ఎవరైనా సరే, నోటిని సరిగా శుభ్రం చేయకపోతే దుర్వాసన రావడం సహజం.. అయితే చిగుళ్ల వాపు లేదా దంత సంబంధమైన వ్యాధులు ఏమీ లేకుండా... సక్రమంగా బ్రష్ చేసిన తర్వాత కూడా నోటి నుంచి వాసన వస్తుంటే, దానిని అంత తేలికగా తీసిపారేయడానికి వీలులేదని, కొన్ని రకాల ఇతర వ్యాధులకు సంకేతంగా భావించి దాని గురించి శ్రద్ధ వహించమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నోటి దుర్వాసన అనేది ఆహారపు అలవాట్లు, నోటి పరిశుభ్రతపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల, దంతవైద్యులు రోజుకు రెండుసార్లు బ్రష్ చేయాలని, భోజనం తర్వాత నోటిలో నీళ్లు పోసుకుని పుక్కిలించి నోటిని శుభ్రం చేయమని చెబుతుంటారు. ఇవి పాటించిన తర్వాత కూడా మీ నోటి నుంచి దుర్వాసన వస్తుంటే, అది శరీరంలో ఇప్పుడిప్పుడే తొంగి చూస్తున్న కొన్ని వ్యాధులకు సంకేతం కావచ్చు.
కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు..
సైనసైటిస్, బ్రాంకైటిస్, న్యుమోనియా వంటి శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల వల్ల కూడా నోటి దుర్వాసన వచ్చే అవకాశం ఉంది. దీనితోపాటు, ఈ ఇన్ఫెక్షన్లు సంభవించినప్పుడు, శ్వాసకోశంలో బ్యాక్టీరియా పెరుగుతుంది. దీని కారణంగా వాసన కలిగించే మూలకాలు ఏర్పడి ఇవి గాలి వదిలినప్పుడు దుర్వాసన వచ్చేలా చేస్తాయి.
జీర్ణ సమస్యలు..
కడుపులో ఉండే ఆమ్లాలు అన్నవాహికలోకి ప్రవహించినప్పుడు యాసిడ్ రిఫ్లక్స్ సంభవిస్తుంది. దీనివల్ల నోటిలో పుల్లని తేన్పులతోపాటు వాసన కూడా వస్తుంటుంది.
కిడ్నీవ్యాధులు..
మూత్రపిండాలనేవి శరీరంలోని మలినాలను వడపోసి శరీరాన్ని శుభ్రంగా ఉంచుతాయి. మూత్రపిండాల పనితీరు మందగించినప్పుడు అవి వాటి పని సక్రమంగా చేయలేక శరీరంలో వ్యర్థాలు పేరుకుని పోతాయి. ఈ విధంగా రక్తంలో చేరిన వ్యర్థాల వల్ల వారు ఊపిరి పీల్చి వదిలేటప్పుడు ఒక విధమైన దుర్వాసన వెలువడుతుంటుంది.
బీపీ, షుగర్..
మధుమేహం ఉన్నవారిలో ఇది చాలా సాధారణ సమస్య.. ఎందుకంటే వారి శ్వాసలో ఎక్కువ కీటోన్లు ఉంటాయి. ఇవి ఒకవిధమైన చెడు శ్వాసను వెలువరిస్తుంటాయి. అదేవిధంగా దీర్ఘకాలికంగా బీపీ ఉన్న వారు వాడే కొన్ని రకాల మందులు కూడా నోటి దుర్వాసనకు కారణం కావచ్చు.
కాలేయ సంబంధ వ్యాధులు..
లివర్ సిర్రోసిస్ లేదా ఫ్యాటీ లివర్ వంటి కాలేయ సమస్యల వల్ల శరీరంలోని వ్యర్థాల నిర్వహణ సరిగా జరగదు. అందువల్ల కాలేయంలో ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు కూడా నోటి దుర్వాసన వస్తుంది.
అందువల్ల నోటి దుర్వాసన ఉన్నప్పుడు దంత వైద్యుని సంప్రదించి, వారు సూచించిన మౌత్‌వాష్‌లను, ఇతర విధాలైన మౌత్ ఫ్రెష్‌నర్లను ఉపయోగించినా కూడా నోటి దుర్వాసన వదలకపోతుంటే మాత్రం అది ఇతర వ్యాధులకు సూచనగా భావించి ఫ్యామిలీ వైద్యుని సంప్రదించి వారి సూచన మేరకు తగిన పరీక్షలు చేయించుకుని మందులు వాడాల్సి ఉంటుంది.
ఇవి చదవండి: ఇంటి శుభ్రతకై.. ఇలా చేస్తున్నారా? జాగ్రత్త!
Comments
Please login to add a commentAdd a comment