పీడియాట్రిక్ కౌన్సెలింగ్
మా బాబు వయస్సు ఎనిమిదేళ్లు. ఈ మధ్య వాడికి నోట్లో పొక్కులు వస్తున్నాయి. దీనికి కారణం ఏమై ఉంటుంది. వాడి సమస్యకు పరిష్కారం చెప్పండి.
– సునంద, హైదరాబాద్
మీ బాబుకు ఉన్న కండిషన్‌ను యాఫ్తస్ అల్సర్స్ లేదా యాఫ్తస్ స్టొమటైటిస్ అంటారు. ఈ పొక్కులు ముఖ్యంగా నోట్లో, పెదవులు, గొంతుపై భాగం (అప్పర్ థ్రోట్)లో ఎక్కువగా వస్తుంటాయి. ఓరల్ క్యావిటీలో ఇవి ఎక్కడైనా రావచ్చు. నోటిలో ఉండే పొర (మ్యూకస్ మెంబ్రేన్)లో పగుళ్లు రావడం వల్ల ఈ అల్సర్ వస్తాయి. వీటికి ఫలానా అంశమే కారణమని నిర్దిష్టంగా చెప్పడానికి ఉండదు. కాని నిమ్మజాతి (సిట్రస్) ఫ్రూట్స్, పులుపు పదార్థాలు ఎక్కువగా తిన్నప్పుడు, బాగా కారంగా ఎక్కువ మసాలాలతో ఉండే ఆహారం తీసుకున్నప్పుడు ఇవి రావచ్చు. కొందరిలో ఇవి విటమిన్ బి12, ఐరన్, ఫోలిక్ యాసిడ్, జింక్ లోపాలతోనూ రావచ్చు. అత్యధిక సాంద్రత ఉన్న టూత్‌పేస్టులు వాడేవారిలో, ఎక్కువ మానసిక ఒత్తిడికి గురయ్యేవారిలో ఇవి కనిపిస్తాయి. కొందరిలో ఇవి బాగా అలసిపోయిన (ఫెటిగ్) సందర్భాల్లో చూస్తూ ఉంటాం. మరికొందరిలో జబ్బుపడ్డప్పుడు కనిపిస్తాయి. కొన్ని హార్మోన్ల అసమతౌల్యత వల్ల, జీర్ణకోశవ్యాధులు ఉన్న సందర్భాల్లోనూ ఇవి కనిపించవచ్చు. ఇవి రాకుండా నివారించడానికి కొన్ని చర్యలు... ∙నోటికి బాధ కలిగించే పదార్థాలు తీసుకోకపోవడం ∙పుల్లని పదార్థాలు అవాయిడ్ చేయడం. ∙నోరు ఒరుసుకుపోయే ఆహారపదార్థాలు (అబ్రేసివ్ ఫుడ్స్) తీçసుకోకపోవడం. నోటి పరిశుభ్రత (ఓరల్ హైజీన్) పాటించడం వంటివి చేయాలి. ఈ సమస్య మరీ ఎక్కువగా ఉన్నప్పుడు లోకల్ అనస్థిటిక్ జెల్స్‌తో పాటు కార్టికోస్టెరాయిడ్స్, సిల్వర్ నైట్రేట్‌తో పాటు ఓరల్ యాంటీబయాటిక్స్ వాడాలి. సమస్య మాటిమాటికీ వస్తుంటే నాన్ ఆల్కహాలిక్ మౌత్‌వాష్, లో కాన్సంట్రేటెడ్ మౌత్ వాష్ వాడవచ్చు.ఇక మీ బాబు విషయానికి వస్తే నోటి పరిశుభ్రత (గుడ్ ఓరల్ హైజీన్) పాటించడంతో పాటు అతడికి విటమిన్ బి12, జింక్ సప్లిమెంట్స్ ఇవ్వండి. లోకల్ అనస్థిటిక్ జెల్స్ కూడా వాడవచ్చు. సమస్య మరీ తీవ్రంగా ఉంటే మీ పిల్లల వైద్య నిపుణుడిని కలిసి చికిత్స తీసుకోండి. ఆందోళన పడాల్సిన అవసరం లేదు.
బాబు స్కూల్ ప్రేయర్‌లో కళ్లు తిరిగి పడిపోయాడు...
మా బాబుకు పదేళ్లు. వాడు ప్రేయర్ సమయంలో కళ్లు తిరిగిపడిపోయాడు. రెండుసార్లు ఇలా జరిగింది. మొదటిసారి ఏమీ భయపడలేదు గానీ రెండోసారి జరగడం వల్ల ఆందోళనగా ఉంది. దయచేసి మా అబ్బాయి విషయంలో తగిన సలహా ఇవ్వండి. – హేమలత, నెల్లూరు
మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తుంటే మీ బాబుకు ఉన్న సమస్యను సింకోప్ లేదా సడన్ లాస్ ఆఫ్ కాన్షియస్‌నెస్‌గా చెప్పవచ్చు. ఇది చాలా మంది పిల్లల్లో కనిపించేదే. పిల్లల్లో ఈ సమస్య కనిపించడానికి కారణాలనేకం. అందులో ప్రధానమైనది ఆర్థోస్టాకిక్ హైపోటెన్షన్. అంటే పిల్లల పొజిషన్స్‌లో మార్పుల వల్ల వాళ్లలో రక్తపోటు తగ్గి ఇలా జరగుతుంటుంది. కొన్ని సందర్భాల్లో న్యూరో కార్డియోజెనిక్ మార్పులు, గుండె సమస్యలు కూడా కారణం కావచ్చు. కొందరు పిల్లల్లో రక్తంలో గ్లూకోజ్ పాళ్లు తగ్గడం, ఫిట్స్, మైగ్రేన్, ఊపిరి బిగబట్టడం (బ్రెత్ హోల్డింగ్ స్పెల్స్) వంటివి ఇందుకు కారణమవుతాయి.
అయితే పిల్లాడు మాటిమాటికీ పడిపోతుంటే డాక్టర్ సలహా తీసుకోవాలి. గుండెకు సంబంధించిన రుగ్మతలు ఉన్నాయేమో అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. గుండెకు సంబంధించిన సమస్య లేదని నిర్ధారణ అయితే కాస్త నిశ్చింతగా ఉండవచ్చు. ఇక పైన పేర్కొన్న ఇతర కారణాలు ఏమైనా కావచ్చేమో అని తెలుసుకోవడం కూడా అవసరం. అరుదుగా ఫిట్స్‌కూడా ఈ రకంగానే కనిపించవచ్చు.
సాధారణంగా చాలా ఎక్కువగా భయం కలగడం వల్ల, తీవ్రమైన నొప్పి వల్ల, భయానక దృశ్యాలు చూడటం వల్ల లేదా డీహైడ్రేషన్ వల్ల అకస్మాత్తుగా కొద్దిసేపు స్పృహ కోల్పోయే ప్రమాదం ఉంది. ఎలక్ట్రోలైట్స్ ఎక్కువగా ఉండే కొబ్బరినీళ్ల వంటివి తాగించటం, పిల్లలు కింద కూర్చుని పైకి లేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండటం వంటివి ఈ సమస్య నివారణకు బాగా తోడ్పడే జాగ్రత్తలు.
మీ బాబుకి పైన పేర్కొన్న కొద్దిపాటి జాగ్రత్తలతో అంతా సర్దుకుంటుంది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే మీరు మరొకసారి మీ పీడియాట్రీషియన్‌ను సంప్రదించి తగిన సలహా, చికిత్స తీసుకోండి.
డా. రమేశ్‌బాబు దాసరి,
సీనియర్ పీడియాట్రీషియన్,
రోహన్ హాస్పిటల్స్,
విజయనగర్ కాలనీ, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment