిమామిడికాయలో ఉన్న విటమిన్ ఏ, ఈలు శరీరం లోని హార్మోన్ల పనితీరుని మెరుగుపరుస్తాయి. దీనిలోని సోడియం క్లోరైడ్ డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉల్లాసంగా ఉంచుతుంది. అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది. ∙ఈ జ్యూస్ కాలేయాన్ని శుభ్రపరిచి బైల్ ఆమ్లాలు సక్రమంగా విడుదలయ్యేట్టు చేస్తుంది. ∙విటమిన్ సీ, క్యాల్షియం, మెగ్నీషియంలు శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపుతాయి. చదవండి: ‘పులి’ లాంటి ఈ పుల్లటి పండు తింటే ఒబెసిటీ పరార్! -
వేసవిలో ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి
-
నిమ్మరసంలో పంచదార కలుపుకొని తాగుతున్నారా? అయితే
దాదాపు ప్రపంచమంతటా వినియోగంలో ఉన్న వేసవి పానీయం నిమ్మరసం. తాజా నిమ్మరసానికి చిటికెడు ఉప్పు, రుచికి తగినంత పంచదార, చల్లని నీరు కలిపి తాగితే ఎండ తాకిడి నుంచి సత్వర ఉపశమనం కలుగుతుంది. నిమ్మరసంలోని విటమిన్–సి రోగ నిరోధక శక్తిని కలిగిస్తుంది. డీహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది. అధికబరువు తగ్గించుకోవడానికి నిమ్మరసంలో పంచదారకు బదులుగా తేనె కలుపుకోవడం మంచిది. వేసవిలో రోజూ నిమ్మరసం తీసుకునేటట్లయితే వేసవిలో తలెత్తే చర్మ సమస్యలు రాకుండా ఉంటాయి. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. వేసవిలో కాఫీ, టీ వంటివి తగ్గించి నిమ్మరసం తీసుకోవడం మంచిది. చదవండి: Curd Rice: వేసవిలో తినడానికి అనువైన చక్కని పోషకాహారం.. ఇలా చేస్తే అదనపు రుచి! -
కిడ్నీలో రాళ్ల తొలగింపు ఇప్పుడు తేలికే!
Kidney Stones Can Now be Removed Easily: సాధారణంగా చలికాలంలో నీళ్లు తక్కువగా తాగుతుండటం వల్ల, వేసవిలో విపరీతంగా దాహం కారణంగా ఎంత తాగినా ఆవిరైపోవడం వల్ల డీ–హైడ్రేషన్ సమస్య రావచ్చు. ఇది కిడ్నీలో రాళ్లు పెరిగేందుకు ఆస్కారం ఇస్తుంది. అందుకే ఎప్పుడూ తగినన్ని నీళ్లు తాగుతూ దేహాన్ని నిత్యం హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి. ఒకవేళ మూత్రపిండాల్లో రాళ్లు వచ్చినా ఆందోళన పడాల్సిన పనిలేదు. వాటి సైజు చాలా చిన్నగానే ఉంటే... ఎక్కువగా నీళ్లు తాగడం, ద్రవాహారాలు తీసుకోవడం వల్ల అవే పడిపోతాయి. పెద్దగా ఉన్న సమయంలో కొన్ని చికిత్సలతో వాటిని తొలగించవచ్చు. కాబట్టి ఆందోళన అక్కర్లేదు. ►మూత్రపిండాల్లో రాళ్ల నిర్ధారణకు రక్త, మూత్ర పరీక్షలతో పాటు ఎక్స్‌రే, ఐవిపి, అల్ట్రాసౌండ్, సిటిస్కాన్వంటి పరీక్షలు అవసరమవుతాయి. చికిత్సలో భాగంగా శబ్దతరంగాల సహాయంతో కిడ్నీలోని రాయిని చిన్న చిన్న పలుకులుగా పేల్చివేస్తారు. దాంతో అవి మూత్ర విసర్జన సమయంలో బయటకు వెళ్లిపోతాయి. ఈ ప్రక్రియను ‘ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ లిథోట్రిప్సీ’ అంటారు. చిన్న పలుకుల్లాంటి రాళ్లు బయటకు వచ్చే సమయంలో, అవి మూత్రనాళాల గోడలతో ఒరుసుకుపోయి, గాయం కాకుండా ఉండేందుకు మూత్రవిసర్జన మార్గం ద్వారా... కిడ్నీలు – మూత్రాశయానికి మధ్యన ఓ ట్యూబ్ వేస్తారు. దీనిని యూరెటెరిక్ స్టెంట్ అంటారు. దీన్ని కొద్దిరోజుల వరకు అలాగే ఉంచాల్సి రావచ్చు. చిన్నముక్కలుగా మారిన ఆ రాతి పలుకులన్నీ తొలగిపోయాక దీన్ని తొలగిస్తారు. దీన్ని చాలా సులభంగా ఔట్ పేషెంట్ విభాగంలోనే తొలగించవచ్చు. -
ఈ ఎండల్లో ఆడి చావమంటారా..? స్టార్ టెన్నిస్ క్రీడాకారుడి ఆగ్రహం
టోక్యో: ఒలింపిక్స్‌కు వేదికైన టోక్యో నగరంలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టెన్నిస్ మ్యాచ్‌లను మాధ్యాహ్నం వేళల్లో నిర్వహించడంపై ప్రపంచ నంబర్ 2 టెన్నిస్ క్రీడాకారుడు డేనిల్ మెద్వెదెవ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అరియాకె టెన్నిస్ పార్క్‌లో బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ మూడో రౌండ్ మ్యాచ్‌లో భానుడి ప్రతాపం ధాటికి మెద్వెదెవ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. జపాన్ కాలమానం ప్రకారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ మ్యాచ్ సందర్భంగా మెద్వెదెవ్ డీహైడ్రేషన్‌కు గురయ్యాడు. ఎండ వేడిమిని తాళలేక మ్యాచ్ మధ్యలో చైర్ అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. నేను యోధున్ని కాబట్టి గేమ్‌ను ఎలాగైనా పూర్తి చేస్తాను. ఈ మధ్యలో నేను చనిపోతే ఎవరిది బాధ్యత అంటూ నిర్వాహకలనుద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఇకనైనా మ్యాచ్‌ల నిర్వహణ సమయాన్ని మారుస్తారా లేక ఈ ఎండల్లో ఆడి చావమంటారా అంటూ నిర్వహకులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. కాగా, నిప్పులు కక్కుతున్న భానుడి ప్రతాపం కారణంగా అరియాకె టెన్నిస్ పార్క్‌లో బుధవారం ఇద్దరు ఆటగాళ్లు వడదెబ్బతో మధ్యలోనే నిష్క్రమించారు. ఇదిలా ఉంటే, క్రీడాకారుల నుంచి వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఒలింపిక్స్ నిర్వాహకులు స్పందించారు. మ్యాచ్‌ల షెడ్యూల్‌ను మారుస్తున్నట్లు ప్రకటించారు. ఉదయం 11 గంటలకు (జపాన్ కాలమానం ప్రకారం) మొదలు కావాల్సిన మ్యాచ్‌లు గురువారం నుంచి మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభంకానున్నాయని పేర్కొన్నారు. కాగా, మూడో రౌండ్ మ్యాచ్‌లో రష్యా ఒలింపిక్ కమిటీ (ఆర్వోసీ) ఆటగాడు మెద్వదెవ్.. ఇటలీకి చెందిన ఫాబియో ఫోగ్నినిపై 6-2, 3-6, 6-2తేడాతో విజయం సాధించి, క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. -
కార్యకర్తకు వడదెబ్బ: ప్రసంగం ఆపి వైద్యులను పంపిన ప్రధాని
గుహవాటి: అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం అసోంలో పర్యటించారు. భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తుండగా పార్టీ కార్యకర్త ఒకరు వడదెబ్బ (డీహైడ్రేషన్)కు గురయ్యాడు. దీంతో సభా ప్రాంగణంలో కలకలం రేపింది. దీంతో ప్రధానమంత్రి ప్రసంగం ఆపేసి వెంటనే అతడి గురించి ఆరా తీశారు. వెంటనే తన వైద్య సిబ్బందిని పంపించి అతడికి వైద్యం అందించాలని ఆదేశించారు. ఈ మేరకు కొద్దిసేపు పాటు నరేంద్ర మోదీ తన ప్రసంగం ఆపేసి కార్యకర్త వైద్యంపై ఆదేశాలు ఇచ్చారు. అసోంలోని బస్కా జిల్లా తముల్పూర్లో బహిరంగసభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతున్నారు. ఆ సమయంలో జనాల్లో ఉన్న కార్యకర్త హరిచరణ్ దాస్ ఎండలకు తాళలేక వడదెబ్బ (డీహైడ్రేషన్) తగిలింది. దీంతో కార్యకర్త సొమ్మసిల్లి పడడంతో జనాల్లో కలకలం మొదలైంది. ఈ విషయాన్ని గమనించిన ప్రధాని మోదీ వెంటనే ప్రసంగం ఆపేశారు. అనంతరం తన వైద్య బృందాన్ని అతడికి వైద్యం చేయాలని పంపించారు. వెంటనే ప్రధానమంత్రి వైద్య బృందం హరిచరణ్ దాస్ వద్దకు వెళ్లి వైద్యం అందించారు. అతడి ఆరోగ్యం మెరుగుపడిందని వైద్యులు తెలిపారు. అనంతరం ప్రధాని ప్రసంగం కొనసాగించారు. ప్రధానమంత్రి వెంట ఎప్పటికీ నలుగురితో కూడిన వైద్య బృందం వెంట ఉండే విషయం తెలిసిందే. నిరంతరం ఆ వైద్యులు ప్రధాని వెంట ఉంటారు. #WATCH: During a rally in Assam's Tamalpur, PM Narendra Modi asked his medical team to help a party worker who faced issues due to dehydration.#AssamAssemblyPolls pic.twitter.com/3Q70GPrtWs — ANI (@ANI) April 3, 2021 -
పెదవుల మృదుత్వానికి... బ్యూటిప్స్
కొంతమందికి తరచుగా పెదవులు చిట్లడం,.పై పొర లేచిపోయి పొట్టు రాలడం జరుగుతుంటుంది. ఇలా ఎందుకు అవుతుందంటే... శరీరంలో వచ్చిన మార్పులను, వాతావరణంలోని మార్పులను పెదవులు ఇట్టే ప్రతిబింబిస్తాయి. ఇందుకు దారితీసే కారణాలు . కాఫీలు ఎక్కువగా తాగడం, ఆల్కహాలు తీసుకోవడం వల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. దీనితో పెదవులు పొడిబారుతాయి. ∙వాతావరణంలో మార్పు వచ్చినప్పుడు ఆ మార్పును పెదవులు భరించలేవు. ఎక్కువ చలిని, ఎక్కువ వేడిని తట్టుకోలేక తేమకోల్పోయి పొడిబారతాయి. ∙పని ఎక్కువైనందువల్ల వచ్చే ఒత్తిడికి శరీర వ్యవస్థలో ఒడిదుడుకులు వస్తాయి. ఆ ప్రభావం మొదట కనిపించేది పెదవులలోనే. ∙లిప్‌స్టిక్‌ల వల్ల ఇరిటేషన్ వచ్చినా కూడా పెదవులు పొడిబారి, చిట్లుతాయి. ∙ఏదైనా రుగ్మతకు మందులు వేసుకున్నప్పుడు శరీరం తేమను కోల్పోయినట్లయితేకూడా బయటకు కనిపించే సమస్యల్లో ఇదేమొదటిది. పెదవులకు సాంత్వన చేకూరాలంటే... ఐదు మిల్లీ లీటర్ల గ్లిజరిన్‌లో అంతే మోతాదు నిమ్మరసం, పన్నీటిని కలపాలి. ఈ మిశ్రమాన్ని ఉదయం ఒకసారిసాయంత్రం ఒకసారి పెదవులకు పట్టించాలి. పెదవులకు పట్టించి దానంతట అదిఆరే వరకు అలాగే ఉంచాలి. ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో పెట్టుకుని మూడు రోజుల వరకు వాడవచ్చు. మరీ ఎక్కువగా పొడిబారినట్లనిపిస్తే రెండు గంటలకొకసారి కాని ఉదయం రెండు సార్లు, సాయంత్రం రెండు సార్లుకాని పట్టించవచ్చు. ఇవేవీ వీలుకానప్పుడు నీటితోనే మర్దన చేస్తేతాత్కాలికంగా ఉపశమనం కలుగుతుంది. చలికి పెదవులు చిట్లినప్పుడు వేడి నీటిలోదూది ముంచి పెదవులకు పట్టించాలి. ఎండలకు చిట్లినట్లయితే దూదితో చల్లటి నీటినిపట్టించాలి. వీలైతే నీటిలోనే గ్లిజరిన్, వాజలిన్, తేనె ఏదో ఒకటి కొద్దిగా వేసుకోవచ్చు. లిప్‌స్టిక్ కొనేటప్పుడు అందులో వాడినపదార్థాల జాబితాను ఒకసారి సరి చూసుకోవడం తప్పని సరి. బ్రాండెడ్ కంపెనీలుతప్పని సరిగా ఈ లిస్ట్‌ను ప్రచురిస్తాయి. మాయిశ్చరైజర్ ఉన్న లిప్‌స్టిక్‌నే ఎంచుకోవాలి. సాధారణంగా లిప్‌స్టిక్‌లలో గ్లిజరిన్‌తోపాటు యాంటిసెప్టిక్ ప్రాపర్టీస్ కూడాఉంటాయి. -
డీహైడ్రేషన్ వల్ల అలా అయిందంతే..
బెర్లిన్ : తన ఆరోగ్యం గురించి వస్తోన్న పుకార్లను ఖండిచారు జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మార్కెల్. కేవలం వేడి ఎక్కువగా ఉండటం మూలనా డిహైడ్రేషన్కు గురయినట్లు పేర్కొన్నారు. మంగళవారం ఓ అధికారిక కార్యక్రమంలో భాగంగా మార్కెల్ ఉక్రేయిన్ అధ్యక్షుడు వోలోడైమిర్ జెలెన్స్కీని సందర్శించారు. ఈ క్రమంలో మిట్ట మధ్యాహ్నం ఎండలో నిల్చుని గౌరవ వందనం స్వీకరించారు మార్కెల్. దాంతో ఆమె డీహైడ్రేషన్‌కు గురై వణకడం ప్రారంభించారు. పరిస్థితి గమనించిన సిబ్బంది వెంటనే ఆమెను నీడకు చేర్చి మంచి నీళ్లు అందించి ప్రథమ చికిత్స చేశారు. ఈ క్రమంలో ఏంజెలా ఆరోగ్యం గురించి వదంతలు వ్యాప్తి చేందడం ప్రారంభించాయి. దాంతో ఈ విషయం గురించి ఆమె వివరణ ఇస్తూ.. ‘వేడి ఎక్కువగా ఉండటంతో డీహైడ్రేషన్‌కు గురయ్యానంతే. ఓ మూడు గ్లాసుల మంచి నీళ్లు తాగాను. దాంతో అంతా సర్దుకుంది’ అన్నారు మార్కెల్. 2014 ఓ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్న మార్కెల్ ఉన్నట్లుండి తీవ్ర అస్వస్థకు గురయ్యారు. రక్తపోటు పెరగడంతో హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ తర్వాత 2021 వరకూ రాజకీయాల నుంచి వైదొలగుతానని ప్రకటించారు మార్కెల్. వయసు పైబటమే కాక ఆరోగ్యం కూడా సహకరించనందున ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆమె వెల్లడించారు. -
పిల్లల నోట్లో పొక్కులా?
పీడియాట్రిక్ కౌన్సెలింగ్ మా బాబు వయస్సు ఎనిమిదేళ్లు. ఈ మధ్య వాడికి నోట్లో పొక్కులు వస్తున్నాయి. దీనికి కారణం ఏమై ఉంటుంది. వాడి సమస్యకు పరిష్కారం చెప్పండి. – సునంద, హైదరాబాద్ మీ బాబుకు ఉన్న కండిషన్‌ను యాఫ్తస్ అల్సర్స్ లేదా యాఫ్తస్ స్టొమటైటిస్ అంటారు. ఈ పొక్కులు ముఖ్యంగా నోట్లో, పెదవులు, గొంతుపై భాగం (అప్పర్ థ్రోట్)లో ఎక్కువగా వస్తుంటాయి. ఓరల్ క్యావిటీలో ఇవి ఎక్కడైనా రావచ్చు. నోటిలో ఉండే పొర (మ్యూకస్ మెంబ్రేన్)లో పగుళ్లు రావడం వల్ల ఈ అల్సర్ వస్తాయి. వీటికి ఫలానా అంశమే కారణమని నిర్దిష్టంగా చెప్పడానికి ఉండదు. కాని నిమ్మజాతి (సిట్రస్) ఫ్రూట్స్, పులుపు పదార్థాలు ఎక్కువగా తిన్నప్పుడు, బాగా కారంగా ఎక్కువ మసాలాలతో ఉండే ఆహారం తీసుకున్నప్పుడు ఇవి రావచ్చు. కొందరిలో ఇవి విటమిన్ బి12, ఐరన్, ఫోలిక్ యాసిడ్, జింక్ లోపాలతోనూ రావచ్చు. అత్యధిక సాంద్రత ఉన్న టూత్‌పేస్టులు వాడేవారిలో, ఎక్కువ మానసిక ఒత్తిడికి గురయ్యేవారిలో ఇవి కనిపిస్తాయి. కొందరిలో ఇవి బాగా అలసిపోయిన (ఫెటిగ్) సందర్భాల్లో చూస్తూ ఉంటాం. మరికొందరిలో జబ్బుపడ్డప్పుడు కనిపిస్తాయి. కొన్ని హార్మోన్ల అసమతౌల్యత వల్ల, జీర్ణకోశవ్యాధులు ఉన్న సందర్భాల్లోనూ ఇవి కనిపించవచ్చు. ఇవి రాకుండా నివారించడానికి కొన్ని చర్యలు... ∙నోటికి బాధ కలిగించే పదార్థాలు తీసుకోకపోవడం ∙పుల్లని పదార్థాలు అవాయిడ్ చేయడం. ∙నోరు ఒరుసుకుపోయే ఆహారపదార్థాలు (అబ్రేసివ్ ఫుడ్స్) తీçసుకోకపోవడం. నోటి పరిశుభ్రత (ఓరల్ హైజీన్) పాటించడం వంటివి చేయాలి. ఈ సమస్య మరీ ఎక్కువగా ఉన్నప్పుడు లోకల్ అనస్థిటిక్ జెల్స్‌తో పాటు కార్టికోస్టెరాయిడ్స్, సిల్వర్ నైట్రేట్‌తో పాటు ఓరల్ యాంటీబయాటిక్స్ వాడాలి. సమస్య మాటిమాటికీ వస్తుంటే నాన్ ఆల్కహాలిక్ మౌత్‌వాష్, లో కాన్సంట్రేటెడ్ మౌత్ వాష్ వాడవచ్చు.ఇక మీ బాబు విషయానికి వస్తే నోటి పరిశుభ్రత (గుడ్ ఓరల్ హైజీన్) పాటించడంతో పాటు అతడికి విటమిన్ బి12, జింక్ సప్లిమెంట్స్ ఇవ్వండి. లోకల్ అనస్థిటిక్ జెల్స్ కూడా వాడవచ్చు. సమస్య మరీ తీవ్రంగా ఉంటే మీ పిల్లల వైద్య నిపుణుడిని కలిసి చికిత్స తీసుకోండి. ఆందోళన పడాల్సిన అవసరం లేదు. బాబు స్కూల్ ప్రేయర్లో కళ్లు తిరిగి పడిపోయాడు... మా బాబుకు పదేళ్లు. వాడు ప్రేయర్ సమయంలో కళ్లు తిరిగిపడిపోయాడు. రెండుసార్లు ఇలా జరిగింది. మొదటిసారి ఏమీ భయపడలేదు గానీ రెండోసారి జరగడం వల్ల ఆందోళనగా ఉంది. దయచేసి మా అబ్బాయి విషయంలో తగిన సలహా ఇవ్వండి. – హేమలత, నెల్లూరు మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తుంటే మీ బాబుకు ఉన్న సమస్యను సింకోప్ లేదా సడన్ లాస్ ఆఫ్ కాన్షియస్‌నెస్‌గా చెప్పవచ్చు. ఇది చాలా మంది పిల్లల్లో కనిపించేదే. పిల్లల్లో ఈ సమస్య కనిపించడానికి కారణాలనేకం. అందులో ప్రధానమైనది ఆర్థోస్టాకిక్ హైపోటెన్షన్. అంటే పిల్లల పొజిషన్స్‌లో మార్పుల వల్ల వాళ్లలో రక్తపోటు తగ్గి ఇలా జరగుతుంటుంది. కొన్ని సందర్భాల్లో న్యూరో కార్డియోజెనిక్ మార్పులు, గుండె సమస్యలు కూడా కారణం కావచ్చు. కొందరు పిల్లల్లో రక్తంలో గ్లూకోజ్ పాళ్లు తగ్గడం, ఫిట్స్, మైగ్రేన్, ఊపిరి బిగబట్టడం (బ్రెత్ హోల్డింగ్ స్పెల్స్) వంటివి ఇందుకు కారణమవుతాయి. అయితే పిల్లాడు మాటిమాటికీ పడిపోతుంటే డాక్టర్ సలహా తీసుకోవాలి. గుండెకు సంబంధించిన రుగ్మతలు ఉన్నాయేమో అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. గుండెకు సంబంధించిన సమస్య లేదని నిర్ధారణ అయితే కాస్త నిశ్చింతగా ఉండవచ్చు. ఇక పైన పేర్కొన్న ఇతర కారణాలు ఏమైనా కావచ్చేమో అని తెలుసుకోవడం కూడా అవసరం. అరుదుగా ఫిట్స్‌కూడా ఈ రకంగానే కనిపించవచ్చు. సాధారణంగా చాలా ఎక్కువగా భయం కలగడం వల్ల, తీవ్రమైన నొప్పి వల్ల, భయానక దృశ్యాలు చూడటం వల్ల లేదా డీహైడ్రేషన్ వల్ల అకస్మాత్తుగా కొద్దిసేపు స్పృహ కోల్పోయే ప్రమాదం ఉంది. ఎలక్ట్రోలైట్స్ ఎక్కువగా ఉండే కొబ్బరినీళ్ల వంటివి తాగించటం, పిల్లలు కింద కూర్చుని పైకి లేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండటం వంటివి ఈ సమస్య నివారణకు బాగా తోడ్పడే జాగ్రత్తలు. మీ బాబుకి పైన పేర్కొన్న కొద్దిపాటి జాగ్రత్తలతో అంతా సర్దుకుంటుంది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే మీరు మరొకసారి మీ పీడియాట్రీషియన్‌ను సంప్రదించి తగిన సలహా, చికిత్స తీసుకోండి. డా. రమేశ్‌బాబు దాసరి, సీనియర్ పీడియాట్రీషియన్, రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ, హైదరాబాద్ -
పెదవుల మృదుత్వానికి...
కొంతమందికి తరచుగా పెదవులు చిట్లడం,. పై పొర లేచిపోయి పొట్టు రాలడం జరుగుతుంటుంది. ఇలా ఎందుకు అవుతుందంటే... శరీరంలో వచ్చిన మార్పులను, వాతావరణంలోని మార్పులను పెదవులు ఇట్టే ప్రతిబింబిస్తాయి. ఇందుకు దారితీసే కారణాలు... ♦ కాఫీలు ఎక్కువగా తాగడం, ఆల్కహాలు తీసుకోవడం వల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. దీనితో పెదవులు పొడిబారుతాయి. ♦ వాతావరణంలో మార్పు వచ్చినప్పుడు ఆ మార్పును పెదవులు భరించలేవు. ఎక్కువ చలిని, ఎక్కువ వేడిని తట్టుకోలేక తేమ కోల్పోయి పొడిబారతాయి. ♦ పని ఎక్కువైనందువల్ల వచ్చే ఒత్తిడికి శరీర వ్యవస్థలో ఒడిదుడుకులు వస్తాయి. ఆ ప్రభావం మొదట కనిపించేది పెదవులలోనే. ♦ లిప్‌స్టిక్‌ల వల్ల ఇరిటేషన్ వచ్చినా కూడా పెదవులు పొడిబారి, చిట్లుతాయి. ♦ ఏదైనా రుగ్మతకు మందులు వేసుకున్నప్పుడు శరీరం తేమను కోల్పోయినట్లయితే కూడా బయటకు కనిపించే సమస్యల్లో ఇదే మొదటిది. పెదవులకు సాంత్వన చేకూరాలంటే... ఐదు మిల్లీ లీటర్ల గ్లిజరిన్‌లో అంతే మోతాదు నిమ్మరసాన్ని, పన్నీటిని కలపాలి. ఈ మిశ్రమాన్ని ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి పెదవులకు పట్టించాలి. దానంతట అది ఆరే వరకు అలాగే ఉంచాలి. ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో పెట్టుకుని మూడు రోజుల వరకు వాడవచ్చు. మరీ ఎక్కువగా పొడిబారినట్లనిపిస్తే రెండు గంటలకొకసారి కాని ఉదయం రెండుసార్లు, సాయంత్రం రెండుసార్లు కాని పట్టించవచ్చు. ♦ ఇవేవీ వీలుకానప్పుడు నీటితోనే మర్దన చేస్తే తాత్కాలికంగా ఉపశమనం కలుగుతుంది. చలికి పెదవులు చిట్లినప్పుడు వేడినీటిలో దూది ముంచి పెదవులకు పట్టించాలి. ఎండలకు చిట్లినట్లయితే దూదితో చల్లటి నీటిని పట్టించాలి. వీలైతే నీటిలోనే వాజలిన్, తేనె ఏదో ఒకటి కొద్దిగా వేసుకోవచ్చు. ♦ లిప్‌స్టిక్ కొనేటప్పుడు అందులో వాడిన పదార్థాల జాబితాను ఒకసారి సరిచూసుకోవడం తప్పని సరి. బ్రాండెడ్ కంపెనీలు తప్పనిసరిగా ఈ లిస్ట్‌ను ప్రచురిస్తాయి. మాయిశ్చరైజర్ ఉన్న లిప్‌స్టిక్‌నే ఎంచుకోవాలి. సాధారణంగా లిప్‌స్టిక్‌లలో గ్లిజరిన్‌తోపాటు యాంటిసెప్టిక్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. ఒకసారి నిర్ధారణ చేసుకోవడం మంచిది. -
మళ్లీ ఆస్పత్రిలో చేరిన దిలీప్ కుమార్
ముంబై : ప్రముఖ బాలీవుడ్ నటుడు దిలీప్‌కుమార్ (94) మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను బుధవారం సాయంత్రం ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చేర్చారు. డీహైడ్రేషన్ కారణంగా దిలీప్ కుమార్‌ను కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కాగా దిలీప్‌కుమార్ గత రెండురోజులుగా జ్వరంతో బాధపడుతున్నట్లు ఫ్యామిలీ ఫ్రెండ్ ఉదయ తారా నాయర్ తెలిపారు. ఇంతకుముందు కూడా ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆ సమయంలో దిలీప్‌కుమార్ ఆరోగ్యం గురించి కొన్ని వదంతులు కూడా వ్యాపించాయి. అయితే ఆయన భార్య, అలనాటి ప్రముఖ హీరోయిన్ సైరా బాను వాటిని ఖండించారు. అప్పట్లో శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఆయన లీలావతి ఆస్పత్రిలోనే చికిత్స పొందిన విషయం తెలిసిందే. దిలీప్ కుమార్ చిట్టచివరగా 1998లో ఖిలా సినిమాలో నటించారు. -
వేసవితాపం.. చిన్నారులకు శాపం
– డీహైడ్రేషన్‌తో ఆస్పత్రి పాలవుతున్న వైనం – కిటకిటలాడుతున్న విమ్స్ పీడియాట్రిక్ వార్డు బళ్లారి: బసిల బళ్లారిగా పేరుగాంచిన నగరంలో ఎండలు మండుతూ నిప్పులు కురిపిస్తున్నాయి. వారం రోజులుగా 41 నుంచి 42 డిగ్రీలతో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. దీంతో పిల్లలే కాదు పెద్దలు సైతం ఎండలకు తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ముఖ్యంగా శిశువులు శరీరంలోని నీటి కొరత(డీహైడ్రేషన్)తో అస్వస్థతకు గురై జ్వరాలతో ఆస్పత్రి పాలవుతున్నారు. దీంతో నిత్యం విమ్స్ పీడియాట్రిక్ వార్డు కిటకిటలాడుతోంది. ఇప్పటి వరకు సుమారు 70మంది శిశువులు డీహైడ్రేషన్‌తో ఆసుపత్రి పాలైనట్లు విశ్వసనీయ సమాచారం. ఈ వేసవిలో అన్ని విభాగాల కంటే పీడియాట్రిక్ విభాగంలోనే చేరే శిశువుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. శిశువుల్లో డీహైడ్రేషన్ నివారణకు అధికంగా మంచినీటిని తాగాలని, శిశువులు ఉండే గదులు చల్లగా ఉండేటట్లు చూడాలని, శరీరంలో నీటి సాంద్రత తగ్గకుండా చూసుకోవాలని పీడియాట్రిక్ వైద్యులు సూచిస్తున్నారు. -
సేఫ్... సమ్మర్ ఫుడ్!
పెనాన్ని స్టవ్ మీద పెట్టి గుప్పెడు నీళ్లు జల్లితే ‘సుయ్...’ అంటూ చుక్క చుక్కా ఆవిరైపోతుంది. కానీ... సగానికి కోసిన ఉల్లి ముక్కతో ఒకసారి పెనాన్ని తుడిచి అట్టు పోస్తే... అట్టులోంచి నీరంతా ఆవిరికాదు. అట్టు పెనానికి అంటుకోదు. ఉడికి తేలిగ్గా ఊడి వస్తుంది. ఇదో టెక్నిక్. వంటలోనే కాదు... ఒంటికీ కావాలి టెక్నిక్స్. వంట వేళే కాకుండా... పదార్థాలూ, తిండి వ్యవహారాల్లోనూ ఒంట్లోంచి నీరు కోల్పోకుండా ఉండాలంటే ఏం తినాలో ఏం చేయాలో... టెక్నిక్ తెలిసిన నిపుణులు చెబుతున్నారు. కమ్మటి సమ్మర్ తిండ్లు తీరుగా తినండి. కూల్ కూల్‌గా ఉండండి! వేసవిలో... కాలానికి అనుగుణంగా తీసుకునే ఆహారం శరీరాన్ని పదిలంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. తేలికగా జీర్ణమయ్యే, ఆరోగ్యకరమైన ఆహారమే తీసుకోవాలి. అప్పుడే వేసవిలో వచ్చే అనారోగ్యాల బారి నుంచి రక్షణ పొందవచ్చు. పుచ్చకాయ: ఇందులో 80 శాతం కంటే ఎక్కువ నీరు ఉంటుంది. అందువల్ల ఇది దాహాన్ని తీర్చి, దేహాన్ని... డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుతుంది. గ్రిల్డ్ వెజిటబుల్స్: ఎండలో నుంచి ఇంట్లోకి రాగానే ఉల్లిపాయ, క్యారట్, బీన్స్, వెల్లుల్లి వంటి కూరలను తినటం మంచిది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఎండలో తిరగటం వల్ల కలిగే చర్మవ్యాధుల నుంచి మనల్ని రక్షిస్తాయి. సలాడ్స్: వేసవిలో కూరగాయలతో రకరకాల సలాడ్స్ తయారుచేసుకోవచ్చు. గ్రిల్డ్ వెజిటబుల్స్, గ్రిల్డ్ వెజిటబుల్ పాస్తా, నూడుల్స్, గ్రిల్డ్ వెజిటబుల్ పనీర్ సలాడ్స్ వంటివి తయారుచేసుకోవచ్చు. వెజిటబుల్, చిల్డ్ సూప్స్: దోసకాయ వంటి వాటితో చేసిన సూప్‌ను భోజనానికి ముందుగా తీసుకోవటం వల్ల ఆకలి పెరుగుతుంది. అదేవిధంగా క్రంచీ వెజిటబుల్స్‌తో తీసుకునే సూప్స్ కూడా మంచివి. ఇవి శరీరంలో నీటి శాతాన్ని పెంచి, దేహాన్ని తగినంత హైడ్రేట్ చేస్తాయి. హోల్ గ్రెయిన్ సలాడ్స్: మొక్కజొన్నలు, మొలకెత్తిన పెసలు, మొలకెత్తిన శనగలు (స్ప్రౌట్స్) వంటి వాటిని తింటే మంచిది. వీటిని అతి తక్కువసమయంలోనే తయారుచేసుకోవచ్చు. పచ్చికూరలను ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత ఎక్కువ ఆరోగ్యాన్ని వేసవిలో పొందవచ్చు. బీన్ అండ్ స్ప్రౌట్ సలాడ్: బీన్స్ స్ప్రౌట్స్‌ను కూరగాయల ముక్కలు, పండ్ల ముక్కలతోపాటు తీసుకుంటే క్యాల్షియం, ప్రొటీన్లు ఎక్కువ మోతాదులో అందుతాయి. వెజిటబుల్ పనీర్ సలాడ్: పనీర్‌ను తరిగిన కూరలతో కలపటం వల్ల సలాడ్ రుచిగా ఉంటుంది. క్యాల్షియం, ప్రొటీన్ల పరిమాణం పెరుగుతుంది. వేసవి రాగానే..: తియ్యగా, చిక్కగా సోడాలను, ఐస్‌క్రీమ్‌లను తీసుకోవటం చూస్తాం. వీటిలో క్యాలరీలు అధికంగా ఉంటాయి. ఏరియేటెడ్ డ్రింక్స్ వల్ల తాత్కాలికంగా దాహం నుంచి ఉపశమనం లభిస్తుందే కాని పూర్తి ఉపశమనం అందదు. అందువల్ల – మజ్జిగ, లస్సీ, లో ఫ్యాట్ పాలు వంటివి తీసుకోవాలి. ఫ్రూట్ డెజర్ట్స్: వేసవిలో పండ్లతో తయారు చేసిన డెజర్ట్స్‌ని తీసుకోవటానికి ప్రాధాన్యత ఇవ్వాలి. తక్కువ కొవ్వు ఉన్న తాజా పండ్లతో కూడిన పెరుగు, ఫ్రూట్ కస్టర్డ్ వంటివి తీసుకోవటం మంచిది. ఇవి శరీరానికి కావలసిన క్యాల్షియం, ప్రోటీన్లను అందిస్తాయి. టొమాటో సాస్, టొమాటో కెచప్‌లు, బొప్పాయి, రెడ్ క్యాప్సికమ్ నుంచి ‘విటమిన్ ఎ’ లభిస్తుంది. వేసవిలో ఆకలి వేసినప్పుడు రకరకాల పండ్లు, పుచ్చకాయ వంటి వాటిని తీసుకోవాలి. అదేవిధంగా వేసవిలో లభించే ఆకుపచ్చని కూరలు, టొమాటోలు, బఠాణీ వంటివి తీసుకోవటం వల్ల పోషకపదార్థాలు శరీరానికి అందుతాయి. ఇవి తక్కువ క్యాలరీలను కలిగి ఉంటాయి. చల్లని కుకుంబర్: దోస వంటివి సహజంగానే చల్లగా ఉంటాయి. తాజాగా ఉన్న చల్లని దోసకాయ ముక్కలను సలాడ్స్‌లోను, కూరలలోనూ వాడటం మంచిది. మామిడి: ఇవి వేసవిలో మాత్రమే లభిస్తాయి. ఇందులో బీటా కెరొటిన్, విటమిన్ సి, ఫైబర్ ఉంటాయి. బెర్రీలు (స్ట్రాబెర్రీలు): ఇవి చాలా రుచిగా ఉంటాయి. వేసవిలో వీటిని తినటం మంచిది. అంతేకాక వీటిని పెరుగులోనూ, ఐస్‌క్రీమ్ లాంటి వాటిలోను వాడవచ్చు. పనీర్: ఇందులో ప్రొటీన్లు, క్యాల్షియం అధికం. వాల్నట్స్: వేసవిలో తీసుకునే ఆహారంలో కొద్దిగా ఆక్రోట్లు (వాల్నట్) , చేపలు తీసుకోవడం మంచిది. వీటిలో ఉండే ఒమేగా – 3 ఫ్యాటీయాసిడ్లు గుండె ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి. అయితే నూనెలో మునిగేటట్లు వేయించిన చేపల కంటే ఉడకబెట్టిన లేదా గ్రిల్డ్ చేపలు మంచిది. ఓట్స్: ఇందులో ఫైబర్లు, ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. వీటిని ఉదయాన్నే తీసుకోవటం మంచిది. తృణధాన్యాలు – పొట్టు తీసేసినవి కాకుండా పొట్టుతో కూడిన పప్పుధాన్యాలు, గింజలు, వాటికి సంబంధించిన ఉత్పత్తులు తీసుకోవాలి. నూనె పదార్థాలు శరీరంలోని నీటి శాతాన్ని తగ్గించేస్తాయి. అందువల్ల వేసవిలో జంక్ఫుడ్ని, వేయించిన పదార్థాలను వాడటం మానేయడం మంచిది. చర్మం, గుండె: ఈ రెండింటికీ కావలసిన కెరటనాయిడ్స్ క్యారట్లలో ఉండే విటమిన్ ఎ ద్వారా పుష్కలంగా లభిస్తుంది. అంతేకాక చక్కటి కంటిచూపుకు కూడా సహాయపడుతుంది. ఎరుపు, ఆరెంజ్, పసుపు రంగులలో ఉన్న కూరలు: గుమ్మడి, బంగాళదుంప, చిలగడదుంప, బెంగళూరు మిర్చి (క్యాప్సికమ్)... వంటివాటిలో ఎ విటమిన్, సి విటమిన్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. నీరు: దాహాన్ని తీర్చడానికి మంచినీటికి మించినది లేదు. ఎండలో ఇంటికి వచ్చినప్పుడు ఒక్క గ్లాసుడు నీరు తీసుకుంటే చాలు, శరీరం ఉత్తేజితమవుతుంది. మంచినీరు ఎక్కువగా తాగుతూంటే డీ హ్రైడ్రేషన్‌కు దూరంగా ఉండవచ్చు. పిల్లలకు ►వేసవి అంటే పిల్లలు ఇంటి దగ్గర గడిపే రోజులు, ప్రయాణాలు చేసే రోజులు, లేదా సమ్మర్ క్యాంపులతో బిజీగా ఉండే రోజులు. విపరీతంగా ఆడుతూండటం వల్ల వారిలోని శక్తి సన్నగిల్లుతూంటుంది. శరీరంలో ఉన్న నీటì శాతం తగ్గిపోతుంటుంది. అందువల్ల పిల్లలకు పోషకాహారాన్ని అందించాలి. ►పాల ఉత్పత్తులు – లస్సీ, మజ్జిగ, ఫ్లేవర్డ్ మిల్క్, ఫ్రూట్ మిల్క్ షేక్‌లు (మ్యాంగో మిల్క్ షేక్) వంటివి పిల్లల శరీరానికి అవసరమయిన శక్తిని, ప్రొటీన్లను, క్యాల్షియమ్‌ను, ఫ్లూయిడ్లను అందిస్తాయి. అయితే ఇందులో చక్కెర పరిమితంగానే వాడాలి. ►తాజా పండ్లు, చల్లగా ఉండే పండ్ల రసాలు వంటివి కూడా పిల్లల శరీరంలోని నీటి శాతం తగ్గిపోకుండా కాపాడతాయి. ►పిజ్జాలు, శాండ్విచ్ వంటివి పనీర్, తాజాకూరగాయలతో తీసుకుంటే పరవాలేదు కాని, ఎక్కువగా చీజ్ ఉపయోగించినవి మాత్రం మంచిది కాదు. ►గ్రిల్డ్ వెజిటబుల్స్‌ను పనీర్‌తో కలిపి ఇవ్వవచ్చు. లేదా పనీర్ రోల్స్ కూడా ఇవ్వవచ్చు. మైదా బదులు గోధుమ పిండితో చేసిన పదార్థాలనే పెట్టాలి. ►ఇంట్లో తయారుచేసిన ఐస్‌క్రీమ్‌లు, ఫ్రూట్ కస్టర్డ్స్, పుడింగ్స్, ఐస్ గోల్స్... వంటివి పిల్లలకి పెట్టవచ్చు. పెద్దలకు ►బరువు తగ్గి, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపటానికి వేసవి మంచి సమయం. పద్ధతి ప్రకారం సమతుల ఆహారం తీసుకుంటే, బరువు తగ్గటానికి ఉపయోగపడుతుంది. నేరుగా ఎండలోకి వెళ్లి వ్యాయామం చేయటం ఈ కాలంలో మంచిది కాదు. ►తాజా పండ్లు, కూరలు తీసుకోవాలి. తర్బూజా, పుచ్చకాయ వంటివి ప్రతిరోజూ తీసుకోవాలి. ►మజ్జిగను వీలయినన్ని ఎక్కువ సార్లు తాగుతుండాలి. ► తాజాగా ఉండే పండ్లరసాలు తీసుకోవటం మంచిది. ►క్యారట్లు, బీట్రూట్లను రసం రూపంలో తీసుకుంటే మంచిది. ఈ కాలంలో దొరికే తాజా ఆకుపచ్చ రంగు కూరల వాడకం చాలా మంచిది. ►మధ్యాహ్నం, రాత్రి వేళలో తీసుకునే భోజనంలో తప్పనిసరిగా తాజా పచ్చికూరలు, మొలకెత్తిన ధాన్యం ఉండేలా చూసుకోవాలి. ►ఆల్కహాల్ మానేయాలి. ఇక కెఫిన్ ఉంటే కాఫీలవంటి వాటిని కూడా తగ్గిస్తే మంచిది. ఎందుకంటే అవి శరీరంలోని నీటి శాతాన్ని తగ్గిస్తాయి. వృద్ధులకు ►వయసు మీద పడేకొద్దీ శరీరంలో అనేక మార్పులు సంభవిస్తాయి. సమతుల ఆహారం తీసుకుంటే మాత్రం శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ►ఆరోగ్యకరమయిన బరువుతో ఉండటానికి క్రమపద్ధతిలో తీసుకునే ఆహారం మంచిది. అందుకే వీరు తీసుకునే ఆహారంలో... ►గంజిలాంటి కార్బోహైడ్రేట్లు అంటే గోధుమ, బ్రౌన్ రైస్, బంగాళదుంపలు, తృణధాన్యాలు ►ప్రొటీన్లు, కొవ్వుతక్కువగా ఉండే మాంసం, చేపలు, గుడ్లు, పప్పుధాన్యాలు ►ఆహారంలో ఐదువంతుల భాగం పండ్లు, కూరలు లేదా పండ్లరసాలు ►తగినంత ఉప్పు (వృద్ధులు రోజుకి ఆరు గ్రాముల ఉప్పు కంటే ఎక్కువ తీసుకోకూడదు) ►ఈ సీజన్లో డీహైడ్రేషన్ ఎక్కువ కాబట్టి లవణాలను భర్తీ చేసేలా పోటాషియమ్, సోడియమ్ ఎక్కువగా ఉండే అన్ని రకాల పండ్లు తీసుకోవాలి. ► పీచుపదార్థాలు (ఫైబర్) పేగు సంబంధిత సమస్యలు వయసు పెరిగే కొద్దీ ఎక్కువవుతుంటాయి. ముఖ్యంగా మలబద్దకం అధికమవుతుంటుంది. జీర్ణవ్యవస్థ సక్రమంగా ఉండటానికి తగినంత పీచుపదార్థాలు తీసుకోవటం అవసరం. వీటిని తీసుకోవటం మంచిది... ►పొద్దున్నే అల్పాహారంగా తృణధాన్యాలు లేదా ఓట్స్ హోల్‌గ్రెయిన్ బ్రెడ్ గోధుమ పాస్తా లేదా బ్రౌన్ రైస్ ►బీన్స్ లేదా ఆ జాతికి చెందిన గింజలు ►తాజా పండ్లు, కూరగాయలు... ఉండాలి. ప్రధానమైన పోషకాలు ►వయసు పైబడుతున్న కొద్దీ కొన్ని పోషకాలు తీసుకోవటం చాలా అవసరం. మీరు వీటిని తీసుకుంటున్నారా లేదా గమనించుకోండి... ►విటమిన్ డి అనేది... క్యాల్షియాన్ని అందిస్తుంది. డి విటమిన్ అనేది సూర్యకాంతి ద్వారా శరీరానికి లభిస్తుంది. అయితే తీసుకునే ఆహారం కూడా చాలా ప్రధానం. గుడ్లు, నూనెతో ఉండే చేపలు మంచిది. ఉదయం తీసుకునే అల్పాహారంలో తృణధాన్యలు ఉండేలా చూసుకోవాలి. ►ఆరోగ్యంగా జీవించడానికి క్యాల్షియం తప్పనిసరి. వయసు మీద పడేకొద్దీ ఆస్టియోపోరోసిస్ వ్యాధి బాధిస్తూంటుంది. ముఖ్యంగా ఇది స్త్రీలలో కనిపిస్తుంది. క్యాల్షియం శరీరానికి అందాలంటే తక్కువ కొవ్వు ఉండే పాలు, పాల ఉత్పత్తులు అంటే పెరుగు, పనీర్ వంటివి తీసుకోవాలి. ఇంకా స్కిమ్డ్ పాలు కూడా మంచిది. ఇంకా పచ్చగా ఉండే కాయగూరలు, ఆకుకూరలు తీసుకోవాలి. అదేవిధంగా క్యాల్షియం ఉండే ఆహారాన్ని ఉదయాన్నే తీసుకోవాలి. ►ఆరోగ్యంగా ఉండటానికి ఐరన్ కూడా ప్రధానం. ఇది తక్కువగా ఉంటే శక్తిహీనులుగా ఉంటారు. అయితే ఆయిలీ ఫిష్‌లో, తృణధాన్యాలలో, పప్పుధాన్యాలలో కూడా ఉంటుంది. ►ఫోలేట్ అనేది ఆరోగ్యానికి చాలా అవసరం. వయసు మీద పడేకొద్దీ శరీరంలో పోషకాలు తగ్గుతుంటాయి. రోజూ గోధుమ అన్నం, ఆకుపచ్చ కూరలు తీసుకోవడం చాలా మంచిది. తీసుకోకూడని ఆహారాలు ►వేసవిలో స్వేదం చిందే వృత్తుల్లో ఉన్న వారు మినహా మిగిలిన వారు ఉప్పును సాధ్యమైనంతగా తగ్గించాలి. ► ఈ సీజన్లో కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారాన్ని సాధ్యమైనంతగా తగ్గించాలి. అలాగే ఆయిల్స్ ఉపయోగాన్ని కూడా వీలైనంతగా తగ్గించాలి. ►కాఫీ, టీ, కూల్‌డ్రింక్స్‌లో కెఫిన్ పాళ్లు ఎక్కువ. అందుకే అవి డీహైడ్రేషన్ కలిగిస్తాయి. కాబట్టి వాటి నుంచి దూరంగా ఉండాలి. ► రెడ్‌మీట్ వంటి మాంసాహారం నుంచి దూరంగా ఉండటం ఈ సీజన్లోనే కాదు... ఏ సీజన్లో అయినా మంచిదే. ► ప్రాసెస్ చేసిన మాంసం, కేకులు, బిస్కెట్ల వంటి వాటికి దూరంగా ఉండాలి. ►చక్కెర ఎక్కువగా ఉండే అన్ని రకాల పదార్థాల నుంచి దూరంగా ఉండాలి. - సుజాత స్టీఫెన్ చీఫ్ న్యూట్రిషనిస్ట్, హైదరాబాద్ -
సమ్మర్ క్విజ్
పిల్లలకు పరీక్షలు సమ్మర్లో ఎలాగూ ఉంటాయి. టీచర్లు ప్రశ్నల మీద ప్రశ్నలు సంధిస్తూనే ఉంటారు. సమాధానాలు ఇవ్వడానికి మన పిల్లలు తపస్సు కంటే తక్కువేమీ చెయ్యరు. ‘‘అసలు తపస్సెందుకు? బాగా చదువుకుంటే ఈజీగానే రాయొచ్చు కదా’’ అని పేరెంట్స్ అంటారు. అయితే ఈ సమ్మర్ క్విజ్‌లో ఎంత మంది పేరెంట్స్ పాసవుతారో చూద్దాం. 25 ప్రశ్నల్లో 15కు సరైన సమాధానాలిస్తే యావరేజ్. 20 సమాధానాలు ఇస్తే గుడ్. 25కు 25 ఇస్తే ఎక్సలెంట్! 1. వేసవిలో ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు అసౌకర్యంగా ఫీలవుతుంటాం. ఎందుకు? మన శరీర నార్మల్ ఉష్ణోగ్రత 98.4 ఫారన్‌హీట్. ఆ ఉష్ణోగ్రత వద్ద జీవక్రియలన్నీ సక్రమంగా జరుగుతుంటాయి. చలికాలంలో ఉష్ణోగ్రతలు తగ్గుతున్నా మన శరీర ఉష్ణోగ్రత స్థిరంగా 98.4 ఫారెన్‌హీట్ ఉంటుంది. అలాగే వేసవిలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నా మన ఒంటి వేడి అంతే ఉంటుంది. ఏ సీజన్లోనైనా శరీర ఉష్ణోగ్రత ఒకేలా ఉంచే బాధ్యతలను మెదడులోని హైపోథలామస్ నిర్వహిస్తుంటుంది. అయితే వేసవిలో కొన్నిసార్లు ఎండ పెరుగుతూ పోతున్న కొద్దీ మన ఒంటి ఉష్ణోగ్రత 99.9 డిగ్రీల ఫారెన్‌హీట్‌కు చేరే అవకాశం ఉంది. అలా ఉష్ణోగ్రతల స్థాయి మించితే జ్వరంగా పరిగణిస్తుంటారు. వైద్య పరిభాషలో ‘హైపర్థెర్మియా’ అనవచ్చు. మనం ముందుగానే అనుకున్నట్లుగా శరీర సాధారణ ఉష్ణోగ్రత వద్ద మనలోని జీవక్రియలన్నీ సక్రమంగా జరుగుతాయి. కానీ ‘హైపర్థెర్మియా’లో అలా జరగదు. కాబట్టి మనకు నీరసంగా, నిస్సత్తువగా, చికాకుగా ఉంటుంది. 2.ఎండవేడిమితో జ్వరం వస్తే ఏంచేయాలి? ఒళ్లు సాధారణ వేడి కంటే ఎక్కువగా ఉంటే... జ్వరం మందులు, తగిన విశ్రాంతి, ద్రవాహారాలతో నార్మల్కు తీసుకువస్తారు. 3.ఈ సీజన్లో మజిల్ క్రాంప్స్ ఎందుకు వస్తుంటాయి? మన కండరాలు సక్రమంగా పనిచేసేందుకు ఖనిజాలు, లవణాలు, నీరు సమపాళ్లలో అవసరం. అయితే వేసవిలో మన ఒళ్లు వేడెక్కకుండా చూసేందుకు, మన ఒంటి ఉష్ణోగ్రత సమపాళ్లలో ఉండేలా చూసేందుకు ఒంటి నుంచి చెమట స్రవిస్తుంది. ఒంటిపై విస్తరించిన ఈ చెమట ఆవిరైపోయే క్రమంలో ఒంటి నుంచి ఉష్ణోగ్రతను తీసుకెళ్తుంది కాబట్టి ఒళ్లు చల్లబడుతుంది. అయితే ఇలా చెమట పట్టే క్రమంలో కేవలం నీళ్లు మాత్రమే కాకుండా... మన ఒంట్లోంచి మెగ్నీషియమ్, పొటాషియమ్ వంటి లవణాలు కూడా బయటకు వెళ్తాయి. వాటి స్థాయులు తగ్గడం వల్ల కండరాలు బిగుసుకుపోతాయి. ఎండలో క్రికెట్ ఆడే సమయంలో ఒంట్లోంచి చెమటలతో పాటు లవణాలు పోవడం వల్ల పెద్ద పెద్ద ఆటగాళ్లు కూడా కాళ్లు, పిక్కలు పట్టేసి, ఆడలేకపోవడాన్ని చూస్తుంటాం. మజిల్ క్రాంప్స్‌ని నివారించడానికి రోజూ 8 – 12 గ్లాసులకు తగ్గకుండా నీళ్లు తాగాలి. లవణాలను భర్తీ చేసుకోడానికి మెగ్నీషియమ్, పొటాషియమ్ వంటివి పుష్కలంగా ఉండే అరటిపండ్లు, కొబ్బరిబొండాలు తీసుకోవాలి. చల్లటి ప్రదేశంలో ఉంటే ఒంట్లోంచి నీళ్లు కోల్పోవడం జరగదు. అలా డీ–హైడ్రేషన్‌ను నివారించడం వల్ల మజిక్ క్రాంప్స్‌ను కూడా నివారించవచ్చు. 4.ఈ సీజన్లో ద్రవాహారం ఎందుకు ప్రిఫర్ చేస్తుంటారు? ముందుగా చెప్పినట్లుగా ఈ వాతావరణంలో కండరాలు బిగుసుకుపోవడం (మజిల్క్రాంప్స్)తోపాటు శరీర జీవక్రియలకూ ఆటంకం కలుగుతుంది. అందుకే... ఒంటికి తగినన్ని నీళ్లు, ఖనిజ లవణాలూ అందాలి. కాబట్టి ద్రవాహారం, పండ్లరసాలు, కొబ్బరినీళ్లు, మజ్జిగ వంటివి తాగాలి. 5. తీసుకోకూడని ద్రవాహారాలు కూడా ఉంటాయా? టీ, కాఫీలు, కెఫిన్ పాళ్లు ఎక్కువగా ఉండే కూల్‌డ్రింక్స్. అవి ద్రవరూపంలో ఉన్నప్పటికీ డీ–హైడ్రేషన్‌కు దారి తీస్తాయి. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో తీసుకోవాల్సి వచ్చినా చాలా మితంగా తీసుకోవాలి. ఇక ఆల్కహాల్ అయితే ఒంట్లోని నీళ్లను విపరీతంగా తోడేస్తుంది. 6.ఒళ్లు మరీ వేడెక్కిపోయినప్పుడు జరిగే అనర్థాలేమిటి? ఇప్పటికే ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరిగిపోయాయి. ఎండలో ఎక్కువ సేపు ఉంటే ఒంట్లోని నీరు ఆవిరై పోయి తలనొప్పి, వికారం (నాసియా), వాంతులురావచ్చు. నాడి వేగంగా కొట్టుకోవడం, శ్వాస వేగం పెరగడం (ఆయాసం), అయోమయం, కొద్దిపాటి విషయాలకే అతిగా ఉద్రేకపడటం, మాట ముద్దగా రావడం, స్పృహ తప్పడం వంటివి జరగవచ్చు. కొందరిలో ఫిట్స్ రావడం వంటి తీవ్రమైన పరిణామాలూ సంభవించవచ్చు. 7. జ్వరాన్ని తగ్గించుకోవడం ఎలా? ఒళ్లు బాగా వేడెక్కినప్పుడు ఆ వ్యక్తిని చల్లగా ఉన్న చోటికి తరలించాలి. చల్లటి నీళ్లలో ముంచిన టవల్‌తో ఒంటిని తుడవాలి. మెడ, బాహుమూలాలు, గజ్జలలో తడి గుడ్డ వేయాలి. తగినన్ని నీటిని తాగించాలి. 8. వేసవిలో చన్నీళ్ల స్నానం మంచిదేనా? మంచిదే. చన్నీళ్ల వల్ల చర్మం చల్లబడగానే ఆ ప్రాంతాలను వెచ్చబరచడానికి రక్తప్రసరణ పెరుగుతుంది. ఇది గుండె పంపింగ్ సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. అలాగని నీళ్లు మరీ చల్లగా ఉండరాదు. గోరువెచ్చగా ఉండాలి. 9.డీహైడ్రేషన్‌కు గురైతే సమస్యలేమిటి? డీహైడ్రేషన్‌కు గురైతే కండరాలు బిగుసుకుపోవడం, మూత్రసంబంధమైన సమస్యలు, కిడ్నీ దెబ్బతినడం, ఫిట్స్ రావడం, స్పృహతప్పిపడిపోవడం వంటివి జరుగుతాయి. 10.కార్డియాలజీ, హైబీపీ, డయాబెటిస్తో బాధపడుతున్నవారికి వేసవిలో జాగ్రత్తలు? కార్డియాలజీ, హైబీపీ, డయాబెటిస్తో బాధపడేవారు... మరింత నీరు నష్టపోకుండా చూసుకోవాలి. ఇది వారి ప్రధాన జాగ్రత్త. వాళ్లు ఈ సీజన్లో పొటాషియమ్ ఎక్కువగా ఉండే పండ్లను మితంగా తీసుకోవాలి. 11. వేసవిలో దోమలూ పెరుగుతాయి. ఈ డబుల్ డేంజర్‌ని అధిగమించడం? చిన్న నీటి గుంత ఉన్నా దోమలు గుడ్లు పెడతాయి. అందుకే ఇంటి చుట్టూ తాగేసిన కొబ్బరి బొండాలు, టైర్ల వంటివి లేకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. కిటికీలకు, డోర్స్‌కు మెష్ అమర్చుకోవాలి. ఇంకా అవసరమైతే మస్కిటో రిపల్లెంట్స్ వాడాలి. 12.అసలే ఉక్క. పైగా తలపై హెల్మెట్... తప్పదా? హెల్మెట్... ప్రాణరక్షణ కల్పించే ఉపకరణం. వేసవి నెపంతో దాన్ని వాడకపోవడం సరికాదు. హెల్మెట్ ఎండదెబ్బ నుంచి కూడా రక్షణనిస్తుంది. తక్కువ బరువుండే హెల్మెట్లు లేదా ఇటీవల వస్తున్న గాలి తగిలే బ్రీతింగ్ హెల్మెట్స్ వాడవచ్చు. 13.ఈ సీజన్లో చంకలు, గజ్జల్లో జబ్బులు పెరుగుతాయా? చంకలు, గజ్జల వంటి శరీర భాగాల్లో చర్మం ముడుతలు పడుతుంది, గాలి ధారాళంగా చేరదు, తడి పూర్తిగా ఆరదు. దాంతో ఫంగస్ అభివృద్ధి అయ్యి... గడ్డలు, ఫాలిక్యులైటిస్, లింఫెడినైటిస్, ఇన్ఫెక్షన్స్, ర్యాష్ వస్తుంటాయి. అందుకే ఈ సీజన్లో ఒంటికి అతుక్కుపోయినట్లుగా ఉండే దుస్తులను వేసుకోవద్దు. చెమ్మను పీల్చుకునే కాటన్ దుస్తులు మేలు. ఒంటికి సరిపడే పౌడర్‌ను వాడటం కూడా మంచిదే. 14.వేడి వల్ల గ్యాస్ట్రో ఎంటరాలజీ సమస్యలు ఉంటాయా? వేసవిలో సాధారణంగా ఆకలి మందగించి, దాహం పెరుగుతుంది. దాహార్తి తీర్చుకునే ప్రయత్నంలో బయట అపరిశుభ్రమైన ద్రవాలను తీసుకుంటే నీళ్ల విరేచనాలకు దారితీయవచ్చు. వేడిమి వల్ల కలిగే డీ–హైడ్రేషన్‌కు నీళ్ల విరేచనాలు తోడయితే దేహం విపరీతంగా నీటిని కోల్పోతుంది. 15.మరి వాటిని అధిగమించడం ఎలా? ►వేసవిలో చిన్న చిన్న మోతాదుల్లో ఎక్కువ సార్లు భోజనం తినాలి ►మసాలా ఆహారం బాగా తగ్గించాలి ∙ఆకుకూరలు, తాజాపండ్లు, పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవాలి ∙జీర్ణక్రియకు ఉపయోగపడే మెంతులు, సోంపు గింజలు, కొత్తిమీర, అల్లం ఎక్కువగా వాడాలి. 16.మైగ్రేన్ తలనొప్పి ఎక్కువయ్యే అవకాశాలుఉన్నాయా? అవును... అకస్మాత్తుగా వాతావరణంలో వచ్చే మార్పు మైగ్రేన్‌కు ట్రిగరింగ్ ఫ్యాక్టర్. అందుకే ఈ సీజన్ మైగ్రేన్ ఉన్నవారికి శాపంగా మారవచ్చు. అందుకే మైగ్రేన్ ఉన్న వారు బయటికి వెళ్లేటప్పుడు డార్క్ సన్ గ్లాసెస్ లేదా హ్యాట్స్ వాడాలి. 17. పాదరక్షల విషయంలో జాగ్రత్తలు? ఫుల్షూస్ తొడుక్కుంటే చెమట బాధిస్తుంటుంది. నైలాన్ సాక్స్ వేసుకుంటే ఫంగల్ ఇన్ఫెక్షన్లు, సెగ గడ్డలు రావచ్చు. అందుకే ఈ సీజన్లో ఫ్లిప్ ఫ్లాప్ షూస్, సాఫ్ట్ సోల్ పాదరక్షలు ధరించాలి. ఫుల్షూ ధరిస్తే, శుభ్రమైన కాటన్ సాక్స్ వాడాలి. 18.చలవ కళ్లజోడు షేడ్స్ డార్క్‌గా ఉండటం వల్ల కనుపాపను మరీ విప్పార్చుకుని చూస్తాం. దాంతో కంట్లోకి మరింత రేడియేషన్ వెళ్లడం నిజమేనా? అల్ట్రా వయొలెట్ రేడియేషన్‌ను తగ్గించేందుకు అవసరమైన సన్ గ్లాసెస్ వాడటం వల్ల ఎలాంటి హాని ఉండదు. అయితే అసలే వెలుగును ప్రసరింపజేయని మెర్క్యురీ గ్లాసెస్, నాణ్యత లేని అద్దాలు వద్దు. 19.ఎండాకాలం నల్లబడకుండా ఉండాలంటే? బయటకు వెళ్లేటప్పుడు సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. ఇంట్లో ఉన్నా సరే... డాక్టర్ సలహా మేరకు మీ ఒంటికి సరిపడే సన్‌స్క్రీన్ రాస్తే మేలు. 20.ఇళ్లలో ఉన్నా వేడిమి అనర్థాలు తప్పవా? వాటిని తప్పించుకోవడం ఎలా? వాతావరణంలో వేడిమి ఇంట్లోనూ ప్రభావం చూపుతుంది. ఆర్థిక స్తోమతను బట్టి గది చల్లగా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకుని సమశీతోష్టంగా ఉంచుకోవాలి. కిటికీలకు వట్టివేళ్లు, నేరుగా సూర్యకిరణాలు రాకుండా కర్టెన్లు అమర్చుకుంటే వేసవి అనర్థాలను తప్పించుకోవచ్చు. 21.దీర్ఘకాలిక వ్యాధులకు మందులు వాడేవారు ఏమైనా జాగ్రత్తలు పాటించాలా? వేసవిలో తాపానికి తగినంతగా తినకపోవడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గే అవకాశం ఉంది. కాబట్టి వేసవిలో నీళ్ల పాళ్లు ఎక్కువగా ఉండే సుమతులాహారం తీసుకోవాలి. పుచ్చ, దోస, కీర వంటివి తీసుకోవడం ద్వారా రోగనిరోధకశక్తి తగ్గకుండా చూసుకోవాలి. 22.వేసవిలో వర్కవుట్స్ ఎలా ఉండాలి? వేసవిలో వర్కవుట్స్ మానాల్సిన అవసరం లేదు. నేరుగా ఎండ పడే చోట, ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు వర్కవుట్స్ చేయరాదు. చల్లటి వేళ వ్యాయామం చేయవచ్చు, స్విమ్మింగ్ చేయవచ్చు. అయితే మధ్యాహ్నం స్విమ్మింగ్ చేయవద్దు. ఇండోర్ జిమ్ లేదా స్విమ్మింగ్ పూల్‌ను ఎంచుకోవాలి. 23.పోలీసులు, గృహనిర్మాణ రంగం, ఫీల్డ్ వర్కర్లు వంటి ఎండలో తిరగాల్సిన వారికి జాగ్రత్తలు? ఎండలో బయటకు వెళ్లే వారు నాణ్యమైన కళ్లజోడుతోపాటు చర్మానికి సన్‌స్క్రీన్ వాడాలి. ఒళ్లంతా కప్పి ఉంచే కాటన్ దుస్తులను ధరించాలి. ∙మరీ సుదీర్ఘంగా ప్రయాణం చేయకుండా, మధ్య మధ్య కొంత బ్రేక్ తీసుకోవాలి. ∙చల్లటి మంచినీళ్ల బాటిల్ వెంట ఉంచుకోవాలి. 24.గొడుగు గుడ్డ నల్లరంగులోనే ఉండటం వల్ల ప్రత్యేక ప్రయోజనం ఉంటుందా? కాంతిలో ఏడు రంగులు ఉంటాయి. ఈ ఏడు రంగులకూ వేర్వేరు ఫ్రీక్వెన్సీ ఉండటం వల్ల ఇవి ఏర్పడతాయి. అలా రేడియేషన్ ద్వారా కాంతిలోని ఆ ఏడు రంగులూ కలగలసి ప్రయాణం చేస్తాయి. ఈ క్రమంలో నల్లటి వస్తువు (బ్లాక్ బాడీ) కాంతిలోని అన్ని ఫ్రీక్వేన్సీలనూ తనలో ఇముడ్చుకుంటుంది. అందుకే అన్ని రేడియేషన్లనూ ఇముడ్చుకునే వస్తువును బ్లాక్ బాడీ అంటారు. అదే తెల్ల వస్తువు... అన్ని రేడియేషన్లనూ వెనక్కు మళ్లేలా రిఫ్లెక్ట్ చేస్తుంది. గొడుగుకు నల్ల గుడ్డ ఉపయోగిస్తే... కాంతి నుంచి వచ్చే ప్రతి కిరణపు రేడియేషన్‌ను ఆ గుడ్డ పూర్తిగా గ్రహిస్తుంది. కాబట్టి రేడియేషన్ అంతకంటే కిందికి ప్రవహించదు. 25.బయటి నుంచి ఇంట్లోకి రాగానే నీళ్లు తాగకూడదంటారు. అది అపోహేనా? బయటి నుంచి లోపలికి రావడం అంటే... ముందుగా చెప్పినట్లుగా ఆ సమయంలో మన నాడి కాస్త వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది. మన శ్వాసక్రియలు, గుండె వేగం కూడా కాస్త ఎక్కువే. అందుకే అవి ఒకింత నెమ్మదించాక నీళ్లు తాగడం మంచిది. డాక్టర్ వేదశ్వి రావు వెల్చాల కన్సల్టెంట్ – ఇంటర్నల్ మెడిసిన్ కిమ్స్ హాస్పిటల్స్, కొండాపూర్, హైదరాబాద్ -
'ఆరాధన కేసులో ఈ నెల 24లోపు నివేదిక ఇవ్వాలి'
హైదరాబాద్: ఉపవాస దీక్షతో మృతిచెందిన ఆరాధన కేసు వ్యవహారంపై గురువారం లోకయుక్తలో ఫిర్యాదు నమోదైంది. నగరానికి చెందిన ఓ వ్యాపారికి ఇటీవలి కాలంలో తరచూ నష్టాలు వస్తుండటంతో.. కుటుంబ సభ్యుల బలవంతంతో ఆయన పదమూడేళ్ల కూతురు ఆరాధన 68 రోజుల పాటు ఉపవాస దీక్ష చేసి డీహైడ్రేషన్‌కు గురై ఇటీవల మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ అంశంలో జోక్యం చేసుకున్న బాలల హక్కుల సంఘం లోకయుక్తలో ఫిర్యాదు చేసింది. ఆరాధన మృతికి కారకులైనవారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది. ఈ వ్యవహారంపై సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసి ఈ నెల 24 లోపు సమగ్ర నివేదికం అందించాలని నార్త్‌జోన్ డీసీపీకి లోకయుక్త ఆదేశాలు జారీ చేసింది. -
ఆపిల్ జ్యూస్‌తో గ్యాస్ట్రో, డీహైడ్రేషన్‌కు చెక్
టొరంటో: గ్యాస్ట్రో, డీహైడ్రేషన్ సమస్యలతో బాధపడుతున్న పిల్లలకు ఆపిల్ జ్యూస్‌తో మంచి ఉపశమనం లభిస్తుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సమస్యలతో బాధపడుతూ వైద్య చికిత్స చేయించుకున్న పిల్లలకంటే ఆపిల్ జ్యూస్ సేవించిన పిల్లల ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ‘గ్యాస్ట్రో, డిహైడ్రేషన్ సమస్యలు చాలా సాధరణమైనవే అయినా వీటితో బాధపడుతున్నవారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటోంది. ఇటువంటివారు ఆపిల్ జ్యూస్ తాగడం వల్ల సమస్యలు రాకుండా అడ్డుకట్ట పడుతుంది. అయితే తక్కువ డిహైడ్రేషన్కు గురైన పిల్లల్లో మాత్రం ఆపిల్ జ్యూస్ ఎటువంటి ఫలితాన్నివ్వలేకపోయింది. 6 నుంచి 60 నెలల పిల్లలపై జరిపిన పరిశోధనల్లో ఈ విషయం రుజువైంద’ని కాల్గరీ యూనివర్సిటీ(కెనడా) శాస్త్రవేత్త ఒకరు తెలిపారు. -
మొటిమలకు చెక్..
బ్యూటిప్స్ ముఖంపై ఏ భాగంలో ఈ మొటిమలు ఎందుకు వస్తాయో తెలిస్తే వాటి నుంచి ఎవరైనా సత్వర ఉపశమనం పొందొచ్చు.. అదెలా అనుకుంటున్నారా..? అయితే ఇలా తెలుసుకోండి. నుదురు మీద: టీనేజ్ వారి నుంచి వయసు పైమళ్లిన వారి వరకు చాలామందికి నుదుటి మీద మొటిమలు వస్తుంటాయి. వీటికి ముఖ్య కారణాలు అజీర్తి, డీహైడ్రేషన్. దాని కోసం రోజుకు వీలైనన్ని ఎక్కువ గ్లాసుల నీరు తీసుకుంటే సరి. అజీర్తి చేయకుండా ఉండాలంటే పౌష్టికాహారం తీసుకోవడంతో పాటు టైమ్‌కు తినేయాలి. టీ జోన్: టీనేజర్లకు ఎక్కువ మొటిమలు అయ్యేది ఈ టీ జోన్లోనే. అంటే ముక్కు, నుదురు భాగాల్లో. ఇక్కడ మొటిమలు అవుతున్నాయంటే కారణం కాలేయ సంబంధిత సమస్య ఉందని అర్థం. అందుకు కొవ్వు పదార్థాలు, జిగురు పదార్థాలు ఆహారంలో లేకుండా చూసుకోవాలి. బుగ్గలపై: ఎంతో అందంగా ఉండే బుగ్గలపై మొటిమలు వస్తుంటాయి. ఇది ఊపిరితిత్తులకు సంబంధించిన అంశం. పొగ తాగటం, కాలుష్యపూరిత వాతావరణంలో తిరగడం మూలాన బుగ్గలపై మురికి ఏర్పడి అవి మొటిమలు ఏర్పడటానికి కారణమవుతుంది. అలాగే ఈ మధ్య స్మార్ట్ఫోన్లతో ఎక్కువగా మాట్లాడటం వల్ల వాటిపై ఉండే దుమ్ము, ధూళి ముఖ చర్మానికి తగిలి మొటిమలు అవుతున్నాయి ఎంతోమందికి. వీటి నుంచి ఉపశమనం పొందాలంటే బయటికి వెళ్లినప్పుడు ముఖానికి ప్రొటెక్టివ్ లోషన్ రాసుకోవడం, ఫోన్‌ను యాంటీ బ్యాక్టీరియల్ లోషన్‌తో రోజూ తుడవడం చేయాలి. పిల్లో కవర్లను తరచూ శుభ్రం చేసుకోవడం కూడా ముఖ్యం. నోటి చుట్టూ: దంత సమస్యలున్నవారికి ఈ ప్రాంతాల్లో ప్రభావం చూపుతుంది. దాని కోసం షుగరీ ఫుడ్స్, సోడా లాంటివి తీసుకోవడం మానేయాలి. అలాగే రోజుకు రెండుసార్లు బ్రష్ చేసుకుంటూ కాఫీ, టీలు తాగడం తగ్గించాలి. చెవి భాగం: ఇక్కడ మొటిమలు అవుతున్నాయంటే శరీరం డీహైడ్రేట్ అవడంతో పాటు కిడ్నీ పనితీరులో సమస్య ఉందని అర్థం. అంతే కాకుండా ఆహారంలో ఉప్పుశాతాన్ని ఎక్కువ తీసుకున్నా ఈ ఇబ్బంది వస్తుంది. దాని కోసం వీలైనన్ని గ్లాసుల నీళ్లు తాగాలి. అలాగే తలస్నానం చేసేప్పుడు కండీషనర్‌ను, నూనెను సరిగ్గా శుభ్రం చేసుకోకపోయినా చెవి భాగం దగ్గర మొటిమలు వస్తాయి. చుబుకం(చిన్) కింది భాగం: ఈ ప్రాంతంలో మొటిమలు అవుతున్నాయంటే చిన్న ప్రేగులో ఏదో సమస్య తలెత్తిందని గుర్తించాలి. అలాగే హార్మోన్ల అస్థిరత కారణంగా కూడా మొటిమలు వస్తుంటాయి. అంతేకాకుండా బోర్ కొట్టినప్పుడు, ఏదో ఆలోచిస్తున్నప్పుడు, అలసిపోయినప్పుడు చాలా మంది చుబుకం కింద చేతులు పెట్టుకొని కూర్చుంటారు. అలా చేయడం వల్ల చేతి వేళ్లలో ఉండే ఆయిల్ చిన్భాగంలోకి వెళ్లి మొటిమలు తయారవుతాయి. -
డీహైడ్రేషన్‌తో చాలా సమస్యలు..
కొత్త పరిశోధన డీహైడ్రేషన్‌ను అంత తేలికగా తీసుకోరాదని, నిజానికి అదే పెద్ద సమస్య అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. డీహైడ్రేషన్ వల్ల నోటి దుర్వాసన, చర్మం పొడిబారటం, మలబద్ధకం వంటి సమస్యలే కాకుండా, అలాంటి పరిస్థితిలో డ్రైవింగ్ చేసినట్లయితే ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. డీహైడ్రేషన్ వల్ల వ్యాయామం చేసేటప్పుడు త్వరగా అలసట ముంచుకొస్తుందని... శరీరంలో కేవలం రెండు శాతం నీరు లోపిస్తే, శారీరక శ్రమతో కూడిన పనుల్లో పదిశాతం మేరకు పనితీరు తగ్గుతుందని వివరిస్తున్నారు. డీహైడ్రేషన్‌కు గురైనప్పుడు రక్తపోటు పడిపోవడంతో పాటు గుండె కొట్టుకునే వేగం పెరుగుతుందని, కండరాల్లో నీరు తగ్గిపోవడం వల్ల కాస్త శ్రమని కూడా శరీరం తట్టుకోలేని స్థితి ఏర్పడుతుందని లాస్ ఏంజెలిస్‌లోని కెర్లాన్-జోబ్ ఆర్థొపెడిక్ క్లినిక్‌కు చెందిన క్రీడా వైద్య నిపుణుడు లుగా పొడేస్టా వివరిస్తున్నారు. -
నిరాహారదీక్షలో విషాదం
సితాపూర్: 17 ఏళ్లుగా మూతపడి ఉన్న సుగర్ మిల్లును తెరిపించాలని జరుగుతున్న ఆందోళనలో విషాదం చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్ మహోలీలో నిరాహారదీక్ష చేస్తున్న 40 ఏళ్ల మహిళా కార్మిక నేత రామ్రాఠి శుక్రవారం సాయంత్రం అసువులు బాశారు. ఒక వైపు ఎండలు, మరోవైపు నిరాహార దీక్ష ఆమె ఉసురు తీశాయి. తమ డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ స్థానిక కార్మిక సంఘం ఆధ్వర్యంలో 30 మంది ఆందోళనకారులు ఈ దీక్షకు దిగారు. ఈ సందర్భంగా రామ్ రాఠి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయినా ఫలితం లేదు. డీహైడ్రేషన్ కారణంగా ఆమె చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. వేడిగాలుల తీవ్రతకు తట్టుకోలేక ఆమె చనిపోయిందనీ, ఆందోళన విరమించమని విజ్క్షప్తి చేసినా పట్టించుకోని ఆందోళనకారులపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.