డీహైడ్రేషన్ చికిత్సకు ఓఆర్‌ఎస్‌అనుకొని ప్యాకేజ్డ్ పండ్ల రసాలు వాడుతున్న బాధితులు
దీనివల్ల ఆరోగ్యం మరింత క్షీణించి ప్రాణానికే ముప్పు వస్తుందంటున్న వైద్యులు
డబ్ల్యూహెచ్‌ఓ ఫార్ములా ఓఆర్‌ఎస్‌లనే వాడాలని సూచన
సాక్షి, హైదరాబాద్: వేసవిలో చాలా మందికి ఎదురయ్యే సమస్య డీహైడ్రేషన్. అయితే దీని చికిత్సకు తక్షణ పరిష్కారంగా బాధితులు మెడికల్ షాపుల నుంచి ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్ (ఓఆర్‌ఎస్)ను పోలిన వాటిని వాడుతూ మరింత అనారోగ్యం పాలవుతున్న ఉదంతాలు హైదరాబాద్‌లో ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా చిన్నారుల్లో ఈ సమస్య మరింతగా కనిపిస్తోంది. దీనికి కారణం బాధితులు వినియోగించినవి నిజమైన ఓఆర్‌ఎస్‌లు కాకపోవడమేనని వైద్యులు నిర్ధారిస్తున్నారు. ప్రస్తుతం నగరవాసులు వినియోగిస్తున్న వాటిలో అనేకం నిజానికి ఓఆర్‌ఎస్‌లు కావని... అవి కేవలం ప్యాకేజ్డ్ పండ్ల రసాలు మాత్రమేనని స్పష్టం చేస్తున్నారు. అవగాహన లేమితో వాటిని వినియోగించడం అనర్థాలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు.
సరైన చికిత్స తీసుకోకుంటే ప్రాణాపాయమే..
ఆకస్మిక అనారోగ్యం తద్వారా నీళ్ల విరేచనాలు, వాంతుల వల్ల శరీరం నుంచి లవణాలు,నీరు అధికంగా కోల్పోవడాన్నే డీహైడ్రేషన్‌గా పేర్కొంటారు. ఈ పరిస్థితి ఏర్పడడం వల్ల శరీరంలో రక్తసరఫరా తగ్గిపోతుంది. అది అనంతరం ఫిట్స్ రావడానికి లేదా కిడ్నీ ఫెయిల్ కావడం వంటి తీవ్ర సమస్యలకు కూడా దారితీయొచ్చు. ఈ ప్రమాదాల్ని నివారించడానికి బాధితులకు వెంటనే ఓఆర్‌ఎస్ ఇవ్వాలని వైద్యులు సూచిస్తుంటారు. డీహైడ్రేషన్ ద్వారా మనం కోల్పోయిన నీటిని, లవణాలను భర్తీ చేసేదే ఓఆర్‌ఎస్.
అలవాటులో పొరపాటుగా...
కానీ భాగ్యనగరంలో అనేక మంది డీహైడ్రేషన్‌కు గురవగానే ఓఆర్‌ఎస్‌లుగా భావించి వాటిని పోలిన పేర్లతో ఉండే వాటిని వినియోగిస్తున్నారు. ఆకర్షణీయమైన ప్యాకింగ్‌తో కనిపించే వాటిని ఓఆర్‌ఎస్‌ఎల్ అని, రీబ్యాలెన్స్ విట్ ఓఆర్‌ఎస్ మొదలైన పేర్లతో కంపెనీలు అందుబాటులోకి తెచ్చాయి. అయితే వీటిని ఓఆర్‌ఎస్‌గా వాడకూడదని చిన్న అక్షరాల్లో ఓ మూలకు రాస్తుండటంతో చాలా మంది వాటిని గమనించక ఓఆర్‌ఎస్‌గా భావించి వాడుతున్నారు.
రివర్స్ రిజల్ట్...
పండ్ల రసాలను ఓఆర్‌ఎస్‌గా భ్రమింపజేసేలా లేబుల్ అతికించి విక్రయించడంపై ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (ఐఎపి) వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇవి అధిక చక్కెరను కలిగి ఉంటాయని, అతిసారాన్ని తగ్గించే బదులు మరింత పెంచుతాయని హెచ్చరిస్తున్నారు. చక్కెర శాతం అధికంగా ఉండే జ్యూస్‌ల వాడకం వల్ల మనం ఏ ప్రయోజనం ఆశించి వాటిని తీసుకుంటున్నామో వాటికి పూర్తి వ్యతిరేక ఫలితాలు వస్తాయని చెబుతున్నారు. అంటే విరేచనాలు, వాంతులు మరింతగా పెరుగుతాయని వివరిస్తున్నారు.
డబ్ల్యూహెచ్‌ఓ ఫార్ములా కీలకం...
కేవలం డబ్ల్యూహెచ్‌ఓ ఫార్ములాను అనుసరించి తయారైన ఓఆర్‌ఎస్‌లనే వాడాలని ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (ఐఓపీ) వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. డబ్ల్యూహెచ్‌ఓ సిఫార్సు చేసిన ఫార్ములా ప్రకారం తయారైన ఓఆర్‌ఎస్‌లో సోడియం క్లోరైడ్, గ్లూకోజ్, పొటాíÙయం క్లోరైడ్, ట్రైసోడియం సిట్రేట్ మాత్రమే ఉంటాయని... కాచి చల్లార్చిన లీటర్ నీటిలో ఈ మిశ్రమాన్ని కలిపి 24 గంటల వ్యవధిలో తాగితే డయేరియా వల్ల కలిగే నిర్జలీకరణాన్ని సమర్థంగా ఎదుర్కోవడానికి ఉపకరిస్తుందని వైద్యులు చెబుతున్నారు.
అవగాహన కల్పించాలి..
ఈ సమస్యపై కొన్నేళ్లుగా రకరకాల వేదికలపై పోరాడుతున్నా. అసలైన ఓఆర్‌ఎస్‌ను పోలిన లేబుల్స్‌తో ఉన్న ప్యాకేజ్డ్ జ్యూస్‌లను వాడటం వల్ల చిన్నారులు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్న ఉదంతాలు పెరుగుతున్నాయి. దీనిపై వినియోగదారుల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది.
– డాక్టర్ శివరంజని సంతోష్, పిల్లల వైద్య నిపుణురాలు
Comments
Please login to add a commentAdd a comment