వడలిన ప్రాణాలు
- ఒక్క రోజే వడదెబ్బకు 16 మంది మృతి
- విశాఖలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
- ఎండ తీవ్రతతో అల్లాడిన జిల్లా జనం
- మరో రెండు రోజులు ఇదే పరిస్థితి
విశాఖ రూరల్ : ఎండ ప్రచండానికి జనం పిట్టల్లారాలిపోతున్నారు. రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు విలవిలల్లాడుతున్నారు. ఉక్కపోత ఒకవైపు ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. ఉడికించేలా వేడిగాలులు ఊపిరాడకుండా చేస్తున్నాయి.మూడు రోజులుగా అనూహ్యంగా వాతావరణంలో మార్పుల తో బెంబేలెత్తిపోతున్నారు. రోడ్ల మీదకు రావాలంటే భయపడుతున్నారు. బుధవారంతో పోలిస్తే ఒక్క రోజు వ్యవధిలోనే గురువారం జిల్లాలో 3-4 డిగ్రీల ఉష్ణోగ్రత అధికంగా నమోదయింది. కేవలం గురువారం ఒక్కరోజే 16 మంది వడదెబ్బకు చనిపోవడం పరిస్థితికి అద్దం పడుతోంది.
గత మూడు రోజులుగా ఎండలకు మొత్తం 24 మంది మరణించారు. జిల్లాలోని తీర ప్రాంత గ్రామాల్లో పరిస్థితి భయానకంగా ఉంది. ఒక్క నక్కపల్లి మండలంలోనే సోమవారం ఇద్దరు, బుధవారం నలుగురు మృతి చెందగా గురువారం మరో నలుగురు చనిపోయారు. వడగాల్పులకు తట్టుకోలేక నక్కపల్లికి చెందిన నడిగట్ల అప్పలనర్స(60), ఉద్దండపురానికి చెందిన తుమ్మల రాజారావు(62), సీతంపాలెం గ్రామానికి చెందిన గదుల అప్పారావు(60)లు గురువారం కన్నుమూశారు. ఇదే మండలం అప్పలపాయకరావుపేటకు చె ందిన దస్తగిరి(60) నక్కపల్లి నుంచి స్వగ్రామానికి వెళుతుండగా మార్గమధ్యలో కుప్పకూలిపోయాడు.
స్థానికులు సపర్యలు చేసే లోపు ప్రాణాలు విడిచాడు. అలాగే కె.కోటపాడు మండలం భీమవరం గ్రామానికి చెందిన వల్లంశెట్టి సముద్రం(72) వడదెబ్బకు గురై మృతిచెందాడు. ఎండకు తాళలేక ఆందోళనకు గురైన సముద్రంను ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నిస్తుండగా చనిపోయాడు. తగరపువలస సప్తగిరి థియేటర్ వద్ద గురువారం మధ్యాహ్నం కొచ్చెర్ల సంతోష్(28) అనే కార్పెంటర్ వడదెబ్బకు గురయ్యాడు. విశాఖ పెదవాల్తేరు కాగితాల వీధికి చెందిన ఇతడు విజయనగరం జిల్లా భోగాపురంలో కార్పెంటర్ పనులు చేస్తున్నాడు. అక్కడి నుంచి వస్తూ తగరపువలసలో కుప్పకూలిపోయాడు.
కశింకోట మండలంలో మరో నలుగురు చనిపోయారు. ఈ మండలం వెదురుపర్తికి చెందిన కాండ్రేగుల రాము (45) వికలాంగుడు. కశింకోట వారపు సంతలో గురువారం యాచన అనంతరం ఇంటి ముఖం పట్టాడు. పాలకేంద్రం వద్దకు చేరే సరికి సొమ్మసిల్లి పడిపోయాడు. స్థానికులు ఉపశమన చర్యలు చేశారు. 108కు సమాచారం అందించారు. సిబ్బంది వచ్చి పరీక్షించే సరికిచనిపోయాడు. ఇదే మండలం వెదురుపర్తిలో ముత్తుర్తి దొరబాబు(55) వడదెబ్బతో మృతి చెందాడు. జి.భీమవరానికి చెందిన ముత్తా కొండయ్య (90) ఎండకు తాళలేక ఇంటి వద్దే మృతి చెందాడు. ఇదే గ్రామానికి చెందిన కరణం బాబులు(90) కూడా తీవ్ర అస్వస్థతకు గురయి చనిపోయాడు.
మండల కేంద్రం చీడికాడకు చెందిన నెల్లి మహా లక్ష్మి (65) గురువారం సాయంత్రం వడదెబ్బకు గురయి మృతిచెందినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. ఆనందపురం మండలం గుడిలోవకు చెందిన దనియాల రామారావు(52) గ్రామ సమీపంలోని కొండపైకి కట్టెలకు వెళ్లాడు. తిరిగొచ్చి దాహమంటూ మంచంపై పడుకున్నాడు. భోజనం కోసం భార్య కళావతి లేపబోగా చనిపోయాడు. యలమంచిలి మునిసిపాలిటీ ధర్మవరానికి చెం దిన గొల్లవిల్లి వెంకటరమణ ఎండతీవ్రతకు అస్వస్థతకు గురయ్యాడు. అతనిని విశాఖకు తరలిస్తుండగా అనకాపల్లి సమీపంలో మృతి చెందాడు.
అనకాపల్లి పట్టణంలో ని గవరపాలెం శంకర్ థియేటర్ వద్ద ఉంటున్న ఆడారి సుబ్బలక్ష్మి (60) రెండు రోజులుగా కాస్తున్న ఎండలకు వడదెబ్బకు గురయి మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక్కడి రైల్వేస్టేషన్‌లో వడదెబ్బకు శరగడం కృష్ణ (55) మృతి చెందాడు. రోజూ విశాఖపట్నానికి వివిధపనులపై రాకపోకలు సాగించే ఇతడు ఎండకు తాళలేక రైల్వేస్టేషన్‌లో చనిపోయి ఉండడాన్ని తోటి ప్రయాణికులు గుర్తించారు. చోడవరం మండలం కన్నం పాలెం గ్రామానికి చెందిన కోవెల రామలక్ష్మి(52) ఎండ తీవ్రతకు అస్వస్థతకు గురై గురువారం రాత్రి మృతి చెం దింది.
వడదెబ్బకు గురయిన ఆమెకు కుటుంబ సభ్యులు సపర్యలు చేసినప్పటికి ఫలితం లేకుండా పోయింది.
రెండు రోజులుగా వడగాడ్పుల తీవ్రతకు ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. మరో రెండు రోజులపాటు జిల్లాలో ఇదే పరిస్థితి కొనసాగనున్నట్టు వాతావరణ కేంద్రం తెలిపింది. వాయుగుండం పెకైళ్తూ తేమను కూడా వెంట తీసుకుపోవడం వల్లే ఈ దుర్భర పరిస్థితులు నెలకొన్నట్టు వాతావరణ నిఫుణులు చెప్తున్నారు. గాలిలో తేమ శాతం కూడా భారీగా తగ్గిందన్నారు. గతంలో 80-90 శాతం మధ్య ఉండే తేమ గురువారం 47-57 శాతానికే పరిమితమయింది. దీంతో ఉష్టతాపానికి శరీరం నుంచి చెమట ధారాపాతంగా కారి వడలిపోయే పరిస్థితులు పెరిగాయి. చాలా మంది డీహైడ్రేషన్‌కు గురై ఆస్పత్రులపాలయ్యారు.