
Kidney Stones Can Now be Removed Easily: సాధారణంగా చలికాలంలో నీళ్లు తక్కువగా తాగుతుండటం వల్ల, వేసవిలో విపరీతంగా దాహం కారణంగా ఎంత తాగినా ఆవిరైపోవడం వల్ల డీ–హైడ్రేషన్ సమస్య రావచ్చు. ఇది కిడ్నీలో రాళ్లు పెరిగేందుకు ఆస్కారం ఇస్తుంది. అందుకే ఎప్పుడూ తగినన్ని నీళ్లు తాగుతూ దేహాన్ని నిత్యం హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి. ఒకవేళ మూత్రపిండాల్లో రాళ్లు వచ్చినా ఆందోళన పడాల్సిన పనిలేదు. వాటి సైజు చాలా చిన్నగానే ఉంటే... ఎక్కువగా నీళ్లు తాగడం, ద్రవాహారాలు తీసుకోవడం వల్ల అవే పడిపోతాయి. పెద్దగా ఉన్న సమయంలో కొన్ని చికిత్సలతో వాటిని తొలగించవచ్చు. కాబట్టి ఆందోళన అక్కర్లేదు.
►మూత్రపిండాల్లో రాళ్ల నిర్ధారణకు రక్త, మూత్ర పరీక్షలతో పాటు ఎక్స్‌రే, ఐవిపి, అల్ట్రాసౌండ్, సిటిస్కాన్‌వంటి పరీక్షలు అవసరమవుతాయి.
చికిత్సలో భాగంగా శబ్దతరంగాల సహాయంతో కిడ్నీలోని రాయిని చిన్న చిన్న పలుకులుగా పేల్చివేస్తారు. దాంతో అవి మూత్ర విసర్జన సమయంలో బయటకు వెళ్లిపోతాయి. ఈ ప్రక్రియను ‘ఎక్స్‌ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ లిథోట్రిప్సీ’ అంటారు. చిన్న పలుకుల్లాంటి రాళ్లు బయటకు వచ్చే సమయంలో, అవి మూత్రనాళాల గోడలతో ఒరుసుకుపోయి, గాయం కాకుండా ఉండేందుకు మూత్రవిసర్జన మార్గం ద్వారా... కిడ్నీలు – మూత్రాశయానికి మధ్యన ఓ ట్యూబ్ వేస్తారు. దీనిని యూరెటెరిక్ స్టెంట్ అంటారు. దీన్ని కొద్దిరోజుల వరకు అలాగే ఉంచాల్సి రావచ్చు. చిన్నముక్కలుగా మారిన ఆ రాతి పలుకులన్నీ తొలగిపోయాక దీన్ని తొలగిస్తారు. దీన్ని చాలా సులభంగా ఔట్ పేషెంట్ విభాగంలోనే తొలగించవచ్చు.