
సమ్మర్ ఫుడ్స్... సమ్మర్ ఫ్రూట్స్!
అందరి కడుపు చల్లగా..!
పుచ్చకాయ -ఇందులో 80 శాతం కంటె అధికంగా నీరు ఉంటుంది. అందువల్ల ఈ వేసవిఫలం దాహాన్ని తీర్చి, డీహైడ్రేషన్‌ను నివారిస్తుంది.కూరగాయలు - ఉల్లిపాయ చలువ చేస్తుంది. అలాగే క్యారట్, బీన్స్, వెల్లుల్లి వంటి కూరలను ఎండలో నుంచి ఇంట్లోకి రాగానే తినటం మంచిది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వేసవిలో ఎండలో తిరగటం వల్ల కలిగే చర్మవ్యాధులనుంచి రక్షిస్తాయి. ఎండ నుంచి ఇంటిలోకి రాగానే పుదీనా ఆకుల్ని కాస్త నలిపి, ఆ రసాన్ని తాజా నీటిలో కలుపుకుని, అందులో ఒక నిమ్మకాయ పిండుకుని తాగితే చాలా మందిచి. ఇది సమ్మర్‌లో బయట తిరిగిన అలసటను తగ్గించి, వెంటనే తాజా అనుభూతిని కలిగిస్తుంది. సొరకాయ, బీరకాయ, పొట్లకాయ వీటన్నింటిలోనూ నీటి పాళ్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వేసవి ఆహారంగా తీసుకుంటే చలువ చేస్తాయి.
వెజిటబుల్ చిల్డ్ సూప్స్: దోసకాయ వంటివాటితో చేసిన సూప్‌ను భోజనానికి ముందుగా తీసుకోవటం వల్ల ఆకలి పెరుగుతుంది. దీనితో పాటు జుకినీ (దోసకాయ కుటుంబానికి చెందిన ఇది ఇప్పుడు చిన్నదోసకాయలాగే కనిపిస్తూ, పైన గీతల్ని కలిగి ఉంటుంది) వాడటం మంచిది. ఇవి శరీరంలో నీటి శాతాన్ని పెంచి డీహైడ్రేట్ అవ్వకుండా కాపాడుతాయి.హోల్ గ్రెయిన్ సలాడ్స్: మొక్కజొన్నలు, మొలకెత్తిన పెసలు, శనగలు (స్ప్రౌట్స్), కూరముక్కలు... వంటివాటిని కలిపి తింటే మంచిది. వీటిని అతి తక్కువసమయంలోనే తయారుచేసుకోవచ్చు. ఎంత ఎక్కువ పచ్చికూరలను తీసుకుంటే అంత ఎక్కువ ఆరోగ్యాన్ని వేసవిలో పొందవచ్చు.
స్ప్రౌట్ సలాడ్: మొలకెత్తిన రకరకాల గింజలను (స్ప్రౌట్స్‌ను) సన్నగా తరిగిన కూరముక్కలు, పండ్ల ముక్కలతో పాటు కలిపి తీసుకుంటే క్యాల్షియం, ప్రొటీన్లుతో పాటు శరీరానికి చలువ చేకూరుతుంది.
కొవ్వుపదార్థాలు తక్కువగా ఉండే పానీయాలే మేలు : వేసవి రాగానే సాధారణంగా ... తియ్యగా, చిక్కగా ఉండే కాఫీ, టీ, సోడాలను, ఐస్‌క్రీమ్‌లను తీసుకోవటం చూస్తాం. వీటిలో క్యాలరీలున్న అధికంగా ఉంటాయి. ఎటువంటి ద్రవపదార్థాన్ని తీసుకున్నా వాటి వల్ల తాత్కాలికంగా దాహం నుంచి ఉపశమనం లభిస్తుందే కాని, అవి ఆకలిని తీర్చలేవు. అందువల్ల - మజ్జిగ, లస్సీ, లో ఫ్యాట్ పాలు వంటివి తీసుకోవాలి.
పండ్లతో తయారయిన డెజర్ట్స్: వేసవిలో ఆరోగ్యాన్నిచ్చే పండ్లతో తయారుచేసిన డెజర్ట్స్‌ని తీసుకోవటానికి ప్రాధాన్యత ఇవ్వాలి. తక్కువ కొవ్వు ఉన్న తాజా పండ్లతో కూడిన పెరుగు, ఫ్రూట్ కస్టర్డ్ వంటివి తీసుకోవటం మంచిది. ఇవి శరీరానికి కావలసిన ప్రోటీన్లు, క్యాల్షియంలను అందిస్తాయి.
బెటర్ ఫ్రూట్స్... బెర్రీఫ్రూట్స్ : మొత్తం పండును తినగలిగే టొమాటో, బెర్రీల వంటి వాటినే బెర్రీ ఫ్రూట్స్ అంటారు. వేసవిలో ఆకలి వేసినప్పుడు రకరకాల బెర్రీ ఫ్రూట్స్ మంచిది. ఇక కూరల విషయానికి వస్తే లభించే ఆకుపచ్చని కూరలు, టొమాటోలు, బఠాణీ వంటివి తీసుకోవటం వల్ల పోషకపదార్థాలు శరీరానికి అందుతాయి. పైగా ఇవి తక్కువ క్యాలరీలను కలిగి, తేలిగ్గా జీర్ణమయ్యేలా ఉంటాయి.
కూల్ కూల్ కుకుంబర్ - దోస వంటివి సహజంగానే చల్లగా ఉంటాయి. తాజాగా ఉన్న చల్లని దోసకాయ ముక్కలను సలాడ్స్‌లోను, కూరలలోనూ వాడటం మంచిది.
మామిడి - ఇవి కేవలం వేసవిలో మాత్రమే లభిస్తాయి. ఇందులో బీటా కెరొటిన్, విటమిన్ సి, ఫైబర్లు ఉంటాయి.
వాల్‌నట్స్ - వేసవిలో తీసుకునే ఆహారంలో కొద్దిగా అక్రోట్లు (వాల్‌నట్) తీసుకోవడం మంచిది. జీడిపప్పు కంటే బాదంపప్పు మేలు.
చేపలు : వేసవిలో చేపలు తినడం మంచిది. వీటిలో ఉండే ఒమేగా - 3 ఫ్యాటీ యాసిడ్లు గుండె ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి. అయితే వేయించిన చేపల కంటె ఉడకబెట్టిన లేదా గ్రిల్డ్ చేపలు తినడం మరీ మంచిది.
సుజాతా స్టీఫెన్
న్యూట్రీషనిస్ట్,
సన్‌షైన్ హాస్పిటల్స్, హైదరాబాద్