మృత్యుగాల్పులు
జిల్లాలో 100మందికి పైగా మృత్యువాత
నెల్లూరు (సెంట్రల్): జిల్లాలో రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రుతుపవనాలు మాత్రం ఊరించి ఊరించి ఉసూరుమనిపిస్తున్నాయి. పెరిగిన ఎండలకు చిన్నాపెద్దా అనే తేడా లేకుండా చాలా మంది పిట్టల్లా రాలుతున్నారు. దీనికితోడు విద్యుత్ కోతలు అధికంగా ఉండటంతో చిన్నపిల్లలు, వృద్ధులు విలవిలలాడుతున్నారు.
ఇప్పటి వరకు జిల్లాలో వడదెబ్బకు గురై 100మందికి పైగా మృత్యువాతపడ్డారు. మంగళవారం ఒక్కరోజే 15 మంది మృతి చెందారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది. నెల్లూరు, కోవూరు ప్రాంతాల్లో 26 మంది, కావలిలో నలుగురు, ఆత్మకూరులో 11 మంది, సూళ్లూరుపేటలో 16 మంది, ఉదయగిరిలో 12 మంది, గూడూరులో 17 మంది, సర్వేపల్లి పరిధిలో 12 మంది వడదెబ్బకు మృతి చెందినట్టు తెలుస్తోంది. కూలి పనులకు వెళ్లిన వారు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు.
రుతుపవనాలు ఏవీ ?
ఏప్రిల్ నుంచి ఎండలు మండిపోతాయి. సాధారణంగా జూన్ మొదటి వారంలో రుతుపవనాలు వస్తాయి. చాలా వరకు ఎండ తీవ్రత తగ్గుతుంది. అయితే ఈ సంవత్సరం రుతుపవనాలు వస్తాయని సంబంధిత అధికారులు మాత్రం పది రోజుల క్రితమే చెప్పినా ఇంత వరకు వాటి జాడ జిల్లాలో కనిపించలేదు. దీంతో ఎండ తీవ్రత అధికంగా ఉంది. జూన్ దాదాపుగా పూర్తి కావస్తున్నా ఇంత వరకు ఎండ వేడి ఏ మాత్రం తగ్గలేదు. ఈ ఎండ తీవ్రత కొనసాగితే పరిస్థితి చాలా దయనీయంగా ఉంటుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పాఠశాలలు, కళాశాలలు ప్రారంభించారు.
ఈ ఎండ ధాటికి చిన్నారులను పాఠశాలలకు పంపాలంటేనే వారి తల్లిదండ్రులు బెంబేలెత్తుతున్నారు. రెక్కాడితేకాని డొక్కాడని కూలీలు ఈ ఎండకు పనులకు వెళ్లలేక, పస్తులు ఉండలేక నానా ఇబ్బందులు పడుతున్నారు.
బాధితులకు ఆసరా ఏదీ?
ఎండ తీవ్రతకు మృతి చెందిన వారికి ఆసరా కరువైందనే చెప్పాలి. అధికారులు సైతం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండటంతో మృతిచెందిన పేదల బతుకులు అధ్వానంగా తయారయ్యాయి. వడదెబ్బ మృతులపై పోలీసులు కేసులు నమోదు చేస్తారు.
అలాగే ప్రభుత్వ వైద్యశాలల్లో పోస్టుమార్టం నిర్వహించి సంబంధిత అధికారులు పరిశీలిస్తారు. ఆ తర్వాత ప్రకృతి వైపరీత్యాల కింద పరిహారాన్ని అందజేస్తారు. ఇప్పటి వరకు అధికారులు ఈ ప్రక్రియను మమ అనేలా చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇకనైనా సంబంధిత అధికారులు చొరవ తీసుకుని వడదెబ్బకు మృతి చెందిన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం చేసేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.