నిరాహారదీక్షలో విషాదం
సితాపూర్: 17 ఏళ్లుగా మూతపడి ఉన్న సుగర్ మిల్లును తెరిపించాలని జరుగుతున్న ఆందోళనలో విషాదం చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్ మహోలీలో నిరాహారదీక్ష చేస్తున్న 40 ఏళ్ల మహిళా కార్మిక నేత రామ్రాఠి శుక్రవారం సాయంత్రం అసువులు బాశారు. ఒక వైపు ఎండలు, మరోవైపు నిరాహార దీక్ష ఆమె ఉసురు తీశాయి. తమ డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ స్థానిక కార్మిక సంఘం ఆధ్వర్యంలో 30 మంది ఆందోళనకారులు ఈ దీక్షకు దిగారు.
ఈ సందర్భంగా రామ్ రాఠి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయినా ఫలితం లేదు. డీహైడ్రేషన్ కారణంగా ఆమె చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. వేడిగాలుల తీవ్రతకు తట్టుకోలేక ఆమె చనిపోయిందనీ, ఆందోళన విరమించమని విజ్క్షప్తి చేసినా పట్టించుకోని ఆందోళనకారులపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.